"ఆస్పత్రికి వెళ్ళాలి. తొందరగా" రాణా కంఠంలో కనపడిన అధికారానికి భయపడి బండి అటు తిప్పాడు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి అక్కడ గాయపడిన మనిషి లేడు.
రాణా నిరుత్తరుడయ్యాడు.
అతడిని చూసి పరిహసిస్తున్నట్టు వీధి నిర్మానుష్యంగా వుంది.
బండివాడు గొణుక్కుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. గాంధీ విగ్రహం నీడ అతడిమీద పడుతుంది. అతడు చుట్టూ చూశాడు. అతడి దృష్టి ఒక ఇంటి మేడమీద పడింది. మెట్లు బయటనుంచి వున్నాయి. పైన చిన్న వసారాలా వుంది. దానికి చెక్క రెయిలింగ్ వుంది. ఆ రెయిలింగ్ మీద చేతులు ఆన్చి నిలబడి వున్నాడొక వ్యక్తి.
అతడు కూడా శిలా ప్రతిమలాగే వున్నాడు.
రాణా మెట్లెక్కి అతడి దగ్గరకు వెళ్ళేడు. అతడికి అరవై- డెబ్బై మధ్య వయసుంటుంది. అయినా వయసుకు మించి దృఢంగానే వున్నాడు.
"ఇక్కడ జరిగినదంతా మీరు చూశారా?"
"ఎవరు బాబూ నువ్వు?"
రాణా అప్పటికే విసిగిపోయి వున్నాడు. అధికార యుక్తమైన కంఠంతో "మీరు చూశారా లేదా అది చెప్పండి" అన్నాడు కటువుగా.
"చూశాను"
"వాళ్ళెవరో మీకు తెలుసా?"
"ఎవరు? కొట్టిన వాళ్ళా? పడిపోయిన వాడా?"
"ఇద్దరూ"
"కొట్టినవాడు మస్తాన్ రెడ్డి, పడిపోయిన వాడు పులిరాజు మనిషి".
"ఎవడా మస్తాన్ రెడ్డి?"
"నువ్వీ వూరికి కొత్తా బాబూ."
అప్పటికి ఆవేశం తగ్గిన రాణా "అవును" అన్నాడు.
"మస్తాన్ రెడ్డి నరసింహనాయుడి మనిషి."
"నరసింహనాయుడు ఎవరు?"
వృద్దుడు ఆశ్చర్యంగా "నాయుడు తెలీదా-ఈ వూరి ఎమ్మెల్యే" అన్నాడు. రాణాకి పరిస్థితి అర్ధమైంది. "ఆ మస్తాన్ గురించి నేను కనుక్కుంటాన్లెండి. రేపు మళ్ళీ వస్తాను. మీ దగ్గర స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంటాను. మీ పేరు?"
"వరాహమూర్తి నువ్వెవరో చెప్పనే లేదు."
"నేనీ ఊరుకి కొత్తగా వచ్చిన ఇన్ స్పెక్టర్ని" అంటూ మూర్తి ఏదో అనబోతూ వుంటే రాణా కదిలాడు.
అతడు మెట్లెక్కి మాట్లాడటం బండివాడు చూశాడు. ఇంకా చాలామంది చూశారు. రాణా వెళ్ళిపోయాక పక్క కిళ్ళీ కొట్టువాడు మెట్లెక్కి పైకి చూశాడు. "ఎవరు సార్ అతను?"
"కొత్తగా వచ్చిన ఇన్ స్పెక్టర్ అట" అన్నాడాయన. సరిగ్గా రెండు నిముషాల్లో ఆ వార్త మస్తాన్ రెడ్డికి తెలిసింది.
* * *
"యాభై రూపాయలు అడ్వాన్సు" అన్నాడు రిసెప్షనిస్టు. డబ్బిచ్చి రూమ్ తీసుకున్నాడు రాణా. పక్కనుంచి సన్నటి మెట్లు క్రిందరూమ్ లో పదిమంది పేకాడుకుంటున్నారు. పొగ- ఒక పాక తగలబడినట్టు వస్తోంది.
మెట్ల పక్కనే సిగరెట్టు పీకలు, మల్లెపూల వాడిన దండలు గుట్టగా పడివున్నాయి.
గది మరీ అసహ్యంగా వుంది. కిళ్ళీ మరకలు, చిరిగిన దుప్పటి, బయట వరండాలో ఖాళీ సోడా సీసాలు.
కిటికీ బయటనుంచి ఇద్దరాడవాళ్ళు బిగ్గరగా నవ్వుకుంటూ వెళ్తున్నారు.
రాణాకి అక్కడ వుండబుద్ది కాలేదు. పోలీస్ స్టేషన్ పక్కనే అభిషిక్తా వాళ్ళ ఇల్లని చెప్పింది. రెండూ చూసినట్టు వుంటుందని బయల్దేరాడు.
* * *
మస్తాన్ రెడ్డి మెట్లెక్కి వసారాలో నిలబడి చూశాడు.
వరాహమూర్తి పేపరు చదువుకుంటున్నాడు. అతడి కోడలు బియ్యం ఏరుకుంటూంది. చిన్నకొడుకు, పధ్నాలుగేళ్ళ కూతురు చదువుకుంటున్నారు. పెద్ద కూతురు లోపల వంట చేస్తూంది.
అలికిడికి మూర్తి తలతిప్పి చూశాడు.
మస్తాన్ లోపలకి వచ్చాడు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. పాప చేతిలో పుస్తకం జారిపోయింది. మస్తాన్ అందరివైపు చూశాడు. వరాహమూర్తి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. పెద్ద కూతురు వంటింటి గుమ్మం దగ్గరకు రాబోయి ఆగిపోయింది.
"ఏమిటి? ఏదో స్టేట్ మెంట్ ఇస్తానన్నావుట."
.....నిశ్శబ్దం.
"ఇవ్వవు కదా"
మూర్తి మాట్లాడలేదు.
"గుర్తుంచుకో" అని రెడ్డి వెళ్ళబోతూ ఆగాడు. అతడి దృష్టి పధ్నాలుగేళ్ళ పాప మీద పడింది. దగ్గరకు వెళ్ళాడు.
"....నీ రెండో కూతురా?"
ఎవరూ సమాధానం చెప్పలేదు. మస్తాన్రెడ్డి ఆ పాప గెడ్డం పట్టుకుని పైకెత్తబోయాడు. పక్కనున్న కుర్రవాడు అదిచూసి విసురుగా లేచాడు. తండ్రి అతడి భుజం పట్టుకుని ఆపుచేశాడు. మస్తాన్ రెడ్డి ఆ కుర్రవాడిని చూసి నవ్వేడు. పాపని వదిలి కిటికీ వైపు నడిచి, అక్కన్నుంచి క్రిందికి ఉమ్మేశాడు. గుమ్మం దగ్గరికి నడుస్తూ మూర్తి దగ్గర ఆగి "ఎదుగుతున్న పిల్లలున్నోడివి కాస్త జాగ్రత్త" అంటూ తిరిగాడు.
గుమ్మం దగ్గర రాణా నిలబడి వున్నాడు.
అతడు అంత దగ్గరగా వున్నాడని రెడ్డి చూసుకోలేదు.
ఒకే ఒక దెబ్బ!
రాణా పిడికిలి బిగించి కొట్టిన దెబ్బకి అక్కడి నిశ్శబ్దం చెదిరింది. ఇద్దరూ మెట్లమీద నుంచి కొట్టుకుంటూ క్రిందపడ్డారు. జనం పోగయ్యారు. రాణా శివమెత్తిన వాడిలా వున్నాడు. మస్తాన్ కూడా తక్కువ తినలేదు. ఊహ తెలిసిన తరువాత మొదటిసారి ఒకడు తనని కొట్టడం.
రోడ్డు పక్కన మురికి గుంటలో పడి కొట్టుకుంటూ వుండగా పోలీస్ విజిల్ వినిపించింది. పోలీసులు నలుగురు బిరబిరా జీపు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని విడిపించారు. మస్తాన్ ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. రాణాని పోలీసుల మధ్య వెనుక సీట్లో కూర్చోబెట్టారు.
వ్యాన్ కదిలింది. వరాహమూర్తి ఆశ్చర్యంగా చూస్తూండగా వ్యాన్ కదిలింది. అతడు చెప్పేది ఎవరూ వినిపించుకోలేదు.
"ఒక సిగరెట్ వుంటే ఇవ్వరా" అన్నాడు మస్తాన్ హెడ్ కానిస్టేబుళ్ జేబులోంచి తీసి ఇచ్చాడు.
"ఏ వూర్రా మనది?" అన్నాడు మస్తాన్ రాణాని చూసి రాణా జవాబు చెప్పలేదు.
వ్యాను పోలీసు స్టేషన్ ముందు ఆగింది. మస్తాన్ వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
"ఇప్పుడు చెప్పరా లం..... కొడుకా ఎవర్నువవు."
రాణా చుట్టూ చూశాడు. అది పోలీసు స్టేషన్ లా లేదు. పాడై పోయిన సత్రంలా వుంది. నలుగురి కంటే ఎక్కువ మంది పోలీసులు లేరు.
"ఈడ్ని లాకప్పులో ఎయ్యండి. రాత్రికొచ్చి ఈడిసంగతి చూస్తా" అన్నాడు మస్తాన్.
"టీ తాగుతావా అన్నా" అని అడిగాడు బాలకిషన్ (హెడ్ కానిస్టేబుల్). అంతలో ఫోను మ్రోగింది. హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ అనగానే అటెన్షన్ లోకి వచ్చాడు బాలకిషన్.
"ఇన్ స్పెక్టర్ గారొచ్చి జాయిన్ అయ్యారా?"
బాలకిషన్ ఫోన్ లో "లేదు సార్ ఆయన కోసమే చూస్తున్నాం" అన్నాడు.
3
యస్.పురం పోలీస్ స్టేషన్.
ఫోన్ రింగవగానే, రిసీవర్ ఎత్తి "హలో- వ్" అని విసుగ్గా అన్నాడు బ్రహ్మానందం.
"వనజుందా?"
"ఎవరూ?"
"వనజ లేకపోతే సుమతిగానీ, అనసూయగానీ-"
"ఏ నెంబర్ కావాలి మీకు?"
"సీతా లాడ్జి కాదా?"
"కాదిది పోలీసు స్టేషన్"
అవతల్నుంచి ఫోన్ కట్ అయింది. బ్రహ్మానందం కుర్చీ వెనక్కి జారిపడ్డాడు. టైమ్ పదకొండయింది. ఇంకా సబ్-ఇన్ స్పెక్టర్ రాలేదు.
మళ్ళీ ఫోన్ మోగింది.
"హల్లో"
"ఏరా రామ్మూర్తి-ఎవరెవరున్నారు?" బొంగురు గొంతు అట్నుంచి అడిగింది.
"రామ్మూర్తి ఎవడు?"
"బ్రోకరు నాకొడకా! నీ పేరు కూడా మర్చిపోయావా?"
"నాలుక కోసెయ్యగల్ను ఇది పోలీసు స్టేషను నేను కానిస్టేబుల్ బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నాను" క్షణం ఆలస్యం కాకుండానే అట్నుంచి ఫోన్ పెట్టేసిన చప్పుడు వినపడింది. బ్రహ్మానందం ఫోన్ వైపు కసిగా, కోపంగా చూశాడు.
దూరంగా మరో కానిస్టేబులు శర్మ రైఫిల్ తుడుచుకుంటున్నాడు. శర్మకి యాభై ఏళ్ల వయసుంటుంది. ఎన్నో సంవత్సరాల్నుంఛీ ఆ పోలీస్ స్టేషన్ లోనే పని చేస్తున్నాడు. పైసా తీసుకోడు. నిజాయితీ పరుడు అని పేరుంది.
"ఏం శర్మగారూ ఆ తుపాకులు పేలాలంటే కిరసనాయిలు పోసి తగలెట్టాలి. వాటిని క్లీన్ చేయటం వేస్టు."
"ఏదోలే నాయినా ఆఫీసన్నాక అన్నిటినీ శుభ్రంగా వుంచాలి."
"మీరీ కానిస్టేబుల్ ఉద్యోగంలోకి ఎలా వచ్చారా అని నా కిప్పటికీ ఆశ్చర్యంగానే వుంటుంది సుమాండీ."
"ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటంలో తప్పులేదుగా."
"ఆ, మీలాంటి వాళ్ళుండబట్టే పనిపిల్ల జీతానికి కూడా మనకి శాంక్షన్ లేదు. అంతవరకూ ఎందుకు? పేరుకు పోలీసు స్టేషనేగానీ, లాకప్ కి వేసే తాళం కొనటానికి బడ్జెట్ శాంక్షన్ లేదు." అని ఇంకా ఏదో అనబోతూ వుండగా ఫోన్ మ్రోగింది.
"హలో.....వ్"
"ఏరా రామ్మూర్తీ- మృదంగం ఖాళీగా వుందా?"
"లేదు, కచేరీకెళ్ళిందండి" బ్రహ్మానందం జవాబిచ్చాడు.
"అనసూయుందా?"
"రాత్రి పురాణ కాలక్షేపానికి వెళ్ళి ఇంకా రాలేదండి"
"అభిలాష?"
"ఇప్పుడే మోర్నింగ్ షో కెళ్ళిందండి. తమ రెవరండీ మాట్లాడుతుంటా?"
"ఓ వెధవా? నన్నే మర్చిపోయావురా? కలప బాబూరావు కొడుకుని."
"ఓర్నాకొడకా అప్పుడే లాడ్జింగులకి ఫోన్ చేసేంత పెద్ద వాడివై పోయావురా నువ్వు?"
"ఎవడ్రా మాట్లాడేది?"
