"ఏం పని?"
"చెప్పను. చూస్తారుగా?"
* * *
సుత్తితో బలంగా చెక్కలు దిగ్గొట్టి వాటికి తాళ్ళు బిగించి కట్టాడు బాలూ చిన్న టెంట్ లా తయారైంది.
కాలేజీకి వెళుతున్న అమ్మాయిలు అతను చేస్తున్న పనినే విచిత్రంగా చూసుకుంటూ లోపలికి వెళుతున్నారు. హాస్టల్ నుంచి తెచ్చుకున్న దుప్పటి, తలగడా టెంట్ లో పడేశాడు. బోర్డుమీద ఒకటో రోజు అని రాసి టెంట్ ముందుపెట్టి లోపలికి వచ్చి పడుకున్నాడు. దేనికి ఒకటో రోజు కారణం వ్రాయలేదు.
కాని ఇలాంటి విషయాలు చాలా తొందరగా పాకుతాయనుకుంటా గంట గడిచేసరికి సుబ్బారావు, అహమ్మదూ పరిగెత్తుకుంటూ వచ్చారు.
"ఇదేమిటి బాస్" అన్నాడు సుబ్బారావు. బాలు నవ్వి వూరుకున్నాడు.
"చరిత్రలోనే అపూర్వమైన సంఘటన! ఒకమ్మాయి కోసం కాలేజీ ముందు నిరాహారదీక్ష చేయటం."
"ఒరేయ్, అమ్మాయి పేరు బయటికి మాత్రం తెలియకూడదు. తెలిసిందంటే కాలేజీలో ఆ అమ్మాయి పరిస్థితి చాలా అసహ్యంగా వుంటుంది. ఆమెకి ఏ మాత్రమైనా కొద్దిగా నా మీద ప్రేమంటూ వుంటే అది కాస్తా ద్వేషంగా మారుతుంది. మొదటికే మోసం వస్తుంది."
"నువ్వు చేస్తున్న ఈ నిరాహారదీక్ష ఆ అమ్మాయి కోసమని చెప్పని పక్షంలో అసలింత హడావిడి దేనికి?" అని అడిగాడు అహమ్మద్ ఆశ్చర్యంగా.
"నేనిది చేస్తున్నది ఎందుకో వూరంతటికీ తెలియనక్కరలేదు. ఆ అమ్మాయికి ఒక దానికి ఎలాగూ తెలుసు. ఇవ్వాళ కాకపోతే కొన్ని రోజులకైనా ఆమె కరుగుతుంది. దానికోసమే ఈ ప్రయత్నం తప్ప వూరుందరి సానుభూతి కోసమూ, వూరి వాళ్ళందరూ ఆమె మీద ఒత్తిడి తీసుకురావటం కోసమూ కాదు."
వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. సుబ్బారావుగాడు లేచి హుషారుగా "నీ ఆలోచన అర్ధమైంది బాస్! మిగతా విషయాలన్నీ మాకొదిలి పెట్టు" అన్నాడు. ఇద్దరూ అక్కడినుండి వెళ్ళిపోయారు. అరగంట తరువాత హెచ్ యమ్ వీ గ్రామ్ ఫోన్ సెట్టు ఒకదాన్ని పట్టుకొచ్చారు. దూరం నుంచి ఆ అమ్మాయి కాలేజీకి వస్తూ కనబడేసరికి మొదటి పాట పెట్టారు. "రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా....నీ కోవెల ఈ ఇల్లు కొలువై వుందువుగానీ.... రావమ్మా..."
కాలేజీకి వస్తూ యధాలాపంగా టెంట్ వైపు చూసిన ఆ అమ్మాయి ఒక క్షణం షాక్ తగిలినట్టు నిలబడిపోవటం ఓరగా గమనించాడు బాలు. ఆమె వెంటనే సర్దుకుని స్నేహితురాళ్ళతో ముందుకు కదిలిపోయింది.
అతని స్నేహితులు కోతులు. అన్నీ సరిగ్గా సరిపోయే పాటలే ఏరుకొచ్చారు. ఆమె చదువుకోవటం కోసం పుస్తకం తీసే సమయానికి "చెలియలేదూ చెలిమిలేదు వెలుతురే లేదూ" అన్న పాటా, లంచ్ చేసే సమయానికి "ఆకలుండదు...దాహముండదు నిన్ను చూస్తుంటే" అన్న పాటా ఆమె కాలేజీకి వస్తున్నప్పుడు, ఇంటికి వెళుతున్నప్పుడు "ఎవరికోసం... ఎవరికోసం" అనేది పెట్టేవారు. ఒక స్పెషల్ సాంగ్ మాత్రం కేవలం ఆమె కోసం వినిపించేవారు.
"ఓ వసంత యామినీ... ఓ మరాళ గామినీ! నీవే నా నీలినిషా జీవిత సౌదామినీ?" ఆమెకే అది అర్ధమయ్యేది.
సుబ్బారావుగాడి చెల్లెలు అదే కాలేజి. ఆవిడ ద్వారా వాడో చిన్న ఫీలరు. కాలేజీలోకి వదిలాడు. తను కాలేజీలో చదివే ఒక అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి ఆమె ప్రేమ కోసం యీ విధమైన నిరాహార దీక్ష కాలేజీ ముందు చేస్తున్నాడనీ, ఆ అమ్మాయి పేరు నలుగురికీ తెలియటం ఇష్టంలేక గోప్యంగా వుంచాడనీ, సుబ్బారావు చెల్లెలు ఇద్దరు స్నేహితురాళ్ళకి చెప్పింది. ఆ కాలేజీలో ప్రతి అమ్మాయికీ ఒక గుణం వుంది. తమ కేదైన ఒక కొత్త వార్త తెలిస్తే వెంటనే దాన్ని మరో ఇద్దరికి అయిదు నిముషాల్లో చెప్పెయ్యకపోతే కాలు నిలువదు. ఆ కాలేజీలో అయిదు వేలమంది విద్యార్ధినులు వున్నారు.
(ప్రియమైన పాఠకుల్లారా! మీ ఐ. క్యూ.కి ఒక చిన్న పరీక్ష సుబ్బారావు చెల్లెలు యీ న్యూస్ మొట్టమొదటి ఇద్దరి దగ్గిర చెప్పిన ఎంతసేపటికి కాలేజీలో అందరికీ, అంటే మొత్తం అయిదు వేలమందికి తెలిసి వుంటుందో వూహించగలరా? నవల చదవటం ఇక్కడ ఆపి కాగితం కలం తీసుకుని లెక్క కట్టండి. లేదా నోటి లెక్కన ఉజ్జాయింపున వూహించండి. తరువాయి పేజీల్లో దీనికి సమాధానం వుంది. దానికి మీరెంత దగ్గిరగా వచ్చారో పోల్చి చూసుకోండి. ఆ సమాధానానికీ మీ సమాధానానికీ తేడా ఎక్కువైతే, మీకు మనుష్యుల మీద ఇంకా చాలా నమ్మకం వుందన్నమాట. రెండూ దాదాపు ఒకటే అయితే, రూమర్లు ఎంత తొందరగా పాకిపోతాయో మీకు బాగా తెలుసన్నమాట. సమాధానం ఎలాగూ తరువాత వుంటుంది కదా అని చదవటం మొదలెట్టేయకండి. ఒక క్షణం ఆలోచించి, లెక్క కట్టండి.)
ఇక కథా విషయానికి వస్తే-
కాలేజీలో ఈ వార్త గుప్పుమనగానే అమ్మాయిలు చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యారు. రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. బాలు అంటే అమ్మాయి లందరికీ సానుభూతి ఎక్కువ కాసాగింది.
"అబ్బ, నిజంగా ప్రేమంటే అలా వుండాలే!" అని ఒకళ్ళూ, "అలాంటి కుర్రవాడు నన్ను ప్రేమించి వుంటే, గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోయి వుండే దాన్ని" అని ఒకరూ, "ఎవరోనోయ్ ఆ కఠినాత్మురాలు నిజంగా ఆవిడ గుండె రాయి అయివుండాలి. అతను ఎంతో మంచివాడు కాబట్టి అమ్మాయి పేరు చెప్పకుండా తనే బలైపోతున్నాడు."
.... ఇలా గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకోసాగారు. ఇవన్నీ వింటూ సౌదామిని ఎలా ఫీలవుతుందో మాత్రం ఎవరికీ తెలీదు.
అప్పటికి మూడు రోజులైంది. బాగా నీరసించిపోయాడు బాలు. సౌదామినిలో ఏ మార్పు వున్నట్టు వాళ్ళకి కనబడలేదు. అందరమ్మాయిలతోపాటే కాలేజీకి వెళుతున్నప్పుడూ, వస్తున్నప్పుడు వాళ్ళ టెంట్ వంక చూసేది. మిగతా అమ్మాయిల కళ్ళల్లో కనబడిన కుతూహలం కూడా ఆ అమ్మాయిలో కనబడేది కాదు.
అయితే ఆ అమ్మాయి పరిస్థితి మాత్రం ఘోరంగా వుంది.
రోజులు గడిచేకొద్దీ ఆమె నరకాన్ని అనుభవించసాగింది. భోజనం చేస్తూంటే బాలూ పక్కనే కూర్చుని, "అక్కడ నేను నిరాహారదీక్ష చేస్తూంటే మీకు ఇక్కడ భోజనం ఎలా సహిస్తూందండీ" అని దిగులుగా అడుగుతున్నట్టు అనిపించేది. దాంతో సగంలో చెయ్యి కడుక్కుని లేచిపోయేది.
స్నానానికి కుచ్చిళ్ళు తీయబోతూంటే పక్కనే జాలిగా నిలబడి "నేనక్కడ ఎండలో వానలో అలా కృశిస్తూ వుంటే ఇక్కడ మీకు స్నానం ఎలా చెయ్యబుద్ది అవుతుందండీ-" అన్నట్టు వినిపించేది. కాలేజీలో చర్చనీయాంశాలు సరేసరి.
తెలుగు లెక్చరర్ 'వరూధినీ ప్రవరాఖ్య' చెపుతూ, "ఆ రోజు వరూధిని ప్రవరూడి కోసం ఎంతగా తపించిందంటే, అదిగో బైట ఆ కుర్రవాడు లేడూ అలా నిద్రాహారాలు లేక క్రుంగి కృశించి..." అంటూ ఆ టాపిక్ లోకి వెళ్ళిపోయేవాడు. ఇంగ్లీషు లెక్చరర్ ఒధెల్లో గురించి చెపుతూ, "ప్రేమకి అనాదినుంచీ చరిత్రలో ఒక విశిష్టత వుంది. ఆ రోజుల్లో డెన్ డిమోనాని ప్రాణాధికంగా ప్రేమించిన ఒధెల్లో నుంచీ, ఈ రోజు నిరాహారదీక్ష చేస్తున్న బాలూ వరకూ-" అంటూ స్పీచ్ ఇచ్చేవాడు. ఇంగ్లీషు, తెలుసు సరే- ఎకనమిక్స్, పాలిటిక్స్ లెక్చరర్స్ కూడా హమ పాఠాల్లో బయటివాడి ప్రసక్తి లాక్కొచ్చేవారు. "....కాంపిటీష్ లో రెండు రకాలు. పెరఫెక్ట్- ఇంపెరఫెక్ట్....బియ్యం, పాలు వగైరా అమ్మకాలు మొదటిరకం. వాటిని ఎవరైనా అమ్మొచ్చు. సబ్బులు, టూత్ పేస్ట్ లు రెండోరకం. అవి బ్రాండ్ నేమ్ మీద అమ్ముడుపోతాయి. ఇదికాక మోనోపోలీ అని ఒకటి వుంది. బయట నిరాహారదీక్ష చేస్తున్న బాలు 'ప్రేమ' మీద ఏదైనా ఒక టానిక్ అమ్మాడనుకోండి. అతడు కాలేజీ మొత్తానికి మోనోపోలీ అవుతాడు...." అంటూ కొనసాగించేవాడు ఎకనమిక్స్ లెక్చరర్.
"ఎప్పుడైతే మనిషిలో స్వార్ధం ప్రవేశించిందో, అప్పుడే 'ఇజం' కూడా ప్రవేశిస్తుంది. విశ్వజననీయమైన ప్రేమంటే, కాపిటలిజం, కమ్యూనిజం- ఇవేమీ అవసరం లేదు. అన్నిటికీ పునాది ప్రేమ. ఉదాహరణ- బయటవున్న టెంటు..." అంటూ పాలిటిక్స్ లెక్చరర్ ఆవేశంగా చెప్పేది. ఆమె నలభైఏళ్ల అవివాహితురాలు.
నాలుగోరోజు గడిచేసరికి, టూరిస్టు బస్సుల వాళ్ళు కూడా ఈ టెంట్ ముందునుంచి బస్ తీసుకువెళ్తూ అక్కడ ఆపి యాత్రికులకు చూపించటం మొదలుపెట్టారు.
అంతవరకూ బాగానే వుంది. కానీ బాలు పరిస్థితే రోజు రోజుకీ దిగజారిపోతుంది.
దాదాపు ఓడిపోయామనే అనుకున్నారు. అప్పటికి అది పదకొండోరోజు. రాత్రి తొమ్మిదయింది. కొన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చే అది. సుబ్బారావూ, అహమ్మదూ ఈసారి కలిసి కట్టుగా బాలూతో వాదించసాగారు. ఇప్పటికి మూడు రోజుల నుంచి అతనికి కుడివైపు రొమ్ములో సన్నగా నొప్పి వస్తోంది. ఈరోజు ప్రొద్దున్న నుంచి అది మరింత ఎక్కువైంది.
వాళ్ళనేది ఏమిటంటే ఇదంతా ఆ అమ్మాయిని ఒప్పించటానికి చేస్తున్నదే కాబట్టి దీన్నంతా ఒక నాటకంగా తీర్చిదిద్దుదామని. అతను మామూలుగా భోజనం చేసి, పస్తులతో వున్నట్టూ నటిస్తే చాలని వాళ్ళ వాదన. కానీ దానికి ఒప్పుకోలేదు బాలు. ఆ అమ్మాయి ప్రేమని పొందటానికి కాదు నిరాహారదీక్ష. దీనివల్ల, బెదిరింపులవల్ల ప్రేమలు ఉద్భవించవు. ఆమెకి తనంటే ఇష్టమని అనుకుంటున్నాడు. కానీ ఆమె ఎందుకు వివాహానికి ఒప్పుకోవటం లేదు? ఆమెకున్న అడ్డంకులేమిటి? అది తనతో ఎందుకు చెప్పదు? చెప్పించటం కోసమే ఈప్రయత్నం ఆమె కారణం చెప్పేసి ప్రేమించకపోయినా, పెళ్ళి చేసుకోకపోయినా తనకు ఇష్టమే- ఇదీ అతని వాదన.
తన వాదనని ఎంత సిన్సియర్ గా నమ్ముతున్నాడో అంత సిన్సియర్ గానూ ఈ పనిని నిర్వహించదలచుకున్నాడు. ఇది ఆమె మనసుని బలహీనపరచి నిజం చెప్పించవలసిన సమస్య. ఇటువంటివి మామూలు నాటకాలవల్ల సఫలమవ్వవు.
అతని ఆర్యుమెంట్ తో వాళ్ళు విసుగుచెంది "సరే, నీ ఖర్మ!" అనుకుంటూ భోజనానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన పది నిముషాలకి రొమ్ముల్లో నొప్పి ఎక్కువయింది అతనికి. కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది. కనుచూపుమేర నిర్మానుష్యంగా వుంది.
లేచి నిలబడదామని ప్రయత్నించాడు. ఒళ్ళు తూలిపోయింది. ఎలాగో కష్టపడి టెంట్ బయటవరకూ రాగలిగాడు. అక్కడికి వచ్చేసరికి సత్తువ పూర్తిగా హరించుకుపోయింది. మోకాళ్ళ మీద నుంచి నేల మీదకు జారిపోతూ వుండగా స్పృహ తప్పింది.
* * *
"ఏం చెయ్యమంటావురా? గ్లూకోజ్ ఎక్కటం లేదు. హార్ట్ బీట్ వినబడటంలేదు. బి.పి. తగ్గిపోయింది..." అన్నాడు డాక్టర్ వైద్య సుబ్బారావు తండ్రివైపు దిగులుగా భయంగా చూసి అన్నాడు, "....మిగతా అన్ని విషయాలూ సరే. గ్లూకోజ్ ఎక్కకపోవడమే ఆశ్చర్యంగా వుంది. అతడి శరీరంలో ఏదో శక్తి అన్ని రకాల ఆహారాల్నీ రిజెక్ట్ చేస్తుందన్న మాట..."
"కార్డియోగ్రామ్ లో గుండె శబ్దాన్ని సూచించే వెలుగుచుక్క అతి నెమ్మదిగా బలహీనంగా 'ల...బ్...డ....బ్' అని పాక్కుంటూ వెళుతూంది."
"అదేమిటి సార్! బలవంతంగా ఎక్కిస్తే-" అంటూ అహమ్మద్ ఏదో చెప్పబోయాడు.
"అదే నాకూ అర్ధంకావడంలేదు. నిరాహారదీక్ష చేసేవాడు నోటితో ఆహారం తీసుకోవటాన్ని నిరాకరించటమే చరిత్రలో తెలుసు కానీ, నరాలూ రక్తనాళాలూ కూడా నిరాకరించడం నేను చూడటం ఇదే మొదటిసారి..."
