Previous Page Next Page 
మమత పేజి 7

అయ్యో... మంచంమీద నుంచి దొర్లి కిందపడ్డాడు.
సుమతి గబుక్కున వెళ్ళి ఎత్తుకుంది. కక్కటిల్లి ఏడ్చాడు శశికాంత్, సుమతి కన్నీళ్ళోత్తుకుంది. రాజీవ్ మేడమీద గదిలో తలుపు వేసుకుని దైవధ్యానంలో మునిగిపోయాడు. "ఏ దేముడు ఈ తల్లీ పిల్లని కలపగలడు?' తను మంచి చేశాననుకున్నాడు. ఇది చెడు అవుతోందా!
సుమతి మనకు వికలమైపోయింది. ఆ పిల్లని ఎక్కడ దించారో, ఏ అనాధాశ్రమంలో వదిలారో, వెళ్ళి తెచ్చుకుంటే....? అసలు రాజీవ్ ఒప్పుకోడు, తన బుద్దిపై అతనికి పూర్తిగా నమ్మకం పోయింది. తీరా ఆ పిల్లని తెచ్చాక తను చూడగలదా - భగవాన్, ఎందుకు నా మనసుని ఇంత క్షోభపెడుతున్నావ్!! సుమతి కన్నీళ్ళాగలేదు.   
                                    *    *    *
"ఏమమ్మా...వచ్చిందా?" లోపలకొస్తూనే అన్నాడు చంద్రయ్య.
తులసమ్మ ముఖంలోనూ విచారం!
ఎక్కడికెళ్ళింది లీల? ఎందుకెళ్ళింది లీల??
"పోన్లేవమ్మా, ఈ దిక్కుమాలిన సంబంధం అయినప్పట్నుంచీ వాడికి అన్నీ కష్టాలే...ఆ ఉద్యోగం కూడా ఊడేట్టుంది....గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చినవేళ అనీ....ఆ పసిది భూమ్మీద పడింది, అంతే!"
"ఏమ్మాటలని చంద్రయ్యగారూ! ఆ వరదల్లో అదెక్కడ కొట్టుకుపోయిందో, ఆ పిల్ల ఏమయిందోనని నేను భయపడి ఛస్తుంటే..! మీరు, సుధాకర్ వెళ్ళి వుండండి ఆ ఇంట్లో అదొచ్చి నా దగ్గరుంటానంది" అంది తులసమ్మ.
చంద్రయ్య ఫెళ్ళున నవ్వాడు.
"చాల్లేవమ్మా, ఆ మహలక్ష్మమ్మ తెలివి...! నీ దగ్గరామె వుంటే మా కొచ్చేదేమిటీ... ఆ ఇల్లు అల్లుడి పేర రాసేయాలి. అంతే!! ఆ మాటే చెప్పు ఆ మహాలక్ష్మమ్మకి" కోపంగా చంద్రయ్య అన్నాడు.
"ఆ ఆఫీసు నష్టాలతో నడుస్తోంది కనక నెల, రెండు నెలల్లో దాన్ని మూసేయటం ఖాయం. సుధాకర్ కీ, భార్యకీ, బిడ్డకీ ఆధారమేది?! మహాలక్ష్మి, పోనీ... ఇల్లు అల్లుడి పేర రాసేస్తే- వాళ్ళ దగ్గర తను వుండచ్చుగా! కానీ, ఇల్లు తన పేరే రాయించుకుని అత్తగారిని వెళ్ళగొడితే..?! సుధాకర్ చేయకపోవచ్చు కాని- చంద్రయ్య, తులసమ్మ ఏమీ పాలుపోక సతమతమవుతూ వుంటే, లీల ఆ వరదలో ఎక్కడ చిక్కడిపోయిందోననే బాధ మరీ ఎక్కువైపోయింది. ఆరోజు పిన్ని నీ దగ్గరుంటానని ఏడ్చింది, వుండనిస్తే ఎంత బావుండేదీ?"
"ఇంతకీ... ఎక్కడెళ్ళిందంటావూ?! అయినా-ఆడపిల్లకి అంత అహం పనికిరాదు. మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టనని తెగేసి చెప్పింది వాడికి. ఏదయినా వాడు భర్త, తాళి కట్టినవాడూ!" చంద్రయ్య మాటలు, మహా చిరాగ్గా వున్నాయి తులసమ్మకి వినటానికి.
"పిల్ల ఇంటికొచ్చిందేమో....నే వెళ్ళి మహలక్ష్మిని కనుక్కుంటా...మీరెళ్ళండి" అంది చంద్రయ్యతో.
"నేనూ వస్తా... పద! అయినా- ఆడదానికి ఇంత తెగింపా...? చంద్రయ్య స్కూటర్ పైన బయలుదేరాడు.
"నేను తరువాత వెడతా, మహలక్ష్మితో మాట్లాడతా మీ పనిమీద మీరెళ్ళండి" అంది తులసమ్మ చంద్రయ్యతో.
చంద్రయ్యతో తులసమ్మ పేచీ పడలేదు. ఎందుకంటే-వడ్డీ ఇస్తానని చెప్పి చాలా డబ్బు తీసుకున్నాడు చంద్రయ్య. ఈనాడు ఏ చిన్న పేచీయో పెట్టి వడ్డీ డబ్బులు ఇవ్వకుండా, అసలు ఇవ్వకుండా ఊరొదలి వెళ్ళిపోగలడు చంద్రయ్య అందుకే, ముళ్ళమీద బట్ట చిరక్కుండా లాగటం ఎంత కష్టమో ఈ చంద్రయ్య దగ్గరున్న తన డబ్బు వసూలు చేసుకోవడమూ అంత కష్టమే.
తులసమ్మకి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది....
లీల స్నేహితురాలు జానకి తనకీ తెలుసు... ఒకవేళ లీల ఆ జానకి ఇంటికెళ్ళి వుండచ్చు... జానకి చాలా డబ్బున్న ఆమె... భర్త పెద్ద వ్యాపారంలో వున్నాడు. తలదాచుకోటానికి ఇంత చోటిచ్చిందేమో! వెడతాను, వెళ్ళి లీలని నాలుగు చివాట్లు పెట్టి, వెంట తీసుకువస్తా, అయినా సమస్య వస్తే పరిష్కరించుకోవాలి కానీ, ఇల్లు వదిలిపోతే ఎలా!! ఆస్తికోసం కాపురం కూలగొట్టుకుంటే ఎలా? అంతకీ భర్త దగ్గరుండలేకపోతే ముందు తల్లిని, పిల్లని తను చూస్తుంది, తరువాత సంగతి తరువాత.
తులసమ్మ పనులు ముగించుకుని, జానకి యింటికి బయలుదేరింది. అంతలోనే చంద్రయ్య గుమ్మంలో ఆగాడు.
"ఆ మహలక్ష్మమ్మ జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడుంది... పిల్లకోసం కలవరిస్తోంది... ఆవిడకేం తెలుసు లీల భర్తతో పోట్లాడి, పిల్లని తీసుకుపోయిందనీ..!చంద్రయ్య చాలా ఉత్సాహంగా చెబుతున్న మాటలు మహా విసుగ్గా వుంది వినటానికి తులసమ్మకి! తన ఆవేదన వేరు, ఇతని ఆలోచన వేరు, ఛీ..!
- తులసమ్మ చంద్రయ్యతో కలిసి మహలక్ష్మమ్మ ఇంటికెళ్ళింది.
వీణ, రవి చాలా సంతోషంగా వున్నారు పిల్లని చూసి. "మహాలక్ష్మి మనింటికొచ్చింది కదూ!" అంటూ వీణ ఆ పిల్ల సేనలో మునిగిపోయింది.
"ఇదిగో ఒక మాట వింటావా.... శుభవార్తే! నాకు ప్రమోషను, ట్రాన్సఫరు!!" రవి ఎంతో ఉత్సాహంగా పిల్లని ఎత్తుకున్నాడు.
ఒక్క నిమిషం మనసు ఆనందపడ్డా మరు నిముషంలో విచారంలో మునిగి పోయింది వీణ.
"ప్రమోషనూ వద్దు, ట్రాన్స్ ఫరూ వద్దు- అని చెప్పేయండి!" అంది.
"చాల్లే-ప్రమోషన్ ఎందుకొద్దూ? అయినా...ఉద్యోగం చేసుకునేవాడికి అన్ని ఊళ్ళూ తనవే..!" అన్నాడు.
వీణ భయం ఒకటే- మరో ఊరు తను వెళ్ళిపోతే, రాజీవ్ పిల్లని తనతో పంపనంటాడు. ఎలాగో ఓలాగ థానే చూసుకుంటానంటాడు. వీణ ఆ పిల్లని వెంటనే గుండెల్లో దాచుకుంది. దీన్ని వదిలి వుండటమే!!
"వద్దండీ, ట్రాన్స్ ఫర్ ఆపించుకోండి..!" అంది మళ్ళా.
"సరే... నువ్వుండు ఇక్కడే! - నేను వెడతాను" అన్నాడు.
హమ్మో! భర్తకి దూరంగా అసలు వుండలేదు తను!! ఏం చేయాలీ! చూద్దాం, అన్నిటికీ ఆ దేవుడేవున్నాడు.
వీణ ఫక్కున నవ్వింది... ఏమిటో అర్ధంకాలేదు రవికి.
"అవునూ... దీన్ని మనం ఏమని పిలుద్దాం?" అంది ఎంతో సంతోషంతో.
"పప్పీ, పప్పీ..!"
"ఛీ... ఎప్పటికీ అదే పేరు నిలిచిపోతుంది"
"మరి...నీ యిష్టం!"
"అపరాజిత! అమ్మవారి పేరండీ... ఎంత బావుందో చూసారా! ఇప్పుడే, ఈ క్షణమే నాకు తోచింది. బాగుంది కదూ..!" హడావిడిగా చెప్పేస్తుంటే రవి నవ్వి ఊరుకున్నాడు.
"నిజం చెప్పాలంటే నాకు బాగా లేదు. ఎలా పిలుస్తామో చెప్పు!"
రవి మాటలు వీణకి నిరుత్సాహం కలిగించినా, మళ్ళీ ఆలోచించటం మొదలుపెట్టింది.
"దీని పేరు నేను ఎప్పుడో నిర్ణయించేశా- మమత, మమత!"
ఆ పేరు వీణకి కూడా బాగా నచ్చింది.
వాళ్ళ మాటలు అర్ధమయినట్టుగా కళ్ళు అటు ఇటు తిప్పింది మమత.
"మీ అన్నయ్య మనకి ఈ పిల్లనిచ్చేశాడు, మనం పెంచుకుంటామంటే! మనం ఎక్కడికెళితే అదీ మనతోబాటే..!"
వీణ ఏమీ అనలేదు.
వినోద్ కి ఈ పాప రావటం ఏమీ ఇష్టం లేదనేది స్పష్టం. అయితే చెప్పలేదు కనక, తల్లి చూడనప్పుడు దాని పొట్టమీద మెల్లగా ఓ దెబ్బ వేస్తాడు. జుట్టు పీకుతాడు. అది ఏడ్వగానే వీణ వచ్చేస్తుంది.
ఏదో పేచీ పెట్టి ఏడుస్తాడు. వెంటనే పాపని కింద పడుకోబెట్టి వెంటనే వాణ్ణి ఒళ్ళో కూచోపెట్టుకుంటుంది వీణ..!
ఋణానుబంధం అంటే ఇదేనేమో!!
బయటకి పనిమీద వెళ్ళిన రవి వచ్చేశాడు.
ప్రమోషన్ రావటం చాలా సంతోషంగా వుంది. స్నేహితులంతా అభినందిస్తున్నారు. ఈ అదృష్టమంతా ఆ పసిపిల్లదే అనుకున్నాడు మనసులో.
ఎవరికైనా చెప్తే..? ఆ... తప్పేముందీ!
రవి బాగ్ తెరిచి వీణ చేతికందించాడు.
బొమ్మలు, గౌన్లు!!
"ఇప్పుడే బొమ్మల్తో ఆడుకుంటుందా..?" అంది వీణ.
"ముందు వీడు ఆడుకుంటాడు, తరువాత అది ఆడుకుంటుంది..!"
వీధిలో కారాగిన చప్పుడైంది. హడావిడిగా పిల్లని లోపలి తీసికెళ్ళిపోయింది వీణ.
నిద్రపోతున్న పిల్లని పడుకోపెట్టింది.
కారులోంచి మాధవరావు దిగాడు ముందు! తర్వాత అతని భార్య దిగింది.
వీళ్ళంతా క్లబ్బులో స్నేహితులు!
సింగపూర్ ట్రిప్పు గురించి అడగడానికొచ్చింది మాధవరావు భార్య జానకి.
"నేను రాలేను" అంది వీణ.
"అదేమిటీ..? మీరే ముందొస్తారనుకుంటుంటే..!! ఏమిటీ... హెల్త్ బాలేదా?" అంది జానకి.
"నాకు ట్రాన్స్ ఫరయింది... వారం రోజుల్లో వెళ్ళిపోవాలి. సర్దుకోవలసినవీ అవీ చాలా వుంటాయిగా..!!" అన్నాడు రవి.
లోపలనించి 'కేరు' మని ఏడుపు! జానకి అటు ఇటు చూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS