స్వప్నశీలి శర్మ సినీమా తార తార
ప్రజాస్వాయవాది ప్లేటో
మధుర మధుర మధుశాల మనుష్యులతో కిటకిటలాడు
తోంది. నేను వెళ్ళేసరికి ఎక్కడా జాగాలేదు. హాలంతా
సంభాషణతో, పొగతో నిండిపోయింది. ఒంటరిగా తాగుతున్న
ఒక యువకుడి పక్క కూర్చున్నాను. చాలాసేపటినుంచి
జపం చేస్తున్నట్టున్నాడతను. ఎదుట ఎవ్వరూ లేకపోయినా
ఒక్కడే ఏమిటో మాట్లాడేస్తున్నాడు. నాకో అరగంట వ్యవధి
వుండడంవల్ల అతని పక్క కూర్చుని అతని వాక్కులు
విన్నాను.
దుఃఖాన్ని మనం తాగుడులో ముంచకపోతే తాగుడు మనల్ని దుఃఖంలో ముంచేస్తుంది అంటున్నాడతను. ఆ రోజుల్లో నేను తార అనే సినిమా తారతో కలిసి దుఃఖాన్ని ముంచేసేవాణ్ని పదేళ్ళ కిందట. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కరకం దుఃఖాన్ని పంచవలసి వస్తుండేది. ఋతువులంటే వసంతం, గ్రీష్మం, వర్షం మొదలైనవి కావు. సినిమాలూ, చిత్రలేఖనం, క్రికెట్ ఇత్యాదులు. గుర్రాల ఋతువు నాకు బాగా జ్ఞాపకం. అప్పటి దుఃఖం అతి భయంకరమైనది. అక్కడిక్కడికి వచ్చే హైక్లాస్ అమ్మాయిలతో వేగలేకపోయేవాణ్ణి. పెద్ద పెద్ద కుటుంబాలకి చెందినవాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివినవాళ్ళు. వంగసాహిత్యం మీద వాళ్ళు చర్చిస్తూ వుంటే నేను నోరు వెళ్ల పెట్టుకుని వినేవాణ్ణి. అప్పుడప్పుడు కోచి కోచీ, అమిజింటాన్, బొంగొదేషేర్ షోభా అనే మాటలు నన్ను హడలగొట్టేవి.
ఆ యేడు నా హైక్లాస్ ఋతువు మాఘమాసంలో మినర్వా హాటేల్ లో ప్రారంభమయింది. ఇది నాలుగురోజుల కంటే ఎక్కువకాలం సాగలేదు. ప్రతిరోజూ ఎడతెరిపి లేకుండా దుఃఖాలను ముంచడమే. నాలుగోరోజు కొందరు కాలేజీ కుర్రాళ్ళు నన్ను నా గదిలో పడుకో పెట్టవలసి వచ్చింది.
ఆరోజుల్లో ఈ అమ్మాయి నాతోబాటు నా దుఃఖాలను సరిసమానంగా అనుభవించి పంచుకొంది. ఒక్కణ్నే అయితే అంత దుఃఖాన్ని మొయ్యలేకపోయి వుండేవాణ్ని. అదృష్టం వరించడం వల్ల అంతకుముందు గుర్రాల ఋతువులో అమూల్యమైన నా ధనం అంతర్ధానమయింది. సిగరెట్టు టిన్నులకు కూడా చెడ్డచిక్కు పడవలసి వచ్చింది. అప్పుడా అమ్మాయి, తార అమోఘంగా సహాయపడింది. ఒకటే దుఃఖమే లేకపోతే నేనూ మిగలక ఉన్నదన్నంత వరకు పరిస్థితి విషమించింది. తార నా దుఃఖంతో హోరాహోరీ పోరాడింది.
ఉంటే ఇక నాతో లాభం లేదని నా దుఃఖం పెట్టేబేడా సర్దుకుని ఇంకో అదృష్టవంతుడి దగ్గరకి పోయింది.
నాకు సాయపడడమంటే ఎందుకో తారకంత సరదా? చూడండి శర్మగారూ, అనేది తార. ఎంతకాలం ఈ హోటేలు బదుకు? చక్కగా మాయింటికి వచ్చెయ్యకూడదా అనేది. ఇంకా ఎన్నెన్నో తియ్యని ఉపన్యాసాలిచ్చేది.
ప్లేటో మహాశయుడు నిర్వచించిన ఆధ్యాత్మిక బాంధవ్యం, ఈ రోజుల్లో చాలామంది ప్లేటోనిక్ స్నేహాలను గురించి మాట్లాడడం వింటున్నాం. గాని వందలో ఒకటైనా అసలైనదవునో కాదో. హిందీ భాషలోకి తర్జుమా అయిన ప్లేటో పుస్తకాన్ని పట్టుకొని తార గంటల తరబడి నాకు తెలుగులో చెబుతుండేది. సోఫా మీద ఇద్దరం కూర్చుంటాం. ఎదురుగుండా చిన్న టేబిల్ మీద గ్లాసులూ, సీసాలూ. ఒక గ్రామఫోన్ ఇటీవలి ఫిలిం సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఈ వాతావరణంలో తార ప్లేటో వేదాంతాన్ని నాకు చదివి వినిపిస్తుంది. ఇక మనం ప్రజాస్వామ్యం అంటే ఏమిటో పరిశీలిద్దాం. ఇది యెలా ఏర్పడుతుంది? దీని స్వరూప స్వభావాలెట్టివి? ప్రజాస్వామ్య మానవుడెట్టివాడు? అతని విలువ యెంత?
ఈ విధంగా సాగిస్తుంది తార. నేను సోఫాలో చేరబడి కలలు కంటూ ఉంటాను. ప్రజాస్వామ్య మానవుణ్ణి గురించి వాడి విలువ గురించి. నా మిత్రుడొకడు ఉండేవాడు. ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ, ఒకరి జోలి నాకక్కరలేదు, నా జోలి ఒకరికక్కర్లేదు అనేవాడు. తానొక్కడే ప్రజాస్వామ్యవాది అయినట్టు మాట్లాడేవాడు. వాడి విలువ ఎంత ఉండి ఉండవచ్చునని అంచనా వేసేవాడిని నేను. ధరించిన బట్టల ఖరీదు కూడా కలుపుకుని అయిదు రూపాయల చిల్లర ఉంటుందనుకొన్నాను.
ఆ రోజుల్లో ప్లేటో మహానీయుడి ఫిలాసఫి మమ్మల్ని బాగా కాపాడింది. బొంబాయి వెళ్ళి హిందీ చిత్రాలలో నటించడం తన జీవితాశయమని తార చెప్పేది. తన కాలి గోటికైనా పోలనివారు పెద్దపెద్ద పోజులిచ్చి తిరుగుతూ ఉంటే తానేనా అంత తీసిపోయింది? అంచేత ఒకరోజు ప్లేటో రచనలను కొనుక్కుని వచ్చింది.
ప్రజాస్వామ్య మానవుడెలా వుంటాడో కలలు కనడం ముగించిన తర్వాత నాకు ప్లేటో ఎలా వుండేవాడో అన్న అనుమానం కలిగింది. తారా? ప్లేటో ఇంటి పేరేమిటి? అని అడిగాను.
ఇంటిపేరా? ప్లేటోకి ఇంటిపేరున్నట్టు కనబడదు. ప్లేటో అంటారతణ్ణి అందరూ. అంతే! అనేది తార.
ప్లేటో ఉద్యోగం ఏమిటి, తారా? అతడొక గొప్ప వేదాంతి. నేను చదువుతున్నవన్నీ గొప్ప సత్యాలు.
అయితే మరికొంచెం చదువు అనేవాడిని.
తార పుస్తకం తెరచి చదివేది. ధనార్జనతో నిమగ్నులైన వారికి కండకావరం వల్ల కళ్ళు కనబడవు. వీరు అశ్రద్ధవల్ల దేశంలో సోమరిపోతులూ, భిక్షకులూ అధికమవుతారు. వీళ్ళ కొడుకులు మాత్రం ఐశ్వర్యంతో తులతూగుతూ మందమతులుగా తయారవుతారు. బాధని ఓర్చుకొనే శక్తిగానై, ఆనందాన్ని నిరాకరించే నిగ్రహంగాని వీళ్ళకుండవు. తార చదివేది. పాలకులూ పాలితులూ ఒండొరులను వీధులలో గానీ, ఉత్సవాలలో గాని కలుసుకున్నప్పుడూ, యుద్ధకాలంలో సైన్యంలో చేరి ధనికులూ దరిద్రులూ కలిసి పనిచేసేటప్పుడు ధనికులు దరిద్రులను అసహ్యించుకోరు. తరుచు, కాయకష్టపడి పనిచేసే దరిద్రుడు సుకుమారంగా పెరిగి ఒళ్ళు బలిసిపోయిన ధనవంతుల్ని చూసినప్పుడు పేదవాళ్ళతనం వల్లనే ధనవంతుల ఆటలు సాగుతున్నాయని గ్రహిస్తాడు. ఆ నోటా ఈ నోటా మాట వ్యాపిస్తుంది. దరిద్రులందరూ ఏకీభవిస్తే ధనవంతులను హతమార్చడం సులభమని భావిస్తారు.
