"నువ్వెందుకు ఇక్కడ కొచ్చావ్? కబురుచేస్తే నేనే వచ్చేవాడ్నిగా?" చిరాకు పడుతూ అన్నాడు.
"థియేటర్ను అమీనా సీల్ చేశాడు. నాకేమీ తోచడంలేదు. ఏం చెయ్యాలో?"
"సరే! నువ్వెళ్ళు ఇప్పుడు నేను టూర్ వెళ్తున్నా. ఎల్లుండి తిరిగొస్తా!"
"మీరు వెళ్ళేముందు వకీలుతో మాట్లాడతారేమోనని?" అన్నది వరూధిని బాధగా.
"వీలుంటే చూస్తా ఎల్లుండి పొద్దున్నే వస్తాగా నీకెందుకు?"
వరూధిని దిగులుగా అతని కళ్ళలోకి చూసింది.
వీలయినంత త్వరగా వరూథిన్ని ఆఫీసు ముందునుంచి పంపేయాలన్న ధోరణిలో "రెండురోజుల్లో మించిపోయేదేమీలేదులే. రేయ్ రిక్షా? పోనియ్ రా!" అన్నాడు డి.యస్.పి.
వరూధిని ఇంటికి తిరిగొచ్చింది. వెంకటపతి కాళ్ళమీద తల పెట్టుకొని కుర్చీలో గొంతు కూర్చొని వున్నాడు.
"ఏమిటా కూర్చోవడం?" అంది భార్య.
వెంకటపతి తలెత్తి చూశాడు. కళ్ళు తేలిపోతున్నాయి.
"ఆయనేమన్నాడూ?"
"ఏదో ఒకటి అన్నాడులే. ముందు నువ్వు సరిగా కూర్చో! వంటి మీద బట్టన్నా సర్దుకోవడం తెలియదా?" అని వరూధిని విసురుగా లోపల కెళ్ళింది.
"అంతా నాశనం చేసింది!" అన్నాడు వెంకటపతి. భార్య ఆ మాట వినేంత దగ్గర్లో లేదనే అన్నాడు. ఆమె వినాలని అతని మనసులోవుంది. ఆ మాట అనాలనే అంతసేపూ ఆలోచిస్తూ భార్యకోసం చూస్తూ కూర్చున్నాడు. కాని తీరా ఆమె వస్తుండగానే వెంకటపతి చివాల్న లేచి బయటికి వెళ్ళాడు.
ఆ రెండు రోజులు వరూధిని వెలుగు ముఖం చూడలేదు. డి.యస్.పి. వచ్చాడేమో చూసి రమ్మని మూడోరోజున భర్తను పంపించింది.
"ఇంకా రాలేదట, సాయంకాలానికి వస్తాడన్నారు." తిరిగొచ్చి వెంకటపతి చెప్పాడు.
సాయంకాలం ఆరయినా డి.యస్.పి రాలేదు.
వరూధిని మళ్ళీ వెంకటపతిని వెళ్ళి చూసి రమ్మన్నది.
"ఎన్నిసార్లు తిరగమంటావ్? వస్తే ఆయనే వస్తార్లే!" బద్దకించి అన్నాడు వెంకటపతి.
లాక్కుపోతున్నట్టున్న కాలివేళ్ళను విరుచుకున్నాడు. నోరంతా తెరచి ఆవలించాడు.
వరూధిని భర్త అవస్థను గుర్తించింది.
"మనవసరమా? ఆయనవసరమా? ఎన్ని సార్లయినా తిరగాలి." భర్తకు గీతా రహస్యం బోధిస్తున్నట్లుగా అన్నది వరూధిని.
జీవిత పరమార్ధాన్ని గ్రహించిన వాడిలా ముఖం పెట్టి "డబ్బులు కావాలి." అన్నాడు వెంకటపతి.
"మొన్ననేగా ఇచ్చాను?"
"అయిపోయినై. మొన్నటిది ఇవ్వాల్దాకా ఉంటుందా? నిన్ననే అయిపోయింది." వేదాంత ధోరణిలో అన్నాడు వెంకటపతి.
"ముదనష్టపాడు! ఎంతిచ్చినా చాలదు ఎప్పటికప్పుడే తగలేస్తాడు." అనుకుంటూ గోద్రేజ్ బీరువా దగ్గరకు వెళ్ళింది వరూధిని. ఇరవై రూపాయలు భర్తమీదకు విసిరింది.
వెంకటపతి వళ్ళోపడిన రెండునోట్లు తీసుకొని "ఇరవయ్యేనా? ఇది ఏమూలకు చాల్తదీ?" అంటూ గొణుక్కున్నాడు.
వెంకటపతికి తెలుసు. అనుభవం అతని విజ్ఞానాన్ని పెంచింది సమయాసమయాలు పట్టు విడుపులూ తెలుసుకొన్నాడు.
వరూధిని చేతిలో వున్న మిగతా రెండు నోట్లూ భర్త మీదకు విసిరింది. కింద పడ్డ పదిరూపాయల నోట్లు ఏరుకుని, తిరిగిచూడకుండా అదేపోత పోయాడు.
వెంకటపతి మరో గంటకు తూలుతూ ఇంటికొచ్చాడు.
"ఏమయిందీ?" ఆదుర్దాగా అడిగింది వరూధిని.
"అంతా అయిపోయింది?" అన్నాడు వెంకటపతి.
"ఏమిటయిపోయింది? నా శ్రాద్ధమా?"
"ఆఁ? ఇంకా పదిహేనుంటే హోటలు వాడికిచ్చేశాను. పాతబాకీ, వెంట పడుతున్నాడు మరి!"
హోటల్లో కూడా బాకీలు పెడ్తున్నాడా?
వరూథినికి వళ్ళు మండిపోయింది. మరో సమయంలో అయితే భర్త అంతుకనుక్కొని ఉండేది. కాని ఆమె మనస్సును ఇప్పుడు తొలిచేస్తున్నది డి.యస్.పి. వచ్చాడా లేడా? అన్న విషయం.
"ఇంతకీ ఆయన వచ్చాడా లేదా?"
"ఒచ్చాడొచ్చాడు!"
"ఎప్పుడు?"
"ఎప్పుడో మరి! అసలొచ్చాడు."
"ఎప్పుడొస్తానన్నాడూ?"
"వచ్చాడని చెప్తుంటే మళ్ళీ?" అన్నాడు భార్య మందుతాగి తిక్కిరి బిక్కిరి అవుతోంది అనుకున్న వెంకటపతి.
"నా దెవసం! మనింటి కెప్పుడొస్తానన్నాడని నేనడుగుతుంది."
భర్తను చూస్తుంటే వరూధిని వళ్ళు కంపరం ఎత్తి పోయింది.
"ఆఁ! ఆ మాట నేనడగలేదు. మర్చిపోయా మళ్ళీ వెళ్ళొచ్చేదా?" అన్నాడు వెంకటపతి వెళ్ళటానికి సిద్దం అయి భార్య అనుమతి కోసం ఎదురుచూస్తూ.
"ఎక్కడికీ? వల్లకాట్లోకా?"
"అక్కడ లేడు డి.యస్.పి. ఇంట్లోనే ఉన్నాడు." తల విదిలించుకొని గుర్తుచేసుకొని చెప్పాడు వెంకటపతి.
"నా ఖర్మ! నా రాత!" నొసటిమీద బాదుకొంది. వరూధిని.
ఛ! ఛ! కట్టుకొన్న వాడు ఇంట్లాంటివాడు కనుకనే తను అడ్డమైన వాళ్ళకూ అలుసయిపోయింది.
వరూధిని పడక గదిలోకి పరుగెత్తింది. వెంకటపతి మీద కసి డి.యస్.పి. మీదకు తిరిగింది.
ఊళ్ళోకొచ్చి కూడా ఇంతవరకు రాలేదు. తను అతడేదో మంచివాడనుకొంటూంది. అతడూ సమయం వచ్చేసరికి ముఖం తప్పిస్తున్నాడా?
వరూధిని ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చుందో గేటుదగ్గిర కారు ఆగిన చప్పుడు అయిందాకా తెలియలేదు.
డి.యస్.పి. కారుదిగి లోపలకొచ్చాడు. వరూథిని అతన్ని చూస్తూ ఆనందంతో పరవశం చెందింది.
ఈలోకంలో తనకున్న ఆత్మీయుడు ఈయన ఒక్కడే.
రాత్రి తొమ్మిదవొస్తుంది.
"పొద్దున్నే వస్తానని చెప్పి వెళ్ళారు. సాయంకాలమే ఊళ్ళోకి వచ్చి కూడా ఇప్పుడు కనిపిస్తున్నారా?" దెప్పుతూ అన్నది వరూధిని.
"మీ ఆయన చెప్పలా?"
"ఆయనేవుంటే మంగలాడెందుకూ అన్నదట వెనకటికి ఓ తలచెడ్డ ఆవిడ!"
"అంటే ఇప్పుడు నేను మంగలాడ్ని అంటావా?" వరూధిని చెయ్యి పట్టుకొని వళ్ళోకి లాక్కుంటూ, నవ్వుతూ అన్నాడు డి.యస్.పి. మోహన్ రావు.
చెయ్యి విడిపించుకొంటూ "మంగలాళ్ళనూ..." నాలుక కొరుక్కుంది వరూధిని.
"ముందీ సంగతి చెప్పండి. ఏం చేశారూ? వకీలుతో మాట్లాడారా?" అన్నది వరూధిని.
"అందుకేగా ఇంత ఆలస్యం అయింది. ఆరోజే లాయరు శంకర్రావుగారితో మాట్లాడి టూర్ వెళ్ళాను. ఇవ్వాళ రాగానే ముందు ఆయన్ను కలుసుకొన్నాను. ఆయనకు కేసు వివరాలన్నీ చెప్పాను."
"లాయరుగారేం చెప్పారూ?" ఆదుర్దాగా అడిగింది వరూధిని.
"శ్యామలాంబ భర్తకు నోటీసు ఇప్పించిందట. లీజు అయిపోయింతర్వాత థియేటర్ను అక్రమంగా తన అధీనంలోనే వుంచుకొన్నాడనీ, వెంటనే తన అన్నగారైన రామకృష్ణయ్యకు ఆ థియేటర్ ను హేండోవర్ చెయ్యాల్సిందనీను. నెలరోజుల క్రితమే రామనాధబాబుకు లాయరు నోటీసు ఇప్పించిందట భార్య. అంటే నువ్వు థియేటర్ ను తిరిగి స్వాధీనం చేసుకొన్న మూడోరోజే నోటీసు ఇప్పించిందన్నమాట. రామనాథబాబుతో పాటు నీకూ ఆ నోటీసు ఇప్పించి ఉండాలికదా? అలా ఎందుకు జరగలేదని లాయర్ ను అడిగాను. ఆయనగారు చెప్పిందేమిటంటే, నీ తరపున.....అంటే పవర్ ఆఫ్ ఆటర్నీ రామనాధబాబుకు ఉందట. అది నిజమేనా?" అన్నాడు డి.యస్.పి. మోహనరావు.

