* * * *
జయంతి తమ్ముళ్ళని, చెల్లెల్ని అంజనేయస్వామి గుడికి తీసుకువెళ్ళింది. వాళ్ళ నలుగుర్ని సురేంద్ర తన ఎడ్లబండిలో తీసుకెళ్ళాడు. పూజారి చేత పూజ చేయించింది జయంతి. పూజ అయిన వెంటనే ముగ్గురూ జయంతి కాళ్ళు మొక్కారు.
"అరెరె....ఇదేంట్రా నాకు మొక్కుతారెంటి? మీరు మొక్కాల్సింది ఆ స్వామికి, తరువాత అమ్మకి, నాన్నకి" అంది.
"మాకు కనిపించే దైవం నువ్వే అక్కా! ఆ స్వామి ఉన్నాడో లేడో మాకు తెలియదు. అయన మాకు మేలు చేస్తున్నాడో లేదో కూడా మాకు తెలియదు. ఈ దేవతే లేకపోతే మేము సురేంద్ర బావతో కలిసి పొలం పనులు చేసుకుంటూ వుండేవాళ్ళం. మా జీవితానికి సరికొత్త బాటను వేసావు. అన్నారు వాళ్ళు.
జయంతికి గత స్మృతులన్నీ గుర్తొస్తున్నాయి, చిన్నప్పుడు బావని ఆటలు పట్టించటం, ఎగతాళి చేయటం.....దిగులూ, చింతా ఏమి లేకుండా హాయిగా సినిమాలకి వెళ్ళటం.......డాబా పైన పిన్నివాళ్ళతో, బావతో కబుర్లు చెప్పుకోవటం...ఓహ్ ....ఇక ఆ జీవితం రాదు అనుకుంటూ ఆలోచిస్తుంది.
అందరం కలిసి ఇదే బండిలో లవకుశ సినిమాకు వెళ్ళటం! నాన్నగారికి తెలియకుండా మల్లీశ్వరి సినిమాకెళ్ళటం, పిన్ని వాళ్ళ భయం. అన్నీ గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంది.
"ఏంటక్కా! నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్?" అడిగింది తులసి.
"ఏం లేదులే! ఏదో గుర్తొచ్చింది!' అంది ముభావంగా.
"ఏంటి జయంతి ఇంతసేపు ఉన్నారు?' అడిగింది శివపార్వతి.
"ఏంచేద్దాం! బావ బండిని అలా తోలాడు. నేను తోలతాను ఇవ్వు బావా అంటే ఇవ్వలేదు. అయన లేట్....అయన ఎడ్లు లేట్!" అంది తులసి నవ్వుతూ.
"ఓహో! మరదలుపిల్లా నన్ను అంటే ఒప్పుకుంటానుగానీ నా ఎడ్లను అంటే ఒప్పుకునేది లేదు!" అన్నాడు సురేంద్ర బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటు.
"సరేలే! పదండి లోపలికి. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని రండి. అంతా ఎదురుచూస్తున్నారు మీకోసం ఇప్పటికే ఆలస్యమయింది భోజనం చేద్దాం!" అంది శివపార్వతి.
"అందుకే పిన్ని ఇంత లావయింది" అంది తులసి.
"ఏయ్! నిన్ను!" అంటూ తులసి వెంట పరుగుతీసింది శివపార్వతి.
తులసి ఆమెకు చిక్కకుండా బావిచుట్టు తిరిగింది.
"అమ్మో....ఆయాసం...." అంది శివపార్వతి.
"మరెందుకు పిన్ని నాతో పెట్టుకుంటావు? నువ్వు రోజు పొద్దుటే లేచి ఎక్సర్ సైజ్ చేయి.....స్కిప్పింగ్ చేయి....అంటే తాడాట.....దెబ్బకు మన జయంతక్కలా తయారవుతావు" అంది తులసి బావిలో చేద వేస్తూ.
"నిజంగానా?" అంది ఆతృతగా.
"అబ్బ! ఎంత అశో.....మన జయంతక్కలా అవుతావనేసరికి చూడు ఎంత సంబరపడిపోతుందో" అంది తులసి.
"నేనంటే మిరందరికి నవ్వులాట అయిపోయింది. లాభం లేదు ఆ కిప్పింగ్ చేయాల్సిందే!" అంది సీరియస్ గా.
"కిప్పింగ్ కాదు పిన్ని! స్కిప్పింగ్....స్కిప్పింగ్......" అంది తులసి ఆటపట్టిస్తూ.
"ఏదో ఒకటిలే! అసలు ఆయన్ని అనాలి ముందు!" అంది పార్వతి.
"అదేంటి మధ్యలో మా బాబాయ్ ఏం చేశాడు పాపం?" అన్నాడు శేఖర్ ప్యాంట్ పైకి మడుచుకుంటు.
"మీలాగే నన్ను ఆయన కూడా అనివుంటే నా జాగ్రత్తలో నేను ఉండేదాన్ని కదా?" అంది సీరియస్ గా.
"ఒకరు చెప్పాలా? నీకు తెలియదా?" అంది తులసి.
"ఊరుకోండే....పాపం చిన్న పిన్నిని ఎందుకు అలా అటపట్టిస్తారు?" అంది జయంతి.
"అబ్బో! నువ్వు మాత్రం తక్కువ తిన్నావా తల్లీ! మొన్నటి వరకు నువ్వు కూడా నన్ను ఎగతాళి చేశావుగా. ఇప్పుడు ఇక నీకు బదులు వీళ్ళు మొదలు పెట్టారు" అంది సీరియస్ గా శివపార్వతి.
"మా చిన్నత్తంటే మీకు బాగా అలుసయిపోయింది. అత్తా నువ్వు ఓ నెలరోజులు ఇక్కడే ఉండి నాతో పాటు పొలం పనికిరా. ఒక్క దెబ్బతో సగం అయిపోతావు." అన్నాడు సురేంద్ర నవ్వుతూ.
"పొలంపనికా?" అంది ఆశ్చర్యంగా.
"అవునత్తా! పొలంలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కలుపు మొక్కలు తీశావనుకో!" అన్నాడు సురేంద్ర.
"నడుం విరిగి బాబాయ్ కి ఆస్పత్రి బిల్లు పెరుగుతుంది గానీ పదండి లోపలికి" అంది తులసి.
అంతా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు.
"తులసి....శేఖర్, ఇటురండి ముగ్గురూ! నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి!" అంది జయంతి.
ముగ్గురు అయన గదిలోకి వెళ్ళారు. వాళ్ళ వెనుకే జయంతి వెళ్ళింది.
"నాన్నగారూ! మమ్మల్ని దీవించండి, ఫస్ట్ క్లాసులో పాసయ్యాను" అన్నాడు శేఖర్ అయన కాళ్ళు కళ్ళకద్దుకుంటు. తులసి, రాము కూడా అలాగే చేశారు.
అయన కళ్ళలో కోటి కోటి నక్షత్రాలు మెరిసాయి.
అలానే అచేతనంగా మంచంపైన పడుకున్న వ్యక్తీ లేవటానికి ప్రయత్నం చేశాడు.
"వద్దండి....లేవకండి...." అంది జయంతి ఆప్యాయంగా.
ఆయన జయంతిని దగ్గరకు రమ్మని పిలిచాడు.
జయంతి అయన తల దగ్గర మంచం పైన కూర్చుంది.
ముగ్గురు పిల్లలు మంచం దగ్గర నిలబడి ఉన్నారు.
కస్తూరి కూడా ఆ గదిలోకి వచ్చింది.
సర్వోత్తమరావు రెండు చేతుల్తో కూతురికి దండం పెట్టాడు. అయన కళ్ళ వెంట నీళ్ళు జలజల రాలిపోతున్నాయి.
