"కిందకు పోదామా చిన్నపిన్ని? మళ్ళీ ఎప్పుడొస్తారు మీరు?" అడిగింది జయంతి.
"వస్తాం జయంతీ! ఉగాది పండుగ వస్తుందికదా. పిల్లల్ని కూడా తీసుకుని వస్తాం. మీరు మా ఇంటికి వస్తూ పోతూ వుండండి" అడిగింది అర్దింపుగా పార్వతి.
"వచ్చేవారం వస్తాం పార్వతీ! నేను, అయన కలిసివస్తాం" అంది దాక్షాయణి.
"మంచిదక్కా!" అంది పార్వతి.
ముగ్గురూ కలిసి కిందకు దిగారు.
42
ఆరోజు.....
జయంతి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఇంటిల్లిపాదీ పండగ వేడుకులా వుంది.
కస్తూరి హడావుడి ఇంతా అంతా కాదు.
వంటపనిలో మునిగిపోయింది.
ఊరునుంచి శివపార్వతి, సుందరం వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు.
ఈ ఆనందంలో ప్రత్యేకత ఏమిటంటే -సురేంద్ర, గిరిజలు కూడా ఆరోజు జయంతిని మనస్పూర్తిగా అభినందించారు.
చాలా రోజుల తరువాత ఆ ఇంటికి పూర్వవైభవం వచ్చింది.
"దాక్షాయణి...అమ్మా దాక్షాయణి! ఓసారి ఇలా రా" అంటూ పిలిచింది కస్తూరి వంటగదిలోనుంచి.
"వస్తున్నానక్కా" అంటూ దాక్షాయణి వంటగదిలోకి వెళ్ళింది.
"పొయ్యిమీద పప్పు పొంగుతుంది. కాస్త చూడమ్మా! నేను ఈ లోపు యీ కాయగూరలు తరుగుతాను. పిల్లలందరూ వచ్చారు. నాకు కాలు చేయి ఆడటం లేదు. వంట చూస్తే ఇంకా కాలేదు..." అంది అందోళనగా కస్తూరి.
"మేమున్నాం కదక్కా! మీరెందుకు కంగారుపడతారు? పార్వతి, నేను యిద్దరం కలిసి అరగంటలో వంట పూర్తీ చేస్తాం సరేనా?" అంది నవ్వుతూ దాక్షాయణి.
"పాయసం కూడా చేయాలమ్మా!జయంతికి చాలా యిష్టం" అంది కస్తూరి.
"చేద్దామక్కా! ఈరోజు జయంతి ఆశయం సగం నెరవేరింది. ఆ పిల్లకు వీళ్ళు ఎంతైనా ఋణపడి వుండాలి" అంది పప్పు మేదుపుతూ.
"అవును దాక్షాయణి! పాపం పిచ్చిపిల్ల. వారికోసం రాత్రింబవళ్ళు కష్టపడుతోంది. అదే లేకపోతే వీళ్ళ జీవితాలు ఏమయ్యేవో! తలుచుకుంటేనే భయం వేస్తుంది" అంది కస్తూరి కళ్ళు వట్టుకుంటు.
"ఏంటక్కా ఏమయింది?" అంటూ వచ్చింది పార్వతి.
"ఏం లేదులే, కూతురి కష్టం, విజయం చూసి ఒక కంట కన్నీరు, మరోకంట ఆనందభాష్పాలు రాలుస్తోందికస్తూరక్క" అంది దాక్షాయణి నవ్వుతూ.
"నిజమే....ఇది జయంతి ఒంటిరెక్కతో సాధించిన విజయం...." అంది శివపార్వతి ఆనందంగా.
ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తిచేశారు.
