Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 77


    "నాన్సెన్స్" అని మానాన్న తనమానాన తాను నడుచుకుపోయాడు.
    మా నాన్నకి మతిపోయిందనుకొని వెంటపడ్డాడు రైతు "ఆ బట్టలతో నడుచుకు వెళ్ళడం అప్రతిష్ఠ, పోనీ నా బైసికిలిస్తాను. తీసుకోకూడదూ?" అన్నాడు రైతు.
    రైతు మానాన్నగారి ఆప్తకోటిలోనివాడు. అతనికి మా నాన్నగారంటే ఎంతో గౌరవం. చాలా సదుద్దేశంతో సైకలిస్తానన్నాడతను. అసహ్యంగా చూస్తూ ఇలా అన్నాడు.
    "ఏమిటీ? ఆ అపవిత్రమైన యంత్రాన్ని నన్నెక్కమంటున్నావా? ఆ చెత్తతో నా బతుకుని అంటు చేసుకోమంటున్నావా? (చెత్తనే మాటకి ఆర్మీనియన్ భాషలో పర్యాయపదం మరీ దారుణంగా ఉంటుంది.) ఇటువంటి పదార్థాలు మనుష్యుడు ముట్టుకోవలసినవి కావు. నిటారుగా నిలబడి రెండుకాళ్ళతో నడవడానికే మానవుణ్ని దేవుడు ఈభూమి మీద ఉద్దేశించాడు."
    అంటూ మానాన్న వెళ్ళిపోయాడు.
    ఔను. మానాన్నని ఆరాధిస్తున్నాను నేను. ఇకనిప్పుడు, ఒంటరిగా ఈ గదిలో, ఈ సంగతులన్నీ ఆలోచిస్తూ ఈ కథని టైపుచేస్తూ నేనూ మానాన్న ఒకటే అని ఋజువుచెయ్యబోతున్నాను.
    టైపురైటరు సంగతి త్వరలోనే చెప్పబోతున్నాను. ఇప్పుడేమీ తొందరలేదు. నేను కథారచయితని. వైమానికుణ్ని కాను. విమానంలో కూర్చుని గంటకు రెండువందల యాభైమైళ్ళ వేగంతో అట్లాంటిక్ సముద్రాన్ని దాటబోవడం లేదు.
    ఇవాళ సోమవారం. ఈయేడు 1933.
    కొన్నికోట్ల సంవత్సరాల కాలాన్ని కథలోకి కూరదలచుకున్నాను. ఇంకోసారి ఈ కథను చదివేటప్పుడు నేనూ మానాన్నలో కలిసిపోయి ఇద్దరమూ ప్రేమించిన ఈ భూమిలో ఒక భాగమైపోవచ్చును. నా పిల్లలు ఈ భూమిపైకి తేలవచ్చును. నన్ను మా నాన్న కోరినట్లు వాళ్ళని నేనుకూడా వినయంగా ఉండండని కోరవచ్చు.
    ఇంకో క్షణంలో ఒక శతాబ్దం గడచిపోవచ్చును. వీలయినంతవరకు ఈ క్షణాన్ని సజీవంగా నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
    సంగీతవేత్తలు తమ వాద్యాలు పోయినా, దెబ్బతిన్నా ఏడ్చారని మనం ఎరుగుదుము. గొప్ప వైణికునికి అతని వీణ అతనిలో ఒక భాగం. చీకటి మనస్సుగల చిత్రమైన యువకుణ్ని నేను. చిత్రమైన పోకడలు నావి. భూమి నాదేకాని లోకం నాదికాదు. భాష నుంచి నన్ను వేరుచేసి వీధిలో పడేస్తే నా స్వరూపమే పోతుంది. నీడకూడా మిగలదు. అప్పుడు నాకు గుమాస్తాకున్నపాటి గౌరవం గాని, హోటల్ బంట్రోతుకున్న హోదాగాని, టాక్సీ డ్రైవరుకున్నపాటి అస్తిత్వంగాని ఉండనే ఉండవు.
    ఈ ఆరునెలల నుంచీ నేను నా రచనకి దూరమైపోయాను. శూన్యాన్ని అయిపోయాను. వీధుల్లో నడుస్తున్నానేగాని ప్రాణం ఉన్నట్టేలేదు. ఈ విశ్వపు దుస్స్వప్నంలో ఏదో ఒక అస్పష్టపు నీడని. బుద్ధిపూర్వకంగా ఆలోచించకుండా మాటలు లేకుండా. భాష లేకుండా నేను బతకలేను. నాకు అర్థంలేదు. చచ్చిపోయినవాళ్ళలోనే జమ. ఇలా బతకడం భగవంతుని దృష్టిలో ఒక అపరాధం. ఇన్ని యుగాల తర్వాత మనం ఏమీ సాధించలేదన్నమాట.
    ఈ కారణంవల్ల, నా టైపురైటరు మళ్ళీ నాకు లభించినందువల్ల, రెండు దస్తాల కాగితాలు పెట్టుకొని కూర్చోగలగడంవల్ల గదినిండా నిండిన సిగరెట్ పొగలో మానాన్న గదిలో నన్ను కనిపెడుతూ ఉండడంవల్ల - ఈ కారణంవల్ల నేను పునర్జన్మ పొందినట్లు భావిస్తున్నాను. జీవితాన్నీ, జీవిస్తున్న ఇంద్రియాలనూ, పనిచేస్తున్న మనస్సులనూ నేను ఆరాధిస్తాను. చైతన్యాన్ని ప్రేమిస్తాను. స్పష్టతని ప్రేమిస్తాను. ఊపిరి తీస్తున్న మనిషీ తన జీవితాన్ని తాను సృష్టించుకోవాలి. తన చైతన్యాన్నీ, స్పష్టతనూ తానే నిర్ణయించుకోవాలి. ఇవి వాటంతటవి ఎక్కడా దొరికేవికావు. నావి చాలా పారమార్ధిక భావాలని చెప్పేనుకానూ? ఔను. నేను జీవిస్తున్నట్లు విశ్వసిస్తున్నాను. ఇటువంటి కార్యకరమైన విశ్వాసం ఆధ్యాత్మికం కాకపోతే మరేమిటి? ఇందుకు నా కృతజ్ఞత. ఇందుకే అడకువ. నిజంగా జీవిస్తున్నాను. కాబట్టి సంవత్సరాలు దొర్లిపోనీ, నాగదిలో కూర్చున్నాను.
    జీవిత యధార్ధాన్ని మాటలతో ప్రకటిస్తున్నాను. ఈ సత్యాన్ని అసత్యం నుంచీ, స్పష్టతనుంచీ పిండుతున్నాను. ఈ క్షణపు జీవితం ఎన్నడూ తుడిచిపెట్టరానిది. ఇది ప్రపంచానికతీతమైనది.
    వాణిజ్యం అంటే నా కసహ్యం. నేనొక డబ్బులేని యువకుణ్ణి ఒక్కొక్కప్పుడు ఈ డబ్బు అవసరం చెడ్డ ఇబ్బంది పెడుతుంది. జీవితంలో ఇదే ప్రధానమేమో అనే భ్రమ కలిగిస్తుంది. వాణిజ్యాన్ని అసహ్యించుకుంటాను గాని డబ్బుని నేను గౌరవిస్తాను. ఒకవిధంగా చూస్తే డబ్బు చాలా ముఖ్యమైనది. ఇది లేకపోబట్టే మానాన్న ఏళ్ళతరబడి గతాన్ని ఈడవలేక ఈడుస్తూ ఆఖరికి చచ్చిపోయాడు. అంత డబ్బులేనివాడు అంత మంచిగుడ్డలు కట్టుకోకూడదు. అలాంటివి దరించడానికి తన కర్హత ఉందని అతను అమ్ముతూ ఉంటేమాత్రం ఏంగాక? అంచేత మానాన్న చచ్చిపోయాడు. బెడదలేకుండా బతకడానికీ, నా జీవిత కథ రాసుకోవడానికీ సరిపోయినంత డబ్బుంటే చాలును నాకు. సంవత్సరాలకిందట వాణిజ్యం తరఫున నేను పనిచేస్తున్న రోజులలో ఒక చిన్న టైపురైటరును అరవై అయిదు డాలర్లు పెట్టి కొన్నాను. (ఇది చాలా పెద్దమొత్తం అనడానికి సందేహం లేదు. ముఖ్యంగా నువ్వు బీదవాడివయితే). మొదట్లో ఇది నాకు వింతగా ఉండేది. అది చేసే చప్పుడుకి ఒప్పు మండుకొచ్చేది. రాత్రి పూట ఈ చప్పుడు మరీ దుర్భరంగా ఉండేది. వెయ్యిపెట్టి గుణకారం చేసిన నిశ్శబ్దంలాగ ఉండేది ఈ చప్పుడు. ఒకటి రెండేళ్ళలో ణ టైపు యంత్రానికీ నాకూ మంచి స్నేహమయింది. సంగీతాన్ని గౌరవించే గొప్ప పియానో విద్వాంసుడు తన పియానోను ప్రేమించినట్లు నేనీ టైపు యంత్రాన్ని ప్రేమించాను. చిన్నప్పుడూ నేను శుభ్రపరచిన పాపాన పోలేదు. కాని నేనెంత గట్టిగా వాడినా ఇది నశించిపోకుండా నిలబడింది. నిజంగా దీన్ని నేను గౌరవిస్తున్నాను.
    ఇలా వుండగా ఒక దుర్ముహూర్తాన నా అవసరం నిమిత్తం దీన్ని ఊళ్లోకి తీసుకెళ్ళాను. తాకట్టు తీసుకొని డబ్బు అప్పిచ్చే వాడిదగ్గర దీన్ని వదిలిపెట్టాను. జేబులో పదిహేను డాలర్లు వేసుకొని నగరంలో నడుచుకుపోయాను. దరిద్రాన్ని మరి భరించలేకపోయాను. మొదట ఒక జోళ్ళకి రంగు వేసేవాడి దగ్గరకివెళ్ళి నా జోళ్ళకి రంగు వేయించుకున్నాను. నా జోళ్ళకొకడు రంగు వేస్తున్నప్పుడు వాడిని నా స్థలంలో కూర్చోపెట్టి నేను వాడిజోళ్ళకి రంగువేస్తాను. ఇది వినయంలో ఒక అనుభవం.
    తర్వాత సినిమా చూశాను. ప్రజలమధ్య కూర్చుని హాలీవుడ్ కల్పనలలో నన్ను నేను చూసుకున్నాను. అందమైన ఆడవాళ్ళను చూస్తూ కూర్చుండి కలలుకన్నాను. తర్వాత ఒక హోటలుకి వెళ్ళి రెండు డాలర్ల విలువగల భోజనం చేశాను. వెయిటరు ఆశ్చర్యంగా చూస్తే మరేం పర్వాలేదన్నాను. కులాసాగా ఉన్నానన్నాను. వాడికి కొంత డబ్బిచ్చాను. తర్వాత నగరంలో చీకటి వీధుల్లో తిరిగాను. ఆడవాళ్ళున్న వీధులు. బీదతనంతో నాకు విసుగేసిపోయింది. టైపురైటరు తాకట్టుపెట్టి డబ్బు ఖర్చుపెట్టడం మొదలుపెట్టాను. ఎంత మహాకవి అయినా ఏళ్ళతరబడి బీదవాడుగా ఉండలేడు. "సాహిత్యం! పోనిద్దూ. వెధవ సాహిత్యం!" అంటాడు. అదే నేనన్నాను.
    వారం రోజులు పోయాక నాకు కొంత తెలివొచ్చింది. నెల్లాళ్లకి బాగా తెలివొచ్చింది. కాగితంమీద మాటలు పెట్టాలనే కోరిక తీవ్రమయింది. ఇంకో ప్రారంభం చెయ్యాలనే కోరిక. ఏదో ఒకటి అని, అది సరియైనదో కాదో చూడడం. కాని నా దగ్గర డబ్బులేకపోయింది. నానాటికీ టైపురైటరుమీద కోరిక హెచ్చింది.
    ఇంతేకథ. ఇది శిల్పంతో కూడుకున్న ఉపసంహారమని చెప్పలేను కాని ఇంతటితో ఇది సమాప్తం. అసలు సంగతి ఇది. "రోజు రోజుకీ నా టైపురైటరు మీదకి మనస్సు పోయింది."
    నేటి ఉదయం టైపురైటరును తెచ్చుకున్నాను. ఇది నా యెదుట ఉంది. ఇంతవరకు నేను రాసిందంతా ఇది!


                                        * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS