Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 77


    "అది మీవల్ల జరిగిందే! అందుకు మీ యస్సై, సర్కిలూ బాధ్యులు." గొంతు పెద్దది చేసింది వరూధిని.
    డి.యస్.పి. ముందు అంత చనువుగా మాట్లాడగలగటం ఆమెకే ఆశ్చర్యం వేసింది. అయినా అతని ముఖంలో కోపం కనబడటంలేదు. పైగా ప్రసన్నంగా వున్నాడు.
    "అయితే నన్నిప్పుడేం చెయ్యమంటావ్?" ఎంతో ఆప్యాయంగా ఆత్మీయుడిలా అడిగాడు డి.యస్.పి.
    వరూధిని గుండెల్లో నిప్పు ఆరిపోయింది. హృదయంలో అమృతం చిలకరించినట్లయింది. కృతజ్ఞతాభారంతో ఆమె కళ్ళు అతని కనుపాపల్ని వెతికాయి.
    "ఏం చెయ్యమంటావో చెప్పు మరి?" డి.యస్.పి. స్వరం అతి మృదువుగా వుంది.
    "రేపు సాయంకాలానికి థియేటర్ మళ్ళీ నా స్వాధీనంలోకి రావాలి. అంతే!"
    "అదెలా సాధ్యం?"
    "మీ మనుషుల్ని పంపండి!"
    "పోలీసుల్ని పంపకూడదే మరి?"
    "అయితే రౌడీలను పంపండి!" వరూధిని అధరాలపై దరహాసం పరుగులు తీసింది.
    డి.యస్.పి బిత్తరపోయాడు. ఆమె ముఖంలోకి చూస్తూ ఆలోచనలో పడ్డాడు.
    "పదివేలు ఖర్చయినా సరే, రేపీపాటికి వరూధిని పిక్చర్  ప్యాలెస్ నా ఆధీనంలో ఉండాలి." వరూధిని శపథంచేసి, డి.యస్.పి మీదకు సవాల్ విసిరింది.
    
                          34
    
    సెకండ్ షో ఇంటర్వెల్ కు ముందే, పది తలకాయలు పగిలి, ఐదు చేతులూ, మూడు నడుములూ, ఆరు కాళ్ళూ విరిగి, ఒక గాలెన్ రక్తం కూడా కారిన తర్వాత వరూథినీ పిక్చర్ ప్యాలెస్ వరూధిని స్వాధీనంలోకి వచ్చింది.
    ఆ రాత్రి దిగ్విజయం పొందిన వరూధిని, థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళటానికి జట్కా ఎక్కుతుండగా మఫ్టీలో డి.యస్.పి కన్పించాడు. వరూథినికి జట్కా దిగి అమాంతం రోడ్డుమీద డి.యస్.పి కాళ్ళమీద వాలిపోవాలనిపించింది. కాని డి.యస్.పి. గంభీరంగా ముఖంపెట్టి, ఆమెను చూడనట్టే కారెక్కి డ్రైవ్ చేసుకుంటూ జట్కాను దాటుకొని వెళ్ళిపోయాడు.
    వరూధిని బుర్రలో డి.యస్.పి గురించిన ఆలోచనలు, వాన రాబోయే ముందు ఆకాశంలో ఆడే తూనీగల్లా ముసురుకున్నాయి.
    ఆయన ఎంత మంచివాడు? ఆయనే లేకపోతే తను ఏమై ఉండేది? ఎంత నిండైన మనిషి? తనను చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయాడు. మర్యాదా మన్ననా తెలిసినవాడు సభ్యత తెలిసిన వ్యక్తి.
    డి.యస్.పి.తో రామనాథబాబును పోల్చి చూసుకొన్నది వరూధిని. తననుంచి ఏమీ ఆశించకుండానే ఎంత సహాయం చేశాడు? ఒక్కపైసా కూడా తీసుకోలేదు. ఈయనలాంటివాళ్ళు పోలీసు డిపార్టుమెంటులో అరుదుగా ఉంటారు. అసలు ఈయన మనుషుల్లోనే తప్ప పుట్టాడు. దేవుడిలా తనను ఆదుకున్నాడు. వరూధిని డి.యస్.పి.కి మనసులోనే చేతులెత్తి దణ్ణం పెట్టుకొంది.
    వరూధిని జట్కా దిగుతూనే ఇంటిముందు ఆగివున్న కారును చూసి ఆశ్చర్యపోయింది!
    రామనాథబాబు వచ్చాడా? తన చేతులో చావుదెబ్బతిని కాళ్ళ బేరానికి వచ్చినట్టున్నాడు! జన్మలో ఇంకా తను అతనిముఖం చూడదు. జట్కావాడికి డబ్బులిచ్చి ముందుకు నడిచిన వరూధిని చీకట్లో వున్న కారును చూస్తూ నిలబడిపోయింది.
    ఇది రామనాథబాబు కారు కాదు. మరెవరిదీ?
    కారులోంచి నవ్వుతూ దిగిన డి.యస్.పి. ని చూసి వరూధిని శిలా ప్రతిమలా నిలబడిపోయింది! డి.యస్.పి. దగ్గిరగా వచ్చి నిలబడ్డాడు. వరూధిని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఆమె అడుగులు తడబడ్డాయి. మౌనంగా ఇంట్లోకి నడిచింది. అతడూ తనవెనుకే నడుస్తున్నట్టు గమనించింది. అతని అడుగుల చప్పుడు ఆమె గ్మ్దేల్లో సమ్మెట పోటుల్లా పడుతున్నాయి. అతన్ని ఆగమనే శక్తి ఇంకా తనలో ఉందేమోనని వెతుక్కుంది. నిస్సహాయతా, పరాధీనతా ఆమె అణువణువులో గూడుకట్టుకొని వున్నాయి.
    
                           35
    
    వరూథినీ పిక్చర్ ప్యాలెస్ లో సీతారామకల్యాణం నూట ఇరవైఐదో రోజు కూడా ఆడి డబ్బాలు రైలెక్కాయి. ఆ రోజు కొత్త పిక్చర్ రిలీజు. అందులో ఇద్దరు హీరోలు, ఇద్దరూ హీరోయిన్లు, ముగ్గురు విలన్లూ ఉన్నారు. అప్పటికే ఆ పిక్చర్ గురించి పెద్ద 'టాక్' ఉంది. సీతారామకల్యాణాన్ని మించి డబ్బు చేసుకొంటుందన్న అభిప్రాయం సినిమా పరిశ్రమలో పడిపోయింది. ఆ పిక్చర్ మీద తను షేరే ముఫ్ఫైవేలదాకా రావచ్చన్న అంచనాతో ఉంది వరూధిని.
    మ్యాట్నీతో పిక్చర్ ప్ర్రారంభం అయింది. హాలంతా కిటకిటలాడుతోంది. టికెట్ దొరకని వాళ్ళు ఆరుగంటలాటకు, మూడున్నర నుంచే క్యూలో నిలబడి వున్నారు. రామదాసు ఆఫీసుగదిలో వరూధిని ముందు చేతులు కట్టుకొని నిలబడి, యీ బొమ్మను రామనాథబాబు వాళ్ళు, వాళ్ళ పాత హాలుకు తీసుకోవాలని ఎంత ప్రయత్నించిందీ, చివరకు డిస్టిబ్యూటర్సు ఏమన్నదీ - సవివరంగా మనవి చేస్తున్నాడు.
    లోగడ కంటే వరూధినిమీద అందరికీ భయభక్తులు ఎక్కువైనాయి. అక్కడ ఉండే జట్కావాళ్ళకూ, రిక్షావాలాలకూ కూడా హడలుగా ఉంది. కానిస్టేబుల్సూ, యస్సైలూ, సర్కిల్సూ, ఎక్కడ కన్పిస్తే అక్కడే శల్యూట్సూ కొడుతున్నారు. వరూధిని నడక, మాట కూడా మారిపోయాయి. ఆమె ప్రతిమాటా దబాయింపునో, అధికారాన్నో స్ఫురింపచేస్తోంది. ఆమె నడకలో దర్పమూ, అహంకారమూ త్రుళ్ళిపడుతోన్నాయి.
    "దాసూ! అలా చూస్తోండు. రామనాథబాబును ఈ టవున్నుంచి తరిమేయకపోతే నా పేరు వరూధిని కాదు! సూదికోసం సోదికిపోతే....ఏదో బయటపడినట్టు, రామనాథబాబు చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. మొన్న డి.యస్.పి గారు ఏమన్నారో తెలుసా?" అడిగింది సగర్వంగా వరూధిని రామదాసును చూస్తూ.
    తల ఆడించాడు రామదాసు.
    "రామనాథబాబు జైలుకు పోయే రోజులు దగ్గిర్లోనే వున్నాయన్నారు తెలుసా?" అంటూ వరూధిని ఆఫీసు గదిలోకి వచ్చిన అమీనాను చూచి "అడ్వాన్సు బుకింగ్ కౌంటర్ వేరే ఉంది. అక్కడ కనుక్కోండి. ఇది ఆఫీసుగది." అన్నది.
    కోర్టు అమీనా వెనకే లాయరూ, రామకృష్ణయ్య లోపల కొచ్చారు.
    "వరూధిని మీరేనా?" అడిగాడు అమీనా.
    "అవును!" అన్నట్టు తల ఊపింది వరూధిని.
    "ఇక్కడ సంతకం పెట్టి ఈ కాగితం తీసుకోండి!" అన్నాడు ముక్తసరిగా.
    "ఏమిటి ఇదంతా?" అగాధం ఒడ్డున నిలబడి కిందకు చూస్తున్న దానిలా అయిపోయి అన్నది వరూధిని.
    "కోర్టు ఇంజెక్షన్? వరూథినీ పిక్చర్ ప్యాలెస్ ను కోర్టువారు స్వాధీనంలోకి తీసుకున్నారు. కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పేంతవరకూ థియేటర్ను సీల్ చేస్తున్నాం!"
    వరూధిని అమీనా ముందు సంతకం పెడ్తూ అంతు తెలియని అగాధంలో పడిపోయింది.
    
                           36
    
    "అమ్మగారొచ్చారయ్యా" కానిస్టేబుల్ చెప్పాడు.
    ఆఫీసులో కూర్చొని సర్కిల్ తో మాట్లాడుతున్న డి.యస్.పి. తలెత్తి చూశాడు.
    ఆరు నెల్లనాడు మూడో కాన్పుకు వెళ్ళిన భార్య శుక్రవారంనాడు వస్తున్నట్టు రాసింది. కాని మంగళవారమే వచ్చేసిందే? ఏం పుట్టి మునిగిందో? అనుకొని కానిస్టేబుల్ని చూసి "సర్లేపో!" అన్నాడు.
    "అమ్మగారు బయట రిక్షాలో కూర్చున్నారు," భయపడుతూనే చెప్పాడు కానిస్టేబుల్.
    డి.యస్.పి చివాలున లేచాడు. సర్కిల్ కూడా ఆయన లేవగానే లేచి నిలబడ్డాడు. డి.యస్.పి. అదిరిపాటుగా బయటికొచ్చి చూశాడు. వరూధిని రిక్షాలో కూర్చొనివుంది. క్షణకాలం నివ్వెరపోయాడు. డి.యస్.పి.కి తల కొట్టేసినట్టుగా అనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS