Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 77

 

    "గుర్తుంటే మంచిదేగా పిన్నీ.....మనకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు మనసున్న ఆస్థి ఈ బంధాలు....అనుబంధాలు....అత్మియతలే......అవిలేకపోతే లక్షల ఆస్తులున్నా ప్రయోజనం ఏముంటుంది?" అంది జయంతి.

    "కరక్టే జయంతీ.....ఆ రోజు బావగారు అయన విషయమై అంత శ్రమ తీసుకోకపోతే నేడు మా పరిస్థితి ఎలా వుండేదో! తలుచుకుంటేనే భయమేస్తుంది" అంది శివపార్వతి.

    "రిస్క్ తీసుకోకుండా ఎలా వుంటారు పిన్నీ! సొంత తమ్ముడు కష్టాల్లో వుంటే ఏ అన్న సాయంచేయడు? ఆఫ్ కోర్స్ అలా సాయం చేయకుండా ఏమి పట్టనట్టు వుండే అన్నదమ్ములు కూడా ఉంటారనుకో.....మనం అలా కాదుకదా.....చిన్నప్పటినుండి ఒకే ఇంట్లో వుంటూ, కలిసి మెలిసి జీవించటం వల్లనే మన మధ్య ఆప్యాయతలు, పెరిగాయి, ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చుకునేంతగా మన బంధాలు రూపొందాయి. దీనికి కారణం ఉమ్మడి కుటుంబమే. ఉమ్మడి కుటుంబంలో వుండే అనురాగాలు, ఆప్యాయతలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఒంటరి కుటుంబాల్లో వుండవు.

    ఆ కుటుంబాల్లో స్వార్ధం వుంటుంది. ద్వేషం వుంటుంది. ఎవరైనా బంధువులు వస్తే ఓ పూట భోజనం పెట్టటానికి కూడా చేతులురావు. అనవసరమైన ఖర్చులు అనుకుంటారు. ఒంటరిగా వేరుగా ఉండటం వల్లనే అంత కఠినంగా మారిపోతారు" అంది జయంతి.

    జయంతీ! నువ్వెంతగా ఎదిగిపోయావే....ఎంత చక్కగా చెపుతున్నావు! కళ్ళకు కట్టినట్లు నువ్వు చెప్పింది అక్షరాల నిజం" అంది పార్వతి అవమానంతో తల దించుకుంది.

    ఎందుకంటే లోగడ జయంతి చదువుకునే రోజుల్లో పార్వతి దగ్గరకు వెళితే భోజనం కూడా పెట్టకుండా పంపించిన సందర్భాలున్నాయి. అది గుర్తొచ్చే ఇప్పుడు పార్వతి మనస్సు జయంతి మాటలకు చురుక్కుమంది.

    "సుందరం ఎదురుచూస్తుంటాడెమో పార్వతి నీకోసం. టైం ఎంత అయ్యింది జయంతి ఇప్పుడు?" అంది దాక్షాయణి.

    "పదేగా....నేను చెప్పే వచ్చాన్లే ఆయనతో. మేము ముగ్గురం కబుర్లు చెప్పుకుని చాలా రోజులైంది" అని చెప్పింది పార్వతి నవ్వుతూ.

    "ఏంటి మీ ముగ్గురు మీటింగ్ ఇంకా కాలేదా? కరువు తీరా మాట్లాడుకుంటున్నారు?" అంటూ మాధవరావు పైకి వచ్చాడు.

    "అతన్ని చూడగానే శివపార్వతి గబగబా లేచి నుంచుంది.

    "అరెరె....కూర్చోమ్మా.....నేను ఊరికే వచ్చాను, సుందరం ఎక్కడికెళతానని చెప్పాడు నీతో ఇంకా రాలేదు" అన్నాడు మాధవరావు.

    "ఏంటి బావగారూ ....ఇంకా రాలేదా ఆయనా?!" అంది ఆశ్చర్యపోతూపార్వతి.

    "రాలేదు" అన్నాడు నవ్వుతూ.

    "చాలా కాలం తరువాత వచ్చాడు కదా....చిన్ననాటి స్నేహితుల్తో కబుర్లలో పడిపోయి మనల్ని మర్చిపోయి వుంటాడు" అంది దాక్షాయణి.

    "ఆయనకు పట్నంలో కూడా స్నేహితులు ఎక్కువే" అంది శివపార్వతి నవ్వుతూ.

    "ఇంకేంటి కబుర్లు పార్వతి! ఎలావుంది మీ అయన వ్యాపారం?" అన్నాడు మాధవరావు సిగరెట్ వెలిగించుకుంటు.

    "బానేవుంది బావగారూ....మీ సహకారం లేకపోతే అయన వ్యాపారంలో నిలబడేవారేకాదు. అయన కూడా ఈమాటే అంటుంటారు ఎప్పుడు" అంది పార్వతి మనస్పూర్తిగా.

    "నాదేముందమ్మా! సలహా ఇచ్చాను. వాడు వాటిని తెలివితో ఆచరించి సొంతంగా పైకి వచ్చాడు. తాగుడు మనేశాడా పూర్తిగా" అడిగాడు నవ్వుతూ.

    "అయన తాగుడు మానేసి అయిదేళ్ళు అవుతుందండి...కానీ ఈ మధ్యనే మళ్ళీ ప్రారంభించారు" అంది భయంగా.

    "అలాగా?!" అన్నాడు ఆశ్చర్యంగా.

    "ఈ విషయం మీకు చెబుదామనే నేను వచ్చాను" అని అసలు తన రాకకు కారణం చెప్పింది పార్వతి ఇప్పుడు.

    అందుకు వచ్చావా తల్లీ....మామీద ప్రేమతో కాదన్నమాట! మొగుడు తాగేసరికి మేము గుర్తొచ్చామన్న మాట. అనుకుంది దాక్షాయణి కసిగా మనసులో.
    "నేను మాట్లాడతాలేమ్మా! నువ్వు బాధపడకు, రోజు తాగుతున్నాడా?" అన్నాడు మాధవరావు.

    "లేదండి......వారానికోసారయినా తాగుతున్నారు. మళ్ళీ క్రమంగా అది వ్యసనంగా మరి మళ్ళీ ఏం చిక్కుల్లో పడతారో అని భయంగా వుంది. కాస్త మీరు మందలించండీ బావగారూ" అంది పార్వతి అర్దింపుగా.

    "అరె.....నువ్వు అంతగా చెప్పాలా ఏంటమ్మా! ఇప్పుడు కాదులే. నేను పట్నంలోనే వాడిని కలిసి అక్కడ మాట్లాడతాను. ఇప్పుడు చెపితే బావుండదు. నువ్వేదో పిర్యాదు చేసినట్లు ఉంటుంది. అయినా అప్పటిలాగా మళ్ళీ చిక్కుల్లో పడడులేవాడు. అప్పుడంటే ఆ కరణంగాడు వాడ్ని చెడగొట్టాడు" అంటూ తమ్ముడ్ని సమర్ధించాడు మాధవరావు.

    "అబ్బో! సుందరం బాబాయ్ మీద మాట పడనియటంలేదే బాబాయ్" అంది జయంతి నవ్వుతూ.

    "స్వతహాగా వాడు చాలా మంచివాడమ్మా....వాడికి అందరి మీద ప్రేమ వుంటుంది. ఏదో చేయాలనే తపన కూడా ఉంటుంది. కానీ చేయలేడు. ఊరికే వాడిలో వాడు బాధపడుతుంటాడు" అన్నాడు మాధవరావు.

    "మీరు భోంచేశారా?" అడిగాడు మాధవరావు.

    "చేశామండి! భోజనం చేసిన తరువాతే అయన బయట కెళ్ళారు.....ఇప్పుడే వస్తాను అని చెప్పి" అంది పార్వతి.

    "అలాగా! అయితే వచ్చేస్తాడ్లే. నేను వెళుతున్నాను దాక్షాయణి మీరు వుంటారా?" అడిగాడు మాధవరావు.

    "వచ్చేస్తున్నామండి! మేము కూడా వచ్చేస్తాం మరో అయిదు నిమిషాల్లో" అంది దాక్షాయణి.

    కింద వీధి తలుపు చప్పుడయింది. పార్వతి కిందకు చూసింది.

    "అరుగో ఇప్పుడోచ్చారు మహానుభావులు...." అంది పార్వతి నవ్వుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS