Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 76


    అదీకథ! అయితే నా అవస్థ కెవరూ జాలి పడనక్కరలేదు. బాధలను ధైర్యంగా ఎదుర్కొంటున్నానని ఎవరూ నన్ను మెచ్చుకోవాలని కోరను. ఇవేవీ నా లక్షణాలు కావు. "శాటర్ డే ఈవినింగ్ పోస్ట్" పత్రికతో నాకేమీ విరోధం లేదు. నా కథలను ప్రకటించనంత మాత్రంచేత "స్క్రిబ్బర్స్" పత్రికా సంపాదకుడు మూర్ఖుడని నేను భావించడం లేదు. దేశంలో ఏ పత్రికకి ఎటువంటి కథ కావాలో నాకు బాగా తెలుసును. "సీక్రెట్ స్టోరీస్" వెదుకుతున్న కథలెలాంటివో నాకు తెలుసును. "అమెరికన్ మెర్క్యురీ" ఎలాంటి కథలు వేస్తుందో ఎరుగుదును. "హౌండ్ అండ్ హార్న్" వంటి సాహిత్య పత్రికలు ఎలాంటి కథలను అంగీకరిస్తాయో ఎరుగుదును. మిగిలిన వాటన్నిటి సంగతి నాకు తెలుసును. ఈ పత్రికలన్నీ నేను చదువుతూ ఉంటాను. ఎటువంటి సరుకు అమ్మకం అవుతుందో నాకు తెలుసును. అయినా నాకథలేవీ ప్రచురణ కాలేదు. నేను దరిద్రుడుగానే ఉన్నాను. డబ్బు చేసిపెట్టే రాతలు రాయడం నాకు చేతకాదేమిటి చెప్మా? ఆ సందేహం మీకు వద్దు. మీకు ఎలాంటికథ కావలసినా నేను రాసిపెట్టగలను. రేపు పొద్దుట ఎడ్గార్ రైస్ బరోస్ చచ్చిపోయాడనుకోండి. టార్జాన్ కథలు మీకు కావలసినన్ని నేను రాసిస్తాను. లేక, నేను రాయాలనుకుంటే జాన్ డాస్ పాసోస్ లాగ, జేమ్స్ జాయిస్ లాగ రాయగలను. (ఆమాటకొస్తే మీరూ రాయగలరు.)
    కాని నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోదలచుకున్నానని ఇదివరలో చెప్పాను. ఔను తప్పకుండా! ఈ కాపాడుకోవడంలో నా రచనలు అచ్చుకాకపోవడమే తటస్థిస్తే అందుకు కూడా నేను సిద్ధమే. కీర్తిలో నాకు నమ్మకం లేదు. అదికూడా ఓరకం మోసమే. కావలిస్తే కీర్తి సంపాదించిన వాళ్ళనెవరినైనా అడగండి చెబుతారు. అంటే ఏమైనా నిజాయితీ అనేది మిగిలినవాళ్ళు. ఒక బతికున్న మనిషి ఇంకో బతికున్న మనిషికంటె గొప్పవాడని ఎలా అనగలం? ఇంతకూ అచ్చయిన మహాకావ్యాలు వ్రాసినవాడు అచ్చుకాని మహాకావ్యాలు వ్రాసినవాడికంటె ఎలాగ ఎక్కువ? అచ్చుకీ, గొప్పతనానికీ సంబంధం ఏముంది? డబ్బుగాని, డబ్బు లేకపోవడంగాని మానవుని శీలానికి ఎలా వర్తిస్తుంది?
    కాని నావంటి రచయిత కావడానికి కొంత గర్వం, కొంత ఫారమార్థికం కావాలి. కొండంత బలం కావాలి. నాలాంటి రచయిత కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్కప్పుడు కొన్ని శతాబ్దాలు పడుతుంది. మాటలకూర్పులో కాస్త నేర్పుగల కుర్రాళ్ళకి నేనిచ్చే సలహా ఏమిటంటే నాలాగ రాయడానికి ప్రయత్నించవద్దని. ఇంకా థియొడోర్ డ్రైసర్ నీ, సింక్లేర్ లూయిస్ నీ చదవడం మంచిది. ఆఖరికి నాపద్ధతి అవలంభించడం కన్నా ఓ హెన్రీ అడుగుజాడల్లోనో మహిళా పత్రికలకు రచనలు పంపించేవారి ఫక్కీలోనో పోవడం మేలంటాను. ఎంచేతనంటే మరేంలేదు. నేనసలు రచయితనే కాదు. నేను పదేళ్ళకిందట, పదిహేనేళ్ళకిందట రాయడం మొదలుపెట్టినప్పటినుంచీ నియమాలను ధిక్కరించడమే, వెక్కిరించడమే పనిగా పెట్టుకున్నాను. నేనొక యువకుణ్ణి. అంతే ఎందుకు రాస్తున్నానంటే నామటుకింతకన్న నాగరికమైనపని ఇంకోటిలేదు కాబట్టి.  
    మీకు తెలుసునో లేదో కాని నా ఉద్దేశంలో పద్యం అనీ, కథ అనీ, నవల అనీ ఈవిధంగా రచనలకు వేరువేరు రూపాలు లేవు. మానవుడొక్కడే రూపం. మిగిలిందంతా కుట్ర. ఈ రాస్తున్న కథలోకి నా మానవత్వాన్ని దించడానికి ప్రయత్నిస్తున్నాను. నాభూమినుంచి ఎంత్ ఎక్కువగా నింపడానికి సాధ్యమో అంత నింపాలని చూస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా ధోరణిలో నేను నిజాయితీగా, నిర్భయంగా వ్రాయాలని చూస్తున్నాను. ఇందాకా నేను డాస్ పాసోస్ లాగా జేమ్స్ జాయిస్ లాగా రాస్తానన్నానే ఆమాట కావలిస్తే ఇక్కడ ఉపసంహరించుకోగలను. అలాంటిమాట అసందర్భమే కాక ప్రమాదకరంకూడాను. మాటవరసకి ఎవరైనా "ఏదీ చూదాం, ఫాక్నర్ లాగ రాయగల నన్నావుకదా రాసిచూపించూ!" అంటే తెల్ల మొగంవేసి అదేదో ఆ చాకచక్యం నాదగ్గర లేదని ఒప్పుకోవలసివస్తుంది. అయినా ఈ ప్రకటన ఇదివరకు చేశాను కాబట్టి ఇప్పుడిక్కడ దాన్ని రద్దుచెయ్యను. నాకు మతిపోయిందని ఎవ్వరూ ఋజువుచెయ్యలేరు. వియన్నాలోని సైకోఎనలిస్టులందరూ పిచ్చివాళ్ళుగా కనబడేటట్టు నేను చెయ్యగలను. అలాకాకపోతే హైకోర్టు జడ్జీకంటే బుద్ధిమంతుడుగా కనబడగలను. నా శరీరంలో మానవుని గతమంతా ఇమిడిఉందని అన్నాను కానూ? ఆ గత చరిత్రలో సైకోఎనలిస్టులూ ఉన్నారు, హైకోర్టు జడ్జీలూ ఉన్నారు.
    నాకు బాగా తెలియదుగాని ఇటువంటి రాతల్ని నిషేధిస్తూ ఏదైనా చట్టం ఉందేమో? ఇదీ ఒక నేరమే అనుకుంటాను. నా ఒంటి మీద వాలిన ఈగనైనా, నాకాలికింద చీమనైనా నేను చంపలేను. ఇంకొకరి మనస్సుని గాయపరచలేను. వాడు బుద్ధిమంతుడైనా, కాకపోయినా, అయితే మానవశక్తికి అభ్యంతరాలు కల్పించే చట్టాల్ని నేను వెటకారం చేస్తూనే ఉంటాను. ఆడంబరంగా కనబడే రబ్బరు బుడగలలోకి పిన్నులు గుచ్చడమే నాపని. గాలి పూరించిన బుడగలవంటి నీతిపరులూ, పిరికిపందలూ, బుద్ధిమంతులూ నా దెబ్బకి బద్ధలవడం నాకు కావాలి. నేను పిన్ను గుచ్చితే చప్పుడుతో రబ్బరు బుడగ బద్ధలైనట్టు! జాగ్రత్తగా వింటే అటువంటి చప్పుడు ఈపేరాలో మీకు వినబడుతుంది.
    ఇదంతా వృధాకాలయాపనగా మీకు కనపడవచ్చు. కాని కాదు. మరేమీ తొందర లేదు. నూరుగజాల పోటీ నేనొక రోజంతా సాగిస్తాను. మీకిష్టంలేకపోతే ఈ కథని వదలిపెట్టి ఇంకో పత్రిక "కాస్మపాలిటన్" లాంటిది తీసుకోవచ్చును. గొప్ప విషయాలు మున్ముందు రాబోతున్నాయని ఎవరినీ నేను ఆశపెట్టడం లేదు. కొసదాకా చదివిన వాళ్ళకి బంగారు మామిడిపళ్ళు దొరుకుతాయని వాగ్దానం ఇవ్వలేదు. నేను నాగదిలో కూర్చున్నాను. నా బతుకు బతుకుతున్నాను. టైపురైటరు కొడుతున్నాను. చాలాకాలం కిందట చనిపోయిన మానాన్నగారి సమక్షంలో కూర్చున్నాను. అప్పుడప్పుడాయన మొగంలోకి చూస్తున్నాను. ఈ ప్రపంచ వ్యవహారాలను గురించి అతనేమనుకుంటున్నాడో అని. అద్దంలో చూస్తున్నట్టే ఉంది. అతని బొమ్మలో నేను కనబడుతున్నాను. ఆ ఫోటోగ్రాపు తీసినప్పుడాయన వయస్సుతో ఇప్పటి నావయస్సు ఇంచుమించు సరిపోతుంది. అప్పుడతని మీసంవంటిదే ఇప్పుడు నాకుంది. ఆ బొమ్మని నేనారాధిస్తున్నాను. నా జీవితమంతా నేనాయన్ని ఆరాధించాను. మేమిద్దరమూ బతికి ఉన్నప్పుడు నాకింకా చిన్నతనం. మేమెప్పుడూ సరిగా మాట్లాడుకోలేదు. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత, నాకు మాటలమీద కొంచెం అధికారం కుదిరిన తర్వాత మేమిద్దరం గంటల తరబడి మౌనంగా ప్రసంగించుకుంటూ ఉంటాము. "అయ్యా! ఎలావుంది జీవితం?" అని అడుగుతాను నేను. "అడకువను అవలంభించు. దేవుణ్ని వెదుక్కో" అంటాడాయన.
    మా నాన్నకూడా ఒక వ్రాతగాడే. అయితే అతను ప్రచురణకాని రచయిత. వారి ఆముద్రిత రచనలన్నీ నాదగ్గర ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రబంధాలూ, గొప్ప గొప్ప కథలూ,  అయితే అవి ఆర్మీనియన్ భాషలో ఉన్నాయి. వాటిని నేను చదవలేను. ఏటేటా రెండు మూడుసార్లు బూజు దులిపి ఈ పుస్తకాలని బైటికితీసి, విశ్వసాహిత్యానికి మా నాన్న చేసిన సేవకి నిదర్శనాలైన ఈ గ్రంథాలను గంటల తరపడి అలా చూస్తూ ఉండిపోతాను. నాలాగే మా నాన్నకూడా పరమ దరిద్రుడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దరిద్రం అతణ్ణి యావజ్జీవితమూ వేటాడింది. చాలామట్టుకు ఆయన తన పద్యాలూ, కథలూ చిన్నచిన్న కాగితపు పీలికలమీద వ్రాశాడు. వీటిని వేరు వేరు పుస్తకాలుగా కట్టలు కట్టాడు. ఒక్క తన డైరీని మాత్రం ఇంగ్లీషులో రాశాడు. (మా నాన్నకి ఇంగ్లీషు చదవడం రాయడం గొప్పగా వచ్చు)
    ఈ డైరీనిండా రోదనలే ఉన్నాయి. మా నాన్న న్యూయార్కులో ఉన్నప్పుడు, ఈ డైరీప్రకారం, ఆయనకి రెండే రెండు మనస్థితులు: దుఃఖం, మహా దుఃఖం. సుమారు ముఫ్పైయేళ్ళకిందట అయన ఒంటరిగా నగరంలో తిరిగేవాడు. భార్యనీ ముగ్గురు పిల్లల్నీ అమెరికాకు తెచ్చుకోవడానికి కావలసిన డబ్బు ఆర్జించడానికి ప్రయత్నించేవాడు. మానాన్న ఒక హోటల్లో పనిచేసేవాడు. ఈమాట ఎందుకు చెప్పుకోకూడదు? ఒక గొప్ప వ్యక్తి అమెరికాలోని ఒక హోటల్లో పనిచేసేవాడంటే అందులో నామోషీ ఏమీలేదు. స్వదేశంలో ఆయనకి మంచి పలుకుబడి ఉండేది. గొప్ప పండితుడు. అందరూ ఆయన్ని ఆగా అని పిలిచేవారు. ఆగా అంటే ఇంచుమించు ప్రభువన్నమాట. దురదృష్టవశాత్తూ మానాన్న విప్లవవాది. ఆర్మీనియన్లందరూ విప్లవవాదులే. తన జాతికి స్వాతంత్ర్యం లభించాలని కృషిచేశాడాయన. నా ప్రజలు స్వతంత్రంగా సుఖంగా బతకాలనేవాడు. అంచేత మా నాన్నని తరచు ఖైదులో పెట్టేవాళ్ళు. ఆఖరికి పరిస్థితులు విషమించి మా నాన్న షేక్స్పియర్ నీ, స్విఫ్ట్ నీ ఇంగ్లీషులో క్షుణ్ణంగా చదువుకున్నాడు. అంచేత అమెరికాకి వచ్చేశాడు. అమెరికా ఆయనకొక హోటల్ లో ఉద్యోగం ఇచ్చింది. కొన్ని సంవత్సరాలు కాయకష్టపడ్డ తర్వాత ఆయన కుటుంబం న్యూయార్కు చేరుకుంది. కాలిఫోర్నియాలో, మా నాన్న డైరీ ప్రకారం, కొన్నాళ్ళు మానాన్న వ్యవసాయం చేశాడు. కాని ఆయన మహా పండితుడు. ఆయనకి వ్యవసాయం చేతకాలేదు. ఆయనకి గ్రంథాలంటే ఇష్టం. మంచి దుస్తులంటే ఇష్టం. కష్టపడడం ఆయనకిష్టంలేదు. నాలాగే ఆయనకూడా యంత్రాలంటే అసహ్యించుకుంటాడు.
    మా పొలాలు పట్నానికి పదకొండుమైళ్ళ దూరంలో ఉండేవి. రైతులు వారానికొకటి రెండుసార్లు బైసికిళ్ళమీద పట్నానికి వెళ్ళేవారు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ మండిపోతూంటే పొడుగాటి ఒక పెద్దమనిషి చిత్రమైన దుస్తులు ధరించి తీరికగా నడుస్తూ పోతున్నాడు. ఆయన మానాన్నే. మావాళ్ళు నాకీకథ చెప్పారు. మానాన్నలాగ తెలివితక్కువగా నేనుకూడా తయారుకాకూడదనే ఉద్దేశంతో పట్నంనుంచి సైకిలుమీద వస్తున్న ఒక రైతు మా నాన్నని చూశాడు. ఆశ్చర్యంతో పలకరించాడు.
    "ఆగా! ఎక్కడికీ ప్రయాణం?"
    "పట్నాని"కన్నాడు మానాన్న.
    "ఈ ఎండలో! ఈ వేషంతో! పదకొండుమైళ్లుంది పట్నం! అయినా ఆ బట్టలేమిటి? ఎవరైనా నవ్వుతారు."
    "నవ్వనీ ఇవి నా బట్టలు. నాకు సరీగా సరిపోతాయి" అన్నాడు మానాన్న.
    "సరిపోతాయి. సరేలే. కాని ఈ ప్రాంతాలలో ఎవరూ ఇటువంటి బట్టలు వేసుకోరు. ఈ ధూళిలో! ఎండలో?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS