Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 76


    "మరి నువ్వు యస్సైతో మాట్లాడలా?"
    "నన్నేం చేయమంటారు? వారు హాలు మాదంటున్నారు. అది మీరూ మీరూ తేల్చుకోవాలి. రైటింగ్ జరక్కుండా చూట్టంవరకే మా పని!" అని చల్లగా తప్పుకున్నాడు యస్సై!" అన్నాడు రామదాసు.
    వరూధినికి అర్ధం అయింది - ఇదంతా ఎవరు ఆడిస్తున్న నాటకమో! రామనాథబాబే పోలీసుల్ని చేతిలో పెట్టుకొని రామకృష్ణయ్యను పంపించి హాలు స్వాధీనం చేసుకొన్నాడు. ఎంత జిత్తులమారి? పచ్చి మోసం! అతన్ని నమ్మి తను మోసపోయింది.
    గాలివానకు వేళ్ళు పెళ్ళగిలి కిందబడ్డ పున్నాగచెట్టులా వరూధిని కూలబడింది!
    
                          33
    ప్రతిరోజూ ప్రతిక్షణమూ, వరూధిని రామనాధబాబుకోసం ఎదరు చూసింది. మూడురోజుల్లో ఊళ్ళోకి వస్తాడనుకొన్న మనిషి ఐదురోజులయినా వచ్చినట్టులేడు. ఇదంతా కావాలనే చేస్తున్నాడు. తను వెళ్ళి అతని కాళ్ళమీద పడాలనే ఇదంతా చేస్తున్నాడు. దుర్మార్గుడు! తడిగుడ్డలతో గొంతులుకోసే రకం!
    రామనాథబాబు రక్తం తాగాలన్నంత కసిగా వుంది వరూథినికి.
    రామకృష్ణయ్య హాలు స్వాధీనం చేసుకొని ఇప్పటికి ఐదురోజులైంది. ఇది ఆరో రోజు. థియేటర్లో సీతారామకళ్యాణం ఇంకా ఆడుతూనేవుంది. కలెక్షన్స్ కూడా బాగానే వున్నాయని తెలిసింది. రామనాథబాబు ఇంకెంత కాలం తప్పించుకొని తిరుగుతాడో? ఏదో మార్గం వెతకాలి. ఏదో ఉపాయం ఆలోచించాలి. వెయ్యో రెండువేలో పారేసి ఆ పోలీసోళ్ళనే పట్టుకొంటే సరి. వరూధినికి ఈ ఆలోచన రాగానే డి.యస్.పి గుర్తొచ్చాడు.
    అందుకు ఒప్పుకుంటాడా? థియేటర్ తన డబ్బుతోనే కట్టించిందనీ, అందులో సగం వాటా తనకుందనీ ఆయనకు తెలుసుగా? ఆ మాత్రం న్యాయం చెయ్యలేడా? ఆడదానికి ఇంత అన్యాయం జరిగిపోతుంటే అంత పెద్ద పోలీసు ఆఫీసరు ఊరుకొంటాడా?
    డి.యస్.పి. మీద ఆశలు పెంచుకొని వరూధిని ఆ రోజు మునిమాపువేళ బయలుదేరి అతని ఇంటికి వెళ్ళింది.
    డి.యస్.పి. లుంగీ కట్టుకొని, వరండాలో కూర్చొని ఫైల్సు చూసుకొంటున్నాడు.
    గేటు తెరుచుకొని లోఅప్లకు వస్తున్న వరూథిన్ని చూసి లేచి నిలబడ్డాడు.
    "నమస్కారమండీ!" చేతులు జోడించి దగ్గర పెట్టకుండానే అన్నది వరూధిని.
    "రండి! ఇలా కూర్చోండి!" నవ్వుతూ ఆహ్వానించాడు.
    వరూధిని ఆశలు చిగురించాయి. దానికి ఆధారం ఏమీ లేకపోయినా అతనిమీద పెద్ద నమ్మకం ఏర్పడింది.
    వరూథినికి విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియక నిస్సహాయంగా డి.యస్.పి. కేసి చూసింది.
    "అంతా విన్నానండీ!" వరూధిని ముఖంలోకి చూస్తూ అన్నాడు డి.యస్.పి. అతని కంఠంలో సానుభూతి ధ్వనించింది.
    వరూధిని నిట్టూర్చింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మనస్సు తేలికపడింది.
    "చూశారుగా ఎంత అన్యాయం చేశారో? మీ యస్సై, సర్కిలూ కూడా వాళ్ళతో చేరిపోయి హాలును రామకృష్ణయ్య స్వాధీనంలో పెట్టారు."
    "పొరపాటు పడుతున్నారు. ఇందులో వాళ్ళ ప్రమేయం ఏమీలేదు." అన్నాడు డి.యస్.పి.
    వరూధిని గాబరాపడిపోయింది. ఈయనకూడా ఇలా మాట్లాడుతున్నాడేం? క్షణం క్రితం మరి అంత సానుభూతి చూపించాడుగా? పోలీసువాళ్ళను అర్ధం చేసుకోవటానికి తనకు బుర్ర చాలదేమో?
    "థియేటర్ ప్రొటక్షన్ కోసం వున్న పోలీసుల్ని ఎందుకు పంపించివేశాడు యస్సై? బందోబస్తు వంటే రామకృష్ణయ్య హాలు స్వాధీనం చేసుకోగలిగేవాడా? ఆఁ అన్నట్లు, రామకృష్ణయ్యను ఎందుకు వదిలేశారు? హాలుమీదకొచ్చి వాళ్ళు దాడి జరిపితే మీ వాళ్ళెందుకు చూస్తూ ఊరుకున్నారు? ముందామాట చెప్పండి." వరూధిని ఉద్రేకంగా అడిగింది.
    "హాలు వాళ్ళదేనని రామకృష్ణయ్య రుజువు తెచ్చాడు. అందువల్ల అతన్ని హాల్లో ప్రవేశించకుండా ఎవరూ అడ్డగించలేదు. అది 'లా'కు విరుద్దం. రామకృష్ణయ్యను మేము వారిస్తే రేపు మా పీకలమీదకు వస్తుంది."
    వరూధిని ముఖం వడదెబ్బ కొట్టినట్టయి పోయింది. కొద్ది క్షణాలు మాట రాలేదు.
    "అట్లా చూచినా ఆ హాలు రామనాథబాబుదీ, నాదీను. మేమిద్దరమే పార్ట్ నర్స్ మధ్యలో యీ రామకృష్ణయ్యగాడెవడూ? థియేటరు రామనాథబాబు స్వాధీనంలోనో లేక నా స్వాధీనంలోనో ఉండాలి. హాలు మా ఇద్దరిదేనని మీకూ తెలుసుగా?" వరూధిని చెప్పినదంతా ప్రశాంతంగా విన్నాడు డి.యస్.పి.
    వరూధినికేసి జాలిగా చూశాడు. అతని ముఖంలో నవ్వు లీలామాత్రంగా కదిలి ఆగిపోయింది.
    "అదంతా మీ భ్రమ! రామనాథబాబుమీద మీకున్న నమ్మకం!"
    "హాలు కట్టేముందు లాయరుచేత పార్టనర్ షిప్ డీడ్ రాయించాము. నేను కూడా సంతకాలు పెట్టాను."
    "ఆ పార్టనర్ షిప్ డీడ్ రిజిష్టరయిందా?"
    వరూధినికి డి.యస్.పి. మాటల్లోని అంతరార్ధం అర్ధం కాలేదు.
    "రిజిష్ట్రారు ఆఫీసులో చెయ్యాల్సిన పనులన్నీ అప్పుడే చేసేశానన్నాడు" అంటూ వరూధిని గుటక మింగింది.
    "అన్నాడుకాని చేశాడా?"
    "చేసే వుంటాడు. ఆ పత్రాలన్నీ రిజిష్ట్రారు ఆఫీసులో దొరుకుతాయి కావాలంటే." అతినమ్మకంగా అన్నది వరూధిని.
    "ఇప్పుడు రామకృష్ణయ్య చూపించిన డాక్యుమెంట్సు ఏమిటో తెలుసా?" అన్నాడు డి.యస్.పి.
    "ఏం చూపించాడూ?" కుంగిపోతున్నట్లు అన్నది వరూధిని.
    "అసలు స్థలం రామనాథబాబు భార్య శ్యామలాంబ పేరుమీద ఉంది. థియేటరు కూడా ఆమెపేరుమీదే ఆమె డబ్బుతోనే కట్టినట్టూ, రెండేళ్ళకు రామనాథబాబుకూ, మీకూ లీజ్ కిచ్చినట్టు.
    ఇప్పుడేమో ఆ లీజు పిరియడ్ దాటిపోయినట్టు, మళ్ళీ కొత్తగా థియేటర్ను రామకృష్ణయ్యకు లీజుకిచ్చినట్టు పత్రాలు చూపిస్తోన్నారు."
    "అంతా అబద్దం! అవి దొంగపత్రాలు, అంతా మోసం!" వరూధిని పిచ్చిదానిలా అరిచింది.
    "రామనాథబాబు నిన్ను ప్రేమించటంకూడా అబద్దమే! అతన్ని నువ్వు నీ వాడనుకోవటమూ మోసమే! నిన్ను నువ్వు దగా చేసుకొన్నావ్. రామనాథబాబు సంగతి నాకు బాగా తెలుసు."
    డి.యస్.పి. అలా కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాట్టం వరూథినికి ఆశ్చర్యం వేసింది.
    అతను వరూథినికి ఏదో సన్నిహితుడిలా అన్పించింది. పోలీసు ఆఫీసరులా అన్పించలేదు.
    వరూధిని వచ్చే ఏడుపును ఆపుకుంటూ మొండిగా అన్నది ...
    "రామకృష్ణయ్య చూపించినవన్నీ దొంగపత్రాలే. అవన్నీ మీరెందుకు నమ్ముతారు నిజం మీకు తెలిసి కూడా?"
    ఇంకా ఆమెకు పూర్తిగా ఆశలు చావలేదు. డి.యస్.పి చెప్పింది నమ్మడానికి ఆమె మనసు ఎదురు తిరుగుతోంది.
    "నిజానిజాల ప్రశ్నకాదు. ఎవరి హక్కులేమిటో, ఎవరి అధికారాలు ఏమిటో, ఆ స్థలం ఎవరిదో, ఆ థియేటర్ ఎవరిదో నిర్ణయించాల్సింది కోర్టు. నేనూ కాదు, మా పోలీసు బలగమూ కాదు" అన్నాడు డి.యస్.పి.
    "అలా అయితే వాళ్ళే కోర్టులో తేల్చుకోవాలి. అంతవరకూ థియేటర్లో కాలు పెట్టే హక్కు వాళ్ళకు లేదు. అది నా స్వాధీనంలో వుంది" అని వాదించింది వరూధిని.
    డి.యస్.పి. ఆలోచనలో పడ్డ్డాడు. ఆమె వాదనలో బలం లేకపోలేదనిపించింది.
    "కాని ఇప్పుడు హాలు వాళ్ళ స్వాధీనంలో వుందే మరి?" అన్నాడు డి.యస్.పి. సాలోచనగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS