(ఈ మధ్యలో ఒక విషయం రాయడం మరచిపోయాను. మా పెద్దమ్మాయి కడుపులో వుండగా 'నీకేమిటి కావాలో కోరుకో' అన్నారు శ్రీశ్రీగారు. 'ఏమీ వద్ద'న్నాను. కానీ ఆయన వదలలేదు. చివరికి ఆయన బలవంతం మీద 'కింద నున్న బెడ్ రూమ్ కిపైన ఓ రూమ్ వేస్తే, ఆ రూమ్ కిటికీలో నుండి సముద్రం మీద పడే పున్నమి వెన్నెలని చూడాలని వుంద'ని అడిగాను. వెంటనే కొత్తగా మెట్లు కట్టించి, బ్రహ్మాండమైన రూమ్ కట్టించి ఇచ్చారు.
మేము ఆ రూమ్ లోనే రాతపని పెట్టుకొనే వాళ్ళం. రాత్రిళ్ళు హాయిగా వెన్నెల్లో పడుకొని ఎన్నెన్నో కథలు చెప్పేవారు. ఇప్పుడు సముద్రం కనిపించినా ఎదురుగా చాలా బిల్డింగులు లేచిపోయాయి. అప్పటంత బాగా కనిపించకున్నా సుమారుగా కనిపిస్తుంది.)
పిక్చర్ రిలీజయ్యింది. డబ్బాలు తిరిగొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ కి మేమే బాకీపడ్డాం. చమ్రియావాళ్ళు తెగ సతాయిస్తున్నారు.
"సరోజా ఏం దారి?" అన్నారు శ్రీశ్రీగారు.
"అలా భయపడతారేమిటండి" అన్నాను.
ఇంతలో మళ్ళీ సుబ్బరామన్ గారు వచ్చి 'తమిళ భాషలో తను తీసిన 'పార్ మగ్ హళేపార్' అనే పిక్చర్ పార్ట్నర్ షిప్ లో తీద్దామ'ని ఆఫరిచ్చారు.
"ఈ పిక్చర్ ఒప్పుకుందాం సరోజా! నష్టాలు కాస్త సర్దుకున్నా సర్దుకోవచ్చు" అన్నారు.
నాకు ఇష్టం లేకున్నా వారి మాటమీద సరే ననక తప్పలేదు. దానికి 'కవల పిల్లలు' అని టైటిల్ ఇచ్చారు. దానికి కూడా మ్యూజిక్ డైరెక్షన్ నేనే చేశాను. అది అనుకున్నంత బాగా పోలేదు. మొత్తంమీద నష్టమనే చెప్పాలి.
"సుందర్ లాల్ గారికి మళ్ళీ డబ్బయ్యయిదు వేలదాకా బాకీపడ్డాం సరోజా! ఇది మనవంతు షేరు మాత్రమే. సుబ్బారామన్ గురించి ఫరవాలేదు. అతను స్ట్రయిట్ పిక్చర్ తీసి మేనేజ్ చేసుకుంటాడు. కానీ మనం అప్పు ఎలా తీర్చడం?" అన్నారు శ్రీశ్రీగారు.
ఇద్దరం బెంగపెట్టుకు కూర్చున్నాం. ఉన్న ఈ ఒక్క ఇల్లు ఆధారం. ఏం చేయాలో తోచలేదు .డబ్బుకోసం చమ్రియానుండి ఒత్తిడి ప్రారంభమయ్యింది. ఇంటిమీద యాక్షన్ తీస్తామని చెప్పారు.
నేను శ్రీశ్రీగారికి ధైర్యం చెప్పి, "మనిద్దరం చమ్రియాకి వెళదాం రండి" అని బయలుదేరాం.
"ఏం చేస్తావు?" అని అడిగారాయన. నా ఉద్దేశం ఆయనతో చెప్పాను.
"వాళ్ళు ఒప్పుకుంటే బాగానే వుంటుంది" అన్నారు.
"నేను ఒప్పిస్తానుగా. మీరు నా పక్కనుందురూ" అన్నాను.
ఇద్దరం వెళ్ళాం.
సుందర్ లాల్ గారికి అప్పుడు తెలుగు అంత బాగారాదు. ఏదో మాట్లాడేవారు. "రండి రండి బాగున్నావే" అని అనేవారు.
"ఏమిటండీ తెలుగు మాట్లాడడం రాకుంటే, మానేసి హిందీలోనే మాట్లాడరాదూ! నాకు హిందీ బాగా తెలుసు. 'ఏవే. ఏవిటే' అని ఎవర్ని ఎవరు పిలుస్తారో మీకు తెలుసా?" అంటే నవ్వేస్వారు.
మాటలన్నీ అయ్యాక. "శ్రీశ్రీగారూ! మీవంతు డబ్బు పదిహేను రోజులలోగా కట్టేయాల"ని అన్నారు నహతాగారు.
నేను వెంటనే అందుకుని, "పదిహేను రోజులుకాదు_పదిహేనేళ్ళు మీరు టైమిచ్చినా మేమా మొత్తాన్ని కట్టలేం" అన్నాను.
"మరైతే ఎలాగ?" అన్నారాయన.
"చూడండి. మీకు అరడజను పిక్చర్లు మేము రాసేస్తాం. ప్రస్తుతం మేము పిక్చర్ కి పన్నెండువేలు తీసుకుంటున్నాం. ఎంత డబ్బు బాకీవున్నా దాంతో సరిపెట్టుకోండి. మీరు శ్రీశ్రీగారికీ, నాకూ చేయాల్సిన మహోపకారం ఇదే" అన్నాను.
తర్వాత ఏవో డిస్కషన్స్ అయినా, ఆ ప్రకారంగానే నహతాగార్ని ఒప్పించి, ఆ కష్టం నుండి గట్టెక్కాం. అనుకున్న ప్రకారం ఆరు పిక్చర్లూ తీసు రుణం తెర్చుకున్నాం. అది చాలక మా మొదటి పిక్చర్ వారి దగ్గరే వదిలేశాం.
"మొత్తానికి సాధించావు సరోజా!" అన్నారు శ్రీశ్రీగారు.
"లేకుంటే ఏమిటండీ! ఈ ఫీల్డు మీకు ఎంత డబ్బు ఎగగొట్టింది?" అని అడిగాను.
"చాలా" అన్నారు.
"మనం ఎగగొట్టలేదు. పనిచేసి అప్పు తీర్చుకున్నాం" అన్నాను.
మా పెద్దమ్మాయికి ఎనిమిదో నెల వచ్చేసరికి, మా రెండో పాప కడుపులో పడింది.
ఒకరోజు నేనూ, శ్రీశ్రీగారూ డాబామీద కూర్చున్నాం. ఆయన విపరీతంగా ఆలోచిస్తున్నారు.
"ఏమీటండీ ఆలోచిస్తున్నారు?" అని అడిగాను.
సరోజా! నేనే డైరెక్టు చేసి, ఓ పిక్చర్ తీద్దామనుకుంటున్నాను. దానికి టైటిల్ కూడా అప్పుడే పెట్టేశాను. స్క్రిప్ట్ కూడా రడీగా వుంది. స్క్రీన్ ప్లే....అన్నీ రడీ. తిన్నగా సెట్ కి వెళ్ళిపోవడమే" అన్నారు. ధోరణి చాలా ఘాటుగా సాగుతోందని మధ్యలో డిస్టర్బ్ చేయకుండా వినసాగారు.
"టైటిల్ ఏమిటి చెప్పుకో" అన్నారు.
"ఏమయివుంటుంది? మీ మాటల్నిబట్టి దానికి సంబంధించినదే అయి వుంటుంది" అన్నాను.
"అవును. ఆకలి మంటలు', ప్రజలందరినీ ముందుకు నడిపించేటట్టు దాన్ని రాశాను. వాళ్ళ బ్రతుకుల్ని స్వర్గంలా వాళ్ళే చేసుకునేలా చెయ్యాలని నా తపన.
మానవుడిలో మహత్తర శక్తి వుందని ధృవపరచాలి. మానవుడు పరిసరాలకు బానిస అనే విశ్వాసాన్ని విచ్చిన్నం చెయ్యాలి.
అప్పుడే ఇవన్నీ అనేకచోట్ల, అనేక దేశాల్లో అమలులోకి వచ్చి సాగుతూనే వున్నాయి. ప్రజలు మేల్కొంటున్నారు.
మనం కూడా కొత్త పోకడలతో ప్రజా హృదయాలలోకి నడక సాగించాలి. మనదేశంలో కూడా నాటకాలలో, బుర్రకథలలో, నృత్యాలలో, పాటలలో, జానపదాలలో సాహిత్యరీత్యా కూడా కొత్త కొత్త పోకడలతో ముందుకి సాగి ప్రజలతో కలిసిపోతూ వాళ్ళని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అనేకులు అనేక విధాలుగా చురుగ్గానే ముందుకు సాగుతున్నారు. మహోజ్వలమైన చారిత్రక స్మృతులతో నూతన సంచలనం కనిపిస్తోంది. అయినా చాలదు.
ప్రజలు తమ చుట్టూ ఆవరించి వున్న దారిద్ర్యాంధకారం నుండి బైటపడాలి. మనది ప్రజా ప్రభుత్వం కాదు. పోలీసు రాజ్యం. ఒక మనిషిని మరొక మనిషి దోచుకునే విధానానికి స్వస్తి చెప్పాలి. సమసమాజాన్ని నిర్మించాలి. అనేక రూపాల్లో పోరాటం సాగిస్తేనే గానీ ఇది సాధ్యంకాదు. ఆయుధాన్ని ఆయుధంతోనే ఎదిరించాలి. హింసని ప్రతి హింసతో ప్రతిఘటించాలి. అనుక్షణం దండయాత్ర జరుపుతూనే వుండాలి.
తాత్కాలిక పరాజయాలు ఎన్ని తటస్థించినా అంతిమ విజయం నేనవలంబించిన మార్గానికే సరోజా! ఒక్కసారి పర్యావలోకవం చేస్తే మన కళ్ళ ఎదుట కనబడుతున్న సత్యమే ఇది.
ఇవన్నీ నీకు చెప్తున్నాను. అర్ధమైనా కాకున్నా వింటూ వుండు, మధ్యలో 'ఊఁ' కొడితే ఇంకా సంతోషం.
ఈనాడు పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. నేను కనే కలలు అట్టే దూరంలో లేవని నా నమ్మకం. ఎందుకంటే...నేను ఆశావాదిని. నా చూపు ఎప్పుడూ ముందుకే వుంటుంది. వెనక్కి చూసే అలవాటే లేదు నాకు. భవిష్యత్తు మీదే నా నిఘా ఎప్పుడూ ఉంటుంది.
