నేనేమీ మాట్లాడలేదు. అయిదు నిముషాల తర్వాత "సరోజా" అని పిలిచి, "ఆకలి మంటలు పిక్చర్ గురించి నీ అభిప్రాయం చెప్పావు కావు. తీద్దామా వద్దా?" అని అడిగారు.
"అదేమిటండీ? పిక్చరయితే తియ్యమంటాను. కానీ ఎలా? డబ్బేది? ఇప్పటికే చాలా నష్టపోయాం. గట్టిగా మీ మాటని కాదనలేకపోయిన పాపానికి రెండు లక్షలపైగా క్షవరం అయ్యింది." అన్నాను.
"ఫిల్ము తియ్యడానికి డబ్బు ప్రధానం కాదు_అనే దృఢ నిశ్చయానికి వచ్చాను సరోజా! ఒక ప్రొడక్షన్ మేనేజరే చేతిలో చిల్లిగవ్వయినా లేకుండా ప్రారంభించి ప్రొడ్యూసర్ అవుతున్నాడు. అలాగయ్యేవాళ్ళని ఎందర్నో చూశాను కూడా. కొందరు రచయితలు తమ కలం బలంతో ప్రోద్యూసర్లూ డైరెక్టర్లూ మాత్రమే కాక స్టూడియో అధిపతులు కూడా అయ్యారు.
కానీ నా ధ్యేయం వేరు. నేను నా కలం బలంతో నా ప్రజలలోకి వెళ్ళాలి. వాళ్ళకోసమే నేను పిక్చర్ తీయదలచుకున్నాను. నేనే డైరెక్టు చేస్తాను.
నేను తీయబోయే చిత్రంలో వీరోచితమైన సాహసం వుంటుంది. భీభత్సం, హాస్యం వుంటుంది. అన్నిటికన్నా కష్టకాలంలో మనిషిని మనిషి ఎలా ఆదుకోవాలో చూపించే మానవత్వం ఉంటుంది." అన్నారు.
* * *
శ్రీశ్రీ గారి నమ్మకం
శ్రీశ్రీ గారి మాటలు భావావేశంతో సాగిపోతున్నాయి.
"ఈనాటి తెలుగు జీవితాన్ని, ఎటువంటి పుక్కిటి పురాణాలూ అభూత కల్పనలూ జోడించకుండా ప్రతిబింబించగల ఫిల్మ్ తియ్యగలగడంకానీ, తీయించగలగడంకానీ చెయ్యగలనని నాకు గట్టి నమ్మకం వుంది.
మన తెలుగువాళ్ళు తెలుగు జీవితం జోలికి పోరు. లాభసాటి దృష్టితో చూసే పెట్టుబడిదారీ మనస్తత్వమే దీనికి కారణం. ఈ లెక్కలో మనకన్నా బెంగాలీ, మలయాళీ, తమిళం వాళ్ళు ఎంతో మెరుగు!
దేనికైనా మనల్ని ఎదుర్కొనేది డబ్బు సమస్య. నేనెలాగైనా అవస్థపడి 'ఉషశ్రీ పిక్చర్స్' పేరిట 'ఆకలి మంటలు' తీస్తాను. దానికి నువ్వేసంగీత దర్శకత్వం చేద్దువుగాని" అన్నారు.
"ఉషశ్రీ పిక్చర్స్ పేరిటే కదండీ, ఇంతకు ముందు మనం రెండు పిక్చర్లు తీశాం" అన్నాను.
"అవునులే! పెద్ద నటీనటులు నా చిత్రానికి అవసరంలేదు. కొత్తవాళ్ళకి అవకాశాలు కల్పిస్తాను. కొత్త తరహా పద్ధతిలో తీస్తాను. నేననుకున్న విధంగా, నేను చెప్పదలచుకున్నది సూటిగా డొంకతిరుగుళ్ళు లేకుండా, ప్రజల హృదయాల్లో హత్తుకుపోయేటట్టు చెప్తాను. ఏమంటావు?" అన్నారు.
"అలాగే! తప్పకుండా మీ ఇష్టప్రకారం చెయ్యండి. కానీ మీకు రాజా అన్నామలైపురంలో ఓ ఇల్లు, మందపల్లిలో ఓ ఇల్లు వున్నాయన్నమాట మరచిపోయి ఏదైనా చెయ్యండి. నాకు అభ్యంతరంలేదు. మీతో పాటు నేనూ కష్టపడతాను" అన్నాను.
"కొంచెం కాఫీ ఇస్తావూ?" అని అడిగారు. ఇచ్చాను.
"కిందకి పోదాం రండి" అన్నాను.
"లేదు సరోజా! ఇక్కడే కొంతసేపు వుందాం" అన్నారాయన.
"ఏవండీ! ఇంతసేపూ ప్రవాహంలా చెప్పుకుపోయారు. నా సందేహం ఒకటి తీరుస్తారా?" అన్నాను.
"అడుగు" అన్నారు.
"మతం గురించి మీ అభిప్రాయం ఏమిటండీ" అని అడిగాను.
"సూర్యుడులాంటి సత్యానికి మబ్బులాంటిది ఈ మతం. అనాది నుండీ ఈ మతాలు మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుషులందర్నీ ఏ మతమూ ఒక్కటిగా చేయలేకపోయింది. అలా చేసే శక్తి ఏ మతానికీ లేదు. పైగా మనిషిమీద మనిషికి వుండవలసిన విశ్వాసాన్ని లేకుండా చేస్తుందీ మతం. దేవుడనే హేతువాద దూరమైన భావాన్ని ఆరాధిస్తూ పోటీగా మూఢవిశ్వాసాలను నిలబెడుతుంది. నన్నడిగితే మనం ఈ మూఢవిశ్వాసాలతోనే మొట్ట మొదట పోరాడాలి.
ఢంకాని జోకొట్టాలని, అలల్ని అరికట్టాలని, గాలిని ఉరితియ్యాలని కాదు మన ప్రయత్నం. ప్రయత్నించినా అలా జరగడం అసంభవమని నేను వేరే చెప్పక్కర్లేదు. ఎవ్వరైనా గతాన్ని గురించి ఆలోచించకపోయినా నష్టం లేదంటాను. రేపటి గురించి ఈరోజే ఆలోచించడం మంచిదంటాను. మానవుడు సమసమాజమనే గమ్యం చేరడానికింకా గాలకాల పట్టవచ్చు. అందుకనే మనం చేసే ప్రయత్నంలో లోటు వుండకూడదు.
ఎవరి పని వారిదే. దేని దారి దానిదే సరోజా! ఇప్పుడు నా సంగతి చూడు. ఏమయ్యింది? 'ఆకలి మంటలు' ఫిల్మ్ తియాలని ఎంతగానో ఉబలాట పడ్డాను. ఎన్ని విధాలుగానో ప్రయత్నించాను.
నా ఆశయం, ధ్యేయం అన్నీ బాగానే వున్నాయి. కానీ ఏం లాభం? ఎవరైనా ముందుకొచ్చి 'మేం ఫైనాన్స్ చేస్తాం' అని అన్నారా? ప్లాన్లూ, ఆదర్శాలూ ఏమయ్యాయి?
ఇదే పెట్టుబడిదారీ విధానం సరోజా! 'ఎంత పెడుతున్నాం. దీనిమీద మనకెంత వస్తుంది?' అన్నదే లెక్క. ఇది బూర్జువా సమాజం, బూర్జువా సంస్కృతి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవజీవితం యావత్తూ బూజుపట్టిన విలువలకే అంకితమైపోతోంది.
అందుకనే నేనంటున్నదేమిటంటే...మానవ జీవితాన్ని తేజోవంతం చెయ్యడానికి, కడుపునిండా కూడు, ఒంటినిండా గుడ్డా వుండడానికి, నూతన జీవిత ప్రాప్తికి శాయశక్తులా కృషి చెయ్యాలి" అని ఆయన చెబుతూవుంటే...
"ఏమిటండీ మీ ఆవేశం? ఇది ఒక్కరివల్ల జరిగేపనా? ఇదివరలో ఎంత మంది కాలగర్భంలో కలిసిపోలేదు? చివరికి ఏమిటి మిగిలింది? ఏమిటి సాధించారు?" అని అడిగాను.
"నీకు తెలియదు సరోజా! వివరంగా చెప్పాలంటే ఒక్క రోజుతోనో, ఒక్క నెలతోనో అయ్యే పనికాదు. నువ్వు నాకు ఇన్స్ పిరేషన్. నువ్వలా వింటూ వుండు. మూడ్ వచ్చినప్పుడు నేనలా మాట్లాడుకుంటూ పోతాను. వినడంలో తప్పులేదుకదా!" అన్నారు.
"భలేవారే! వినడం ఏమిటి? మీ నోటంటే వచ్చే ప్రతి అక్షరాన్నీ రాసుకుంటున్నానండి" అన్నాను. చాలా సంతోషించారు.
"రాసి ఏం చేస్తావు?" అని అడిగారు.
"భద్రంగా దాచుకుంటాను" అన్నాను.
గట్టిగా ఒక దమ్ము లాగారు.
* * *
కాలచక్రం మరికొంత తిరిగింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. తర్వాత ఓ కొడుకు పుట్టాడు. వాడిని మేము 'బైజూ' అని పిలిచేవాళ్ళం. ఈ పేరు నేను పెట్టుకున్నదే. శ్రీశ్రీగారికి కూడా ఈ పేరు బాగా నచ్చింది. వారికి పిల్లలందరిమీద విపరీతమైన ఇష్టం వుండేది. నెత్తిమీద కూర్చోపెట్టుకునేవారు.
మగపిల్లవాడు పుట్టాడంటే ఆయన మొదట నమ్మలేదు. "నిజంగా నాకు కొడుకు పుట్టాడా?" అని అడిగారు.
1964 వ సంవత్సరంలో ఆగస్టు నెల పదిహేడవ తేదీన వాడు పుట్టాడు. వాడికి శ్రీశ్రీగారు వెంకటరమణ అని తన తండ్రి పేరు పెట్టారు ఇంట్లో మాత్రం బైజూ అని పిలుచుకునే వాళ్ళం. మా రెండో అమ్మాయిని 'బుజ్జీ' అని నేను పిలిచేదాన్ని శ్రీశ్రీగారు 'బజ్జీలూ' అని పిలిచేవారు.
ఒకనాడు శ్రీశ్రీగారు కంపెనీనుండి వచ్చి, "సరోజా ! గుడ్ న్యూస్" అన్నారు.
"ఏమిటి?" అని అడిగాను.
"నేను కథ, స్క్రీన్ ప్లే రాసిన 'రుక్మిణీ కళ్యాణం' తియ్యమని అందరూ అంటున్నారు. 'డిస్ట్రిబ్యూటర్స్ ని మేము ఏర్పాటు చేస్తామ'ని దుక్కిపాటి మధుసూదనరావుగారు మాట ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావుగారు కృష్ణుడుగానూ, కృష్ణకుమారి రుక్మిణిగానూ నటిస్తామన్నారు. రాజేశ్వరరావుగారు సంగీత దర్శకత్వం, గోఖలేగారు ఆర్టు_ ఒకటేమిటి_అందరూ సహకరిస్తామన్నారు" అని చెప్పారాయన.
"దర్శకత్వం ఎవరు?" అని అడిగాను.
"నేనే చేస్తాను సరోజా!" అన్నారు.
"పురాణంలోని 'రుక్మిణి కల్యాణమా' లేక అది కూడా కలియుగ రుక్మిణీ కృష్ణుల కళ్యాణమా?" అని అడిగాను.
"నీ సందేహం కరెక్టే. మార్పులు చాలా వుంటాయి. నీకు చెప్తాగా!" అన్నారు.
"బాగానేవుంది. కానీ 'ఆకలి మంటలు" సంగతి?" అని అడిగాను.
"అది కూడా తప్పకుండా తీస్తాను సరోజా! దానిని మనస్సులో పెట్టుకొనే ఇవన్నీ చెయ్యడం" అన్నారు.
"ఆలోచించండి. ఆర్ధికంగా ఇప్పటికే మనం దెబ్బతిన్నాం" అన్నాను.
"అంటే మనం స్ట్రయిట్ పిక్చర్ తియ్యలేమంటావా?" అని అడిగారు.
"ఎందుకు తియ్యలేమండీ. తియ్యగలం. పోతే చిప్పా దొప్పా చేతికి రాకుండా చూసుకోవాలి. నన్ను అడిగితే_నా కిష్టంలేదు. తర్వాత మీ ఇష్టం" అన్నాను.
అనుకోకుండా అన్నీ కలిసొచ్చి "రుక్మిణీ కల్యాణం పూజ మందపల్లిలో మా ఇంట్లోనే సింపుల్ గా చేస్తున్నామ"ని వారు ఒకరోజు హఠాత్తుగా చెప్పారు.
ఆయన అనుకున్న ప్రకారం మా ఇంట్లోనే పూజ సింపుల్ గా ముగిసింది. నాగేశ్వరరావుగారు, దుక్కిపాటి మధుసూదనరావుగారు, గోఖలేగారు, కృష్ణకుమారిగారు, రాజేశ్వరరావుగారు_మొదలైన వాళ్ళంతా వచ్చి పూజలో పాల్గొన్నారు.
