ఇక శ్రీశ్రీగారి ఆనందానికి అంతులేదు. 'నిజంగానే_నిజంగానే' అని రోజుకి ఎన్నిసార్లు అనేవారో!
"అబ్బబ్బో! శ్రీశ్రీకి పిల్లల్ని కంటున్నావేమిటి? నిజంగా నువ్వు రాక్షసివేనే" అని అంటూవుంటే, వారి సంతోషాన్ని చూసిన నాకు కళ్ళనీళ్ళు గిర్రున తిరిగేవి.
మొదట్లో కొంచెం అవస్థపడినా తర్వాత మామూలుగా కంపెనీకి వెళ్ళి పనులూ, పాట్లూ చేసుకొనేవాళ్ళం. కస్తూరీ సుబ్బరామన్ గారు తీసిన 'నాన్ సొల్లుమ్ రగసియం' అనే సినిమాను స్వంతంగా డబ్ చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టాం. మా యిద్దరికీ స్వంత పిక్చర్ తియ్యాలంటే మహా సరదా.
ఎడిటర్ మాణిక్యంగారి ప్రోత్సాహంతో పిక్చర్ తియ్యడానికి నడుంకట్టాం. పాటలూ ,మాటలూ రాసేశారు. స్క్రిప్టు ఫెయిర్ కూడా చేసేశాను. ఇక రికార్డింగ్ కి వెళ్ళాలి.
ఆ సమయంలో "స్టాక్ హోమ్ వెళతానన్నా"రు శ్రీశ్రీగారు.
"ఇప్పుడెందుకు?" అన్నాను.
"వెళ్ళాలి సరోజా! నాతోపాటు పెద్దావిడనీ (రవణమ్మగారిని), అమ్మాజీని కూడా తీసుకువెళతాను" అని అన్నారు.
"డబ్బులేవీ?" అని అడిగాను.
"దానికీ ,అమ్మాజీకి అది డబ్బులు పెట్టుకుంటుందట" అన్నారు.
చివరికి ప్రయాణం మరో వారం రోజులుందనగా ఆవిడ ఇంట్లో బంగారమంతా అంటే వడ్డాణం, కాసులమాల, పెద్ద పెద్ద గొలుసులు, నక్లెస్ లు, వెండీ_వగైరాలతో పాటు ఇల్లు కూడ తాకట్టుపెట్టి డబ్బు తెస్తున్నారని డ్రైవర్ సుబ్బారావు చెప్పగా విన్నాను.
నేనిక రంగంలోకి దిగాను.
స్వంత పిక్చర్ డబ్బింగ్ కే రెండు లక్షల దాకా ఖర్చవుతుంది. అందులో కనీసం లక్షదాకా మనమే పెట్టుకోవాలి. తీరా పిక్చర్ ఏమవుతుందో? ఉండే ఇల్లూ, వాకిళ్ళూ కూడా ఎగిరిపోతే, నడి రోడ్డున పడతామని, తాకట్లు పెట్టి వాళ్ళని తీసుకు వెళ్ళొద్దని డబ్బుంటే తప్పకుండా తీసుకు వెళ్ళమని గొడవ చేశాను.
అప్పటికే నాకు తెలియకుండా కారు మీద ఆరువేలు, వెండి బంగారాల మీద ఇరవై అయిదు వేలు దాకా తెచ్చేశారు. తిడితే తిట్టారులే అని కల్పించుకున్నాను.
రెండు మూడు రోజులు గొడవలయ్యాయి. నేను ఆవిడ్ని తీసుకొని మార్వాడి దగ్గరికి వెళ్ళి నగల మీద ఇచ్చిన డబ్బు వాడికిచ్చేసి నగలన్నీ విడిపించేసి ఆవిడ ఇంట్లో పడేశాను. ఇక ఇంటి మీద అప్పు తెచ్చే ప్రశ్నే లేదు. మొదట్లో నా మీద విసుక్కొని తిట్టినా తర్వాత ఆవిడ నన్ను చాలా మెచ్చుకున్నారు.
కారు మీద తెచ్చిన కేష్ మాత్రం వుంది. దాని మీద మరి కొంత డబ్బువేసి శ్రీశ్రీగారు 5_5_59 వ తేదీన బయలుదేరి స్టాక్ హోమ్ కి వెళ్లారు. పది రోజుల తర్వాత ప్రయాణం ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చేలోగా నేను మా స్వంత పిక్చర్ మాటలూ, పాటలూ పూర్తి చేసేశాను. ఎవ్వరికి నయాపైసా బాకీ పెట్టలేదు. డబ్బింగ్ దైలాగ్సు డైరెక్షన్ అన్నీ నేనే చేసుకున్నాను. నా సంగీత దర్శకత్వంలో శ్రీ ఘంటసాలగారు, సుశీల, పిఠాపురం, మాధవపెద్ది, పి. లీల, ఈశ్వరి వగైరా_ అందరూ పాడారు. పిక్చర్ బ్రహ్మాండంగా వచ్చింది.
ఇంటికి రాగానే, "మొత్తం పిక్చర్ పూర్తిచేశాన"నే సరికి నిర్ఘాంతపోయారు. తరువాత నేను బిడ్డని కన్నానన్న సంతోషంతో వారు తాను సంపాదించుకున్న ఆస్తిపాస్తుల మీద సర్వ హక్కులూ నాకూ, నా పిల్లలకి వుండాలనే ఉద్దేశం మీద, ముందు మామూలుగా పెళ్ళి జరిగినా, 28_5_59 వ తేదీన నన్ను రిజిష్టరు మ్యారేజ్ చేసుకున్నారు.
"పెళ్ళి చేసుకోలేదని ఎవరన్నా, ఈ పత్రం చాలు సరోజా!" అన్నారు.
"మీ కెందు కిలాంటి అనుమానం వచ్చింద" ని అడిగాను.
"నేను చేస్తున్న ఈ పని కేవలం నీ కోసం, నీ పిల్లలకోసం. మన పెళ్ళిచూసినవాళ్ళు ఎంతమంది వున్నారు? ఆ చూసినవాళ్ళే రేపు జరగలేదని చెప్పరన్న నమ్మకం ఏముంది? అందుకే ఈ రిజిష్టరు మేరేజ్. అదీగాక నువ్వు నాకు బిడ్డని కానుకగా ఇస్తున్నావు. ఆ సంతోషంతో నేను నీకిస్తున్న బహుమానం ఇది" అన్నారు.
17_9_59వ తేదీ గురువారం తెల్లవారు ఝామున మూడు గంటల పదినిముషాలకి మా పెద్దమ్మాయి పుట్టింది. ఇంటికి ఫోన్ చేసి చెప్తే వారు ఎగిరి గంతేశారు.
తొమ్మిది గంటలకి నన్ను చూడడానికి వచ్చిన శ్రీశ్రీగారు తన కూతుర్ని చూసుకొని మురిసిపోయి, దాని తల కింద పదివేల రూపాయలు పెట్టారు.
"ఎక్కడివండీ" అని అడిగాను.
"వస్తూ దారిలో కంపెనీకి వెళ్ళాను సరోజా! పదివేలు ఇచ్చారు. కాబట్టి ఈ డబ్బు తల్లిగాడిదే" అన్నారు. ఆయన మా పెద్దమ్మాయిని 'తల్లి' అని పిలిచేవారు.
బాలసారె చాలా బ్రహ్మాండంగా జరిపించాం. ఆ పిల్ల పుట్టినప్పుడు శ్రీ ఆరుద్రగారు ప్రెజంట్ చేసిన స్టీలు పువ్వుల పళ్ళెం నా పూజాగదిలో ఇప్పటికీ భద్రంగా ఉంది.
బాలసారె అయిన తర్వాత రెండు రోజులు గుమ్మం కదలకుండా ఆ పసిపిల్లతోనే కాలం గడిపారు.
ఆ అమ్మాయికి 'అప్పన్న కొండ' అని మా అత్తగారి (శ్రీశ్రీగారి తల్లి)పేరు పెట్టారు. స్కూల్లో వేసేటప్పుడు 'మంజుల' అని పెట్టాను. ఇంట్లో మాత్రం శ్రీశ్రీగారు పెట్టిన 'తల్లి' అనే పేరుతోనే పిలుచుకునేవాళ్ళం.
* * *
ఆకలి మంటలు
"స్టాక్ హోమ్ విశేషాలేమీ చెప్పారుకారేం?" అని శ్రీశ్రీగారిని అడిగాను. "ప్రత్యేకించి ఏమున్నాయిలే? ఈసారి కూడా ప్రపంచ శాంతి సంఘ ప్రతినిధిగానే వెళ్ళాను. శాంతిసంఘం పదవ వార్షికోత్సవం జరిగింది. స్టాక్ హోమ్ నుండి రష్యా వెళ్ళాలని చాలా ప్రయత్నించాను గానీ జరగలేదు.
నేను అక్కడికి చేరుకునేసరికి వెంటనే బయలుదేరి రమ్మని ఇక్కడివాళ్ళిచ్చిన కేబుల్స్ నాకోసం ఎదురు చూస్తున్నాయి. అన్నీ మన ప్రొడ్యూసర్లిచ్చినవే. వెళ్ళింది మొదలు తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేసుకోవడంతో సరిపోయింది. దానికి తోడు నీ గురించి దిగులొకటి.
ఉత్త మనిషివి కావు. పిక్చర్ల పన్లన్నీ నీ మీదే వదిలిపెట్టేను. అన్నీ కలిసొచ్చాయి. ఇప్పుడు మన పిక్చరు రిలీజ్ కి ఏర్పాట్లయిపోయాయి" అన్నారు.
"డిస్ట్రిబ్యూషన్ ఎవరికిచ్చా రేమిటి?" అని అడిగాను.
"చమ్రియా సుందరలాల్ నహతాగారికే" అన్నారు.
