దూరంగా ఎక్కడో కోయిల కూస్తుంది.
ఆకాశంలో చంద్రుడు మేఘాల దుప్పటిని కప్పుకుంటున్నాడు.
"జయంతీ! వాతావరణం ఎంతో ప్రశాంతంగా వుంది కదూ?" అంది దాక్షాయణి.
"అవును పెద్దపిన్ని! ప్రస్తుతం చిన్నపిన్ని మనసులాగా" అంది జయంతి సీరియస్ గా.
"అబ్బ! ఎంత చక్కగా చెప్పావు జయంతీ! నిజంగానే నా మనసు ప్రశాంతంగా వుంది. మీ సాహచర్యంలో నేను సర్వస్వం మర్చిపోతాను. ఏంటో మొదటినుంచి అలా అలవాటైపోయింది. మీతో ఏకాంతంగా కబుర్లు చెప్పుకుందామనే నేను వచ్చింది" అంది శివపార్వతి.
"మేమూ పట్నం వచ్చేస్తాంలే చిన్నపిన్ని త్వరలో...." అంది జయంతి.
"నిజంగానా?!" అంది ఆశ్చర్యంగా శివపార్వతి.
"నిజంగానే-ఎందుకంటే ఈ ఏడాదితో రాము టెన్త్ క్లాస్ పూర్తవుతుంది. వాడు కూడా కాలేజిలో చేరిపోతాడు. శేఖర్, తులసిలు కూడా పట్నంలోనే చదువుకుంటున్నారు. నా ఉద్యోగం కూడా అక్కడే! అమ్మా, నాన్నల కోసమే ఇక్కడుండేది. పెద్దపిన్ని వాళ్ళ దుకాణం కూడా పట్నంలోనే....వీళ్ళు కూడా వచ్చేస్తే అందరం అక్కడకు చేరుకోవచ్చు.....కాకపోతే మరికొంత సమయం పడుతుంది. మా తదనంతరమే మీరు పట్నం వెళ్ళాలి, మా కట్టెలు ఇక్కడే దహనం కావాలి అంటుంది అమ్మ" చెప్పింది జయంతి.
"వాళ్ళ కోరిక కూడా సబబేగా" అంది శివపార్వతి.
"అందుకే కొంతకాలం యిక్కడే వుందామనుకుంటున్నాం" అంది జయంతి.
"మంచి ఆలోచనే! మీరు కూడా వచ్చేయండి దాక్షాయణి అక్కా" అంది శివపార్వతి.
"జయంతి వస్తే మేము కూడా వచ్చేస్తాం" అంది దాక్షాయణి.
"అబ్బా....నిజమా! అదే నిజమైతే నాకంటే సంతోషించేవాళ్ళు ఇంకేవరుండరు" అంది శివపార్వతి.
"ఏంచేస్తాం....మాకు ఈ పల్లేటురిని, వెన్నెలరాత్రుల్ని వదిలిపెట్టి రావాలనిలేదు. కానీ పొట్టకూటికోసం రాకతప్పదు" అంది జయంతి సీరియస్ గా.
"మహామహులందరి జివితనేపద్యం పల్లేటుల్లేగా....అందరూ అక్కడ్నుంచి వచ్చినవాళ్ళే అంది దాక్షాయణి.
"ఏంటో అక్క మాటలు కొత్తగా వుంటున్నాయి. నా కర్ధం కావటం లేదు" అంది శివపార్వతి.
"పెద్దపిన్ని చదువుకుంటుంది. నేనే చెబుతున్నాను. అమెచేత ప్రయివేట్గా డిగ్రీ చేయించాలనేదే నా కోరిక అంది జయంతి.
"నిజమా?! అబ్బ నువ్వెంత అదృష్టవంతురాలివక్కా......జయంతి నితోపాటే వుండటం వల్ల నీకు అన్ని విషయాలు చెపుతూ తగిన విధంగా ప్రోత్సహిస్తుంది అంది శివపార్వతి ఆనందంగా.
"పెద్దపిన్నె నన్ను ప్రోత్సహించింది, నేను ఆమెను ప్రోత్సహించటంలేదు" అంది జయంతి.
"ఒకరికోకరుగా ఉన్నారు. నాకెవరున్నారు చెప్పండి?" అంది దిగులుగ.
"అదేంటి చిన్నపిన్ని మేము లేమా?' అంది జయంతి.
"ఉన్నారు....కానీ దూరంగా వున్నారు" అంది పార్వతి.
"త్వరలో దగ్గరవుదాంలే" అంది జయంతి.
"ఆ. ఆశతోనే తిరిగి వెళతాను" అంది పార్వతి.
"పిల్లలు ఒక్కళ్ళు ఎలా వుంటారు పిన్నీ ఇంట్లో.....మీరిద్దరూ వచ్చేశారుగా" అంది జయంతి.
"మా అమ్మ వచ్చింది జయంతి. ఆమె వుంది పిల్లల దగ్గర" అంది పార్వతి.
"ఓహో....పోనిలే పట్నం వెళ్ళటంవల్ల నువ్వు అమ్మకు దగ్గరయ్యావు. ఇదివరకు ఇక్కడకు వచ్చేది కాదుగా....ఏడాదికోసారి వచ్చేది" అంది జయంతి.
"ఇదివరకంటే నాకు భయమే లేదు కదా? అందరం కలిసి వుండే వాళ్ళం. అమ్మకు నా విషయం దిగులుండేదే కాదు. నిశ్చింతగా ఉండేది. ఇప్పుడలా కాదు కదా?" అంది పార్వతి.
"అవున్లే" అంది జయంతి.
"పిల్లలు మమ్మల్ని తలుచుకుంటున్నారా? చిన్నపిన్ని అసలు పూర్తిగా మర్చిపోయారా?' అంది జయంతి.
"వాళ్ళకు మీరందరూ గుర్తే....ఎలా మర్చిపోతారు?" అంది పార్వతి.
"పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది" అంది దాక్షాయణి.
"అంతేగాని మీరు రారు కదా...నేనే రావాలి....ఎప్పుడూ" అంది పార్వతి సీరియస్ గా.
"మేము అక్కడకు రావడం కాదు, రావాలంటే అది కష్టం కూడా కాదు. పిల్లలు వస్తూ పోతూ వుంటే రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఒకరికొకరు మర్చిపోకుండా బంధుత్వాలు పదికాలాలపాటు నిలుస్తాయి. అనుబంధాలు, ఆత్మీయతలు అంతరించిపోకుండా వాటిని బ్రతికించుకునే బాధ్యత మనమీద ఉంది" అంది దాక్షాయణి.
శివపార్వతి మౌనంగా వుండిపోయింది.
"ఈ అయిదేళ్ళలో చిన్నపిన్ని పిల్లలు అమ్మమ్మకే దగ్గరయి వుంటారు. నానమ్మ తరపు వాళ్ళకి దూరమయ్యారు" అంది జయంతి.
"నేను ఎప్పటి కప్పుడు పిల్లల్ని తీసుకురావాలనే అనుకుంటూ పనుల వత్తిడి వల్ల కుదరక రోజులు గడిచి పోయాయి జయంతి. పిల్లలు మీరనుకుంటున్నట్లు మిమ్మల్ని మర్చిపోలేదు" అంది పార్వతి తనని తాను సమర్ధించుకుంటూ.
