Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 75


                                  ఈ భూమి మీద నేను

    ప్రారంభం ఎప్పుడూ కష్టమే. అపారమైన భాషా సముద్రం
    నుంచి అందమైన ఒకే ఒక మాటని. చావులేని శాశ్వత
    వాక్కుని. ఒకే ఒక్క ఉజ్జ్వలమైన మాటని ఎంచుకోవడం
    కష్టమే. ఒంటరి మానవుని బ్రతుకు ఎప్పుడూ ఒక్కటేమాట.
    ఒక్కటే పాట. ఒకే కథ. నవల. నాటిక. ప్రతి స్వప్నం
    మనం ఇంకా తర్జుమా చెయ్యని ఆ విశాల నిశీధ
    విజ్ఞానపు ఛందస్సులేని, వ్యాకరణంలేని సరిహద్దులు లేని
    భాషలో ఒకభాగం. విపులాచపృధ్వీః! పృథ్వితోబాటు అన్ని
    వస్తువులూ విస్తీర్ణమైనవే. నలభై అంతస్తులమేడ. నాలు
    గాకుల మొక్క. మనస్సూ, ఆత్మా అనుమతిస్తే నేత్రం నీ
    యిష్టమొచ్చినంత ఎత్తుకి ఎగరగలదు. మనస్సు కాలాన్ని
    ధ్వంసం చెయ్యగలదు. కాలం మరణానికి తమ్ముడు,
    తమ్ముడూ! మరణానికేకాదు ప్రాణానికికూడా! అన్నిటికన్నా    
    విశాలమైనది అహం. మానవజాతికి భీజం, దానితోబాటు
    సమస్త విశ్వానికీ, స్వర్గనరకాలకీ, భూమికీ, మానవుని
    వదనానికీ, నీ మొగానికీ నా మొగానికీ, మన నేత్రాలకీ
    ప్రారంభం. నా మట్టుకు నేను నమ్రభావంతో హర్షించ
    మంటాను.   
    ప్రాచీనమైన నగరంలో నవీనమైన యువకుణ్ణి నేను. తెల్లవారింది. ఒక చిన్నగదిలో కూర్చున్నాను. చపగ్గా కొనుక్కొచ్చిన రెండు దస్తాల కాగితాలను చూస్తూ కూర్చున్నాను. ఇవన్నీ తెల్లకాగితాలు. వీటిమీద ఏ భాషా ఇంకాపడలేదు. స్వచ్చంగా వున్నాయి. ఈ కాగితాలు. నేనొక యువక రచయితని. ఇక కథ రాయాలని ఉపక్రమిస్తున్నాను. ఇవాళ సోమవారం సెప్టెంబరు 25, 1933. బతికి ఉండడం ఎంత బాగుంది! ఇంకా ప్రాణంతో ఇలాగే మిగిలివుండడం. (నేను ముసలివాణ్ణి. అనేక వీధులలో, అనేక రంగాలలో, అనేక దినాలూ, రాత్రులూ సంచారం చేసినవాణ్ణి ఆఖరికి నా యింటికి నా దగ్గరకి వచ్చేశాను. నాకు ఎదురుగా వున్న ఈ గదిలో గోడమీద మా నాన్న ఫోటో వుంది. ఆయన చచ్చిపోయి చాలా కాలమయింది. అతని మొగంతో కళ్ళతో నేను పుట్టాను. నేను ఇంగ్లీషులో కథలు రాస్తున్నాను. అతనయితే మా ఆర్మీనియన్ భాషలో వ్రాసేవాడు. అయినా మేమిద్దరమూ ఒక్కటే వ్యక్తి. అతను చనిపోయాడు. నేను బతికున్నాను. అంతే భేదం) జోరుగా సిగరెట్టూ ఊదేస్తున్నాను. ఎంచేతనంటే ఈ తరుణం ఎంతో ముఖ్యమైనది. నాకేకాదు అందరికీ. ఎంచేతనంటే ఇప్పుడు నేనొక తెల్లని కాగితంమీద భాషని. నా భాషని పెట్టబోతున్నాను. అంచేత వొణుకుతున్నాను. మాటలని ఉపయోగించడం చాలా బాధ్యతతో కూడుకున్నపని. తప్పుమాట ఒక్కటీ నాకు చేయాలని లేదు. తెలివిగా కనబడాలనికూడా లేదు. తెలివి అంటే నాకు చెడ్డ భయం. ఈ కవితకాలంలో ఎప్పుడూ నేను తెలివిగా ప్రవర్తించలేదు. ఇప్పుడు జీవితంకన్నా ఎక్కువైనా రచనకి ఉపక్రమిస్తున్నాను. కాబట్టి ఒక్కటైనా కృత్రిమమైన మాటని ఉచ్చరించదలచుకోలేదు. నెలల తరబడి నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. "వినయం నేర్చుకో. విను. అన్నిటికన్నా మిన్నగా వినయాన్ని అలవాటుచేసుకో" అని. రచయితగా నా శీలాన్ని పోగొట్టుకోకూడదని నా పంతం.
    నేను కథలు రాస్తాను. కాని నేనెప్పుడు చెప్పినా ఒక్కటే కథ. మహితలంమీద మానవుని కథ. సూక్ష్మమైన ఈ కథని నా ధోరణిలో నేను చెప్పదలచుకున్నాను. రచనా కల్పానికి సంబంధించిన కట్టుబాట్లన్నిటినీ మరిచిపోదలచుకున్నాను. నేను చెప్పదలచుకున్నదేదో వుంది. దాన్ని బాల్జాక్ లాగ చెప్పాలనిఅలేదు. నేను శిల్పినికాను. నాగరికతలో నిజంగా నాకు నమ్మకం లేదు. అభివృద్ధి గురించి ఉత్సాహం ప్రకటించలేను. ఒక పెద్ద వంతెనను నిర్మించారని చప్పట్లు కొట్టలేను. విమానాలు అట్లాంటిక్ సముద్రాన్ని దాటాయని విన్నప్పుడు ఓహో! ఎంత అద్భుతమైన యుగంలో జీవిస్తున్నామో" అని నేను ఉప్పొంగిపోయాను. ఏం దేశం ఎలాపోతే నాకేం? చరిత్రంటే నాకు తలనొప్పి. చరిత్రకి అర్ధం ఏమిటి? దాన్ని చూసేవాళ్ళుగాని, అందులో విశ్వాసం వున్నవాళ్ళుగాని ఆ అర్థమేమిటో విడమరచి చెప్పగలరూ? తన బతుకు తాను బతుకుతున్నా అమాయకపు మానవుడు ఏ ఆశ్చర్యంవల్ల యిలాగ సారంలేని రాక్షసపు దస్తావేజులకోసం బలికావలసి వస్తోంది? వాడి ఏకత్వాన్ని ఎందుకపహరించారు. వాడి దేవత్వాన్ని ఎందుకపహసించారు? వాడిచేత ఎందుకిన్ని యుద్ధాలు, ఎందుకిన్ని నేరాలు చేయిస్తున్నారు? మరి నాకు వాణిజ్యంలో కూడా నమ్మకం లేదు. అన్ని యంత్రాలనీ నేను అసహ్యంగా చూస్తాను. మోటారుకారునీ, రైల్వే ఇంజన్నీ, విమానాన్నీ, ఆఖరికి బైసికిల్ని కూడా. ప్రయాణాలలో నాకు నమ్మకంలేదు. శరీరంతో చేసే ప్రయాణాలు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడకివెళ్తారో చెప్పమనండి చూదాం? నిన్ను వదలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళగలవు? జీవితం మీదుగా మనస్సుచేసే ప్రయాణంకంటే విశాలమైనదీ అమోఘమైనదీ ఇంకే ప్రయాణం వుంది? ఏ ప్రయాణపు ముగింపైనా మరణంకంటే ఇంపుగా వుంటుందీ?
    మానవుడంటే మాత్రమే నాకిష్టం. ప్రాణాన్ని నేను ప్రేమిస్తాను. మరణం సమక్షంలో శిరస్సు వంచుతాను. భౌతిక మరణం అంటే నాకు భయంలేదు. ఈనాడు నేనూ, మా నాన్నా ఈ శరీరంలో జీవిస్తున్నామన్న మాట నిజంకాదూ? మానవుని గతమంతా నా శరీరంలో నిక్షిప్తమయిందన్నమాట నిజం. కాని హింసని నేను మెచ్చుకోలేను. హింస తరపున నిలబడేవాళ్ళని శపించడం నేను మానలేను. ఒక మనిషి సహజంగా చనిపోవడంకన్నా వాడి చిటికెనవ్రేలి కొక చిన్న దెబ్బతగలడం చాలా దారుణం అంటాను. ఇక పెద్ద పెద్ద యుద్ధాలలో వేనవేల మనుష్యులు పరస్పర సంహారకాండలో పడిపోయినప్పుడు నాకు విచారంతో పిచ్చెత్తిపోతుంది. ఒళ్ళు తెలియని కోపం వచ్చేస్తుంది. భాష ఒక్కటే నాకున్న ఆయుధం. ఇది మరఫిరంగులకంటె శక్తివంతమైనదని నాకు తెలుసును గాని యుద్ధ ప్రచారకులు మానవులలో రెచ్చగొట్టే ఈ ఉద్దేశాన్ని నేనొక్కణ్ణే హతమార్చలేనందుకు విషణ్ణత పొందుతాను. నా రచనలలో కూడా ప్రచారం లేకపోలేదు. మానవుని సహజ సౌమనస్యం మానవుని కప్పగించడమే నేను చెయ్యగల ప్రచారం. మూకనుంచి విడదీసి మానవుణ్ణి వాడి ఒంట్లోకి, వాడి ఇంట్లోకి పంపించి వెయ్యడమే నా ఆశయం. చారిత్రిక దుస్స్వప్నంనుంచి మానవుణ్ణి విడిపించి వాడి సొంత నిద్రలోని తియ్యని కలలకి కామందుని చెయ్యడమే నాపని. అదే వాడి అసలైన సిసలైన ఇతిహాసం. వాడు తన్ను తాను తెలుసుకోగలిగితే చాలు. పశువుల్ని మందలుగా తోలవచ్చు. మనిషిని మందలో కప్పెడితే దేవుడికే నొప్పెడుతుంది. అంతకన్న అమంగళం ఇంకోటి ఉండదు.
    నడిమిరకం వాళ్ళంటే నాకు పడదు. నిజాయితీ వున్న మనిషికి చదువులేకపోయినా ఫర్వాలేదు. వాణ్ని ప్రేమించగలను. కాని దగాచేసే విద్వాంసుణ్ణి తిట్టక తప్పదు. నా జీవితమంతా నియమాలనీ, సంప్రదాయాలనీ, శైలినీ హేళనచేస్తూ వచ్చాను. మానవుని వంటి అమేయ నిర్మాణానికి నియమాలెక్కడ? ప్రతి జీవితం ఒక వ్యత్యాసం. ఒక కొత్త సత్యం ఒక కొత్త విచిత్రం. మోసంలో కూడా మజాలేకపోలేదు. నేను వేదాంతిని కాను. తత్వాలలో నాకు నమ్మకం లేదు. ఆ మాటంటేనే నాకు అనుమానం కలుగుతుంది. తానన్న దానిని కాదనే హక్కు మానవుడికుందంటాను. మాటవరసకి, ఇప్పుడిప్పుడే నేను యంత్రాలంటే అసహ్యించుకుంటానన్నాను కాదూ? కాని నా టైపురైటరును దేవతలాగ కొలుచుకుంటాను. నా వస్తువులన్నింటిలోకీ అదే నాకు అత్యంత ప్రియమైనది.
    ఇదిగో ఇప్పుడు నేను చెప్పదలచుకున్న కథలోకి దిగుతున్నాను. ఇది నా గురించీ, నా టైపురైటరు గురించీ! ఇది బహుశా నిస్సారమైనదే కావచ్చు. కావలిస్తే మీరింతకన్న మంచికథలను ఖరీదైన జాతీయ మాసపత్రికలలో చదవగలరు. వాటినిండా వల్లమానినంత శిల్పసౌందర్యం, శృంగారం, ఉద్రేకం, ఉత్సాహం ఉండవచ్చు. ఎల్మర్ ఫౌలర్, విల్ ఫ్రెడ్ డిగ్గెన్స్ మొదలైన పురుషులను గురించీ, ఫ్లారెన్స్ ఫార్వెల్, అగాథాహ్యూమ్ మొదలైన స్త్రీలను గురించీ ఆ కథలలో చదవవచ్చు.
    ఈ పత్రికలు తిరగేస్తే మీకు ఎన్నైనా చక్కని కథలు కనబడవచ్చు. అన్నీ సర్వాంగ సుందరమైనవే. చక్కని కల్పన, వాతావరణం, భావన, శైలి, శీలం ఇంకా మంచికథకి కావలసిన ఎన్నో లక్షణాలు వీటికుంటాయి. కూరలో కల్తీలేని నెయ్యి, మసాలా, జీడిపప్పు మొదలైనవున్నట్లు (దయచేసి మరోలా అనుకోకండి. నన్ను నేను మరచిపోయి తెలివితేటలు ప్రదర్శిస్తున్నాననీ, ఈ కథలనీ వెక్కిరిస్తున్నాననీ అనుకోవద్దు. ఈ కథలూ, వీటిని చదివే ప్రజలూ కలిస్తేనే ఈనాటి అమెరికన్ వాస్తవికత. హాలీవుడ్ సినిమాలూ, వాటిని రోజూ చూస్తూ కలలుకనే జనులూ కలిస్తే నవలారచయితకి కావలసినంత కథా వస్తువు. ఒక సంగతి ఒప్పుకోవాలి. తరుచు నా దగ్గర డబ్బులుండవుగాని తప్పిజారి ఎప్పుడైనా సినిమా చూడడానికి వెళ్ళానంటే చూసే చిత్రంకంటే చుట్టూ ఉన్న ప్రజలే నా కళ్ళంట నీళ్ళు తెప్పించుతారు. ఇక వార్తా చిత్రాలు నన్నెంత తీవ్రంగా కలవరపెడతాయో చెప్పలేను. వరదలూ, మంటలూ, తుఫానులూ, రైలు ప్రమాదాలూ, సమ్మెలూ, యుద్ధాలూ, రాజకీయ నాయకుల ముఖాలూ చూస్తూ ఉంటే నిజంగా ఏడుపే వస్తుంది. ఆఖరికి మిక్కీ మౌస్ పడే బాధలు కూడా నా హృదయాన్ని కలచివేస్తాయి. ఏమంటే అది వుత్త కల్పన అయినా కృత్రిమమే అయినా మానవునికి చిహ్నంగా మిక్కీ మౌస్ ను నేను స్వీకరిస్తాను.) కాబట్టి నన్ను అపార్థం చేసుకోకండి. నేనెవరినీ హేళనచేస్తూ రాయలేదు. ఇంతకీ హేళన చెయ్యడానికేంవుంది? దాంభికమైనదీ, మోసమైనదీ దానంతటదే నవ్వు పుట్టిస్తుంది. ప్రస్తుతం నేను చెప్పదలచుకున్నదల్లా నేనొక రచయితనని, కథలు రాస్తానని. దేశంలోని పత్రికలన్నీ నాకథల కోసం కనిపెట్టుకుని కూర్చున్నట్లుగా. నేనేది రాస్తే దాన్ని ఎంత డబ్బైనా యిచ్చి కొనడానికి సిద్ధమైనట్టుగా భావించి రాసేస్తున్నాను. ఇలా సిగిరెట్టు మీద సిగిరెట్టు తగలేస్తూ ఈగదిలో కూర్చున్నాను. అవతల నాకన్నా సమర్థులైన సమకాలికులు రాస్తున్న కథల ముందు నా కథ పోటీకి నిలవగలదో లేదో అని భయపడుతున్నాను. వింతగా లేదూ? అయినా కథారచయితనైన నేను ఈ టైపురైటరంటే ఇంత పడిచావడమేమిటి? దీనివల్ల నాకేం లాభం? ఇంతకూ ఈ రచనల వల్ల నాకేం తృప్తి కలుగుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS