"ఏం, మీరు మగాళ్ళు కాదూ? మీకు చేతుల్లేవూ?"
మెరుపులా రామదాసు తన మనుషల్తో రామకృష్ణయ్యమీద పడ్డాడు. మరుక్షణంలో ఇద్దరు వస్తాదులు, మరో నలుగుర్ని వెంటబెట్టుకుని గదిలోకి జొరపడ్డారు. రెండునిమిషాల్లో ఆఫీసు గదిలోని ఫర్నీచరంతా విరిగి కూలిపోయింది. పది ఆంబోతులు ఒక్కసారి తలబడి కుమ్ముకుంటున్నట్టుగా వుంది! ఎవరు ఎవర్ని కొడుతున్నారో తెలియడంలేదు. అందిన వాడిని, అందినచోటల్లా కుమ్ముతున్నారు.
కేకలూ! పెడబొబ్బలుఁ! శ్రీ రామచంద్రుడి పోష్టరు మీద చిక్కటి రక్తం చిమ్మింది. కిందపడ్డవాళ్ళు కిందపడగా ఉన్నవాళ్లు తన్నుకొంటున్నారు. ఆఫీసు గదిలో ప్రారంభం అయిన దెబ్బలాట, ఆఫీసు ముందు ఆవరణదాకా పాకింది. మత్తగజాల కాళ్ళ దగ్గిర చిక్కిపోయిన లేడిపిల్లలా అయిపోయింది వరూధిని. తన్నుకొంటూ తన మీదకు పడుతున్న వాళ్ళను తప్పించుకొంటూ, కంపించిపోతూ గోడకు వదిగి వదిగి నిలబడింది వరూధిని.
వెంకటపతి భార్యను ఛాతీకి హత్తుకొని అతి కష్టం మీద గదిలోనుంచి బయటకు తీసుకొచ్చాడు.
తెరమీద శ్రీ రాముడు శివధనుస్సును విరిచాడు. సీత రాముడి మెళ్ళో దండవేస్తుంది. థియేటర్లో కూర్చున్నవాళ్ళు గగ్గోలుగా లేచారు. ఆఫీసు గదిముందునుంచి దెబ్బలాట, థియేటరు గేట్లదాకా వచ్చేసరికి జనం ఒక్క పెట్టున లేచారు! ఆడవాళ్ళూ, పిల్లలూ ఒకటే అరుపులూ - ఏడుపులూ ఆపరేటర్ కు ఇంజన్ రొదలో కింద జరుగుతుందేమీ విన్పించలేదు. ఫిల్మ్ నడుస్తోనే వుంది. తెరమీద జనక మహారాజు, దశరథ మహారాజు ఆనందబాష్పాలు విడుస్తున్నారు.
సీత రాముడి కళ్ళలోకి చూసింది.
లోకోత్తరుడైన శ్రీ రామచంద్రుడు - హాల్లో త్రొక్కివేయబడుతోన్న పిల్లల ఆక్రందనలూ, హాహాకారాల మధ్య సీత ముగ్ధసౌందర్యాన్ని మైమరచి చూస్తోన్నాడు.
వరూధిని భర్తతో ఇంటికి చేరింది. అప్పటుకి పదిదాటి పోయింది. వెంకటపతికి పెద్దగా దెబ్బలేమీ తగలలేదు.
వరూధిని మెదడంతా ఓ చీకటి గుహలా అయిపోయింది! ఏదీ నిలకడగా ఆలోచించలేకపోతూంది. జరిగిందంతా ఓ పీడకలలా మాత్రం జ్ఞాపకం ఉంది.
"మీకేం దెబ్బలు తగల్లేదుగా?" భర్తను అడిగింది.
గూడూ, తలా రుద్దుకుంటూ "పెద్దగా ఏం తగిలినట్టు లేదులే!" అన్నాడు. వెంకటపతి.
"రామకృష్ణయ్య ముందే ఇదంతా పథకం వేసుకొచ్చాడన్న మాట!" పెదవి కొరుక్కొని అన్నది వరూధిని.
"రామనాధబాబుకు కబురుచేస్తే మంచిదేమో?" అతడయితే బావమర్ది అంతు తేల్చుకుంటాడన్న ఆశతో అన్నాడు వెంకటపతి.
భర్త సలహా మొదటిసారిగా వరూథినికి నచ్చింది ఇదేనేమో!
ఆ రాత్రి వరూధిని స్వయంగా భర్తకు గ్లాసులోని విస్కీ తన చేతుల్తో ఇచ్చింది. అతను తాగినంత కసురుకోకుండా ఇచ్చింది.
బాగా తాగి, తిని, వళ్ళు నెప్పులు మర్చి హాయిగా నిద్రపోతున్న భర్తమీద వరూధిని హృదయంలో మొదటిసారిగా ప్రేమాభిమానాలు పొంగినై.
బాగా పొద్దెక్కి లేచిన వరూధినికి తల పగిలిపోతున్నట్టుగా వంది. అప్పటికే వెంకటపతి బయటికి వెళ్ళిపోయాడు. రెండు అనాసిన్ బిళ్ళలు వేసుకొని కాఫీ తాగి మళ్ళీ వరూధిని పడుకొంది.
మధ్యాహ్నానికి వరూథిని తలనొప్పి తగ్గిపోయింది. స్నానం చేసి వస్తుండగా వెంకటపతి ఇంటికొచ్చాడు.
"కొండలరావు తలకు తగిలిందంట. వెంకులుకు చెయ్యి విరిగింది. రామదాసు వాళ్ళను ఆస్పత్రిలో చేర్పించాడు."
"రామనాథబాబు ఊళ్ళో ఉన్నాడా?" వరూధిని భర్తను అడిగింది.
"ఇంకా రాలేదట. రెండురోజుల్లో వస్తాడని తెల్సింది."
"రామదాసు ఎలా ఉన్నాడు?"
"వస్తానన్నాడే? రాలేదా?" అన్నాడు వెంకటపతి.
వెనక్కు తిరిగి చూసి "అదిగో, వస్తున్నాడు రామదాసు" అన్నాడు మళ్ళీ.
రామదాసు నడ్డి పట్టుకొని వంకరగా నడుస్తూ లోపలకొచ్చాడు. మెడ పక్కకు పెట్టి చూస్తూ నిలబడ్డాడు.
వరూధిని రామదాసును కూర్చోమని సోఫా చూపింది.
"వాళ్ళంతా వచ్చారా?" అడిగింది.
"ఎవరూ?" అన్నాడు రామదాసు మెడతోపాటు మనిషీ తిరుగుతూ.
"ఆర్టిస్టులు, శతదినోత్సవానికి రావల్సినవాళ్ళు."
"ఇంకేం శతదినోత్సవం అమ్మా! రాత్రికి రాత్రే సత్యనారాయణ టాకీస్ వాళ్ళు అందరికీ ఫోన్లుచేసి చెప్పారు .... వరూథినీ పిక్చర్ ప్యాలెస్ తగాదాల్లో పడిందనీ, వస్తే రైటింగులు జరుగుతై అనీ!"
"ఆ కిష్టిగాడే చేయించాడా?"
కిష్టిగాడంటే రామకృష్ణయ్య అని అర్ధం చేసుకోటానికి రామదాసుకు సమయం పట్టింది.
"సత్యనారాయణ టాకీస్ వాళ్ళుమాత్రం తక్కువ వాళ్ళా? మన థియేటర్ రాకముందు వాళ్ళదే టౌన్లో లీడింగ్. ఇప్పుడు వెనకపడిందిగా! అందుకే వాళ్ళకు మనమీద ఏడుపు." రామదాసు చెప్పాడు.
"రాత్రికి మళ్ళీవచ్చి అల్లరేం చెయ్యరు గదా?" వెంకటపతి రామదాసును అడిగాడు.
"ఏడ్చారు, ఇంకేం చేస్తారు? రాత్రి మనం తయారయిలేము గనుక అట్లా అల్లకల్లోలం చెయ్యగలిగారు. రామకృష్ణయ్యగాడ్ని మరో ఇద్దర్నీ పోలీసులు లాకప్ లోకి తీసుకొన్నారుగా? ఇంకెవడొస్తాడు మన హాలు మీదకు అంత ధైర్యం చేసి? ఆ శివరాంగాడ్ని హాల్లో అడుగుపెట్టనివ్వొద్దు!" అన్నది వరూధిని.
"వాడ్ని ఇంకా థియేటర్ ముందుకు రానిస్తానా? వస్తే మెడపెట్టి గెంటిస్తా!" అన్నాడు రామదాసు.
"అంతే! ఆ పనే చెయ్! ఎవడడ్డొస్తాడో చూద్దాం! రాత్రికి నేను రావాలా?
వంట్లో బాగాలేదు. జ్వరం వచ్చినట్టుగా వుంది" అంది వరూధిని రామదాసుతో.
"మీరెందుకమ్మా! అంతా నేను చూసుకొంటాగా? రెండో ఆట బుకింగ్ అయిపోగానే డబ్బు తెచ్చి మీకప్పచెప్తే సరిగదా?" భరోసా ఇస్తూ చెప్పాడు రామదాసు.
నడుంపట్టుకొని లేచి నిలబడ్డ రామదాసును చూస్తూ "డాక్టరుకు చూపించకూడదూ?" అన్నది వరూధిని.
"డాక్టరుదాకా ఎందుకమ్మా? అదేపోతుంది. ఆ గదిలో అమాంతంగా నలుగురొచ్చిపడితే చెయ్యీ కాలూ ఆడలేదు. నెరాబాలో అయితేనా, నాకొడుకుల్ని" రామదాసు తర్వాతమాట మింగేశాడు.
"నెరాబాలో అయితే కాలికొద్దీ పరుగెత్తేవాడు ఈ రామదాసుగాడు!" అనుకొన్నాడు వెంకటపతి ... దెబ్బలాట జరిగినప్పుడు రామదాసు తిన్న దెబ్బలు గుర్తొచ్చి. ఏ మాట కామాట, వెంకులూ, కొండల్రావే గట్టిగా నిలబడ్డారు. తను మాత్రం ఊరుకున్నాడా? ఇద్దర్ని గట్టిగా జబిరాడు.
"వెంకటపతిగారూ! ఇప్పుడొస్తారా. కాసేపాగివస్తారా?" రామదాసు వెళ్ళబోతూ అడిగాడు.
"అన్నం తిని వస్తా, నువ్వు పద!" అన్నాడు వెంకటపతి.
ఆరుగంటలవుతుంది. వరూధిని ఇంటిదగ్గరే ఉంది. కాని ఆమె మనస్సంతా హాలుమీదే వుంది. అక్కడేం జరుగుతుందో అన్న ఆలోచన ఆమె మనసులో పాములా తిరుగుతున్నది.
సాయంత్రం ఆరున్నర అవుతుండగా రామదాసు మరో హాలు వర్కర్ను వెంటబెట్టుకొని రొప్పుకుంటూ వచ్చాడు.
"అంతా అయిపోయింది! హాలును వాళ్ళు స్వాధీనం చేసుకొన్నారు. మన చేతులు దాటిపోయింది." వగరుస్తూ చెప్పాడు రామదాసు.
అది విన్న వరూథినికి కాళ్ళకింద భూమి కదిలినట్లయింది. రక్తం గడ్డకట్టుకు పోతున్నట్టయింది.
"పోలీసులున్నారుగా? అదెట్లా జరిగిందీ?" వరూధిని తెప్పరిల్లుకొని అడిగింది.
"ఐదున్నరకు పోలీసులందరూ వెళ్ళిపోయారు. రామకృష్ణయ్యనుకూడా వదిలేశారు."
"పోలీసోళ్ళకి లంచం పెట్టి విడిపించుకొని వుంటాడు!"
"ఏం జరిగిందో ఏమో? రామకృష్ణయ్యతోపాటు యస్సైకూడా వచ్చాడు. యస్సైవచ్చి రాత్రినుంచి బందోబస్తులోవున్న పోలీసుల్ని పంపించివేశాడు. రామకృష్ణయ్య ఇరవైమంది మనుషుల్తో వచ్చి హాలుమాదే నంటూ ఆక్రమించుకొన్నాడు."

