"అబద్ధం చెప్పడం చేతకాదన్నారుగా?"
"నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను సరోజా! ప్రేమ వేరు_పెళ్ళి వేరు. ప్రేమించి పెళ్ళిచేసుకున్నానంటే అర్ధం ఏమిటి? నా జీవితంలో ప్రేమ అంటే ఏమిటో నీ వల్లే తెలుసుకున్నాను. ఎంతమందితో నువ్వుపోయావని నిన్నెవరయినా అడిగితే నాకు నువ్వే వస్తుంది. నేనెవర్నీ ప్రేమించలేదు.
కమలని ఒకామె వుండేది. మేమిద్దరం ఒకర్నొకరం చూసుకోకుండానే ఓ సంవత్సరంపాటు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు జరుపుకున్నాం. తర్వాత ఆమెను చూశాననుకో. మా ముసల్దాని అనుమతితో ఆమెను పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నాను. కానీ తప్పిపోయింది" అన్నారు.
"మరి సంవత్సరంపాటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకొని పెళ్ళిదాకా వచ్చినవాళ్ళు ఆవిడ్ని ఎలా వదిలేశారు?" అని అడిగాను.
"వదిలేయడం ఏమిటి? చేసుకుందామనుకున్నాను. జరగలేదు. అంతే_
ఆవిడ పెళ్ళి చేసుకొని ఒక కొడుకును కూడా కంది" అన్నారు.
"అంటే మీరామెను ప్రేమించలేదా?" అని అడిగాను.
"లేదు" అన్నారు.
"మరి మీ ఆవిడని?" అని అడిగాను.
"అది పెద్దలు చూసి ఏర్పాటు చేసిన పెళ్ళి సరోజా! ముందే చెప్పానుగా ప్రేమ వేరు, పెళ్ళి వేరు అని. నిన్ను చూసిన తర్వాత నీతో పరిచయమైన తొలి రోజుల్లోనే నాలో వుండే సుఖవ్యాధుల్ని తరిమెయ్యాలనిపించింది. నీకు తెలియకుండా డాక్టర్ కృష్ణగారి దగ్గరికి వెళ్ళి నా అభిప్రాయం చెప్పాను. 'దానికో పూర్తి కోర్స్ వుంది. ఓ వారం రోజులు ఇంజక్షన్ లు తీసుకోవాల'న్నారు. రెండుపూటలా ఇంజక్షన్ లు తీసుకున్నాను. తర్వాత నీకు తెలిసి ఆ మూలవ్యాధి బాధ కూడా నివారణ అయింది" అని అంటూవుండగా బోయ్ వచ్చాడు. బీర్లు, విస్కీ వగైరాలు పెట్టేసి వెళ్ళిపోయాడు.
"టేబిల్ మీదున్న గ్లాసు తీసుకురా" అన్నారు.
"దేనికి?" అని అడిగాను.
"చెప్పినపని చెయ్యి సరోజా! అడ్డు ప్రశ్నలు వెయ్యకు" అన్నారు.
బుద్ధిగా వెళ్ళి తెచ్చాను.
మళ్ళీ బోయ్ వచ్చి చికెన్, గుడ్లుతో నాన్ విజిటేదియన్ మీల్స్ ఒకటి, చపాతీ డాలుతో విజిటేరియన్ మీల్స్ ఒకటి పెట్టేసి వెళ్ళిపోయాడు.
శ్రీశ్రీగారు గ్లాసులో బీరు పోసి, "తీసుకో సరోజా!" అన్నారు.
తీసుకోనని చాలాసేపు అల్లరిపెట్టాను. చివరికి ఓడిపోయాను.
ఓ గ్లాసు ముక్కు మూసుకుని గడగడ తాగేశారు. కసగా ఉన్నట్టనిపించింది. మొదట ఐదు నిమిషాలు ఏం కాలేదు. త్రేన్పులు మాత్రం వచ్చాయి. మళ్ళీ మరో గ్లాసు పోశారు. నెత్తీ నోరూ మొత్తుకున్నా వినలేదు. నాకూ ఏదోలా వుండడం ప్రారంభించింది. రెండో గ్లాసు కూడా తాగేశాను. అంతే. దానితో వికారం ప్రారంభమయింది. కళ్ళు తిరగడం ప్రారంభించాయి. ఏం మాట్లాడుతున్నానో నాకే అర్ధం కావడంలేదు. అరగంట కూడా కాలేదు. భళ్ళున వాంతి చేసేశాను. గోడమీదా, కిందా కూడా వాంతే! లేస్తే పడిపోయేట్టున్నాను.
పాపం_వారు ఓ గుడ్డ తీసుకుని గోడమీదా కిందా అంతా తుడిచారు. అన్నం తినమన్నారు. 'సయించలేదు' అన్నాను. 'అదే సయిస్తుంది తిను' అన్నారు.
"అన్నం తింటే మళ్ళీ వాంతి అవుతుందేమో! కడుపులో తిప్పేస్తోంది. తల కూడా నొప్పిగా వుంది. మీరు అన్నం తినండి" అని మంచంమీద వాలిపోయాను.
తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు. మర్నాడు నాకు తెలివి వచ్చేసరికి పది గంటలయింది.
"బాగా నిద్రపోయావా?" అని అడిగారు.
లేస్తూనే గొడవ ప్రారంభించాను. "చూడండి. మీరు ఎంతయినా తాగండి. నాకు మాత్రం అలవాటు చెయ్యకండి" అంటూ ఏడుపు ప్రారంభించాను. "సరే సరోజా! ఆ మాత్రం దానికి ఏడుపెందుకూ? నీ కిష్టం లేకుంటే మానెయ్యి. నిన్ను బలవంత పెట్టనులే" అన్నారు.
"నన్ను బలవంతం పెట్టడం కాదు. మీరు కూడా రాత్రిళ్ళు మాత్రమే తాగాలి. పగలంతా తాగి తందనాలాడతానంటే ఇంటికి పోదాం పదండి.
ఈ మాత్రం సౌభాగ్యానికి బెంగుళూరెందుకు రావడం?" అన్నాను.
"అలాగే_పగలు తాగనులే" అన్నారు.
మా స్నానాలు, టిఫిన్లయ్యేసరికి దగ్గిర దగ్గిర పన్నెండు గంటలయింది. ఇద్దరం రూము తాళం వేసుకొని ఆటోలో బయలుదేరాం. బెంగుళూరంతా ఓ రౌండ్ కొట్టాం.
శ్రీ పట్టాభిగారు అప్పుడు బెంగుళూరులోనే వున్నారు. వారింటికి వెళ్ళాం. శ్రీశ్రీగారిని చూడగానే ఆయన ఎంతో పొంగిపోయారు. ఆ పూట వారింట్లోనే భోజనాలు చేశాం.
అక్కడ నుండి ఊడిపడేసరికి నాలుగు గంటలయింది.
"రేపు మైసూరు వెళదామా?" అని అడిగారు.
"ఎందుకులెండి" అన్నాను.
వచ్చినదారినే మరోసారి రౌండ్ కొట్టి రూముకి చేరుకున్నాం. బోయ్ చేత బాటిల్ తెప్పించారు.
"ఇప్పుడు తాగితే ఒప్పుకోను" అన్నాను.
"సరే_నువ్వు తాగమన్నప్పుడే తాగుతానులే" అన్నారు.
బాటిల్ దాచేశాను.
"అబ్బా! దాచకు సరోజా! దాన్నక్కడే ఆ టేబిల్ మీదే వుండనీ, తాగనంటే తాగను. నా సంగతి నీకింకా తెలియదు" అన్నారు.
"తెలియకేమండీ బాబూ! పూర్తిగా కాకున్నా కొంతవరకైనా తెలుసుకున్నాను. కానీ ఇప్పుడేమిటి మన ప్రోగ్రాం?" అని అడిగాను.
"సినిమాకి వెళదామా" అని అడిగారు.
ఇద్దరం కాఫీ టిఫిన్ చేసి సినిమాకి వెళ్ళాం. ఆ మూడు రోజులుగా బెంగుళూరులో గడిపి మద్రాసు చేరుకున్నాం. గొడవలేమీ లేవు. ఎవరిళ్ళలో వాళ్ళం హాయిగా ఉంటున్నాం. రెండు మూడుసార్లు రవణమ్మగారు రమ్మని కబురు చేశారు. కారణాంతరాలవల్ల నేను వెళ్ళలేకపోయాను.
1959 వ సంవత్సరం ప్రవేశించింది.
నాకు ఒంట్లో బాగుండడంలేదు .డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పారు.
