"జయంతీ! బావున్నావా?" అంది శివపార్వతి లేచి ఎదురువచ్చి.
"బావున్నాను చిన్నపిన్ని! ఎప్పుడొచ్చావు నువ్వు?" అంది ఆశ్చర్యంగా చూస్తూ.
"మధ్యాహ్నం" అంది నవ్వుతూ.
"ఏంటి ఇంతలావు అయ్యావు? నిన్ను చూసి ఆరునెలలు కావొస్తుంది. మరీ ఇంత లావు అయితే ఎలా?" అంది జయంతి నవ్వుతూ.
"ఆ మాదేముందిలేమ్మా! ముసలివాళ్ళమయిపోతున్నాం. ఏదో పిల్లల కోసం జీవిస్తున్నాం అంతే" అంది నవ్వుతూ.
"అదేంటి పిన్నీ! నీ వయసెంత? నాకంటే ఆరేడు ఏళ్ళు పెద్దదానివి అంతేగా! అప్పుడే జీవితం మీద విరక్తి పుడితే ఎలా?" అంది జయంతి నవ్వుతూ.
ఆమె మాటలకు దాక్షాయణి కూడా నవ్వింది.
"పెద్దపిన్ని చూడు చక్కగా మెయిన్ టైన్ చేస్తుంది. అప్పుడెలా వుందో ఇప్పటికి అలానే వుంది. కాకపోతే కొంచెం లావయింది. వయసుకు తగినట్లు ఆమాత్రం లావుండాలి. నువ్వు పట్నంలో వుంటూ కూడా బాడిని మెయిన్ టెయిన్ చేయలేకపోతే ఎలా?" అంది జయంతి వాళ్ళ పక్కనే కూర్చుని.
"ఇప్పుడు నా సౌదర్యపోషణ గూర్చి ఎందుకు జయంతీ! మీ బాబాయ్ కి ఇలాగే లావుగా వుండటమే ఇష్టమట. అందుకే నేను పట్టించుకోలేదు" అంది పార్వతి.
"చిన్నపిన్ని మాటలు ఏమి మారలేదు. అన్నీ బాబాయ్ మీదకే నెట్టేస్తుంది. బాబాయ్ అలా అని మాత్రం అనడు" అంది జయంతి.
"సరేలే....నా సంగతి వదిలేయ్....నువ్వేంటి ఇక పెళ్ళిచేసుకోవా?" అంది పార్వతి.
"ఎందుకు? లావవ్వటానికా నీలాగా?!" అంది జయంతి నవ్వుతూ.
"చుడక్కా! జయంతి నన్ను ఎలా ఎగతాళిచేస్తుందో" అంది బుంగమూతి పెట్టి.
"అబ్బ! ఆ బుంగమూతి పెట్టటం మాత్రం చిన్నపిన్ని మానలేదు"అంది జయంతి.
"ఏంటే గుమ్మంలోనే కూర్చుని మాట్లాడుకుంటున్నారు? లోపలికి రారా" అంది కస్తూరి అప్పుడే గుమ్మలోకి వచ్చి.
"పద జయంతీ! లోపలికి వెళదాం....కస్తురక్క వేడి వేడి పకోడీలు ఇస్తుంది....ఉల్లిపాయ పకోడీలు బ్రహ్మాండంగా ఉన్ని" అంది దాక్షాయణి.
"చిన్నపిన్ని కోసం చేసిందా స్పెషల్ గా" అంది జయంతి ఆమెను ఏడిపించాలని.
"నాకోసం ఏంకాదులేమ్మా, నీకోసమే, ఉద్యోగం చేసి అలసిపోయి వస్తావు కదా! అందుకని పాపం అక్క శ్రమ పడి చేసింది" అంది శివపార్వతి.
"సరే అలాగే అనుకోవే....నా కూతురి కోసమే చేశాను నీకోసం కాదు, సరేనా?" అంది కస్తూరి.
శివపార్వతి నవ్వుతూ "ఏ మాటకామాట చెప్పుకోవాలి పకోడీలు అద్భుతంగా వున్నాయి జయంతీ" అంది శివపార్వతి.
"అవి నీకిష్టమని తెలుసు పిన్ని, నీకోసమే చేసింది అమ్మా, ఆ విషయం ఒప్పుకోవే నువ్వు" అంది నవ్వుతూ.
"అవును నాకోసమే చేసింది....ఏంటి? చేయకుడడా.....?" అంది పార్వతి.
"అలాని నేనెందుకంటాను. భలేదానివే...ఇంకా నీకు ఏమేమి ఇష్టమో అవన్నీ చేయించుకో అమ్మచేత కాదన్నదెవరు?" అంది జయంతి చీర మార్చుకుంటూ.
"ఇవిగో జయంతీ! ఇవి తిను.....తరువాత కాఫీ యిస్తాను" అంది కస్తూరి.
"శేఖర్ ఇంకా కాలేజి నుంచి రాలేదా అమ్మా" అడిగింది జయంతి.
"రాలేదమ్మా! వాడప్పుడే వస్తాడా? ఈమధ్య వాడికి పెత్తనాలేక్కువయ్యాయి. నువ్వే వాడికి అలుసు యిస్తున్నావు" అంది కస్తూరి నిష్టూరంగా
"పోనిలేమ్మా, కాలేజిలో చదివేవాడికి ఆమాత్రం స్వేచ్చ లేకపోతే ఎలా?" అంది జయంతి.
"ఇంకేంటి చిన్నపిన్ని కబుర్లు? రా ఇలా కూర్చో మంచం పైన చాలాకాలానికి మేము గుర్తొచ్చినట్లున్నాం" అంది జయంతి దాక్షాయణిని చూస్తూ నవ్వి.
దాక్షాయణి కూడా నవ్వింది.
"మీరిద్దరూ కలిసి నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను మిమ్మల్ని మర్చిపోయానని, నేనసలు ఇకముందు రాన్లే" అంది మళ్ళీ బుంగమూతి పెట్టి.
"అబ్బో బుంగమూతి పెడితే మా చిన్నపిన్ని ఎంత బావుంటుందో!" అంది జయంతి ఆమెను ఉడికిస్తూ.
"చుడక్కా! నీ కూతురు నన్నెలా ఏడిపిస్తుందో" అంది పిర్యాదు చేస్తున్నట్లు శివపార్వతి.
"ఊరుకోవే పాపం! అది రాక రాకవస్తే అలా ఏడిపిస్తావెందుకు?" అంది కస్తూరి మందలింపుగా.
"నువ్వొక్కదానివే వచ్చావా పిన్నీ! బాబాయ్ రాలేదా?" అంది జయంతి.
"నేనొక్కదాన్నే ఎలా వస్తాను? మీ బాబాయ్ కూడా వచ్చారు.....సెంటర్ వరకు వెళ్ళొస్తానని వెళ్ళారు" అంది పార్వతి.
41
ఆరోజు రాత్రి భోజనాలు ముగించుకుని జయంతి, దాక్షాయణి, శివపార్వతి ముగ్గురూ డాబాపైన వెన్నెల్లో, దుప్పట్లు పర్చుకుని పడుకున్నారు. మేము కబుర్లు చెప్పుకుని వచ్చేవరకూ నువ్వు మేల్కొని వుండోద్దు పడుకోమ్మా" అని చెప్పి పైకి వచ్చింది జయంతి.
"అబ్బ! ఇలా వెన్నెల్లో తడుస్తూ మన డాబా పైన పడుకుని ఎన్నాళ్ళయిందే జయంతి! ప్రాణం లేచివచ్చినట్లుంది" అంది పార్వతి.
"అవును చిన్నపిన్ని! ముగ్గురం కలిసి ఇలా కబుర్లు చెప్పుకుని చాలా కాలమయింది. నీకే హాయిగా విజయవాడలో ఇల్లు కొనుక్కుని పట్నంవాసానికి అలవాటుపడిపోయావు......మా పల్లెటూరు నీకు నచ్చుతుందా?' అంది నిష్టూరంగా జయంతి.
"ఛ....అవేం మాటలు జయంతి.....పట్నవాసంలో ఏముంది? అంతా మురికికంపు. అక్కడ నీళ్ళు మురికే, వీధులు మురికే, మనసులు మురికే" అంది పార్వతి.
"ఏంటి పెద్దపిన్ని చిన్నపిన్నికి కవిత్వం వస్తుందే! పట్నం పోయి కవిత్వం రాయటం నేర్చుకున్నట్లుంది" అంది జయంతి నవ్వుతూ.
"కవిత్వమా నా బొందా" అంటూ జయంతి వీపు మీద చరిచింది పార్వతి.
పెళ్ళెప్పుడు చేసుకుంటావ్....? నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నిజంగా మనస్పూర్తిగా అంటున్నాను. మీకు నామీద కోపం రావటం సహజం....పట్నం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మర్చిపోయానని మిరనుకోవటం సహజం" అంది పార్వతి.
"అలాగని ఎందుకనుకుంటాం పార్వతి ఎన్నాళ్ళని కలుసుంటాం. ఎవరి జీవితాలు వారివి, నువ్వు ఒకవిధంగా మంచిపనే చేశావు. పట్నం పోయి అక్కడ ఇల్లు కట్టుకున్నావు. సుందరాన్ని నీ దారికి తెచ్చుకున్నావు, పిల్లల్ని బాగా చదివిస్తున్నావు" అంది దాక్షాయణి.
"అలానుకుంటే ఫర్వాలేదు. పోగరేక్కింది, మమ్మల్ని మర్చిపోయిందనుకుంటారేమోననే నా భాదంతా" అంది పార్వతి దిగులుగా.
"మొదట్లో అనుకున్నాం చిన్నపిన్ని దీనిలో దాపరికం ఏముంది? తరువాత నేనే రాజీపడ్డాను. ఎల్లకాలం అందరూ కలిసుండాలనే రూలు లేదు కదా అని" అంది జయంతి నవ్వుతూ.
శివపార్వతి బదులు చెప్పకుండా మౌనంగా వుంది.
"నా తప్పేముంది చెప్పండి- మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి నా మనసోప్పిందా? మీ బాబాయ్ ని ఎంతగా బ్రతిమాలాను. అయినా అయన నా మాట విన్నారా? ఇక్కడుండలేను అంటూ నన్ను బలవంతంగా మీ నుంచి దూరం చేశారు. నా ప్రాణం విలవిల్లాడిపోయింది. మొదట్లో నాకు పిచ్చెక్కుతుందేమోనని భయం వేసింది. ఇక్కడ అందరం ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి వుండేవాళ్ళం...ఒక్కసారిగా నన్ను తీసుకెళ్ళి ఆ పట్టణంలో జైలు లాంటి గదిలో పడేశారు మీ బాబాయ్.....అప్పుడేం చేయాలో తెలిక, తోడు కోసం మా అమ్మని కొన్నాళ్ళుండమని ఉత్తరం రాశాను. ఆమె నా దగ్గర నెలరోజులుండి వెళ్ళింది. క్రమంగా ఆ జీవితానికి అలవాటు పడిపోయాను" అంది పార్వతి.
