టీ ముగించి క్షవరానికి కూర్చున్నాను నేను. జుట్టు కత్తిరిస్తూ కథ చెబుతున్నాడు. అతను క్షవరం ఏమీ బాగాలేదు గాని కథమాత్రం అద్వితీయంగా ఉంది. ఇంతకంటే క్షవరశాలలు చూశాను గానీ ఎక్కడా ఇంతకన్నా మంచికథ వినలేదు. ప్రపంచంలోనున్న మంగలాళ్ళు అందరూ కలిసి ఆలోచించినా ఇంతకన్నా మంచికథ కల్పించగలుగుతారని నేననుకోను. పెదనాన్నా, సర్కస్ పులీ! భేష్, ఎంత గొప్ప కథ! క్షవరం బాగులేదు నిజమే! షాపులోంచి బైటికి వచ్చినప్పుడు నా తల అసహ్యంగా ఉంది! అయినా నేను లెక్కచెయ్యలేదు. అసలితనికి క్షవరం చెయ్యటం చేతకాదు. మంగలివాడులాగా అభినయిస్తున్నాడు అంతే. అదేనా పెళ్ళాం పిల్లలకోసం. లోకాన్ని తృప్తి పరచడం కోసం క్షవరం చేస్తున్నాడు. క్షవరం చెయ్యాలనే ఉద్దేశమే లేదతనికి. ప్రశాంతంగా చదువుకోవాలనీ, నిద్రపోవాలనీ, వాళ్ళలోనూ, వీళ్ళలోనూ, ఆ కబురూ, ఈ కబురూ, హాయిగా చెప్పుకోవాలనీ అతనికుంది. అయిదుగురు పిల్లలతనికి. ముగ్గురు కొడుకులూ, ఇద్దరు కూతుళ్ళు! అయిదుగురూ వాళ్లమ్మమ్మ బాపతూ! వాళ్ళతో ఎలాగ కులాసాగా మాట్లాడటం? ఇంటికి వెళ్లగానే ఎంత డబ్బు తెచ్చావని అడుగుతారు.
కేరళ దేశంలోని ఒక పల్లెటూరిలో చిరకాలం కిందట మా పెదనాయన రణపెంకి. దొంగమాత్రం కాదు. తనకన్న బలవంతులెవ్వరూ ఉండకూడదంటాడు మా పెదనాయన. ఎవరైనా బలం ఉన్నట్టు చెప్పుకుంటే నాతో కుస్తీకి రా అని సవాలు చేసేవాడు. ఎలాంటి వారినైనా ఇట్టే చిత్తు చేసేవాడు. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా కుస్తీ పడుతానంటాడు. తాత ముత్తాతలతోనైనా సరే అన్నాడు మంగలాయన.
మా పెదనాన్నకి గొప్ప వస్తాదు అని పేరు వచ్చింది. కుస్తీలు పట్టి డబ్బు ఆర్జించకూడదా అని అనేకులతనికి సలహా ఇచ్చారు. కుస్తీలు పట్టడానికి ఒప్పుకున్నాడు మా పెదనాయన. ఇరవైయేళ్ళయినా నిండకముందే పద్దెనమండుగురు బలవంతుల యెమూకలు విరిచేశాడు. కాని, వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేసేవాడు. తినడం, తాగటం మిగిలింది పిల్లలకి పంచిపెట్టడం. మా పెదనాన్నకి డబ్బంటే గడ్డిపరకతో సమానం.
అదంతా చిరకాలం క్రిందట! ఇప్పుడందరూ డబ్బు కావాలనేవారే! వృద్ధాప్యానికి కొంత సొమ్ము వెనకవేసుకొమ్మని పెదనాన్నకి చాలామంది బోధించారు. అతను వినలేదు. వాళ్ళన్నంతా అయింది. మా పెదనాయనకి నలభైయేళ్ళు వచ్చాయి. సత్తువ పోయింది. డబ్బు పోయింది. అందరూ ఆయన్ని ఈసడించారు. ఈ పోరుపడలేక మా పెదనాయన దేశాంతరం పోయాడు. మెసపటోమియోకి పోయాడు. అక్కడ నుంచి వియన్నాకి వెళ్ళాడు.
వియన్నా? అన్నానేను. మీ పెదనాయన వియన్నా చూశారా?
ఒక్క వియన్నా అన్నమాటేమిటి? మా పెదనాయన చూడని చోటేలేదు. వియన్నాలో ఆయనకేపనీ దొరకలేదు కడుపు మాడిపోయింది. అయినా ఒక్క రొట్టెముక్కయినా దొంగిలించాడా మా పెదనాయన? అబ్బే, ఆయనకి దొంగతనం చెయ్యడం తెలియదు. అక్కడనుంచి బెర్లిన్ వెళ్ళాడు. ఆహా బెర్లిన్! ఎంత గొప్ప పట్టణం! అక్కడా అదే కథ. ఆకలితో మా పెదనాయన చచ్చే పర్యంతమయింది అన్నాడు మంగలాయన.
జోరుగా నా జుత్తు కత్తిరించేస్తున్నాడు మంగలాయన.
గుట్టలు గుట్టలుగా కళ్ళముందు జుట్టు పడిపోతుంది. నా తల పేలికయిపోతుంది. చలి చంపేస్తుంది. వహహ్వ! బెర్లిన్, అన్నాడు మంగలాయన. క్రూరమైన నగరం. వీధులు, వీధులు, వీధులు! ఇళ్ళూ, ఇళ్ళూ, ఇళ్ళూ! తలుపులు, తలుపులు, తలుపులు! కాని ఒక్క తలుపైనా తెరుచుకుందా మా పెదనాయనకీ? పట్టెడు మెతుకులైనా దొరికిందా మా పెదనాయనకి? ఒక్క స్నేహితుడైనా కనపడ్డాడా?
హా, పరమేశ్వరా! అన్నాను నేను. ప్రపంచంలో మానవుని ఒంటరితనం! అకటా! ఈ జీవితపు ఏకాంతం! ఇందులోని విషాదం!
అంతే అన్నాడు మంగలాయన. అదే కథ పారిస్ లో. అదే కథ లండన్ లో! న్యూయార్క్ లోనూ అంతే! న్యూఢిల్లీలోనూ అంతే. వీధులు, వీధులు, వీధులు! ఇళ్లు, ఇళ్లు, ఇళ్లు! తలుపులు, తలుపులు, తలుపులు! మా పెదనాన్నకి ఎక్కడా బాగాలేదు.
ఆహా, పరమేశ్వరా! అని ప్రార్ధించాను నేను. ఈయన్ని రక్షించుతండ్రీ, ఇతనికే హాని కలగకుండా కాపాడు, అనుకున్నాను.
చైనాలో మా పెదనాయనకి ఒక ఫ్రెంచి సర్కస్ లో పనిచేస్తున్న అరబ్బీ బఫూన్ తో పరిచయం అయిందన్నాడు మంగలాయన. ఇద్దరూ తురుష్కభాషలో మాట్లాడుకున్నారు. బపూన్ అడిగాడు కదా, భాయీ! నువ్వు మానవుణ్నీ, మృగాలనీ ప్రేమిస్తున్నావా? అని, మా పెదనాన్న జవాబు, భాయీ! ఆకాశం మీద అల్లా సృష్టించిన సమస్త జంతుకోటినీ నేను ప్రేమిస్తున్నాను. పశువులనూ, పక్షులనీ, చేపనీ, చెట్టునీ, కొండనీ ప్రేమిస్తున్నాను. అయితే భాయీ! అని అడిగాడు అరబ్బీ బఫూన్. దుర్మార్గమైన అరణ్య జంతువులను, మాటవరసకు ఒక పెద్దపులిని ప్రేమించగలవా? అంటే మా పెదనాయన అన్నాడు, భాయీ! అరణ్య జంతువులపట్ల నా ప్రేమ అపారమైంది అని. పాపం మా పెదనాయన!
హా! పరమేశ్వరా! అన్నాను నేను.
అడవి మృగాలంటే మా పెదనాయనకి చాలా ఇష్టమని అరబ్బీ బఫూన్ తెలుసుకున్నప్పుడు తనకి అపరిమితానందం కలిగింది. ఎంచేతనంటే అతనూ మంచి ధైర్యశాలి. ఆయనడిగాడు మా పెదనాయనని, భాయీ! నీకు అడవి జంతువుల మీద అంత ప్రేమకదా పెద్దపులినోట్లో తలదూర్చగలవూ? అని.
రక్షించు ప్రభూ! అన్నాను నేను.
తప్పకుండా తల దూరుస్తాను భాయీ! అన్నాడు మా పెదనాయన, అన్నాడు మంగలాయన. అయితే సర్కస్ లో చేరమన్నాడు. అరబ్బీ బఫూన్. మామూలుగా మా సర్కస్ లో పెద్దపులి నోట్లో తలదూర్చే ఫ్రెంచి మనిషి తలకాయని నిన్న నిర్లక్ష్యమగా మా పెద్దపులి కొరికివేసింది. ఇక మా కంపెనీలో ఎవరూ కరుణామయుడైన భగవంతుని సృష్టిలోని ప్రాణులన్నీటినీ సమానంగా ప్రేమించగలవాళ్ళు లేకపోయారు. మా పెదనాయనకి అప్పటికే ప్రపంచం మీద విరక్తి పుట్టింది. భాయీ! మీ సర్కస్ లో చేరుతున్నాను. భగవంతుడు సృష్టించిన పవిత్రమైన పులినోట్లో ఒకసారి కాదు పదిసార్లు తలదూరుస్తానన్నాడు. పది దఫాలు అనవసరం. రోజుకి రెండు మార్లయితే చాలునన్నాడు బఫూన్. ఆ విధంగా మా పెదనాయన చైనాదేశంలో ఫ్రెంచి సర్కస్ లో చెరి పెద్దపులి నోట్లో తలదూర్చడం ప్రారంభించాడు.
సర్కస్ చైనా నుంచి ఇండియాకే, ఇండియా నుంచీ ఆఫ్గనిస్తాన్ కీ, అక్కణ్నుంచి పెర్షియాకి వెళ్ళిందన్నాడు మంగలాయన. అక్కడి ఆ నీళ్ళు దొరకని పెర్షియాలో జరిగింది. పెదనాన్నా, పులీ మంచి స్నేహితులుగా ఉంటూ వచ్చారు. కానీ, టెహరాన్ నగరంలో, ఆ ప్రాచీనమైన పాపపుచోట పెద్దపులిలో పెద్దమనిషి తరహా నశించింది. ఆరోజు ఎండ మండిపోతుంది. అందరూ తహతాహలాడుతున్నారు. నగరంలో మా పెదనాయన ఆవులించిన పెద్దపులినోట తలదూర్చాడు. ఇక తల తీద్దామనుకునేసరికి ప్రపంచంలోని అన్యాయాలన్నిటికీ ప్రతినిధి అయిన పెద్దపులి రెండు దవడలూ కటుక్కుమనిపించింది.
గబుక్కుమని కుర్చీలోంచి నేను కిందకు దూరి అద్దంలో చూస్తే ఏదో వింత రూపం కనిపించింది. నా మొగమే! భయం వేసింది. నా జుత్తంతా పోయింది. మంగలాయన చేతిలో డబ్బులు పెట్టి ఇంటికి పోయాను. అందరూ నన్ను చూసి నవ్వటమే! అదేం కత్తిరింపు? ఏడిసినట్టుంది, అన్నాడు మా తమ్ముడు.
చాలా బాగుందనుకున్నాను నేను.
కొన్నాళ్లదాకా పెదనాన్నా పెద్దపులీ తప్ప ఇంకో ఆలోచన వెళ్ళేది కాదు నాకు. మళ్లీ జుట్టు బాగా పెరిగిన తరువాత మలబార్ సెలూన్ కి వెళతాను. మంగలాయన నోట వెంట భూలోకంలో మానవుని కథ వినడానికి. దారిలేని ఏకాంత జీవులు దారుణ ప్రమాదాల నోళ్లలో పడుతున్న కథ! మంగలాయన పెదనాయన కథ! మానవుని విషాద కథ!
.jpg)
* * * *
