Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 74


    వరూధినికి నిద్రపట్టక లేచి కూర్చుంది. బీరువాలోనుంచి వైన్ బాటిల్ తీసింది. గ్లాసు ముందు పెట్టుకొని పందిరి మంచంమీద కూర్చుంది.
    వైన్ గొంతులోనుంచి కిందకు జారగానే మళ్ళీ ఆమె మనసు రామనాథబాబు మీదకు మళ్ళింది.
    రామనాథబాబు మద్రాసు హోటల్లో దాంతో కులుకుతూ వుంటాడు. అసలు హైదరాబాద్ వెళ్ళుంటాడేమో? మద్రాసని అబద్దాలు చెప్తూండవచ్చు. హైదరాబాదు సినిమాహాలు సంగతి తననుంచి దాచటానికి ఈ ఎత్తువేసి ఉంటాడు. హైదరాబాద్ లో గోపాలరావు చెప్పింది కొంతవరకు నిజమే! గ్లాసులో వైన్ సగానికి తరిగిపోయింది. వరూధిని మెదడు వేగం హెచ్చింది.
    రామనాథబాబు ఎంతకాలం దాక్కుంటాడు? సినిమాహాలు లాభాల్లో వాటాలకైనా వస్తాడుగా? రాకుండా పోడు! ఎప్పుడో వస్తాడు. అప్పుడడుగుతుంది తను, ఈ రెండేళ్ళ లాభం సంగతి చెప్పమని. ఈ రెండేళ్ళలో తన కెంత ఇచ్చాడూ? తను లెక్కపెట్టి చావలేదు. అతను ఇస్తూ వచ్చాడు. తను తీసుకుంటూ పోయింది. ఏమైనా తనకు రావాల్సిందాంట్లో సగంకూడా ఇచ్చి వుండడు. ఈ ఆరాలన్నీ ఆనాడు తనకు పట్టలేదు. 'నీదీ నాదీ' అన్న తేడా లేకుండా నడిచిపోయింది. రామనాథబాబే తను అనుకున్నది. ముష్టి డబ్బు విషయం ఎవరికీ పట్టలేదు. రామనాథబాబు ఓసారి, "నేనే నీవాడ్ని అయినప్పుడు నాది నీది కాదా? నా సర్వస్వం నీదే! ఇదంతా నీ కోసమేగా?" అన్నాడు.
    అప్పుడు రామనాథబాబు గుండెలమీద తను వాలిపోయింది. రామనాథబాబు తనను, తనలో కలుపుకొంటూ ఎంత ఇదైపోయాడూ? తను రామనాథబాబును పెనవేసుకొని, అతని ముఖం తనమీదకు లాక్కొని ఏంచేసింది? అప్పుడు రామనాథబాబు.......వరూధిని మనస్సు వశం తప్పిపోయింది. పెదవులు కంపించిపోయినై. దుఃఖం పొర్లుకొస్తూంది. పందిరి మంచం మీదనుంచి జారి తూలి కిందపడింది.
    వెక్కి వెక్కి ఏడ్చింది వరూధిని.
    రామనాథబాబుని తలచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది వరూధిని.
    ఎవరో తన వెనకొచ్చి నిలబడ్డారు. రామనాథబాబే! తనను రెండు చేతుల్తో ఎత్తుకెళ్ళి మంచంమీద పడుకోబెడ్తున్నాడు. అతన్ని చెయ్యి పట్టుకొని తనమీధకు లాక్కుంటూ బలవంతంగా కళ్ళు తెరచి చూసింది.
    వరూధిని చెయ్యి అప్రయత్నంగానే అతని చేతిని వదిలేసింది. తేలిపోతున్న దృష్టిని నిలిపి చూసింది. అతను రామనాథబాబుకాడు, భర్త వెంకటపతి!
    పందిరి మంచం మీద కూర్చొని, తనను ఆనుకొని తనమీదకు వంగుతున్న వెంకటపతిని వరూధిని కాళ్ళతో తోసేసింది.
    టీపాయ్ మీద మిగిలిన వైన్ బాటిల్ తీసుకొని అదేపోతగా పోయాడు వెంకటపతి.
    
                                                     32
    
    వరూధిని పిక్చర్ ప్యాలస్ లో సీతారామకళ్యాణం శతదినోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరిగిపోతున్నాయి. వరూధిని అన్ని ఏర్పాట్లు స్వయంగా అజమాయిషీ చేస్తూంది. రామదాసూ, వెంకటపతీ రాత్రింబవళ్ళూ కష్టపడుతున్నారు.
    శివరాం కూడా వరూధినికి అణిగిమణిగి పడివుంటున్నాడిప్పుడు: శతదినోత్సవానికొచ్చే కళాకారులకు, టెక్నీషియన్లకూ, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ తరపువాళ్ళకోసం వరూధిని అన్ని ఏర్పాట్లు సమకూర్చింది. టౌనంతా బ్యానర్లు కట్టించింది తెల్లవారితే అంతా వస్తారు. పది గంటలకు వరూధిని పిక్చర్ ప్యాలెస్ లో ఫంక్షన్. సాయంకాలం ఆరుగంటలకు అల్పాహారవిందు. రాత్రి వరూధిని యింట్లోనే ముఖ్యమైనవాళ్ళకు డిన్నర్.
    నాలుగు రోజులుగా ఊపిరిసలపకుండా అయిపోయింది. అన్ని ఏర్పాట్లు బాగా జరిగిపోయాయని తృప్తికలిగాక వరూథినికి బడలిక తెలిసింది. బాగా అలసిపోయి ఉంది. మధ్యాహ్నం భోజనంచేసి పడుకుంది. బాగా చీకటిపడ్డాకగాని మెలకువ రాలేదు. ఏడుగంటలయింది. త్వరగా డ్రస్ చేసుకుని థియేటర్ కు బయలుదేరింది.
    థియేటరు దగ్గర రిక్షాదిగి మామూలు అలవాటు ప్రకారం ముందుగా ఆఫీసుకేసి వెళ్ళింది. ఆఫీసులో శివరాం పక్కన ఒక వ్యక్తి కూర్చొని వున్నారు. అతడి పక్కన దృఢకాయులు ఇద్దరు నిలబడి ఉన్నారు. వరూధిని గదిలోకి వచ్చింది. తనను చూసి వాళ్ళు నిలబడతారని ఆశించిన వరూధినికి ఆశాభంగమైంది. వరూథిన్ని చూసికూడా చూడనట్టే అవతల వ్యక్తితో థియేటర్ కలెక్షన్ గురించి చెబుతున్నాడు శివరాం. వరూధిని చివాలున వెనక్కు తిరిగి ఆఫీసు గదిలోనుంచి బయటకొచ్చింది. రామదాసు పరుగెత్తుకుంటూ ఆమె దగ్గర కొచ్చాడు.
    "వాళ్ళెవరూ? అడ్డమైన వాళ్ళందర్నీ ఆఫీసులోకి చేరుస్తారెందుకూ?" కోపంతో ఉడికిపోతూ అన్నది వరూధిని.
    "మీ కోసమే చూస్తున్నానమ్మా! ఆఫీసులో కూర్చున్నాయన రాంకృష్ణయ్య ... రామనాధబాబు బావమర్ది."
    "ఆహా! ఎందుకొచ్చాడంటా?" పెదవి విరుస్తూ అన్నది వరూధిని.
    "ఏమో! వచ్చిందగ్గరనుంచీ ఆ శివరాంగాడితో ఒకటే మంతనాలు!"
    "శివరాంను ఇంతవరకూ ఉంచడం మనదే పొరపాటు! ఏడవనియ్! అసలువాడివల్లే కాలేదు. బావమర్ధేం ఏడుస్తాడు?" అని వరూధిని థియేటర్ వరండాలో కుర్చీ వేయించుకొని కూర్చుంది. రామదాసు పక్కన నిలబడ్డాడు. తెల్లవారి శతదినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లు గురించి చెప్పుకుపోతున్నాడు రామదాసు. వరూధిని 'ఊ' కొడ్తూ ఇంకేదో ఆలోచిస్తూ కూర్చొంది.
    రెండో ఆట బుకింగ్ అయిపోయింది. వరూధిని ఇంటికి వెళ్ళడానికి సిద్దమయి ఆఫీసు గదిలోకి వచ్చింది.
    "శివరాం! పూర్తయిందా?"
    "ఆఁ అయిపోయింది, కాని డబ్బు మీకివ్వడానికి వీల్లేదంటున్నాడు!"
    "ఎవడు వాడు?" వరూధిని దురుసుగా అన్నది.
    "రామనాధబాబుగారి బావమరిది."
    "అతని కిక్కడేం పని? అసలు అతడ్ని ఆఫీసులోకి ఎందుకు రానిచ్చావ్?" వరూధిని అంటుండగానే రామకృష్ణయ్య గబగబా తోసుకొని ఆఫీసు గదిలో కొచ్చాడు.
    "అదుగో, వచ్చారు! ఆయన్నే అడగండి!" రామకృష్ణయ్యను చూపిస్తూ అన్నాడు శివరాం. ఒకపక్కన శివరాంకు చెమటలు కమ్ముకొస్తున్నాయి.
    "ఒకడ్నడిగే పని నాకేమిటి? ముందా డబ్బు ఇలా ఇవ్వు!"
    "అట్టా ఇవ్వడానికి వీల్లేదు!" రామకృష్ణయ్య అరిచినట్టు అన్నాడు.
    వరూథినికి చర్రుమంది. "ఎవరు నువ్వు? ముందు బయటికి నడువ్!" అన్నది రామకృష్ణయ్యను చూసి.
    "మర్యాదగా మాట్లాడు. ముందు నువ్వెవరో చెప్పు!" రామకృష్ణయ్య మొరటుగా అన్నాడు.
    వరూధిని గుండెలు వేగంగా కొట్టుకొన్నాయ్.
    "నేనెవర్నా? సమాధానం చెప్పాల్సింది నీక్కాదు, రామనాథబాబును రమ్మను చెబుతాను." ముక్కుపుటాలు ఎగరేస్తూ అన్నది.
    "మా బావెందుకూ? ఆయన్దేమీలేదు ఇక్కడ! ఏయ్ శివరాం, ఇట్టివ్వు డబ్బు!" రామకృష్ణయ్య వరూథిన్ని దాటుకొని డబ్బుకోసం చెయ్యి చాపాడు. వరూధిని శివరాం ముందున్న నోట్లపొత్తి గభాలున అందుకోబోయింది. రామకృష్ణయ్య వరూథిన్ని తోసేసి డబ్బు అందుకొన్నాడు. వరూధిని తూలి గోడమీదకు పడింది! అప్పుడే ఆఫీసు గదిలోకి వచ్చిన వెంకటపతి కిందపడిన భార్యను చూశాడు.
    అతనికి ఏం చెయ్యడానికి తోచలేదు. తన భార్యమీద చెయ్యివేసి తోసేసిన రామకృష్ణయ్యకేసి తీవ్రంగా చూశాడు. రామకృష్ణయ్యలాంటివాళ్ళను నలుగుర్ని అవలీలగా ఎత్తి అవతల పారేయగల వెంకటపతి నిస్సహాయుడిగా నిలబడిపోయాడు. లోపల నాలుగు పెగ్గులు పడివుంటే అలాంటివాళ్ళను ఆరుగుర్ని తుక్కుకింద కొట్టేవాడు. కాని వరూధిని రెండు రోజులుగా వెంకటపతిని ఎండగట్టింది.
    రామదాసు కొండలరావునూ, వెంకుల్నీ వెంటబెట్టుకొని రొప్పుకుంటూ వచ్చాడు.
    వరూధిని చిరుతపులిలా లేచి నిలబడింది. జారిన పైట సర్దుకొంది. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా మండిపోతున్నాయి. తాచులా బుసలు కొడుతూ వెంకటపతి, రామదాసులకేసి చూస్తూ అన్నది ...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS