Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 74


    "లేదు. ఎక్కడపోయిందో  కూడా  తెలీదు. నాకు పిల్లలు పుట్టరని ఖచ్చితంగా రాశాడు. అది ఎంతవరకూ  జరుగుతుందో  వేచి చూడాలి. నాకు పెద్ద పదవి  దొరుకుతుందన్నాడు. అది నాకు నమ్మకంలేదు. నేనుతొంభై ఏళ్ళు బతుకుతానన్నాడు. అది నాకు నమ్మకంలేదు. నేను తొంభై ఏళ్ళు బతుకుతానన్నాడు. ఇవన్నీ  వేచి చూడాల్సిన విషయాలు. చూద్దాం. నేను చిన్నప్పుడు  చాలా అల్లరిపెట్టేవాడినట. రంగు సుద్దముక్కలతో గోడలనిండా  బొమ్మలు గీసేవాడినట. ఆ బొమ్మలు ఎంతో బాగున్నాయని  ఎగిరి గంతులేసేవాడినట. గోడలన్నీ  పాడుచేస్తున్నానని  నాకు తెలీదు. ఆ బొమ్మలు  బాగున్నాయని మా వాళ్ళు అనేసరికి, నేనో గొప్ప చిత్రకారుణ్నయి పోయాననుకొనేవాడిని.
    మా నాన్న నాకు రంగులూ, కుంచెలూ  కొనిపెట్టేవాడు. దాంతో  చెట్లకొమ్మలూ, జంతువుల బొమ్మలూ తెగ రాసేవాడిని. కొంతకాలంపాటు  అదో సరదా. తర్వాత  ఎప్పుడూ  నరవాహనంమీదే వుండేవాడిని. అంటే_అర్ధం తెలుసా? అన్నారు.
    "ఎవరో  ఒకరు  ఇరవై నాలుగ్గంటలూ  ఎత్తుకొని  మోస్తూఉండాలి. అంతేగా?" అన్నాను.
    దమ్ములాగుతూ_"ఊఁ" అన్నారు.
    "ఇంచుమించు  నాదీ  మా నాన్నదీ  మనస్తత్వం  ఒక్కలాంటిదే  అయినా చిన్న భేదం మాత్రం వుంది. మా నాన్న ఓటమిని  అంగీకరిస్తాడు. నేను ఓటమి అన్నదే వుండకూడదంటాను. జీవితాన్ని  మా నాన్న లాగ నేనో జూదంలా అనుకోలేదు. ఓ ఛాలెంజ్ గా తీసుకుంటాను. ఇది నిజంగా  సవాలే.
    ఇంత జరిగినా  మా నాన్న నా కవితాశక్తిని ఏనాడూ నిరుత్సాహపరచలేదు. కవిత్వానికి దోహదంగా వుంటుందని  ఎన్నో గ్రంథాలు  కొని ఇచ్చేవాడు.
    చిన్ననాటి  అనుభవాలు మనల్ని ఎప్పుడూ  వెంటాడుతూనే వుంటాయి. నాకు విశాఖపట్నమంటే  అపరిమితమైన ఇష్టం. విశాఖ జ్ఞాపకాలు నన్ను వెర్రివాడ్ని  చేస్తూ వుంటాయి. తుమ్మెదల మెట్ట, యారాడకొండ, తీర్ధపురాళ్ళు....ఇలా అనేకం. విశాఖలో  ఒక్కోస్థలానికి  ఒక్కో పేరుంది. ఏమయిపోతానోనన్న  భయం నాకు ఎప్పుడూ వుండేది కాదు.
    కాళ్ళకి చెప్పులు లేకుండా  కొన్ని మైళ్ళ దూరం  సముద్రం  ఒడ్డునుండి నడుచుకుంటూ  వెళ్ళిపోతూండేవాడిని. నా షరాయి నీళ్ళతో తడిసిపోయిన విషయం  కూడా నాకు తెలిసేది కాదు.
    ఓ పుస్తకం  పట్టుకొని  చదువుకుంటూ  సముద్రపుటొడ్డు  నుండి  బయలుదేరి, అది ముగిసేవరకూ నడిచేవాడ్ని.         
    సముద్రమంటే జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ తనకి  పిల్లలు  పుట్టలేదన్న  దిగులుతో సముద్రంలో  పడిపోవాలని  పరుగెత్తిందిట. అప్పుడో స్వామీజీ ఆగు అప్పన్నకొండా! నువ్వు ఆత్మహత్య చేసుకోనవసరంలేదు. నేటికి సరిగ్గా పదో నెలకి నీకు మగపిల్లవాడు  పుడతాడు. ఇంటికి వెళ్ళమని  చెప్పాడట.
    మా అమ్మ ఈ మాట ఇంటికివచ్చి  చెప్పిందిట. మా వాళ్ళు వెళ్ళి సముద్రపు ఒడ్డున చూసేసరికి  అప్పటివరకూ  వున్న పాకగానీ, స్వామీజీ  చెప్పినట్టుగానే నేను పుట్టానని చెప్పుకొనేవారు" అని అన్నారు.
    "మీరిది ఎంతవరకూ  నమ్ముతార"ని  అడితే_
    "నేను ముందే చెప్పానుగా  సరోజా! నాకిలాంటి  కట్టుకథలు, పిచ్చి మాటల మీద నమ్మకంలేదని. ఇప్పటికీ విశాఖపట్నంలో  మా వాళ్ళంతా  ఈమాట  చెప్పుకుంటారు. 'నువ్వు వరప్రసాదుడివి  బాబయ్యా! నువ్వో తపస్వివి' అంటూ  వుంటారు. ఎవరి వెర్రి వారికానందం.
    నా కవిత్వానికీ, నాకూ కూడా సముద్రమే  ఆవేశం. దగ్గరలో  సముద్రం లేని స్థలం నన్ను చంపేస్తుంది. రోజూ వెళ్ళకపోయినా దగ్గరలో  మహా సముద్రం వుంటే చాలు. ఖర్చుచెయ్యకున్నా  బ్యాంకులో డబ్బు వున్నంత ధైర్యంగా  వుంటుంది" అన్నారు.
    "అదేమిటండీ? సముద్రం  అంటే  అంత ఇష్టమా?" అని అడిగాను.
    "అవును సరోజా! ఎందుకో నాకే తెలీదు. విశాఖపట్నం  వదిలిన తర్వాత  మద్రాసులో  వున్నాను కనుక సరిపోయింది. ఇంతకాలంగా  ఇక్కడ వుంటున్నానంటే కారణం  సముద్రం  కూడా" అన్నారు.
    "మరి సినిమాలంటే  మీకు ఇష్టమేనా?" అని అడిగాను.
    "ఇష్టం  అయిష్టం  అని చెప్పలేనుగానీ సినిమా అంటే సరదా లేదని మాత్రం  చెప్పలేను. సినిమా సరదా  చిన్నప్పటి నుండే  వుండేది. గుడారంలో  సినిమాతో  ప్రారంభించి, ఈనాడు పెద్ద నగరంలో పెద్ద సినిమా ధియేటర్ వరకూ చూశాను. చివరకు  సినిమా రంగంలోనే  సెటిలయ్యాను  కూడా.
    అయితే  ఈ సినిమా పని  నేను అనుకోనిది. నా ధ్యేయంవేరు. అయినా గడ్డు రోజుల్లో ఆర్ధికంగా నన్ను ఆదుకున్నది ఈ సినిమాయే. నిత్యజీవితానికి  ఏదో ఒక ఉపాధి  కావాలి. ఇది దొరికింది. అందులోనూ నువ్వు వచ్చిన తర్వాత నేనిందులో  కూరుకు పోయాను.
    సైలెంట్ మూవీల నుండి చూశాను. ఎప్పుడూ నేలమీదనే కూర్చునేవాడిని. అందరిలాగే  నేనూ, ఆదా మొగా తారల్ని  ఆరాధిస్తూ ఉండేవాడ్ని. పోతే రోజుకో కొత్త తార రావడం వల్ల  అభిమానతార  అంటూ  ఎవరూ  ప్రత్యేకంగా లేరు. నాకు చార్లీ చాప్లిన్  అంటే చాలా సరదా. సైలెంట్ మూవీలకి  ధ్వని  ముద్రణ  కూడా  చేశాడాయన" అని అన్నారు.
      తలుపు  చప్పుడయింది. నేను వెళ్ళి తీశాను.

 

                              *    *    *


                                           "తల్లి" పుట్టింది


    సర్వర్ వచ్చాడు. అతన్ని భోజనం  తెమ్మని  చెప్పి, లాగే మరో నైట్ హార్స్ విస్కీ, రెండు బీరులూ  తెమ్మని డబ్బులిచ్చారు శ్రీశ్రీగారు.
    బాత్ రూంకి  వెళ్ళొచ్చి  ఓ పెగ్ బిగించారు. "ఆఁ...ఎక్కడ ఆపేశాను?" అని అడిగారు.
    "ఎక్కడ  ఆపేస్తే  ఏం గానీ_నేనోమాట సూటిగా  అడుగుతాను  నిజం చెప్తారా?" అన్నాను.
    "నాకు అబద్ధం  ఆడడం  చేతకాదు సరోజా!" అన్నారు.
    "ప్రేమ, పెళ్ళి  సెంటిమెంట్లు_వీటి మీద  మీకు నమ్మకం లేదని  అడుగడుక్కీ  అంటూ వుంటారే, మీరు నిజంగా  నన్ను ప్రేమించలేదా ?
    ప్రేమించకుంటే పెళ్ళెందుకు  చేసుకున్నారు?" అని అడిగాను.
    ఒక సెకండ్ మాట్లాడలేదు. తర్వాత  "నిజం  చెప్పమంటావా ? అబద్ధం చెప్పమంటావా?" అని అడిగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS