Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 74

    ప్రస్తుతం ఆమె జీతం రెండువేల రూపాయాలకు పెరిగింది. అంటే దాదాపు పది రెట్లు పెరిగింది. కుటుంబ పోషణ బాధ్యత అంతా తనే చూసుకుంటుంది. చెల్లెల్ని డాక్టర్ని చేయాలనే పట్టుదలతో చదివిస్తుంది. ప్రస్తుతం ఏఫ్.ఏ. చేస్తుంది. అది పూర్తయిన తరువాత ఎం.బి.బి.ఎస్. లో చేర్పించాలని జయంతి కోరిక. తులసి కూడా అక్క కోరికను తిర్చాలనే పట్టుదలతో కష్టపడి చదువుకుంది. ఆమెకు ఇక్కడే విజయవాడలో కాలేజికి సంబంధించిన లేడిస్ హాస్టల్లో వుంచే చదివిస్తుంది.
    పెద్ద తమ్ముడు రోజు ఇంటిదగ్గర నుంచి బస్సులో పట్నం వచ్చి చదువుకుంటున్నాడు. పెద్ద తమ్ముడు టెన్త్క్ క్లాస్, చిన్న తమ్ముడు ఎయిత్ క్లాస్. ఉళ్ళోనే జయంతి చదివిన స్కూల్లోనే చదువుకుంటున్నాడు. వాళ్ళ ఇద్దర్ని కూడా ప్రయోజకుల్ని చేయాలనేది ఆమె ఆకాంక్ష.

    కస్తూరి కూతుర్ని పెళ్ళిచేసుకో, అని చెప్పి చెప్పి విసిగిపోయింది. ఈమధ్య అసలు ఆమె పెళ్ళి మాట ఎత్తటంలేదు. జయంతి ఒకటే నిర్ణయం తీసుకుంది. చెల్లెల్ని డాక్టర్ని చేయాలి. డాక్టర్ కావాలంటే మరో అయిదేళ్ళు పడుతుంది. అయిదేళ్ళవరకు ఆమె పెళ్ళి గురించి ఆలోచించదలుచుకోలేదు. చెల్లెలు డాక్టర్ కావటం, పెద్ద తమ్ముడు డిగ్రీ పుర్తవటం, వాడు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరటం, చిన్న తమ్ముడికి కూడా డిగ్రీ పుర్తవటం అన్ని అయిదు సంవత్సరాల్లో జరిగిపోయాయి. అందుకే ఆమె ఈ కఠిననిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆమె పెళ్ళి చేసుకుంటే తనను చేసుకునే భర్త తనకు సహకరిస్తాడనే నమ్మకం ఏముంది?

    నా జీవితం చెల్లెళ్ళకోసం, తమ్ముళ్ళకోసం ఖర్చు పెట్టటం అతనికి ఇష్టం లేకపోతే వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోతాయి కదా! ఇంత వరకు ఎలాగో ఓపికపట్టాను. ఎన్నో విమర్శలను ఎదుర్కున్నాను. మరో అయిదేళ్ళు ఇలానే కళ్ళు మూసుకుంటే అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. అప్పుడు నన్ను చేసుకోవటానికి ఎవరైనా ముందుకొస్తే పెళ్ళిచేసుకుంటాను. లేకపోతే ఇలాగే వుండిపోతాను, నష్టం ఏంటి? జీవితానికి పెళ్ళి చేసుకుంటేనే సార్ధకత కాదు కదా! తనను నమ్మిన వాళ్ళని ప్రయోజకుల్ని చేయటంలో లభించే తృప్తి పెళ్ళిలో వస్తుందని అనుకోను? పెళ్ళి చేసుకున్న వాళ్ళంతా ఏం సాధిస్తున్నారు?

    పిల్లల్ని కనటం, వాళ్ళని పెంచి పోషించటం.....పైగా భర్తగారి మాటకు జవదాటకుండా మెలగటం....నాకు ఇప్పుడు పెళ్ళి చేసుకోకుండానే పిల్లలున్నారు కదా! తమ్ముళ్ళను, చెల్లెల్ని నా సొంత పిల్లలే అనుకుంటే సరిపోతుంది. దీన్లో నాకు ప్లస్ పాయింట్ ఎంటంటే భర్త పోరులేదు, అన్నీ నా స్వంత నిర్ణయాలే తీసుకోవచ్చు. మరొకరి సలహాలను, సంప్రదింపులను తీసుకోకుండా ఎంచక్కా స్వేచ్చగా బ్రతకొచ్చు. ఈ జీవితమే బావుంది.

    నా స్నేహితులందరికీ పెళ్ళిళ్ళయిపోయి పిల్లలు కూడా పెద్దవాళ్ళయి పోయారు. నేనింకా పెళ్ళి చేసుకోకుండా వున్నానని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. "ఏంటే నీ పిచ్చి.....తమ్ముళ్ళకోసం, చెల్లెలు కోసం పెళ్ళి చేసుకోకుండా వుండటం ఏంటి? నీలాంటిదాన్ని మేము ఎక్కడా చూడలేదు అంటుంటారు. నా కాలేజ్ మేట్ సుహాసిని అయితే అప్పుడే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది. మొదటి పెళ్ళి మూడేళ్ళకే పెటాకులు అయితే, వెంటనే సంవత్సరంలోపే మరో పెళ్ళి చేసుకుంది. పేరుకే సుహాసిని. దాని బతుకంతా విషాదమే! నవ్వే మర్చిపోయింది. అప్పుడప్పుడు కనిపించినప్పుడు అంటుంటుంది.

    "నువ్వే బెటర్. ఒక ఆశయంకోసం పెళ్ళిచేసుకోకుండా వుండిపోయావు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నేను ఎండమావి లాంటి జీవితం కోసం పరుగు తీసి, తీసి అలసిపోయాను" అంటుంది.

    ఆశయంలాంటి పెద్దపెద్ద మాటలు అనను కానీ, ఎందుకు నా వాళ్ళని నేను పైకి తీసుకువచ్చిన తరువాతే నేను లైఫ్ లో సెటిల్ కావాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది మంచో, చెడో నాకే తెలియదు. ప్రస్తుతం మంచే అనుకుంటున్నాను. వాళ్ళు ప్రయోజకులయితే అంతే చాలు.
    అప్పుడు నా జీవితం గూర్చి ఆలోచిస్తాను అనుకుంది జయంతి. ఆమె బస్సులో వస్తూ ఆలోచిస్తోంది. పాపం అమ్మను చూస్తే జాలేస్తుంది. నా పెళ్ళి చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఆమె బ్రతికుండగా ఆమె కోర్కెను తిర్చగలనో లేదో నాకే తెలియదు.

    అమ్మ మాత్రం తిట్టి తిట్టి అలసిపోయింది. ఇక ఆమె నా పెళ్ళి విషయం ఎత్తకపోవచ్చు. బస్సు రావిచెట్టు దగ్గర ఆగింది. ఆమె మెల్లగా దిగింది.

                                                         *    *    *    *

    ఇంటిముందు అరుగుల పైన దాక్షాయణి, శివపార్వతిలు ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ బజారులో చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు సర్వోత్తమరావు ఇల్లు, అయన పక్కనే మరో ఇల్లు చెంచమ్మ అత్తది వుండేది.

    ఇంటిల్లిపాదీ పిల్లలంతా ఆమెను అత్తమ్మా....అత్తమ్మా అని పిలిచేవారు. ఆమెకు ఇరవై ఏళ్ళ వయసులోనే భర్త చనిపోయాడు. ఒక్కతే కూతురు, ఆమె కోసమే జీవించి వుంది గాని కూతురు లేకపోతే ఏనాడో చనిపోయేది.

    సర్వోత్తమరావుని అన్నయ్యా అని, కస్తూరిని వదినమ్మా అని ఆప్యాయంగా పిలుస్తుంది. వీళ్ళందరికి అమెంటే ప్రత్యేకమైన అభిమానం. భర్త లేనిదని ఆమెకు కొండంత అండగా వుండేవారు. భర్త ఆమెకు సంపాదించి పెట్టిన ఆస్తి ఆ ఇల్లు. మూడెకరాల పొలం. ఆ పొలం సురేంద్రనే కొలుకు తీసుకుని ఆమెకు ఏడాదికి సరిపడా గింజలు ఇస్తుంటాడు. వాటితో ఆమె కాలక్షేపం చేస్తుంది. ఆమె ఇల్లు మాత్రమే వుండేది సర్వోత్తమరావు ఇంటిపక్కన, అయితే గత అయిదేళ్ళలో మరో అయిదిళ్ళు వెలిశాయి. ఊరు కూడా పెరిగింది.

    జయంతి సందు చివరినుంచి చూసింది. అరుగులపైన కూర్చుంది ఎవరా అనుకుంటూ వస్తుంది. దూరంనుంచే దాక్షాయణిని గుర్తుపట్టింది గానీ ఆమె పక్కనే వున్న వ్యక్తిని గుర్తుపట్టలేదు.

    దగ్గరకు వచ్చిన తరువాత గుర్తుపట్టింది. చిన్నపిన్ని శివపార్వతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS