పెదనాన్న సర్కస్ పులీ
నువ్వు క్షవరం చేయించుకోవాలన్నాడు మా స్కూల్
మాష్టారు. తలకత్తిరించుకో నాయనా అంది మా అమ్మ.
నీకు క్షవరం అవసరమని హెచ్చరించాడు మా తమ్ముడు.
ప్రపంచమంతా నేను క్షవరం చేయించుకుతీరాలని
ఏకగ్రీవంగా తీర్మానించింది. ఒక పెద్ద బుట్టంత తలనాది.
అది పూర్తిగా మాసిపోయింది. అంత జుట్టు అనవసరం
అంది లోకం.
ఎప్పుడు క్షవరం చేయించుకుంటావని అందరూ నన్ను అడుగుతున్నారు.
నేను పేపర్లమ్మే కుర్రవాణ్ణి. రోజూ ఒక పెద్ద మనిషి నా దగ్గర 'ఆంధ్రప్రభ' కొంటూ ఉంటాడు. ఒకరోడ్డు దుక్కంత మనిషి వంద ఎకరాల పొలం, బ్యాంక్ లో యాభైవేల డబ్బూ, చిన్న తలకాయా ఉన్నవాడు. ఆ తలమీద టార్చిలైటు వేసి చూసినా జుట్టు కనపడదు. నున్నగా పొన్నకాయలా ఉంటుంది. ఈ బట్టతల పెద్దమనిషి నన్ను నా అడివినీ నలుగురికీ చూపించి ఆంధ్రప్రదేశ్ అంత జుట్టు అని ఎగతాళి చేసేవాడు.
అసహ్యంగా ఏమిటా జుత్తూ నువ్వు అన్నాడు మా తమ్ముడు.
ఏడు కొండలవానికి మొక్కుకున్నానన్నానేను.
అయితే వెంటనే మొక్కు చెల్లించు, అన్నాడు తమ్ముడు.
ప్రపంచమంతా నామీద పగపట్టినందుకు సంతోషంగానే ఉంది. కాని ఒక రోజు నా జుత్తులో ఊరపిచ్చుక ఒకటి గూడుకట్ట ప్రయత్నించింది. అప్పుడిక లాభం లేదని ఊళ్ళో సెలూన్ లోకి పరుగెత్తాను. ఒక మధ్యాహ్నం చెట్టుకింద పచ్చిక బయలులో చిన్న నిద్ర తీస్తుండగా ఈ పిచ్చిక నా తలమీద కృషి ప్రారంభించింది. ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంది. బహుశా అంతమందీ ఆ సమయంలో పడుకునే ఉన్నారేమో! వాస్తవికత చేసే వెర్రి చప్పుళ్ళేవీ, మోటారు హారన్లూ, టైపు మిషన్లూ, కుట్టు యంత్రాలూ ఏవీ వినబడటంలేదు. ఆహా! టైపుమిషన్లూ, కుట్టు యంత్రాలూ ఏవీ వినబడటం లేదు. ఆహా! ప్రపంచం! ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట సజీవంగా ఉండటంలో ఎంత సుఖం ఉంది! ఇక దీనికితోడు ఒక చిన్న యిల్లు కూడా ఉండేనా? ఆ యింటిచుట్టూ చెట్లూ ఇంట్లో బల్లలూ, కుర్చీలూ, ఒక వంటగదీ! గోడలమీద ఆంధ్రపత్రికలోంచి కత్తిరించిన బొమ్మలూ! ఎక్కడో ఒకచోట ఈ ప్రపంచంలో ఉండటం ఎంత అద్భుతం! ఎంత అమోఘం! బతకడం! కాలాన్ని అనుభవించటం! ఊపిరి పీల్చటం, నవ్వడం, ఏడ్వడం, తినడం, మాట్లాడటం, నిద్రపోవటం, ఎదగటం! ఉండడం ప్రపంచంలో.
ప్రపంచమనేది ఒకటే ఒకటి ఉండటం ఎంత బాగుంది! నేనూ అందులో ఉండవచ్చు. వంటిగాణ్ణి. ఎందుకో దేన్ని చూసినా దిగులు. అయినా అదే బాగుంటుంది. ఆ దుఃఖమే ఎంతో సంతోషం ఇస్తుంది. ఏవో కలలు కలిగిస్తుంది. నేనెప్పుడూ చూడని కలలు కంటాను. ప్రపంచంలోని పెద్ద పెద్ద నగరాలు, న్యూయార్క్! లండన్! పారిస్! బెర్లిన్! మాస్కో! టోకియో! ఆ వీధులూ, ఆవాళ్ళూ ఆ ప్రజలూ! ఇంటింటికీ తలుపులూ, కిటికీలూ! ఈ మాటు యుద్ధం వస్తే సైన్యంలో చేరిపోయి గవర్నమెంట్ ఖర్చుమీద ప్రపంచమంతా తిరిగివస్తాను. రాత్రిపూట రైళ్ళు! చీకట్లో సముద్రంలో స్టీమర్లు! గాఢాంధకార సముద్రం జాలిగా! గత కాలపు మధురక్షణాలు! చరిత్రలో కలిసిపోయిన పట్టణాలూ, నాగరికతా! పరిసమాప్తి పొందిన సామ్రాజ్యాలు! క్షణకాలం బతికి శాశ్వతకాలంగా చనిపోయిన జనాలు! ఆహా! పరమేశ్వరా! ఈ రోజుల్లో రోజుకొక కల కంటున్నాను నేను. బతికున్నవారికి చావులేదని కలకంటున్నాను. భూమి ఉన్నంతకాలం మానవుడు కూడా ఉంటాడు. ఆకాశంలో సూర్యుణ్ణీ, లోకంలో వెచ్చదనాన్ని కలగంటున్నాను.
అప్పుడు పిచిక చెట్టుమీద నుంచి దిగి నా తలలో గూడు కట్టటం మొదలుపెట్టింది. అంతట నాకు తెలివొచ్చింది.
కళ్ళు తెరిచి చూశాను, కదలకుండా!
ఒకానొక విహంగం నా చికురనికురుంబంలోకి ప్రవేశించిందని అది గానం ఆలపించేదాకా నాకు తెలివి రాలేదు. నా జీవితంలో ఎప్పుడూ అంత స్పష్టమైన సంగీతం వినలేదు. పిట్టపాటలో ఏదో కొత్తదనం ఉంది. అయినా అది సృష్టి ఆరంభం నుంచీ వినబడుతున్న పాటే! ఏమిటో దాని అర్థం? మాటలు సరిగా బోధపడలేదు గానీ, ఏడుపు, ఏడుపు, ఏడుపు అని ఆ పిచ్చిక అంటున్నట్టనిపించింది. అయినా ఈ విషాద సందేశాన్ని ఎంత సంబరంగా వినిపిస్తుందా పక్షి! సమస్త ప్రపంచమూ నిశ్శబ్దంగానే ఉంది. అప్పుడు విన్నాను ఈ పిట్ట తాలూకు ముగ్ధ సందేశాన్ని, మధురగానాన్ని, మహోపన్యాసాన్ని! ఒక్క క్షణంసేపు, ఇంకా నిద్ర మగత పూర్తి విడవనప్పుడు ఈ వ్యవహారమంతా సమంజసమే, స్వాభావికమే అనిపించింది నాకు. జుట్టులో పిట్ట నాకేదో చెప్పబోతూ! ఆ చెబుతున్న మాటకీ, అందలి అర్ధానికీ మధ్య వైర్యుధ్యం! ఒకవైపు దుఃఖం, ఇంకొక వైపు సంతోషం.
అబ్బే. ఇదేం బాగోలేదని ఆ మరుక్షణం అనుకున్నాను. జానెడు పిట్ట మనిషంత మనిషి జుట్టులో గూడు కట్టడం ఎంతం మాత్రమూ బాగులేదనుకున్నాను.
అనుకొని దిగ్గున లేచాను. పిచ్చుక హడలిపోయి పారిపోయింది.
ప్రపంచం రైటు! మా మాష్టారు రైటు! తమ్ముడు తప్పకుండా రైటు! కర్తవ్యం తలకత్తిరించుకోవటం. అప్పుడు మన పిచ్చుకలు జుత్తులో గృహనిర్మాణ ప్రణాళికలు అమలు చెయ్యవు.
ఊళ్లో మలబారు సెలూన్ ఒకటి ఉంది. దాన్ని కేశవన్ అనే ఆయన స్థాపించాడు. పూర్వాశమ్రంలో ఆయన ఒక రైతు అనుకుంటాను. జ్ఞాపకం వచ్చినప్పటినుంచీ అతనా షాపులో ఉన్నాడు. "మాతృభూమి" మొదలైన మళయాళపు పత్రికలు చదువుకుంటూ చుట్టలు కాలుస్తూ, వీధుల్లో పోయే మనుష్యుల్ని చూస్తూ ఏకాగ్రంగా కూర్చుంటాడు. అతనెప్పుడూ ఎవరికీ క్షవరం చేయటం నేను చూడలేదు. ఏమో పొరపాటున ఒకరో ఇద్దరో నూటికీ కోటికీ ఒకసారి అతని షాపులోకి వెళితే వెళ్ళి ఉండవచ్చును.
నేను వెళ్ళేసరికి అతను కునుకుతున్నాడు. తెరిచిన పుస్తకం ఒకటి అతని ముందుంది.
లేపి, క్షవరం అన్నాను. డబ్బులు తెచ్చానన్నాను.
దా, కూర్చో అబ్బాయీ! ఏమిటన్నావు నీపేరూ? ఉండు టీ తెప్పిస్తాను అన్నాడు మంగలాయన.
జుత్తు చాలా ముచ్చట వేస్తోంది అన్నాడు మంగలాయన కేశవన్.
క్షవరం చేయించుకోమని అందరూ సలహా ఇస్తున్నారన్నాను నేను.
లోకం వరసే అంత అన్నాడతను. అది చెయ్యి, ఇది చెయ్యి అంటూనే ఉంటుంది. ఏం? ఒక పిసరుజుత్తు ఎక్కువ ఉంటే లోకానికేం పోయింది? లోకం మాట వినకు. ఏమంటుంది లోకం? డబ్బు ఆర్జించమంటుంది. ఆస్తులు కొనమంటుంది. ఎందుకిదంతా? బతుకువాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వదు లోకం!
క్షవరం, అన్నాను నేను. చెయ్యగలవూ! పూర్తిగా డెక్కేసేయ్యాలి. ఆర్నెల్లదాకా మళ్ళీ నాకెవ్వరూ సలహా ఇవ్వకూడదు.
టీ, అన్నాడు మంగలాయన. మొదట మనం కాస్త టీ సేవించాలన్నాడు.
ప్రక్కనే ఉన్న టీ దుకాణానికి వెళ్ళి మంగలాయన స్వయంగా రెండు కప్పుల టీ తీసుకొచ్చాడు. ఇదివరకెప్పుడూ నేనెందుకు రాలేదో ఇక్కడికి? నిజంగా ఇతనెంత గొప్పవాడు! అతని మాటల్లో, నడకల్లో, అన్ని అభినయాల్లో గొప్పతనం ఉట్టిపడుతోంది. నేను లేవగానే మేలుకొన్న తీరులో అతని విశిష్టత కనిపించింది. ప్రపంచంలోని ప్రత్యేక వ్యక్తులలో ఇతడొకడు. ట్రిప్లికేన్ లో మలబారు మంగలి! అతని వయస్సు సుమారు యాభై. నా వయస్సు పదకొండు. ఇద్దరం ఇంచుమించు ఒకటే పొడుగు. బరువు కూడా సమానమే అనుకుంటాను. కాని ఏం మొగం అతనిది! ఎంత వర్చస్సు! నీ రహస్యం తెలిసిపోయిందిలే అని ప్రపంచంలో చెప్పగల జ్ఞాని అతడు. అకళంకమైన విశ్వమానవ ప్రేమ అతని కళ్ళలో జాలువారుతోంది.
నిద్రనుంచి అతను కళ్ళు విప్పినప్పుడు ఆచూపు ఏమన్నట్టు నాకనిపించిందంటే, ప్రపంచమా? ప్రపంచం సంగతా? నాకు బాగా తెలుసు. పాపం, పిసినిగొట్టుతనం, ద్వేషం, భయం! ఎక్కడా శుచిలేదు. అయినా ఈ లోకాన్ని ప్రేమించడం మానలేను అంది అతని చూపు.
ఊదుకుంటూ టీ తాగుతున్నాను. అమృతోపమానంగా ఉంది. ఇంత మంచి టీ ఎప్పుడూ చవిచూడలేదు నేను. వర్షకాలపు పవిత్రమైన బురదనీటి రంగులో ఉందా ద్రావకం.
మలయాళీ భాషలో కూర్చోమన్నాడు మంగలాయన. మనం ఎక్కడికీ వెళ్ళలేం. ఏమీ చెయ్యలేం. ఎందుకంత తొందర? ఇంతట్లోనే జుత్తు ఎదిగిపోదులే అన్నాడు కేశవన్.
నేను కూర్చుని మళయాళంలో నవ్వాను. మంగలాయన ప్రపంచం సంగతి చెప్పటం మొదలుపెట్టేడు.
కేరళ దేశంలోని ఒక పల్లెటూళ్ళో జన్మించిన తన పెదనాయన గురించి చెప్పాడు మంగలాయన.
