వరూథినికి రామదాసుమీద బాగా గురి కుదిరింది. వీలుచూసుకొని ఇంకో నాలుగువారాలు ఆగి, శివరాంకు ఉద్వాసన చెప్పి రామదాసును మేనేజర్ను చేయాలన్న నిర్ణయానికొచ్చింది. ఆమె ఉద్దేశ్యాన్ని గ్రహించిన రామదాసు వరూధినికి నీడలా తిరుగుతున్నాడు. ఆమె వంటిమీద ఈగ వాలకుండా కాపలా కాస్తున్నాడు. రామదాసు సహాయ సహకారాలవల్ల వరూథినికి థియేటరు మేనేజ్ మెంటు వ్యవహారాలు నల్లేరుమీద బండిలా సాగిపోతున్నాయి. శివరాం అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయాడు.
అతని విశ్వాసం రామనాధబాబు మీదే ఉంది. అది కన్పించకుండా పైకి నాటకం ఆడటం మొదలుపెట్టాడు. అయినా లాభం లేకపోయింది. రామదాసు,శివరాం తెరవెనకా ముందూ ఆడే నాటకం అంతా వరూధిని చెవిలో ఎప్పటికప్పుడే వేస్తున్నాడు.
రామనాథబాబుతో శివరాం ఎప్పుడు ఎక్కడ కలిసిందీ, వరూధిని లేనప్పుడు రామనాథబాబు ఎన్నిసార్లు వచ్చిందీ, ఆయన వచ్చినప్పుడు ఎవరితో ఎంతెంతసేపు మాట్లాడిందీ, థియేటరు చార్టుతోపాటు వివరాలు ఇస్తూనే వున్నాడు రామదాసు.
ఇకపోతే వేంకటపతికి వరూధిని పెత్తనం కొంత ఇబ్బందిగానే వున్నా హాలుమీద ఇదివరకు లేని అధికారాలేవో సంక్రమించినట్టుగా ఉంది. అతనికి అదివరలో లేని మర్యాదా మన్ననా హాల్లో పనిచేసేవాళ్ళనుంచి అందుతోంది. కాకపోతే వచ్చినచిక్కల్లా వరూధినితోనే! ఒక్క రూపాయి కూడా తన చేతుల్లో పడటంలేదు. కాఫీ బీడీలతో సహా లెక్కలు కట్టి బొటాబొటిగా ఇస్తోంది. ఎంత గింజుకున్నా రోజుకు రెండు రూపాయలకంటే దొరకటంలేదు. అది సినిమా బండి వెంట వెళ్ళి, సినిమా పేపర్లు పంచి పెట్టేవాడి కూలికంటే పావలా తక్కువే.
ఆవిడకు ఇష్టమైనప్పుడు ఓ బాటిలో, ఆరో, తనే తెప్పించి ఇస్తుంది. అది వెంకటపతికి ఒక మూలకు చాలటంలేదు. థియేటర్ స్టోర్ గదిలో వెంకటపతి దుకాణం వరూధిని సాగనివ్వడంలేదు. రోజులో ఎక్కువ టైం హాలు దగ్గిరే వుండటము చేత కన్ను వెంకటపతి మీద వేసే వుంచుతోంది. ఇంటిదగ్గర వుంటే సరేసరి.
ఓ నెల రోజులు ఆ బాధను ఎలాగో తట్టుకొన్నాడు. తర్వాత వరూధిని హాలు దగ్గరకు వొచ్చే సమయానికి వెంకటపతి ఇంటికి జారుకోవడం మొదలుపెట్టాడు. నాలుగు రోజుల్లో వరూధిని పట్టేసింది. మనిషిమీద మనిషిని పంపించి ఇంటి దగ్గర నుంచి పిలిపించడం మొదలుపెట్టింది.
వెంకటపతికి రామనాథబాబు ఉన్నప్పుడే బాగుండేదనిపించింది. అడిగినంత డబ్బు ఇచ్చేవాడు. వారానికి రెండు మూడు బాటిల్స్ ఇచ్చేవాడు. మొదట మొదట అయితే సీమ సరుకు చాలా ఖరీదైందే ఇచ్చేవాడు. మనిషి నిజంగా పెద్దమనిషి పెద్దచెయ్యి అతనిది. తనను ఎంత మర్యాదగా చూసేవాడు? మర్యాదా మన్ననా తెలిసినవాడు, జమీందారీ పాయ. అందుకే అన్ని గొప్ప లక్షణాలు. దీన్ని తగలెయ్యా! ఇది అంతటి పెద్దమనిషితోనూ పేచీ పెట్టుకొని పెత్తనం చెలాయిస్తూంది. దీనికి ఆ రామదాసుగాడొకడు తోడు. దాసుగాడికంటే శివరామే వెయ్యిరెట్లు నయం.
వెంకటపతికి గత మూడు రోజులుగా నోరు ఎండిపోతూంది. పెళ్ళాంమీద కసి కసిగా వున్నాడు. అవడానికి వరూధిని భర్తే అయినా వెంకటపతి రామనాథబాబుమీదే ఎనలేని అభిమానంగా వున్నాడు. బాహ్యరూపంలో వరూథిని పక్షంవాళ్ళు మనిషిగా కనబడ్డా వెంకటపతి మనసు రామనాథబాబు మనుషులవైపే మొగ్గింది.
మరో రెండు వారాలు గడిచాయి. శ్రీ రామనవమి వచ్చింది. వరూధిని థియేటర్లో సీతారామకళ్యాణం రోజుకు ఐదాటలు వేశారు. నవమి ఐదు రోజులూ హాలు ఫుల్ గానే వుంది. తర్వాత తొమ్మిది రోజులూ నాలుగాటలు వేసినా, జనం బాగానే వచ్చారు. తొమ్మిదోవారం దాటింది. సీతారామకళ్యాణం ఇంకా లాగుతూనే వుంది.
"దాసూ! ఈ బొమ్మ మన థియేటర్లో శతదినోత్సవం చేయించుకోవాలి!" అన్నది వరూధిని.
"శతదినోత్సవం ఏమిటమ్మా? సిల్వర్ జూబిలీ చేయించుకొంటుంది. ఇంకా రెండురోజులు పోనియ్యండి. మళ్ళీ రైజ్ కాకపోతే నన్నడగండి" అన్నాడు రామదాసు.
వరూధిని తృప్తిగా, నిండుగా నవ్వుకొంది.
"అమ్మగారూ! చెప్పటం మర్చిపోయా -"వరూధిని కేసి చాటంత ముఖం చేసుకొని చూశాడు రామదాసు.
"ఏమిటదీ దాసూ?"
"డిస్ట్రిబ్యూటరీ సర్కిల్లో మన హాలుకు మంచి పేరొచ్చింది. అంతా మీ మానేజ్ మెంటు గురించి చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు."
"ఎవరన్నారూ?"
"మొన్న కొత్తగా వచ్చిన రిప్రజెంటేటివ్ చెప్పాడు. ఇక నుంచి పెద్ద పిక్చర్లన్నీ మన థియేటర్ కె ఇస్తారు. ఏ డిస్ట్రిబ్యూషన్ సర్క్యూటయినా మన దగ్గరకే రావాలి. అంత మంచి పేరు పడిపోయింది మీ గురించి!"
"మనం హాలు కట్టి రెండేళ్ళవుతుంది కదా? ఒక్క పిక్చరన్నా ఇట్లా పోయిందా?" గర్వంగా ముఖంపెట్టి అడిగింది.
"నేనొచ్చాక మన హల్లో ఇంత గొప్పగా పోయిన బొమ్మలేదు. ఇందులో ఇంకో మతలబుందమ్మా! ఆ రామనాథబాబుగారేమో ఈ శివరాంగాడిమీద వదిలిపోయేవారు. వీడి సంగతి మీకు తెలుసుగా? బాగా పోయే పిక్చర్ని నొక్కేసేవాడు మూడోవారం తిరక్కముందే హోల్డ్ వరకు తెచ్చేవాడు. అట్లా ఎన్ని పిక్చర్లు దెబ్బతిన్నాయమ్మా! ప్రొడ్యూసర్లంతా ఒకటే ఏడుపుగదమ్మా! ఇప్పుడు చూడండి మద్రాసులో, విజయవాడలో, గుంతకల్లులో మీ గురించి ఎట్లా చెప్పుకుంటున్నారో! మా బావమర్ది విజయచిత్ర కంబైన్స్ లో అసిస్టెంటు డైరెక్టరుగా పని చేస్తున్నాడుగా! మొన్ననే వచ్చాడు. ప్రతి ప్రొడక్షన్ కంపెనీలో మీ గురించే మాట్లాడుకొంటున్నారమ్మా! ఇండస్ట్రీలో ఇప్పుడు మన థియేటర్ గురించి తెలియనివాళ్ళు లేరంటే నమ్మండి!" ఇంకా ఏం చెప్పాలా అని ఆగి ఆలోచించసాగాడు రామదాసు.
"రామదాసూ! రామనాధబాబు వారాల తరబడిగా మద్రాసులో మకాం వేస్తున్నాడు గదా, ఏదయినా పిక్చర్ తీసే ప్రయత్నంలో వున్నాడా ఏం?" అడిగింది వరూధిని, ఆ రోజు కార్లో రామనాథబాబు ప్రక్కకూర్చొని వున్న ఆడది గుర్తొచ్చి.
"అది సినిమా ముండా ఏమిటి?" అనుకొంది వరూధిని. కోలవెన్ను షావుకారుగారి కోడలన్నారుగా? మరి మద్రాసు చుట్టూ తిరుగుతున్నాడెందుకూ? దాన్ని హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తాడా ఏం, కొంపదీసి? అది హీరోయిన్ గా వేస్తే జనం హాలుమీద రాళ్ళు వెయ్యరూ? తెర తగలబెట్టరూ? తన ఆలోచనల్లో తనుగా వున్న వరూథినికి రామదాసు చెప్పింది వినిపించలేదు.
"అసలు సంగతేమిటంటే - షావుకారిగారికోడల్ని బుట్టలో వేసుకొని హైదరాబాదులో కట్టించబోయే హాలుకు పెట్టుబడి పెట్టించా...." రామదాసు ఆఫీసు గదిలోకి వస్తున్న శివరాంను చూసి ఆపేశాడు.
రామదాసు చెప్పిందే వరూధిని మనస్సును పట్టి పీడించసాగింది. రామనాథబాబు అలా ప్రవర్తించటానికి కారణం ఇదేనన్నమాట? దాన్ని అడ్డం పెట్టుకొని హైదరాబాదులో హాలు కట్టాలని చూస్తున్నాడు. అతని మొదటి హాలు కూడా ఇలాగే కట్టి వుంటాడు. దేని సొమ్ముతో కట్టాడో? అదేమయిందో? పైకి చూస్తే పెద్ద జమీందారల్లే కన్పిస్తాడు. రామనాథబాబు ఆస్తంతా ఇలా ఆర్జించిందే అయి వుండాలి? పోనీయ్! ఆ ముదనష్టం తనకెందుకూ? పీడా విరగడయిపోయింది.
తను తన హాలు జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు! తనకు అంతకంటే ఏం కావాలి? ఇంకా మూడో నెల అవలేదు. పదకొండు వారాలకే పాతిక వేలు థియేటర్ వాటా మిగిలింది. వడ్డీలూ, డిప్రెసియేషన్ వగైరా పోను ఇరవై వేలు నికర లాభం.
ఈ లెక్కన ఆ రామనాథబాబు ఈ రెండేళ్ళలో ఎంత తిన్నాడో? తనే పిచ్చిముఖం. పట్టించుకోకుండా ఊరుకుంది. ఈ హాల్లో కొట్టేసిన డబ్బుతోనే హైదరాబాదులో స్థలం కొంటున్నాడు. థియేటర్ కేమో ఆమెచేత పెట్టుబడి పెట్టిస్తున్నాడు. మొత్తం థియేటర్ లో సగం భాగం తను కొట్టేస్తాడు.
తనను మాత్రం ఏం చేశాడు? ఇరవైవేలు పెట్టించి తనచేత లిటిగేషన్ లో వున్న స్థలం కొనిపించలా? చివరకు ఆ స్థలం మళ్ళీ కొని, థియేటర్ కు డబ్బంతా తనచేత పెట్టించాడు. తరుగైన సొమ్ము లోన్ గా తెచ్చాడు. ఇంతకీ అప్పులైనా తీర్చాడా? అంతా పులుసులో వేసుకొన్నాడా? అసలు తనకు లెక్కలు చూపినంత థియేటర్ కు ఖర్చయిందా? అందులోనే ఓ లక్షరూపాయిలదాకా కొట్టేసి ఎక్కువ చెప్పాడా? అయిందేదో అయిపోయింది ఇప్పటికైనా తను కళ్ళు తెరిచింది .... అంతే చాలు!

