"చేదులేదు, తీపి లేదు....రేపు మనం వెళుతున్నాం. రేపు ఆదివారమే కదా, అందరికి సెలవే. జయంతి కూడా ఇంట్లోనే వుంటుంది" అంది శివపార్వతి.
"జయంతి చదువుకునేటప్పుడు ఎప్పుడన్నా మనింటికి వస్తే భోజనం కూడా పెట్టకుండా పంపించావుకదే! ఇప్పుడు అది సంపాదిస్తుందని ఏ ముఖం పెట్టుకుని వెళతావు?" అన్నాడు సుందరం.
'నేనెందుకు పెట్టలేదు! భోజనం చేస్తావా జయంతి అంటే వద్దు వద్దు అనేది. అది కూడా నా తప్పేనా?" అంది.
"ఇంటికొచ్చిన వాళ్ళని భోజనం చేస్తావా అని కాదే అడిగేది.....భోంచేయండి అని అనాలి" అన్నాడు సుందరం అన్నంలో పెరుగు వేసుకుంటూ.
"అదేంటి! అప్పుడే పెరుగు వేసుకుంటున్నారు?" అంది శివపార్వతి కంగారుగా.
"ఆ...నీ మాటలకే కడుపు నిండిపోయింది. ఇంకా ఎందుకులే" అన్నాడు సీరియస్ గా అన్నం కలుపుకుంటూ.
"అబ్బో! రోషానికేం తక్కువలేదు" అంది పార్వతి.
"అదుంటే ఎప్పుడో బాగుపడే వాడినే. నీకు ఇంత నోరు ఎండుకోచ్చేది? నేను చేసిన ఒకే ఒక తప్పుకి జేవితంతం నీ మాటలకు అణిగి మణిగి వుండాల్సి వస్తుంది. ఏంచేద్దాం, అంతా నా ఖర్మ...." అనుకుంటూ ప్లేటులో చేతులు కడుక్కున్నాడు.
"ఆ! అంతా నేను చెప్పినట్లే వింటున్నట్లు....ఏ పెళ్ళాం అయినా మంచి కోరే చెపుతుంది. నా మీద పడి ఎడుస్తారెండుకు?" అంది కంచం తీస్తూ.
సోమసుందరం ఏ బదులు చెప్పకుండా పంచలో కుర్చీలో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు.
పార్వతి ఎందుకు యిలా మారిపోయిందో అతనికి ఇప్పటికి అంతుచిక్కడు. అక్కడున్నప్పుడు అందరితో ఎంతో బావుండేది....పట్నం ససేమిరా రానంది. దాక్షాయణి అక్కని, జయంతిని వదిలి వుండాలేనంది. అలాంటి వ్యక్తీ పట్నం వచ్చిన రెండు మూడు నెలలోనే వాళ్ళని పూర్తిగా మర్చిపోయింది. పైగా నన్ను కూడా వెళ్ళనియ్యకుండా కట్టడి చేసింది. దానంతటికి కారణం వాళ్ళ అమ్మే అయివుంటుంది. మీరు వాళ్ళ దగ్గరకు వెళితే వాళ్ళ భాత్యతలన్నీ మీకు చుట్టుకుంటాయ్. నువ్వు వెళ్లొద్దు, నీ మొగుడ్ని వెళ్ళనియ్యవద్దు అని చెప్పి వుంటుంది. లేకపోతే శివపార్వతి ఇంత దారుణంగా మారదు. పూర్తి స్వార్ధపరురాలిగా మారిపోయింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు సుందరం.
"ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? వెళ్ళొద్దులేండి. మీకిష్టం లేకపోతే ఎందుకు? దానికే అంతగా బాధపడాల్సిన పనిలేదు. రండి పడుకుందురు, ఇప్పటికే పొద్దుపోయింది" అంటూ పిలిచింది శివపార్వతి.
"ప్చ్! నేను పట్నం వచ్చి పొరపాటు చేశాను. అటు వాళ్ళకు దూరమయ్యాను. ఇటు పెళ్ళాన్ని చెడగొట్టిన వడినయ్యాను. అక్కడ వున్నప్పుడు కడిగిన ముత్యంలా వుండేది. ఇప్పుడు బురద గుంటలో పొర్లాడే పందిలా తయారయింది' అని కసితీరా తిట్టుకున్నాడు పార్వతిని. ఆ పోలికలో అతని మనసు కాస్త శాంతపడింది.
40
జయంతి ఉద్యోగంలో చేరి అప్పుడే అయిదేళ్ళు అయింది!
ప్రస్తుతం అసిస్టెంట్ లైబ్రరియన్ పోస్టు నుంచి ప్రమోషన్ వచ్చి లైబ్రరియన్ అయింది. తను చదివిన కళాశాల లైబ్రరీలోనే అయిదేళ్ళక్రితం చేరిన జయంతి ఎంతో క్రమశిక్షణతో, సిన్సియర్ గా ఉద్యోగం చేయటం వల్ల కళాశాల కమిటి ఆమెకు అయిదేళ్ళలోనే ప్రమోషన్ ఇచ్చింది. ఆ కళాశాలలోనే ఉద్యోగం చేస్తూ, ప్రయివేటుగా బి.ఎ. డిగ్రి కూడా పూర్తిచేసింది. ఆ కళాశాల కమిటికి అమెంటే ప్రత్యేకమైన అభిమానం, అదే కళాశాలలో ఎఫ్.ఎ. కాలేజి ఫస్ట్ వచ్చింది. అందుకే ఆమె అడిగిన వెంటనే మొదట్లో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. అది క్రిస్టియన్ కళాశాల ఆ కమిటి కూడా ఎంతో సిస్టమేటిక్ గా పనిచేస్తుంది.
సిన్సియర్ గా పనిచేసేవారికి గుర్తింపు కూడా అదే స్థాయిలో లభిస్తుంది. అక్కడ జయంతి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ గత అయిదేళ్ళలోనే ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తన మంచి సంస్థ అయిన కళాశాలను వదులుకోవటం ఇష్టం లేక అక్కడే వుండిపోయింది. తను కష్టాల్లో వున్నప్పుడు అడిగిన వెంటనే ఉద్యోగం ఇచ్చారనే కారణం కావొచ్చు....కాకపోతే మొట్టమొదటి ఉద్యోగం అనే సెంటిమెంట్ కావొచ్చు, ఏదైనప్పటికీ జయంతి ఆమెకు వచ్చిన వేరే ఆఫర్లను వదులుకుంది. అంతేకాక స్వతహాగా ఆమెకు పుస్తక పఠనమంటే ఎంతో మక్కువ.
కనిపించిన పుస్తకం వదలకుండా చదువుతుంది. ఆ లైబ్రరీలో వున్న సగం నావల్స్, వివిధ రకాలయిన చారిత్రాత్మకమైన పుస్తకాలను గత అయిదేళ్ళుగా చదువుతూ పూర్తిచేసింది. జయంతి వేరే ఉద్యోగ అవకాశాలను వదులుకోవటానికి ఇదో కారణం కూడా కావొచ్చు. ఈ అయిదు సంవత్సరాల కాలంలో జయంతి బి.ఎ డిగ్రి పుర్తిచేయటమే కాకా ప్రముఖుల రచనలన్నీ దాదాపు చదివింది. తెలుగు, ఇంగ్లీషు లిటరేచర్ లో ప్రముఖుల రచనలనూ, వ్యాసాలు కవితా సంపుటాలను ఎంతో ఆసక్తిగా చదువుతోంది జయంతి. దీనివల్ల ఆమెకు పరిపూర్ణమైన వ్యక్తిత్వం అలవడింది.
సొంతంగా రచనలు చేసే సామర్ద్యం కూడా అలవడింది. ఇంతవరకు ఆమె రాసిన రచనలు ఏ పత్రికకు పంపలేదు గానీ పంపినట్లయితే ఖచ్చితంగా ప్రచురితమయ్యేవి....అంతటి బావుకత్వం ఆమెకు అలవడింది.
ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దానిని కాగితం మీద పెట్టటం అలవాటు చేసుకుంది. అలా రాసిన కవిత్వాలు, కధలన్నీ చక్కగా ఫైల్ చేసి పెట్టుకుంది. ఆమె రచనలకు ఏకైక అభిమాని, పాఠకురాలు, ఒక్క దాక్షాయణి మాత్రమే. ఎన్నోసార్లు చెప్పింది ఆమె జయంతికి వీటిని ఏ పత్రికకు అయినా పంపమని, కానీ జయంతి ఒప్పుకోలేదు. నాకు ఇంకా పరిపక్వత రాలేదు. మనం రాసే రచనలు మిడిమిడి జ్ఞానంతో కాదు, అవి పరిపూర్ణత్వంతో వుండాలి, నాకు పూర్తి నమ్మకం, శాటిస్ ప్యాక్షన్ కలిగినప్పుడు మాత్రమే వాటిని పత్రికకు పంపుతాను అంటుంది జయంతి దాక్షాయణితో.
