Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 72


    చందనంగారు నా ఆతిథ్యం స్వీకరించి జేబులోంచి ఒక సిగరెట్ కేస్ తీసి, తెరచి పట్టుకున్నాడు. అతని సిగరెట్టును అంగీకరించాను నేను. ఇద్దరం సిగరెట్లు కాలుస్తున్నాము.
    "రావుబహద్దూర్ వెంకటరత్నంగారు ఉదయం మీ దగ్గరికి వచ్చారని తెలిసింది. వారి రిపోర్టునుబట్టి చూస్తే...మరి...మరి కారులో మీరు ప్రధాన కార్యాలయానికి రాదలచుకోలేదని కనబడుతోంది. మీకెలాగయినా నచ్చజెప్పి మిమ్మల్ని సైన్యంలో చేర్చవలసిందిగా మా సైన్యోద్యోగి నన్ను పంపించాడు. ఇది వెనకటి యుద్ధాలవంటిది కాదు. మనం స్వతంత్రంగా ఇందులో పాల్గొంటాం. నాగరికతా రక్షణకి జరుగుతున్న ఈ యుద్ధంలో మీవంటివారంతా చేరక తప్పదనుకుంటాను."
    చందనంగారితో సంభాషణ ముచ్చటగానే ఉంది. అయితే నాగరికతను రక్షించడానికొక యుద్ధం అవసరమయిందంటే నాకు నవ్వొచ్చింది. నాగరికతకి ప్రమాదం రానుండడం వల్లనే అతనివంటి వాళ్ళు పని కట్టుకొని నా దగ్గరికి వచ్చారా అనిపించింది.
    "అయినా ఏ నాగరికత?" అన్నాను.
    "మన నాగరికత. భారతీయ సంస్కృతి. ప్రపంచం ఇప్పుడు రెండు శిబిరాలుగా విడిపోయింది. మనం ధర్మపక్షం వహించి పోరాడుతున్నాం."
    "నాకు ఏ పక్షం తరపునా పోరాడాలని లేదు. మీ సోదరులతోబాటు మీరు కూడా రణరంగంలోకి దూకవలసిన సమయం ఆసన్నమయింది. లేకపోతే రాక్షసశక్తులు విజృంభించి చిరకాల సంప్రదాయానుగతమైన మానవ నాగరికతను భస్మీపటలం చేస్తాయి."
    "నిజంగానా?"
    "తప్పకుండా! ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడడానికి ఈ యుద్ధంలో చేరాలి. అవసరమైతే ప్రాణత్యాగం చెయ్యాలి."
    "మీరు చేస్తారా?"
    "స్వాతంత్ర్యం కోసం తప్పకుండా ప్రాణత్యాగం చేస్తాను."
    దేనికోసమయినా ప్రాణత్యాగం చెయ్యడం నాకిష్టంలేదని నేనన్నాను. చాలామంది ఉరిపోసుకునీ, రైలుకింద పడిపోయీ చచ్చిపోతూ ఉంటారు గాని అందులో లాలిత్యమేమీ లేదన్నాను. యుద్ధంలో కొన్ని నవీన పద్ధతుల ద్వారా చచ్చిపోవడానికి అవకాశాలు లభిస్తాయి గాని అసలు చచ్చిపోవడమే నాకిష్టం లేదని అతనికి స్పష్టం చేశాను. కథా రచయితగా వీలయినంతకాలం సజీవంగా మిగలడమే నా ఉద్దేశమని చెప్పాను.
    "బాగా ఆలోచించుకోండి. నిర్బంధ శాసనం వెలువడకముందే సేనలో చేరితే మంచిది" అంటూ అతను వెళ్ళిపోయాడు.
    ఆరోజుకి మరి నా కథ సాగింది కాదు. యుద్ధం వచ్చి నన్ను రాయనిచ్చింది కాదు. ఏమీ తోచక వీధిలోకి వచ్చాను. ప్రజల్లోకూడా పెద్ద మార్పు వచ్చినట్లు కనబడింది. కాని ఒకటిమాత్రం నిశ్చయం చేసుకున్నాను. మళ్ళీ ఎవరైనా వచ్చి నన్ను యుద్ధంలో చేరమంటే వాడి తలకాయ బద్దలుకొడదామనుకున్నాను.
    సాయంత్రం ఇంటికి రాగానే నా గదిలో మా పెత్తల్లిగారి భద్రంగాడున్నాడు. కపిలవాయి రామనాథశాస్త్రి పాడిన 'బలే మంచి చౌక బేరమూ' అనే గ్రామఫోను రికార్డు వింటూ సిగరెట్టు కాలుస్తున్నాడు. వాడికి సంగీతమంటే చెడ్డ సరదా. ముఖ్యంగా కపిలవాయిని మించిన గాయకుడు ప్రపంచంలో లేడని వాడి అభిప్రాయం.
    "యుద్ధం మీద నీ అభిప్రాయమేమి"టని అడిగాను.
    "నన్నడక్కు. నాకు తెలియదు."
    "కొయ్యకు. నిజం చెప్పు. నీకు మైనారిటీ తీరింది. మైనారిటి తీరిన వాళ్ళంతా సైన్యంలో చేరవచ్చు."
    "పటాలాలంటే నా కసహ్యం?"
    "నిర్బంధ శాసనం వస్తే ఏం చేస్తావు"
    "నేను రానంటాను. వరసలో నిలబడలేను. కవాతు చెయ్యలేను."
    "లేకపోతే జైల్లో వేస్తారు."
    "వేసుకోమను."
    "నాగరికతను కాపాడాలని నీకు లేదూ?"
    "లేదు."
    భద్రంగాడు నాకు నచ్చాడు. ఇవాళ ఇద్దరు పెద్దమనుష్యులు నన్ను సైన్యంలో చేర్చడానికి ప్రయత్నించారనీ, ఇద్దర్నీ అంపకం పెట్టాననీ చెప్పాను.
    "మంచిపని చేశావు. ఈ యుద్ధం నువ్వు ప్రారంభించలేదు కదూ! ఎవళ్ళు ప్రారంభించారో వాళ్ళనే చేసుకోమను యుద్ధం."
    వారం రోజులు గడిచాయి. ఖాకీ దుస్తులు ధరించిన ఒక అమ్మాయి మా యింటికి వచ్చి "సూర్యనారాయణగారూ! మీరు కథలు రాస్తారని మాకు తెలిసింది. ఈ యుద్ధంలో ఎలాగయినా మీ సహకారం పొందదలచుకున్నాము. యుద్ధ ప్రచారశాఖలో మీరు చేరి సేనలలో పనిచేస్తున్న యువతీ యువకుల అసమాన సేవని కొనియాడుతూ మీరు కథలూ వ్యాసాలూ రాయాలి. ఏమంటారు?" అని అడిగింది.
    "అటువంటివి రాయడం నాకు చేతకా"దన్నాను నేను.
    "ఇందులో కష్టమేమీ లేదు. కావలసిన భోగట్టా అంతా మేమే ఇస్తాము. మీరు దాన్ని చక్కని భాషలో పేర్లుమాత్రం మార్చి రాస్తే చాలును."
    "కథలు ఎలాగ రాయాలో నాకెవరూ చెప్పనక్కరలేదు" అన్నాను.
    "ఆలోచించుకొండి. నెలకు మూడు వందలు జీతం. బుష్ కోటు వేసుకోవచ్చును. మిలిటరీ ఫాయాలోనే ఉంటుంది ఉద్యోగం."
    నా జన్మలో నేను నెలకి మూడు వందలు ఆర్జించ గలగడం కష్టమే. బుష్ కోటు వేస్తే నేను బాగుంటాను కూడా. అయినా ఆ ఉద్యోగం నా కక్కరలేదని ఆవిడని పంపించివేశాను.
    రెండు నెలలు గడిచాయి. ఒక ఉదయం మా భద్రంగాడు న్యూస్ పేపరుతో ప్రత్యక్షమయ్యాడు. పద్దెనిమిదేళ్ళ వయస్సు దాటినవారంతా నిర్భంధ సైనిక సేవ చెయ్యాలని ఉత్తరువు జరిగింది. కొన్నాళ్ళనించీ మనం పోరాడుతున్న పక్షం అపజయాలు పొందుతోంది. వార్తాపత్రికలలో శీర్షికల సైజులు నానాటికీ హెచ్చవుతున్నాయి. జాతీయ ఋణపత్రాల అమ్మకం హెచ్చుతుంది. మీటింగులూ, ప్రార్ధనలూ హెచ్చవుతున్నాయి.
    సిగరెట్టు వెలిగించి వార్తాపత్రికని దీక్షగా చూస్తున్నాము.
    "ఏమంటూ" వన్నాడు భద్రంగాడు.
    "వెళ్ళను గాక వెళ్ళను" అన్నాను.
    అయిదు రోజులు పోయాక నాకో ఉత్తరం వచ్చింది. మర్నాటి ఉదయం ఎనిమిది గంటలకి స్థానిక సైన్యాల ప్రధాన కార్యాలయంలో హాజరు కావలసిందని. మర్నాటి ఉదయం ఎనిమిది గంటలకి నా గదిలో నేను కూర్చుని కథ రాయడానికి ప్రయత్నిస్తున్నాను. పదకొండు గంటలైనా కథ పెగల్లేదు.
    ఇక ఈ రోజుకి కథ సంగతి ఆలోచించకూడదనుకుంటున్నసరికి రావుబహద్దూర్ వెంకటరత్నంగారూ, మరో నలుగురు పెద్దమనుష్యులూ నా గదిలోకి తోసుకొచ్చారు. వారి వెనకాతల ఇద్దరు మిలిటరీ పోలీసులు నిలుచున్నారు. వీధిలో ఖరీదైన రెండు మోటారు కార్లున్నాయి.
    "వీడే చింతపిక్కల సూరిబాబు!" అని నన్ను చూపిస్తూ రావుబహద్దూరుగారు "ఉదయం ఎనిమిదికి ఎందుకు రాలేదూ?" అన్నారు.
    "రాలేదు" అన్నాను నేను.
    "ఉత్తరం నెంబరు (అ) - 247 నీకు అందిందా?"
    "అందింది."
    "చదువుకున్నావా?"
    "చదువుకున్నాను."
    "అయితే ఆఫీసుకెందుకు రాలేదు?"
    "కథ రాసుకుంటున్నాను."
    "తిన్నగా జవాబు చెప్పు. ఒంట్లో సుస్తీగా వుందా?"
    "లేదు. ప్రస్తుతం నేను చాలా ఆరోగ్యంగా వున్నాను."
    "అయితే, సైన్యంలో చేరనందుకు నిన్ను అరెస్టుచేస్తున్నాను."
    ఈ మాటలనడం అతను పూర్తిచేశాడో లేదో నేను రావుబహద్దరును ఒక మొత్తుమొత్తి కింద పడేశాను. డొక్కలో అతణ్ని తంతూ ఉండగా మిగిలినవాళ్లు నన్ను లాగేశారు. వాళ్ళనికూడా తన్నడానికి ప్రయత్నించాను. పోలీసులు నాకు కాళ్ళూ చేతులూ ఆడనివ్వడం లేదు. ఇదంతా రెండు మూడు నెలలో రెండు మూడేళ్ళో గడచి నా గదిలో కథ రాసుకొనేటప్పుడు, ఇంకొకరు నా గదిలోకి ఎందుకు రావాలి? నా చుట్టూ నేనొక చిన్న నాగరికతని సృష్టించుకున్నాను. వీళ్ళెవరు నన్ను నిర్బంధించడానికి? కాని అందరూ కలిసి నన్ను వీధిలోకి లాక్కుపోతున్నారు. "మీ యుద్ధాన్ని మీతో కలిపి తగలెయ్యా!" అని అరుస్తున్నాను నేను. "ఎందరిని చంపినా ఈ ముసలివాళ్ళకి తృప్తిలేదు. నన్ను చంపక మీ యుద్ధం మీరే చేసుకొండర్రా" అని కేకలు వేస్తున్నాను. "వెంకటరత్నంగారు చచ్చిపోకపోతే అదృష్టవంతుడివే. జైలుతో సరిపోతుంది. చచ్చిపోతే మాత్రం నిన్ను గుండు వేసి కాల్చేస్తాం." అని ఎవరో అంటున్నారు. వాళ్ళు నన్ను ఈడ్చుకు వెళ్లుతున్నంతసేపూ ఆ మాటలే నా చెవులో గింగురుమంటున్నాయి.

                                       * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS