మెయిన్ గేటులో నుంచి ఒక్కడు పోయే సందుమాత్రం వదిలి నలుగురు మనుషులు గేటు తన్నిపట్టి నిల్చున్నారు. అయినా ఒక్కడు దూరే సందులోంచి ఇద్దరు తోసుకుపోతున్నారు.
జనం వత్తిడి అంతగా లేనిచోట దూరంగా నిలబడి వరూధిని పరిశీలనగా చూస్తోంది. ఎన్నోసార్లు తను థియేటరుదగ్గర ఈ దృశ్యాన్ని చూసింది. ఇది ఎంత బాధాకరమైనదో ఇదివరకు ఆమెకు తట్టలేదు లోగడ జనం అంతా గొర్రెల మందలా కన్పించేవారు. ఇంత పరిశీలనగా తనెప్పుడూ చూడలేదు.
"పిక్చరేమిటి?" వరూధిని తలెత్తి చూసింది.
గేటు పైగా ఉన్న ఆర్చిమీద బ్యానరూ, కట్ అవుట్ బొమ్మలూ కన్పించాయి.
"సీతారామ కల్యాణం!" అందుకే ఇంత పిచ్చిజనం. హరిశ్చంద్ర, సీతారామ కళ్యాణం, లవకుశ - ఎన్నేళ్ళు గడిచినా ఈ దేశంలో చూస్తూనే ఉంటారు.
పిక్చరొచ్చి ఎన్నిరోజు లయింది? "శుక్రవారం ఐదాటలతో బ్రహ్మాండమైన విడుదల!" తాటికాయంత అక్షరాలతో గోడమీద రాసి ఉంది.
ఇవ్వాళ ఆదివారమా? మూడు రోజులనుంచీ ఇంత రష్ గా వుందా? మరి కలెక్షన్స్ బాగా వుండి వుండాలే? మరి శివరాం అదేమిటి అలా ఏడుస్తాడు?
"రూపాయిన్నర టికెట్ మూడు రూపాయలు! కుర్చీ టికెట్ మూడు రూపాయలు! టికెట్ కావాలండీ?" గళ్ళ చొక్కావాడొకడు ఆమె పక్కగా వచ్చి నిలబడి అడుగుతున్నాడు.
వరూధిని తిరిగి వాడి ముఖంలోకి తేరిపార చూసింది. వాడు నాలుక్కరచుకొని జనంలోకి పారిపోయాడు. తనలాగా నిలబడ్డవాళ్ళదగ్గరికెళ్ళి టికెట్లు అమ్ముతున్నాడు. అలాంటివాళ్ళు ఇంకా నాలుగురైదుగురు కన్పించారు. ఒకడు నేల, ఒకడు బెంచీ, మరొకడు కుర్చీ టికెట్లు బొత్తులు పెట్టుకొని జనంలో తిరుగుతూ అమ్ముతున్నారు. నెల టికెట్ కౌంటరు మీద చెక్క పడింది. అక్కడ మూగిన జనం ఒక్క ఊపున అడ్డం వచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ, బెంచీ కౌంటర్ మీద, అలలా వచ్చిపడ్డారు. అంతకుముందే అక్కడున్నవాళ్ళు గోడకు కర్చుకుపోయారు.
"ఘోరం! ఘోరం!" అనుకొంది వరూధిని.
బెంచీ టికెట్ కౌంటరుకూడా మూసివేశారు. బ్లాకులో అమ్మే కుర్రాళ్ళ గిరాకీ పెరిగిపోయింది.
"ఆట మొదలుపెట్టారంట. పదండి" పపుడే టికెట్లుకొన్నవాళ్ళు గేటుమీద పడ్డారు. ఎంతమందిగేటు దగ్గర మూగినా గేటు మాత్రం మనిషి పోయే సందుకు మించి తెరచిలేదు.
వరూథినికి కంపరమెత్తిపోయింది. ఎందుకా గేటు అలా బిగించి చస్తారు? హాల్లోకి వెళ్ళేప్పుడు ప్రతి గేటు దగ్గరా మనుషులు ఉండనే ఉంటారు కదా? మళ్ళీ ఇక్కడ ఈ ఏపుడు ఏమిటి? ఇదేనా శివరాఁ గాడి మేనేజ్ మెంటు? రామనాథబాబు అనుభవమూ తెలివీ? టిక్కెట్లు కొన్న జనం ఆట మొదలుపెట్టారని లబలబ లాడిపోతున్నారు. అయినా అ గేటు దగ్గర తంతు అలాగే సాగుతోంది.
వరూధిని జనాన్ని తప్పించుకొని గేటుదగ్గర కొచ్చింది. గేటు లోపల్నుంచి నలుగురు ఎద్దుల్లాంటి మనుషులు, ఇనప సువ్వలు పట్టుకొని, గేటు అటూ ఇటూ అంగుళం బెసక్కుండ తన్నిపట్టి నిలబడి ఉన్నారు. అందులో ఒకడు వెంకటపతి!
ఈయన రోజూ ఇక్కడ చేసే పని ఇదేనా? వరూథినికి వళ్ళు మండిపోయింది.
"గేటు వదలండి!" వరూధిని బిగ్గరగా అన్నది.
జనాన్ని అదుపుచేసే పనిలో వున్నవాళ్ళు వరూధిని మాట వినిపించుకోలేదు. వరూధిని ఇంకా ముందుకు వచ్చి గట్టిగా అరచినంత పనిచేసింది.
"మీకే చెప్పేది! మోద్దుల్లా నిలబడి ఎందుకు అలా జనాన్ని అడ్డగిస్తారు?"
"అమ్మగారు, అమ్మగారు! తప్పుకోండి. తప్పుకోండి!" జనాన్ని ఇరగతోసి త్రోవ చేశారు.
వరూధిని ,లోపలకొచ్చి గేట్లు బార్లా తెరిపించింది. వరమిచ్చిన దేవతను చూసినట్టుగా వరూధిని చూశారు జనం.
మూడు నిముషాల్లో జనం అంతా కరిగిపోయారు.
"అట్టా వదిలేస్తే టికెట్ లేనివాళ్ళంతా థియేటరు గేట్లమీదకు ఎగబడతారమ్మా!" అన్నాడు కొండలరావు.
"అందుకని డబ్బులిచ్చి టిక్కెట్లు కొన్నవాళ్ళను మోచేతుల్తో కుమ్మి, పొడిచి హింస పెడ్తారా? ఆ ఏడుపేదో టికెట్లు కలెక్టు చేసే గేటు ముందే ఏడిస్తే పోతుందిగా? అక్కడ నాలుగు గేట్ల మీద సర్దుకుంటారు జనం."
వరూధిని నేరుగా థియేటర్ లోకి వెళ్ళి పదినిముషాలు నిలబడింది. హాలంతా నిండుగా వుంది. తెరమీద విశ్వామిత్రుడు వచ్చి దశరథుడ్ని రామలక్ష్మణుల్ని తనతో పంపమంటున్నాడు.
"వాళ్ళు ముక్కు పచ్చలారనివాళ్ళు. వాళ్ళొచ్చేం చేస్తారు? కావాలంటే నేనే వస్తాను" అంటున్నాడు దశరథుడు.
"ముసలాడివి నువ్వొచ్చేం చేస్తావు? వద్దు పంపితే వాళ్ళనే పంపు. లేకపోతే చూడు ఏం చేస్తానో?" అన్నాడు విశ్వామిత్రుడు.
దశరథుడు ఏడవడం మొదలుపెట్టాడు.
ఛీ! ఛీ! మహారాజుక్కూడా ఏడుపే?
వరూధిని తెరమీది దశరథున్ని చూడలేక థియేటర్లోనుంచి బయటికొచ్చి ఆఫీసు గదిలో ప్రవేశించింది.
శివరాం బ్లాకులో అమ్మిన టికెట్ల తాలూకు డబ్బులెక్కపెట్టుకొంటూ "మొత్తం నూట ఇరవై టికెట్లు. టికెటుకు పెచ్చు అర్ధచొప్పున అరవైరావాలి. ఏభయ్యే ఇచ్చావేమోయ్?" అన్నాడు ఎదురుగా నిలబడివున్న ముఠానాయకుడితో.
"తక్కువ కమ్మేయాల్సి వచ్చింది సార్! మెయిన్ గేటు తెరిచేశారు. రష్ తగ్గిపోయింది. రష్ గా వున్నట్టు కన్పించకపోతే మా దగ్గిరెవరు టికెట్లుకొంటారు సార్?"
"మీకోసం బుకింగులు తొందరగానే క్లోజ్ చేయించాగా?" అన్నాడు శివరాం.
"అదికాదు సార్ మెయిన్ గేటు తెరిచేసరికి మంది పల్చబడ్డారు సార్!"
"ఎవరోయ్ తెరిపించిందీ?" అంటూ ఉండగా శివరాంకు వరూధిని కన్పించింది.
లేచి నిలబడ్డాడు. రేపట్నుంచీ హాలు దగ్గిర కొస్తానన్న వరూధిని ఆ రోజే వస్తుందని ఊహించని శివరాం ఖంగుతిన్నాడు.
"బ్లాక్ లో వస్తున్న డబ్బు ఎవరి ఖాతాలో జమ కడ్తారూ?" అన్నది వరూధిని.
"ఎక్కడమ్మా! ఈ రోజే అదీ యీ ఆటకే! ఆదివారం కదా? రష్ గా ఉంది."
"సరేలే, మొత్తం కలక్షన్ లెక్కచూసి ఆ బ్లాక్ మనీతోసహా ఇట్లా ఇచ్చేయ్!" అంటూ వరూధిని కుర్చీ లాక్కొని కూర్చుంది.
"డిస్ట్రిబ్యూటర్ వాటా, టాక్సూ, దేనికిదానికి లెక్కలు విడివిడిగా చూడాలి." పెద్ద చిక్కు సమస్యలా వరూధిని ముందు పెట్టాడు శివరాం.
"చూడూ, నేవద్దన్నానా?" అతి సులువుగా సమస్యను తేల్చివేసి అన్నది వరూధిని.
"ఇవ్వల్టిది రేపు సాయంకాలానికి చూస్తాం!" అది తిరుగులేని పద్దతి అన్న ధోరణిలో చెప్పాడు శివరాం.
"అది నిన్నటివరకూ జరిగిన పద్దతి. నాకు ఏరోజు చార్ట్ ఆరోజే కావాలి. సెకండ్ షో బుకింగ్ క్లోజ్ అయిన గంటకు లెక్కలు తేలిపోవాలి. అంటే ... పదిన్నరకు థియేటరు శేరు లెక్కచూసి క్యాష్ నా ముందు పెట్టాలి. ఇది ఇవ్వాళ్టినుంచే అమలు జరగాలి." సైన్యానికి ఆర్డరిస్తున్న కమాండరులా చెప్పింది వరూధిని.
31
వరూధిని ఆధ్వర్యంలో వరూధిని పిక్చర్ ప్యాలెస్ బాగానే నడిచిపోతూంది.
ఆమె థియేటర్ నడిపేభారం వహించి ఆరువారాలకు పైగా అయిపోయింది. సీతారామ కళ్యాణం కలక్షన్ ఏమీ డ్రాప్ కాలేదు. ఇంకో ఆరువారాలు అలానే నడిచేట్టుంది. థియేటర్ షేర్ యాభై పర్సెంటు లెవెలుకు వచ్చింది. ఇంకా, వారానికి ఐదురోజులు హౌస్ ఫుల్ అవుతూనే వుంది. ఆ ఆరువారాల్లోనే థియేటరు షేరు పద్దెనిమిది వేలు వచ్చింది. జీత బత్తేలు, ఖర్చులూ పోను, పదివేలు నికరంగా మిగిలింది. స్టాఫ్ లో సగం మంది వరూధినికి సన్నిహితులయారు. ఆమె అంటే భయభక్తులు చూపిస్తున్నారు. శివరాం మీదా, మిగతావాళ్ళమీదా, ఏవేవో ఉన్నవీ లేనివీ చెపుతున్నాడు అసిస్టెంటు మేనేజరు రామదాసు.

