"నేను వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా పిన్నీ" అంది జయంతి నవ్వుతూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని.
"వెళ్ళిరామ్మా. జాగ్రత్త! మొత్తానికి నీ పంతం నెరవేర్చుకున్నావు" అంది కస్తూరి నవ్వుతూ.
జయంతి కూడా నవ్వింది.
39
"అమ్మా....అమ్మా" అంటూ పిలుస్తూ లోపలికెళ్ళింది జయంతి.
"ఏంటే....ఏంటా హడావుడి అంటూ వంటగదిలోనుంచి పైట చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది కస్తూరి.
"కళ్ళు మూసుకో....." అంది జయంతి.
"ఎందుకే నీదంతా హడావుడి? సంతోషం వచ్చినా పట్టలేం, దుఃఖం వచ్చినా పట్టలేం" అంటూ కళ్ళుమూసుకుంది కస్తూరి.
ఈ హడావుడి చూసి దాక్షాయణి తన గదిలో నుంచి హాల్లోకి వచ్చి నిశబ్దంగా గమనిస్తుంది వాళ్ళని నవ్వుకుంటూ.
"గట్టిగా మూసుకో.....రెండు చేతులు దోసిలిపట్టు...." అంది జయంతి.
"అబ్బబ్బా.....ఎందుకే...." అంది మురిపంగా నవ్వుకుంటూ కూతురి మాటలకు.
"పట్టమన్నాను పట్టు అంతే....." అంటూ నవ్వుకుంటూ ఓ తెల్ల కవరు తీసి ఆమె చేతుల్లో పెట్టింది.
"ఆ! ఇప్పుడు కళ్ళు తెరు" అంది.
కస్తూరి కళ్ళు తెరిచి చూసింది. తెల్లని కవరు కనిపించింది అది చూసి.....
"ఏంటే ఇది....దీని కోసమా ఇంత హడావుడి చేశావు. ఏముంది దీన్లో...." అంది ఆశ్చర్యంగా దానినే చూస్తూ.
"తీసి చూడు నీకె తెలుస్తుంది" అంది జయంతి.
కస్తూరి కవరు ఓపెన్ చేసి చూసింది. దానిలో అన్నీఐదురూపాయల నోట్లే కొత్తవి, తళతళ మెరుస్తూ, పెళపెళ మంటూ కరెన్సీ వాసనను వెదజల్లుతున్నాయి. మొత్తం ఆరొందల నోట్లు మూడు కట్టలగా పిన్ చేసి వున్నాయి.
వాటిని చూడగానే కస్తూరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనందంతో హృదయం ఉప్పొంగింది. కళ్ళ వెంట ఆనందభాష్పాలు టపటప రాలి ఆ నోట్ల పైన రాలాయి.
ఆ దృశ్యం చూసిన దాక్షాయణి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి.
"మా అమ్మే--మా బంగారమే....ఇవన్నీ నువ్వు సంపాదించినవేనా జయంతి.....దాక్షాయణి చూశావా....నా కూతురు ప్రయోజకురాలు అయిందే, ఎంత సంపాదిస్తుందో చూడు....' అంటూ జయంతిని దగ్గరకు తీసుకుని నుదిటి పైన ముద్దు పెట్టుకుంది.
"నా మొదటి జీతం అమ్మా అది....." అంది ఆనందంగా జయంతి.
"చాలా సంతోషం తల్లీ! మీ నాన్నగారికి చూపిస్తాను, అయన కూడా సంతోషిస్తారు" అనుకుంటూ అయన గదిలోకి వెళ్ళింది కస్తూరి.
"మొత్తానికి సాధించావు జయంతీ! మొదటి నెల జీతమే మూడు వేల రూపాయలంటే. ముందు ముందు ఇంకా సంపాదిస్తావు....ఇక ఈ కుటుంబానికి ఏ లోటు లేదు--రాదు" అంది దాక్షాయణి ఆనందంగా.
కింద వున్న సంచిని తీసుకుంటూ----
"పిల్లలేరి పిన్నీ-----" అంటూ "తులసీ....అమ్మా తులసీ ...చంటి, ఇటు రండి" అంటూ కేకేసింది.
"ఏంటక్కా!" అంటూ జయంతి చెల్లెలు వచ్చింది "ఇదిగో ఈ స్వీట్లు పిల్లలందరికి ఇవ్వు. శేఖర్.....బాబీలను కూడా పిలువు....ఏరి పిన్నీ పిల్లలు?" అడిగింది.
అంతలోనే శేఖర్ వచ్చాడు అక్కడికి.
"ఏంటక్కా! ఎందుకు పిలిచావ్?" అన్నాడు దాక్షాయణి పెద్ద కొడుకు.
"ఇదిగోరా, నీకిష్టమని జిలేబి తెచ్చాను. తమ్ముడికి కూడా ఇవ్వు"అంటూ వాడి చేతిలో జిలేబి చుట్టలు నాలుగు పెట్టింది.
వాడు వాటిని ఆనందంగా తీసుకున్నాడు.
"పిన్నీ! నువ్వు కూడా నోరు తెరువు. నీ నోరు తీపి చేస్తాను" అంటూ వేరే ప్యాకెట్లో నుంచి మైసూర్ పాక్ ముక్కను సగానికి విరిచి దాక్షాయణి నోట్లో పెట్టింది.
"అత్తయ్య ఏది? ఎక్కడుంది" అనుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళింది. భ్రమరాంబ మంచం పైన కూర్చుని ఏదో అలొచిస్తూన్నది.
"అత్తయ్యా! నోరు తెరువు....." అంది జయంతి.
"ఎందుకే" అంది నవ్వుతూ.
"తెరువు ముందు" అంది నవ్వుతూ.
ఆమె నోరు తెరిచింది. జిలేబి ముక్క పెట్టి "ఇదిగో నీకోసం జిలేబి తెచ్చాను" అంది జయంతి.
"ఎందుకే....." అంది ఆనందంగా.
"మైసూర్ పాక్ అయితే నమలలేవుగా.....పళ్ళు లేని ముసలిదానివి" అంది నవ్వుతూ.
"అసలు సంగతి చెప్పకుండా జిలేబి, మైసూర్ పాక్ అని అంటావెంటే?" అంది భ్రమరాంబ.
"దానికి ఈరోజు మొదటి నెల జీతం వచ్చింది వదినమ్మా" అది దాని సంతోషానికి కారణం" అంది కస్తూరి కూతుర్ని మురిపంగా చూసుకుంటూ.
"అలాగా! మా యమ్మే మరి చెప్పవే" అంది.
భ్రమరాంబ ఆనందంగా జిలేబి ముక్కలు తింటూ.
"ఎన్నాళ్ళయిందే జిలేబి తిని.....వాడికి సురేంద్రకు ఎన్నిసార్లు చెప్పానో....జిలేబి తినాలనిపిస్తోందిరా తీసుకురా అని.....వాడు నాకెందుకు తెస్తాడు. పెళ్ళానికోక్కతికే తెచ్చుకుంటాడు. అందుకే అన్నారు....పెళ్ళాం బెల్లం....తల్లి అల్లం అని" అంది మెల్లగా సణుక్కుంటు.
సర్లేవే....ఇక నేను తెచ్చి పెడతాను నీకు, నువ్వు దిగులుపడకు" అంది జయంతి నవ్వుతూ.
"మాయమ్మే! నేనంటే నీకు ఎంత ప్రేమే....అసలు నిన్ను చేసుకోవాలనే నా కోరిక...మీ అమ్మే పడనియలేదు, నిన్ను చేసుకున్నట్లయితే నాకు ఇన్ని కష్టాలుండేవా?" అంది కల్లోత్తుకుంటు భ్రమరాంబ.
"అబ్బా! అత్తయ్యా!" నీకేం తక్కువయిందే ఇప్పుడు---ఊరుకో" అంది జయంతి.
"ఊరుకోక చేసేదేంముందిలేమ్మా! నన్ను వాడసలు పలకరిస్తున్నాడా? ఎమ్మా ఎలాగున్నవే. అన్నం తిన్నావా లేదా? అని పలకరించడానికి కూడా భయమేనమ్మా వాడికి. పెళ్ళాం అంత కట్టడి చేసేసింది" అంది భ్రమరాంబ విచారంగా.
ఆమె మాటలకు జయంతి నిశ్శ్సబ్దంగా నవ్వుకుంది.
"సర్లే బాధపడకు.....నేను మళ్ళీ వస్తాలే" అంది.
"వెళ్ళిరామ్మా! ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. బంగారం లాంటి మోగుడోస్తాడే నీకు. బాగా చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. గొప్ప ఆఫీసరు చేసుకుంటాడు, మా మొరటోడు నీకెందుకులే.....కంతకుతగ్గ బొంతలు వాళ్ళిద్దరూ" అంది కసిగా సురేంద్ర, గిరిజలను తిడుతూ.
జయంతి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
* * * *
"మనము ఒకసారి కంచికచర్ల వెల్లోద్దామండి! అందర్నీ చూసి చాలా రోజులైంది" అంది శివపార్వతి'
"ఎందుకు? జయంతి సంపాదిస్తుందనా? వాళ్ళు కష్టాల్లో వున్నప్పుడు నన్ను కూడా వెళ్ళనివ్వకుండా చేశావు. ఇప్పుడు వాళ్ళ బతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారని మళ్ళీ పరామర్శించటానికి వెళితే ముఖం మీదే వుస్తారు" అన్నాడు సుందరం.
"అబ్బ మీకు ప్రతిదానికి కోపమే! నేనిప్పుడేమన్నానని? దాక్షాయణి అక్కని, కస్తూరి అక్కని, జయంతిని, పిల్లల్ని చూసి చాలాకాలం అయింది. ఓసారి వెళ్ళి వద్దాం అన్నాను. అంతేగా" అంది సీరియస్ గా.
"నేననేది అదేనే! ఈమాట ఇంతక మునుపు ఎందుకనలేకపోయావు? అప్పుడు వాళ్ళు నీకు చేదయ్యారా, ఇప్పుడు తిపయ్యారా?" అన్నాడు కోపంగా.
