నీ యుద్ధం నువ్వే చేసుకో
ఈ గదిలో, నా గదిలో ఒక రెండు మూడు నెలల
తర్వాత, లేదా ఇంకో రెండు మూడేళ్ళ తర్వాత కూర్చుని
కథ రాసుకుంటున్నాను. కూలీలు సమ్మె చెయ్యడం, వాళ్ళ
ఆకలియాత్ర. వాళ్ళ మనస్సులలో ఆలోచనలూ అవన్నీ
కలిపి కథ రాయాలని నా ఉద్దేశం. కడుపులు కాలుతూ
ఉంటే, కాళ్ళు మాడుతూ ఉంటే వాళ్లు తమ గురించీ,
తమ భవిష్యత్తు గురించీ ఏమని ఆలోచిస్తారనే సంగతి
ఆలోచిస్తున్నాను. ఇంతట్లో ఎవరో తలుపు తట్టిన
చప్పుడయింది.
ఆ తలుపు తట్టింది అదృష్టం కాదని నాకు బాగా తెలుసును. అదృష్టం, లేదా అవకాశం ఒకమారే తలుపు తడుతుందని ఇంగ్లీషు సామెత. లోగడ ఒకసారి అదృష్టం నా తలుపు తట్టడం. అప్పుడు నేను ఇంట్లో లేకపోవడం జరిగింది. ఏదో పనిమీద, పోనీ ఏదో పని వెదుక్కునే పనిమీద ఎక్కడికో పోయాను. అంచేత ఈసారి తలుపు తట్టింది అదృష్టం కాదని స్పష్టం. అయితే మరెవరు? బహుశా మా పెత్తల్లి కొడుకు భద్రంగాడయి ఉండాలి. భద్రంగాడు గొప్ప రచయిత. వాడేది రాయాలేదు. రాయాలనే కోరిక కూడా వాడికి లేదు. అయినప్పటికీ, ఊఁహూఁ, అంచేతనే వాడో గొప్ప రచయిత. వాడు కాకపోతే మరెవడు? ఎవడు తలుపు కొడతాడు ఈ సమయంలో? తప్పకుండా సాయిబుగారి గుమస్తా అయివుండాలి. మాసిపోయిన పంచా, చిరిగిపోయిన చొక్కా, విషాదపూరితమైన మొగమూ వేసుకొని నెలకోమాటు నా గదికి వచ్చి సాయిబుగారికి నేనివ్వవలసిన ఎనిమిది రూపాయలూ ఈ నెలైనా జమ కట్టకపోతే కేసు పడెయ్యవలసి ఉంటుందని నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సాయిబుగారి తరఫున ఈ పెద్దమనిషి ఇళ్ళ అద్దెలు వసూలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడో నేను సాయిబుగారి వరసకొట్లలో ఒకదాంట్లో ఉన్నప్పుడు నెల్లాళ్ళ అద్దె బాకీ మిగిలిపోయిందట. నాకు జ్ఞాపకమే లేదు. అసలా కొట్లలో ఎప్పుడైనా ఉండేవాడినా అనిపిస్తుంది. అయినా ప్రతి నెలా ఈయన రావడమూ, నన్ను గట్టిగా మందలిస్తూ ఎనిమిది రూపాయలు ఇమ్మనడమూ, లేకపోతే సాయిబుగారు నన్ను కోర్టు కీడ్చి, శిక్ష వేయించేస్తాడని హెచ్చరించడమూ మామూలు.
సాయిబుగారి గుమాస్తాని నేను బాగా ఎరుగుదును. వందసార్లు నన్ను కలుసుకున్నవాడిని ఎందుకు బాగా ఎరగను? ఒక విధంగా మేము స్నేహితులమయ్యామని చెప్పాలి. స్థూలదృష్టికి మేము శత్రువుల్లాగ కనిపించినా అతనితో నాకు విరోధం లేదు. మీ పేరేమిటి అని అతణ్ణి నేనెప్పుడూ అడగలేదు గాని మిగతా సంగతులన్నీ అతనే నాకు చెప్పాడు. భార్యా, నలుగురు పిల్లలూ, ఆయనకి నలుగురూ ఆడపిల్లలే. ఆఖరి పిల్లకి ఎప్పుడూ జబ్బే. ఏడుపుతో ఇల్లెగరకొడుతూ ఉంటుందట.
మొదట్లో నాకీయనమీద కొంచెం అసహ్యం ఉండేది. సాయిబు దగ్గర పనిచేస్తున్నాడెందుకా అని! కాని తన సంసారపు చిక్కులు. పిల్లకి జబ్బూ, జీతపురాళ్లు చాలకపోవడం ఇవన్నీ తెలుసుకున్నాక అతనంటే జాలి కలిగింది. ఏదో ఒక పని ఇష్టం లేకపోయినా ఎందుకతని చేసితీరాలో బోధపడింది. ఏడుపుమొగం వేసుకొని నాదగ్గరికి వస్తూ ఉంటాడు. అందులోనే కొంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ, "చూడండీ, సూరిబాబుగారూ! అదుగో ఇదిగో అని మీరు ఆలస్యం చేస్తే లాభంలేదు. ఏమైనాసరే ఆ యెనిమిది రూపాయలూ చెల్లించకపోతే మా సాయిబుగారు ఒప్పుకోరు" అంటాడు. నేనంటాను గదా. "దయచెయ్యండి. ఈ చాపమీద కూర్చోండి. సిగరెట్టు కాల్చరూ? మీ అమ్మాయి నింపాదిగా ఉందా?" అని. నిట్టూర్పు విడుస్తూ చాపమీద కూర్చుని గుమాస్తా సిగరెట్టు అంటిస్తాడు. "ఆఖరిసారి ఖండితంగా అడుగుతున్నాను" అని ప్రారంభిస్తాడు. "సరే. ఖండితంగానే అడగండి. నేనెవ్వరికీ ఒక్క దమ్మిడీ కూడా బాకీ లేను. మా పెత్తల్లి కొడుకు భద్రంగాడి దగ్గర నేనొకమారు పావలా వాడుకున్నాను. అందుకోసం వాడు నన్ను కోర్టు కీడుస్తానని ఎప్పుడూ బెదిరించడు" అంటాను నేను. తర్వాత మేము ఒక అరగంటసేపు ఆమాటా ఈ మాటా చెప్పుకుంటూ గడుపుతాము. గుమాస్తా తన ఇబ్బందులు ఏకరువు పెడతాడు. తన పరిస్థితులేవీ బాగులేవంటాడు. నా పరిస్థితులు కూడా ఏమీ బాగు లేవంటాను కథ రాయాలనుకోవడం, బాగా రాయలేకపోవడం, సరియైన ప్రారంభం కుదరకపోవడం ఇటువంటివి.
తలుపు తట్టిన చప్పుడు వల్ల నా ఆలోచనలకి అంతరాయం కలిగింది. తలుపు తియ్యాలని లేచాను. మా పెత్తల్లిగారి భద్రంగాడయితే వాణ్ని చీవాట్లు పెడతాను. గుమాస్తాగారయితే మర్యాదగా పలకరించి, మీ అమ్మాయికి వొంట్లో ఎలా వుందని అడుగుతాను.
అయితే వీళ్ళిద్దర్లో ఎవరూ రాలేదు. ఆ వచ్చినవాడు రమారమి యాభై ఏళ్ళ మనిషి. పొట్టిగా, బొద్దుగా ఉన్నాడు. మొగంలో తెలివితేటలు లేవుగాని ఏదో గొప్ప ఊహవల్ల తాత్కాలికంగా ఆ మొగంలోని కొక వెలుగు వచ్చినట్టయింది. అతని ఎడం చేతిలో ఒక తోలు సంచీ ఉంది. అందులో ఏవో అమూల్యమైన దస్తావేజులున్నాయనడానికి సందేహం లేదు. ఈ వచ్చిన మనిషిని ఇదివరకెప్పుడూ నేను చూడలేదు. కాబట్టి మంచి కథ రాయడానికి సరిపోయే సరుకేమాత్రమైనా ఇతని జీవితం నుంచి గ్రహించవచ్చునని ఆశ కలిగింది.
"చింతపిక్కల సూరిబాబుగారూ!" అన్నాడతను. అన్నాడేమిటి. అరిచాడు! ఆ అరుపునుబట్టి ప్రపంచంలో ఎక్కడో ఒక గొప్ప సంఘటన. ఏదో చరిత్రాత్మకమైన ఉపద్రవం సంభవించి ఉండాలని నేననుకున్నాను.
"ఔను. నన్నే చింతపిక్కల సూర్యనారాయణ అంటా"రన్నాను.
ఎప్పుడో ఎక్కడో నేను చేసి మరిచిపోయిన చిల్లర నేరానికి ఉరిశిక్ష విధిస్తున్నట్టుగా అతడు 'అయ్యా! చింతపిక్కల సూరిబాబుగారూ! తమర్ని తక్షణం సైన్యంలో చేర్చడానికి అఖిలాంధ్ర శాంతి సంఘం తరఫున ఇక్కడికి ఇచ్చాను. మా సంఘం అంతర్జాతీయ ప్రజాస్వామ్య రక్షణ సభవారి ఆంధ్రశాఖ. ఫాసిజం, నాజీజం, కమ్యూనిజం, అనార్కిజం మొదలగు దుష్టశక్తులను నిర్మూలించడమే మా ఆశయం. కాబట్టి మీరు తక్షణమే నా కారులో బయలుదేరి సైనిక ప్రధాన కార్యాలయానికి రావాలి. అక్కడ మీకు సరికొత్త మిలిటరీ యూనిఫారమూ, ఒక తుపాకి ఇవ్వబడును. వెంటనే నాతో రండి" అని గుక్క తిప్పుకోకుండా ఆయన అన్నాడు.
అతని ఉపన్యాసం బాగానే ఉందిగాని నాలో కదలిక పుట్టించలేకపోయింది. కొంపలు తగులబడుతున్నంత తొందరగా అతడు మాట్లాడాడు. నేను మాత్రం తాపీగా సిగరెట్టు వెలిగించి "యుద్ధం వచ్చిందా!" అని ప్రశ్నించాను.
"అయ్యో! మీకింకా తెలియదూ!" అన్నాడాయన. నా తెలివితక్కువకి విచారిస్తూ! "నేటి ఉదయం ఆరు గంటలకి యుద్ధం ప్రకటించబడినట్లు పేపర్లలో మీరు చూడలేదూ?" అని అడిగాడు.
"అంత పెందరాళే యుద్ధం ప్రకటించుకుంటారా ఎవరైనా? సరిగ్గా ఎవరూ నిద్రమంచాలమీంచి లేవనైనా లేవరే! అయినా ఆ ప్రకటనని ఎవరు చేశారు?" అని నేనడిగాను.
ఈ ప్రశ్నకి పొట్టి ఆయన కొంచెం చిరాకు తెచ్చుకున్నాడు. మొగం చిట్లించుకొని "పూర్తి వివరాలు పేపర్లో ఉన్నాయి" అన్నాడు.
"నేను పేపర్లు చదవను. రచయితని నేను. పేపర్లు చదివితే నా శైలి పాడయిపోతుంది. ఐనా ఆ యుద్ధ ప్రకటనని ఎవరు రచించారు?" అని ప్రశ్నించాను.
పొట్టి మనిషికి పూర్తిగా కోపం వచ్చింది. "మీ పేరు సూర్యనారాయణ వురపు సూరిబాబు అవునా, కాదా?" అన్నాడు.
"ఔను"
"అయితే నాతో వచ్చితీరాలి మీరు."
"క్షమించాలి. నేను కార్మికుల ఆకలియాత్ర గురించి కథ రాసుకుంటున్నాను. మీ యుద్ధంలో చేరలేను నేను. ఇవాళ ఈ కథ పూర్తిచెయ్యాలి. తర్వాతనైనా మీతో రాలేను."
"అంతర్జాతీయ ప్రజాస్వామ్య రక్షణ సభ పేరిట అఖిలాంధ్ర శాంతి సంఘం పేరిట శాసిస్తున్నను. వస్తావా? రావా?"
"రాను. నీ దిక్కున్న చోట చెప్పుకో" అని తలుపు బిడాయించాను.
గదిలో కూర్చుని మళ్ళీ కథారచనకి ఉపక్రమించాను. కాని యుద్ధం ఒకటి వచ్చి పడిందంటే అది ఎవరికీ ఏమీ తోచనియ్యదు. అందరినీ అది అకస్మాత్తుగా మార్చేస్తుంది. యుద్ధం అంటే ఇష్టంలేని నాబోటివాళ్ళని సహా!
కాగితంమీదికి కలం వెళ్ళలేదు. అటూ ఇటూ పచారు చేస్తూ యుద్ధం గురించి మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను.
అరగంట అయిందో లేదో మళ్ళీ తలుపు చప్పుడు. ఈసారి ఒక సైనికోద్యోగి ఎదురుగా నిలబడ్డాడు. వయస్సుకి కుర్రాడే. అప్పుడే కాలేజీ చదువు పూర్తిచేసిన వాడిలాగ ఉన్నాడు.
"చింతగింజల సూర్యనారాయణగారూ!"
"చింతపిక్కల" అని సవరణ చేసి అతణ్ని లోపలికి దయచెయ్యమన్నాను. నాతో కరస్పర్శ చేసి లోపలికి వచ్చాడు.
"నా పేరు చందనం" అన్నాడతను.
"చందనంగారికి వందనం. ఆ పెట్టెమీద కూర్చోగలరూ?"
