Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 71


    
    ఆ సాయంకాలమే వస్తానన్న శివరాం రాలేదు.
    భర్తమీద విసుక్కుంది. "అసలతడేమన్నాడూ?"
    "సాయంకాలం వస్తానన్నాడు."
    "మరి రాలేదేం?"
    "నాకేం తెలుసూ?"
    "మరేం తెలుసు? పో! వెళ్ళి ఇక్కడున్నట్టు రమ్మని చెప్పు! వాడికి పొగ రెక్కింది. ఏమనుకున్నాడో ఏమో?" రుస రుసలాడిపోతూ అన్నది వరూధిని.
    వెంకటపతి వెళ్ళి శివరాంకు మళ్ళీ చెప్పాడు.
    శివరాం ఏదో వంకచెప్పి "రేపు ఉదయం వస్తానని చెప్పండి!" అన్నాడు.
    ఆ మాటే వెంకటపతి భార్యకు చేరవేశాడు. శివరాం ఆ మర్నాడూ రాలేదు. వరూధిని నిప్పులు తొక్కింది.
    మూడోరోజు మధ్యాహ్నం వచ్చాడు శివరాం.
    "ఏం, నీక్కూడా అంత తీరకుండా పోయిందా?" ముఖంమీద కొట్టినట్లే అడిగింది వరూధిని.
    శివరాం మాట్లాడలేదు.
    "డబ్బెంత ఉంది?" అడిగింది వరూధిని.
    "డిస్ట్రిబ్యూతర్స్  ఎకౌంట్స్ కూడా ఈ నెలలో సెటిల్ చేయలేదు. వాళ్ళు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నాడు."
    "అయితే కలెక్షన్ అంతా ఏం చేశారు?"
    "రామనాథబాబుగారే పట్టుకెళ్ళారు."
    "బ్యాక్ లో వుంది ఏమయిందీ?"
    "అదీ వారే డ్రా చేసుకున్నారు."
    "నా కిప్పుడైదువేలు కావాలి. పోయిన నెల్లో కూడా నేనేమీ తీసుకోలేదు." గంభీరంగా ముఖంపెట్టి అన్నది వరూధిని.
    "నన్నేం చెయ్యమంటారూ? హాలు వర్కర్సుకు జీతాలు కూడా ఇవ్వలేదు. కొద్దికొద్దిగా అడ్వాన్సులిచ్చి సర్దుకొస్తున్నాను. పోస్టర్సూ, పబ్లిసిటీబ్యానర్లు కట్టేవాళ్ళు రోజూ నన్ను పీక్కుతింటున్నారు. కార్బన్లు కూడా కావాలి. హాల్లో కూర్చుంటే నా ప్రాణాలు తీసేస్తున్నారు వాళ్ళు."
    "అదంతా నాకు తెలియదు రేపు సాయంకాలంలోపు నాకు డబ్బు తెచ్చివ్వాలి."
    "నన్నేం చేయమంటారు మీరే చెప్పండి? ఉన్నదంతా రామనాథబాబుగారే తీసుకెళ్ళిరి! నా దగ్గర రూపాయి మిగల్నివ్వలేదు ఈ రెండు నెలలుగా నన్నేం చేయమంటారు మీరే చెప్పండి?"
    "నాకు తెలియకుండా రామనాథబాబు కెందుకిచ్చావ్?"
    శివరాం ముఖం తేలవేశాడు.
    "ఇది ఇవాళ్టిదికాదు. కొత్తేముంది? హాలు కట్టిందగ్గర్నుంఛీ డబ్బు విషయం రామనాథబాబుగారే చూసుకుంటున్నారుగా? ఆ సంగతి మీకు తెలియందికాదు."
    "సగంవాటా నాకుందని నీకు తెలుసుగా?" వరూధిని గొంతులో అధికారం పలికింది.    
    "అంతా మీదో, సగమే మీదో నాకెందుకమ్మా! అవన్నీ పెద్దవాళ్ళూ, ఓనర్సూ, మీరూ మీరూ చూసుకోవాలిగానీ" అంటూ లేచాడు శివరాం.
    "ఇంతకీ ఏమంటావ్?" తాచుపాములా బుసకొట్టింది వరూధిని.
    "నేననేదేముందమ్మా?" పాముకాటు తప్పించుకోడానికి ప్రయత్నం చేసేవాడిలా శివరాం అన్నాడు.
    "అంతేనా?" వరూధిని పడగ విప్పింది.    
    "మీరేం చెప్పమంటే  అదే చెప్తాను" అన్నాడు శివరాం.
    "ఎవరికీ?"
    "రామనాధబాబుగారికే."
    "ఒకళ్ళకు చెప్పాల్సినంత ఖర్మ నాకేం పట్టింది?"
    "మీ ఇష్టం" అని శివరాం గబగబా వెళ్ళిపోయాడు.
    వరూధిని ఆ రోజంతా కాలుగాలిన పిల్లిలా తిరిగింది. ఏం చెయ్యాలో ఆలోచిస్తూ అనేక నిర్ణయాలకు వచ్చింది. మళ్ళీ అవి మార్చుకొని మరో రకంగా ఆలోచించింది. ఏ నిర్ణయానికీ రాలేకపోయింది.
    రెండోరోజు మధ్యాహ్నం, ఎలాగయినా రామనాథబాబును కలుసుకొని ఈ వ్యవహారమేదో తేల్చుకోవాలన్న నిర్ణయానికొచ్చి, డ్రస్ చేసుకొని తయారయింది. బయలుదేర బోతుండగా శివరాం రిక్షాదిగి లోపల కొచ్చాడు.
    జేబులోనుంచి కవరుతీసి వరూధినికిచ్చి అన్నాడు శివరాం ...
    "మూడు వేలు రామనాథబాబుగారిచ్చి రమ్మన్నారు."
    "మూడు వేలా? దానాధర్మం ఇస్తున్నాడా? నేనడిగింది ఐదువేలు!"
    "ఆ మాట చెప్పాను. వారింతవరకే ఇచ్చి పంపారు."
    "ఒకళ్లిచ్చేదేమిటి నాకు? ఒకళ్ళ అజమాయిషీ ఏమిటి నా డబ్బు నేను తీసుకొనేదానికి?"
    శివరాం చేతులు నలుపుకొంటూ నేలచూపులు చూశాడు.
    "ఇప్పుడాయనెక్కడున్నాడూ? ఇప్పుడే ఆ సంగతేదో తేల్చుకుంటా!" తొడగొట్టి సవాల్ చేస్తున్నట్లుగా మాట్లాడింది వరూథిని.
    "పొద్దున్నే మద్రాసు వెళ్ళిపోయారు."
    "ఆ ముండతోనేనా?"
    ఆ మాటన్నది వరూథినేనా? అంత నాగరికతగల వరూథిని, అంత అందమైన వరూధిని, అంత సున్నితంగా కన్పించే వరూధిని ఎంత మొరటుగా మాట్లాడింది!
    శివరాంకు నోరు ఎండిపోయింది ఇక మాట్లాడలేకపోయాడు. ఎక్కువసేపు ఆమెముందు నిలబడటంకూడా శ్రేయస్కరం కాదన్నట్టు భావించాడు.
    "నేనొస్తానండీ! ఒక్కగంట లేకపోతే జరగటం లేదు. అంతా అరాజకంగా వుంది. ఎవడూ సరిగా పనిచెయ్యడంలేదు."
    "అసలువాళ్ళకే పట్టకపోతే కూలిడబ్బులకు పనిచేసేవాళ్ళకేంపట్టిందీ?"
    నాలుగడుగులు వేసిన శివరాం వెనుకనుంచి వచ్చిన వరూధిని మాటలకు ఆగిపోయాడు.
    "అడ్డమైనవాళ్ళమీద నమ్మకం ఉంచబట్టే ఇంతవరకూ వచ్చింది. ఎవరిమీదో ఆధారపడి హాలు నడిపించాల్సిన ఖర్మ నాకేం పట్టింది? రేపట్నుంచి నేనే చూసుకొంటాను."
    "అదే మంచిది అలాగే కానియ్యండి." శివరాం అంటూనే గేటు తీసుకొని వెళ్ళిపోయాడు.
    సాయంకాలం ఐదింటికల్లా తయారై భర్తకోసం చూసింది. వెంకటపతి పొద్దున్ననగా తిని వెళ్ళినవాడు. ఇంతవరకూ అంతులేడు. హాలు దగ్గరే తారట్లాడుతూ వుండి వుంటాడని ఊహించుకొన్న వరూధిని వీధి గుమ్మంలోకొచ్చి రిక్షాపిల్చింది. వంట మనిషో, పని పిల్లో, భర్తో ముందుగా వెళ్ళి రిక్షాగానీ, జట్కాగానీ పిలుచుకురాందే వరూధిని గదిలోనుంచి బయటికొచ్చేదికాదు. అలాంటిది ఆ రోజు తనే గబగబా బయటికొచ్చి రిక్షా పిల్చుకొని ఎక్కింది.
    వరూధిని పిక్చర్ ప్యాలెస్ దగ్గర కొచ్చేసరికి జనంతో చాలా రద్దీగా వుంది. మెయిన్ గేటు మూసి వుంచారు. కౌంటర్ల దగ్గర జనం క్యూలో నిలబడి తోసుకొంటున్న్జారు. క్యూలో నిలబడ్డ వాళ్ళకంటే రెట్టింపు జనం ఆడా, మగా, అడ్డదిడ్డంగా నిలబడి, క్యూలో నిలబడ్డ తమ వారికేసి చూస్తున్నారు. రిజర్వ్ డ్ క్లాసులోకి పోయేవాళ్ళను మాత్రం మెయిన్ గేటు దగ్గర కాపలా ఉన్నవాళ్ళు పరీక్షగా చూసి లోపలకు వదులుతున్నారు. రిజర్వ్ డ్ క్లాసు బుకింగ్ కౌంటరు గేటు లోపల ఆఫీసుకు ఆనుకొని ఉంది.
    వరూధిని రిక్షా దిగి జనాన్ని తప్పుకుంటూ గేటు వైపుకు నడిచింది. ఒక్కసారిగా జనంలో కలకలం బయలుదేరింది. నేలా, బెంచీ క్లాసు క్యూలు ములక్కర్ర విరిగినట్టు విరిగిపోయినై. వెనక ఉన్నవాళ్ళు ముందుకు తోస్తున్నారు. ముందున్నవాళ్ళు కాళ్ళు వెనక్కు నిగడదన్ని వెనక్కి నెట్టుతున్నారు. ఆ రద్దీలో వరూధిని ముందుకు వెళ్ళలేకపోయింది.
    బుకింగ్ కంతల్లో చెక్కలు తీసేశారు. లోపలనుంచి వెలుగు కన్పిస్తోంది. టికెట్ల అమ్మకం సాగింది. చొక్కాలు విడిచి, గోచీలు బిగించి ఇద్దరు మనుషులు నేల కౌంటరు దగ్గర తోసుకొంటున్నవాళ్ళ తలల మీదగా పాకిపోతున్నారు. టికెటు తీసుకొన్న ఒక్కొక్కడు వెనక నుంచున్న నలుగుర్ని పడతోసుకొని బయటికొస్తున్నాడు. ఐదునిముషాల్లో హాలు ఆవరణంతా పెద్ద జాతరయిపోయింది. టికెట్లు తీసుకొన్నవాళ్ళు మెయిన్ గేటు దగ్గిర లాకులు బిగించిన కాలవలోని వరదనీటిలా ఆగి సుడులు తిరిగిపోతున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS