ఆమె కస్తూరికి సర్దిచెప్పింది. "మీరు అంతగా బాధపడే పని ఏం చేస్తుందక్కా జయంతి....ఉద్యోగం చేస్తుంది....అంతే! ఎంతమంది అమ్మాయిలు చేయటం లేదు లోకంలో అంటూ సర్దిచెప్పింది.
"లోకం గురించి మీకు తెలీదే.....! మనం బాగా ఉన్నప్పుడు గౌరవిస్తుంది. చితికిపోతే రాళ్ళేస్తుంది" అంది కస్తూరి.
"అంతేగాని ఎవరూ మన దగ్గర కొచ్చి మన కష్టాల్లో పాలు పంచుకోరు కదా....ఎవరూ సహాయం చేయరు కదా? ఎవరో దాకా ఎందుకక్కా.....సుందరంగానీ, పార్వతి గానీ , సురేంద్ర గానీ వస్తున్నారా చెప్పు? అందుకే జయంతి ఉద్యోగం చేసి తన వంతు సాయం కుటుంబానికి చేయాలనుకుంటుంది. అదేం కానిపని చేయటంలేదు కదా.....!?" అని సీరియస్ గా చెప్పింది దాక్షాయణి.
పెళ్ళయినప్పటినుంచి దాక్షాయణి కస్తూరితో అంత సీరియస్ గా ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే, జయంతి మనసు తెలుసుకోకుండా శనిలా దాపురించిందని తిట్టడంతో దాక్షాయణి ఆ మాటలు సహించలేకపోయింది.
దాక్షాయణి మాటల్తో కస్తూరి మెత్తబడింది.
"మీ ఇష్టం తల్లీ! నా మాటంటే విలువ ఎప్పుడోపోయింది. ఈ ఇంట్లో నా మొగుడు సంపాదనపరుడయితే ఎవరికి ఇంత నోరు వచ్చేది కాదు" అంది సీరియస్ గా.
ఆమె మాటలు దాక్షాయణికి ముళ్ళులా గుచ్చుకున్నాయి.
కానీ వెంటనే సంభాళించుకుంది. ఎందుకంటే కస్తూరి మనస్తత్వం ఆమెకు బాగా తెలుసు, భోళా మనిషి. లోపల ఎంతుంటే అంత పైకి అనేస్తుంది.
వెంటనే మళ్ళీ మనసులో ఏది పెట్టుకోకుండా కల్మషం లేకుండా ప్రేమిస్తుంది.
కానీ జయంతి తల్లి మాటలకు తట్టుకోలేకపోయింది.
తండ్రిని అంత మాటనేసరికి ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది.
"అమ్మా, నువ్వు నోరు ముస్తావా లేదా? చీ...నీ నోటికి ఎంతోస్తే అంతమాట అనేయటమేనా? మధ్యలో నాన్నగారిని ఎందుకంటావు?" సీరియస్ గా చివాట్లు పెట్టింది.
"అవున్లేమ్మా! నేనెంత చాకిరీ చేసి పెట్టినా నీకు నామీద ఎందుకుంటుంది ప్రేమ? నీకు నీ తండ్రంటేనే ప్రేమ" అంది నిష్టురంగా.
"అబ్బా అమ్మా! నాకు పిచ్చిపట్టేట్లుంది నీ మాటలతో, ఎందుకిలా విసిగిస్తావు?" అంది జయంతి.
"ఏంటే నువ్వనేది, నేను నిన్ను విసిగిస్తున్నానా? నువ్వు మమ్మల్ని విసిగిస్తున్నావ్ నీ మొండితనంతో" అంది సీరియస్ గా.
"జయంతి నువ్వూరుకో...అక్క సంగతి నీకు తెలిసిందేగా! ఇద్దర్లో ఎవరో ఒకరు తగ్గాలి. అనవసరంగా గొడవ పెంచుకుంటారెందుకు?" అంది దాక్షాయణి.
"లేకపోతే ఏంటి పిన్నీ! నాన్నగార్ని అంతమాటనటం ఎందుకు? అసలే అయన ఆరోగ్యం బాగాలేదు. అయన వింటే ఎంత బాధపడతారు?" అంది జయంతి.
"పిచ్చిదానా! మీ అమ్మమనసు నీకంటే బావగారికే ఎక్కువ తెల్సు, ఆయనేం బాధపడరులే! అసలు ఆయనకు వినపడవు ఈ మాటలు" అంది దాక్షాయణి.
"నాకేండుకమ్మా మధ్యలో! మీ తండ్రి కూతుళ్ళ ఇష్టం, ఉద్యోగాలు చేస్తారో, రాజ్యాలేలతారో, అయినా మీ బాబాయ్ కూడా నీకు వత్తాసు పలుకుతున్నాడు, మీ పిన్ని, బాబాయ్ లు, అందరూ ఒప్పుకుంటే నాకెందుకు....? ఊరంతా ఒకదారి, అయితే ఉలిపికట్టేది మరోదారి అన్నట్లు నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు" అంది చివరకు.
"అమ్మయ్యా! అలా అన్నావు బాగుంది. ఇన్నాళ్ళకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నావు" అంది జయంతి సీరియస్ గా నవ్వుతూ.
దాక్షాయణి కూడా ఆమె మాటలకు నవ్వింది.
"జయంతీ! అక్క ఆశీర్వాదం తీసుకో బయల్దేరే ముందు" అంది దాక్షాయణి.
"నా ఆశీర్వాదాలెందుకులేమ్మా! ఉన్నారుగా దానికి వత్తాసుపలికే వాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం తిసుకోమను: అంది కస్తూరి పైట చెంగుతో ముక్కు చీదుకుంటు.
క్షణంలో జయంతి చీర మార్చుకుని బయలుదేరింది.
పసుపురంగు కాటన్చీర, నల్లజాకెట్ వేసుకుని సింపుల్ గా బయలుదేరింది.
"అమ్మా నన్ను దీవించు. ఈరోజు నా పుట్టినరోజు కూడా....పుట్టిన రోజునాడు నువ్వు నా మనసు బాధపెట్టకూడదు. పైగా శనిలా దాపురించావు అని అనకూడనిమాటన్నావు" అంటూ సెంటిమెంట్ ప్లే చేసింది జయంతి ఆమెకు తెలుసు తల్లి మనసు.
"పాపిష్టిదాన్ని, నా నోరు పడిపోనూ.....పిల్లను పుట్టినరోజునాడు అనరాని మాటలన్నాను, ఉండమ్మా" అంటూ లోపలికి వెళ్ళింది.
జయంతి దాక్షాయణిని చూసి నవ్వింది. ఆమె ఆశ్చర్యంతో చూస్తుంది. క్షణం క్రితం వరకూ విపరీతంగా తిట్టిపోసి, వెంటనే కూతురిపై అంత ప్రేమను పంచుతున్న ఆ తల్లి మనసు అర్ధం చేసుకోవటానికి ఎంతో సేపు పట్టలేదు దాక్షాయణికి.
కస్తూరి పూజగదిలో నుంచి హారతి తెచ్చి "కళ్ళకద్దుకో తల్లి" అంది.
జయంతి హారతి కళ్ళ కద్దుకుని, బొట్టుపెట్టుకుని, తల్లి కాళ్ళకు నమస్కరించింది. ఆమెపై అక్షింతలు వేస్తూ-"వెయ్యేళ్ళు చల్లగా బ్రతుకు తల్లి" అంటూ దీవించింది.
జయంతి తరువాత దాక్షాయణి కాళ్ళకు కూడా మొక్కింది.
"ఏయ్ ఏంటిది? లేలే" అంది ఆనందంగా.
"తల్లి తరువాత తల్లి లాంటిదానివి దాక్షాయణి! నీ దీవెనలు కూడా కావాలి దానికి. నేను పోయినా నా బిడ్డను చూసుకోవలసినదానివి నువ్వేకదా" అంది కస్తూరి కళ్ళు పైట చెంగుతో తుడుచుకుంటూ.
"ఛ....అవేం మాటలక్కా! మీకేమి కాదు. నిక్షేపంలా యింకా వందేళ్ళు బ్రతుకుతారు." అంది నవ్వుతూ.
"నాకంత ఆశ లేదమ్మా....ఏదో వాళ్ళ నాన్నగారూ , నేను జీవించి ఉన్నప్పుడే దాని నెత్తి మీద నాలుగు అక్షింతలు వేయాలనేది మా ఆశ...." అంది కస్తూరి.
