Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 70


                               కుర్రాడు - చుంచెలుకా

    వారంరోజులు రకరకాల పానీయాలతో జీవించిన
    కుర్రాడి భావాలు చుంచెలకమీదికి ప్రసరించాయి.
    చుంచంటే చుంచు కాదు - ఎంచక్కటి చుంచు. మా
    మంచి చుంచు. చుంచుల్లో చుంచు. లోకానికంతటికీ
    ఏకైకం చుంచు. నగరనివాసి. ఉజ్వలమూర్తి. ప్రతిభాశాలి.
    మహాగణాధిప విలాస్ హోటేలు చుంచు.
    వాడు, లేక అది ఒకానొక రాత్రి సంతోషంపట్టలేని జాగిలంలా నాట్యంచేస్తూ ప్రవేశించింది. చుంచెలక నిర్భయంగా కుర్రాణ్ణి సమీపించి అతని పాదాలముందు ధనం జారవిడిచింది. ఈ ధనం నాలుగు పదిరూపాయల నోట్లు. వీటిని చుంచెలక నోట్లో కరుచుకొని తెచ్చింది. ఆకరుచుకోవడం ఎంత నైపుణ్యంతో - కాదు, ఎంత మహాత్మ్యంతో, ఎంత విశ్వ సౌభ్రాత్రంతో - ఎంత సున్నితంగా - చిన్నపంటి నొక్కుకూడా నోట్ల సౌందర్యాన్ని భంగపరచకుండా ఉండేటట్లు?
    కుర్రాడు ధనాన్ని స్వీకరించాడు నిర్లక్ష్యంగా. పరిశీలించాడు పరీక్షగా. ప్రశ్నించాడు చుంచెలకని మౌనంగా. పరిసరాలలో అపస్వరం కలిగించకుండా నుంచుంది చుంచు.
    కుర్రాడు రెండడుగులు నడిచి నిలిచాడు. అతడు నిలబడడంలో కూడా అపస్వరాలేవీ లేవు.
    "శెభాష్" అన్నాడు కుర్రాడు. "భేషుగ్గా ఉం"దన్నాడు. సాలోచనాలోకనాలతో చుంచువేపు చూశాడు.
    "దొంగిలించావు కాదు?" అన్నాడు.
    కోపపడనక్కరలేని తప్పుచేసిన హాస్యగాడిలాగ అంగీకారపూర్వకంగా తల ఆడించింది చుంచు.
    "సరే, కానియ్యి" అన్నాడు కుర్రాడు. "బతకడం, బతకనివ్వడం - అదీ నా జీవితాశయం. నేను బతికి ఉండడానికి వీలుగా ఇలా నువ్వు డబ్బు తెచ్చిపెడుతూ ఉండు. నీ నైతిక ప్రవర్తనని సవరించడానికి నేను ప్రయత్నించను. నీకు సరదా అయితే నాకేం పోయింది? నీ యిష్టమే కానియ్యి."
    ఈ ఏర్పాటు చుంచెలక్కి నచ్చినట్టు కనిపించింది. మహాగణాధిప విలాస్ మూల మూలలా పర్యటనం చేసింది. ముఖ్యంగా ధనవంతులైన యాత్రికులూ, గొప్ప గొప్ప మిలిటరీ ఆఫీసర్లూ, లేదా స్నానానికి వెళ్లేవాళ్లూ తమ డబ్బు ఎక్కడ వదులుతూ ఉంటారో పోల్చుకుంది. ప్రతిదినం కుర్రాడి గదిలోకి వచ్చి భారతదేశపు రంగు రంగుల కాగితపు ధనాన్ని పారపోస్తూ ఉండేది. ఒకప్పుడు పదులనోట్లూ, ఒకప్పుడు ఐదులూ, ఒకమాటు నాలుగు ఒకట్లూ! ఈ ఆఖరి సందర్భంతో కుర్రాడి గుండెల్లో రాయిపడింది. జోరుగా తాగుతూన్న ఈ కుర్రాడికి ఈ కొద్ది మొత్తం దారుణ నిరాశ కలిగించింది.
    "బతకడం, బతకనివ్వడం బాగానే ఉందికాని అంతకన్న మరీ మంచిది మరోపని చెప్పనా? కొంచెం నన్ను బోధపరచనియ్యి-చూడు ఈ సంఖ్య! దీన్ని పది అంటారు. చాలా మంచిది. నీకు వీలయినప్పుడల్లా ఇలాంటివి పట్టుకురా. ఇది చూడు! అయిదు. ఇది పదికంటే సగం మాత్రమే మంచిది. పదులు తీసుకురాలేనప్పుడల్లా ఐదులుతే. ఇది రెండు. దురదృష్టం! అంటే, ఇలాంటివి దొరికితే వదిలి పెట్టకేం, ఇవీ తీసుకురా. అయితే ఇవంత మంచివి కావు. ఇది చూడు. ఒకటి: దౌర్భాగ్యం! పదులకోసం ప్రయత్నించు" అన్నాడు చుంచునుద్దేశించి కుర్రాడు.
    కుర్రాడి సూచనను చుంచెలక శిరసావహించింది కొంతకాలంబాటు అదృష్టం కొద్దీ. స్నానాలకని వెళ్ళినవాళ్ళు అక్కడా ఇక్కడా పెద్దపెద్ద నోట్లకట్టలు పడవేసిన గదుల్లో ప్రవేశించింది. అందువల్ల కొన్నాళ్ళనుంచి కుర్రాడు రాజులాగ జీవిస్తున్నాడు. షోకైన బట్టలు వేసుకుంటున్నాడు. అవీ ఇవీ కొంటున్నాడు. అంతేకాదు పీయూషలహరిగా తాగుతున్నాడు.
    పాపం చుంచుకు మాత్రం సరియైన తిండి లేదు. పాత మేజోళ్ళు తిని బతుకుతోంది.
    ఒకరోజు చుంచుతో కుర్రాడు ఇలా అన్నాడు: "చూడు చుంచూ, మన రహస్యం పైకి పొక్కిపోవచ్చు. జనం అనుమానపడడం ప్రారంభించవచ్చు. చుంచెలక డబ్బు తస్కరించకూడదని ఎక్కడా రూల్సు లేవనుకో. న్యాయశాస్త్ర ప్రకారం నువ్వు నిరపరాధివే. హైకోర్టుకి వెళ్ళినా నీకు శిక్ష పడదు. ఈ దేశంలో ఏ జడ్జీలూ నిన్ను ముట్టుకోలేరు. కాని ఊసుకోని వెధవ ఎవడైనా ఒక ఎలకబోను పెట్టవచ్చును. ఎలకబోను పైకి ఆకర్షణీయంగా కనబడ్డా అది చాలా భయంకరమైనది సుమా. సాధారణంగా అందులో ఉల్లిపాయలుంటాయి. నువ్వు తెచ్చిన కాగితాలలో ఏది మార్చినా నీకు కావలసినన్ని ఉల్లిపాయలు సప్లయ్ చెయ్యగలను. కాని నువ్విష్టపడవనుకుంటాను! వెధవలు నిన్ను కుళ్ళిపోయిన ఉల్లిపాయలతో ఆకర్షించాలని చూస్తారు. ఒట్టి అణాకానీ సరుకు. అలాంటివి నేను తిని ఆరునెలలయింది. నువ్వు మాత్రం మోసపోకుమీ. ఆ దుష్ట వాసనకి మూర్ఛపోయి బోను దగ్గరిసా పోకేం. నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం నాకెంతైనా ఉంది సుమా!"
    చుంచుకిదో కొత్త సంగతి.
    బోనులే? ఉల్లిపాయలే?
    ఎప్పుడూ వినలేదబ్బా! ఇదేదో చాలా హుషారుగా ఉంది.
    ఏ కారణంవల్లనైతేనేం ఎలక్కి డబ్బంటే ఏమిటో తెలుసు. డబ్బు మంచి వాసన వెయ్యదు. దానికి రుచిలేదు. ఏమిటో అంతా గవర్నమెంటు వ్యవహారం. అయినా అర్ధమవుతోంది.
    కుర్రాడు చుంచెలక్కి నాలుగైదు మంచి ఉల్లిపాయలు కొనిపడేస్తే బాగుండును. అయితే భయపడ్డాడు. ఇక దీనికి తిండిలో తప్ప మరి దేనిలోనూ మాధుర్యం కనపడడం మానేస్తుందని. అది వాడికిష్టంలేదు. ఎలక తన గొడవ తానే పడుతుందిలే అని విసర్జించుకున్నాడు.
    కాని ఒక విషయం మాత్రం ఎలక్కి స్పష్టంచేశాడు. "ఎన్నడూ బోనుల జోలికి పోకు. నిశ్చలంగా, అమాయకంగా కనబడ్డా బోను చాలా దుర్మార్గపు యంత్రం -  అందులోని ఉల్లిపాయ చాలా చాలా అమరికగా ఉంటుంది. దాన్ని మాత్రం మెచ్చుకోకు. ఒకసారి ఆ వాసన తగిలిందా మరి నీపని సరి. అదే నీ మరణం."
    మరణం?
    ఎప్పుడూ వినలేదబ్బా ఈ మాటని చుంచు.
    తాగుడు సాగిపోతోంది. ఎన్నోసార్లు చుంచెలక వెళ్ళిపోయి డబ్బుతో తిరిగి వచ్చింది. కాని ఒకరోజున చుంచు తిరిగిరాలేదు. అనతికాలంలో కుర్రాడు బీదవాడు కావడం ప్రారంభించాడు. ఆందోళన కూడా ఆరంభమయింది. డబ్బులేకుండా ఇదివరకు ధోరణిలో ఎలా బతకడమని మొదట్లో మదనపడ్డాడు. కాని క్రమక్రమంగా చుంచు గురించి కూడా ఆందోళనలో పడ్డాడు. యోగదృష్టివల్లనో నిషాబలంవల్లనో దర్యాప్తు చెయ్యగా ఎలాగైతేనేమి. రెండురోజులకిందట తన గది వదలిపెట్టిన చుంచెలక బోనులో పడినట్టు తెలుసుకున్నాడు.
    బోను ఉన్నగది రెండో అంతస్తులో ఎడమ వరుసని ఉంది. అందులో ఒక కిటికీలోంచి గదిలో చొరబడడం కష్టంమీద సాధించాడు కుర్రాడు. ఒక మూలని సాక్షాత్తూ చుంచెలక కనిపించింది. ముసిలాడు పనిమీద ఊళ్లోకి పోయాడు.
    కుర్రాడికి ఏడుపొచ్చింది.
    "నేను చెప్పేనుకాదూ" అన్నాడు కుర్రాడు. "వొద్దంటే విన్నావా" అన్నాడు కుర్రాడు. చుంచెలకను బోనులోనుంచి బైటికి తీసి జాగ్రత్తగా ఎడమ అరచేతిలో పెట్టుకుని తన గదిలోకి వెళ్లాడు.
    దారిలో ఈ దృశ్యాన్ని చూసిన హోటేలు నౌకరుకూడా ఏడ్చాడు. శీతలోపచారాలు చెయ్యమని సలహా యిచ్చాడు.
    శీతలోపచారాలు చెయ్యబడ్డాయి. ఉల్లిపాయలు కొనితెచ్చాడు కుర్రాడు. చుంచెలక వాటిని ముట్టుకోలేదు.
    కుర్రాడు భయంతో వొణికాడు.
    "లావాటి ముసలిపీనుగ, దైవభక్తిలేని చచ్చు ముసలి ఘటం" అని మళ్ళీ మళ్ళీ ఆడిపోశాడు.
    చుంచెలక కుర్రాణ్ణి అయిదు పగళ్ళూ, అయిదు రాత్రులూ దిగాలుపడి చూసి చూసి ఆఖరికి ప్రాణాలు విడిచింది.
    తెల్లకాగితాలు కొని, పొట్లంకట్టి అందులో శ్రద్ధగా ఎలకనిపెట్టి పార్కులో గొయ్యితీసి దాన్ని స్వయంగా సమాధిచేశాడు కుర్రాడు.
    హోటల్ కి తిరిగివచ్చి తన సామాన్లు సద్దుకొని ఇక్కడ మరి ఉండలేనని చెప్పి వెళ్ళిపోయాడు కుర్రాడు. "ఈ వెధవలోకంలో ఎంతేసి దుర్మార్గులైనా ఉంటా"రని శపించుకుంటూ.

                              * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS