Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 70


    "చచ్చాన్రా భగవంతుడా? దీంతో ఇవ్వాళ రంగం తప్పదు, ఈ రాత్రి తెల్లవారదు!" అనుకొన్నాడు వెంకటపతి.
    భార్యను తప్పుకొని హాల్లోకి వచ్చాడు.
    తన వెనకే వచ్చిన వరూధిని అడుగులు, వెంకటపతికి తన గుండెలమీదే పడినట్టయిపోయి, చలనరహితంగా నిలబడ్డాడు! పెళ్ళాం విసరబోయే విచ్చుకత్తులకు వెన్నిచ్చి ఎదురు చూశాడు.
    "విస్కీ వుందా?"
    "విస్కీ లేదూ పాడూ లేదూ. తగ్గించుకోవాలని చూస్తున్నా." తనలో తనే మాట్లాడుకొన్నట్టుగా అన్నాడు.
    "మానేస్తారా?"
    "మానేస్తేనే బాగుంటుంది." వేంకటపతికి ధైర్యం వచ్చింది. వరూధిని రూపంలో కన్పించిన తీవ్రత మాటల్లో లేదు!
    "ఎప్పటినుంచి ఈ వైరాగ్యం?"
    వెంకటపతి మాట్లాడలేదు.
    "ఇప్పుడు విస్కీ కావాలి."
    "ఎవరికీ?" వెంకటపతి భార్య ముఖంలోకి చూస్తూ అడిగాడు.
    "నాకే!"
    వెంకటపతి భార్యకేసి ఆశ్చర్యంగా చూశాడు.
    "విస్కీ లేకపోతే బ్రాందీ అయినాసరే!"
    వెంకటపతి తెల్లబోయి చూశాడు.
    "అదీలేకపోతే సారా అయినాసరే!"
    "అవన్నీ ఎందుకూ? నీ మందుందిగా? ఎర్రది! ద్రాక్షపళ్ళతో చేసేది!" వెంకటపతి భార్యను బుజ్జగిస్తున్నట్లు చెప్పాడు.
    "అదయిపోయింది. నా తల పగిలిపోతూంది. త్వరగా తెచ్చిపెట్టాలి."
    "అర్ధరాత్రప్పుడెక్కడ దొరుకుద్దీ?" ఆలోచించి మరీ అన్నాడు వెంకటపతి.
    "ఎక్కడయినా సరే!"
    "ఎక్కడబడితే అక్కడ కొంటే కల్తీ సరుకు ఇస్తారు."
    "ఏదయినా సరే!"
    వెంకటపతి మాట్లాడలేకపోయాడు. వరూధిని వందరూపాయల నోట్లు రెండు తెచ్చి భర్తకిచ్చి అన్నది ...
    "ఎంతయినాసరే, నాకు ప్రాణం పోయేటట్టుంది. తొందరగా రావాలి!"
    వెంకటపతి మెత్తబడిపోయాడు. భార్యమీద జాలివేసింది.
    పాపం, దాని మందయిపోయినట్టుంది. దానిబాధ తను చూడలేడు. ఏ మందయినా అలవాటయితే అంతే! అది లేకపోతే ప్రాణాలమీదకొస్తుంది. ఆ బాధేమిటో తనకు తెలుసు. ఇప్పుడు దీనిక్కూడా తెలిసివస్తుంది. ఇదీ ఒకందుకు మంచిదే. రేపు తనను అన్నప్పుడు చెప్పొచ్చు.
    వెంకటపతి రోడ్డుమీద నడుస్తూ అనుకొన్నాడు.
    ఓ గంట తిరిగి చివరకు 'చౌకు'లో ఉన్న ఓ సోడాషాపులో నూటడెబ్బై ఇచ్చి ఓ బాటిల్ కొన్నాడు. అందులో అంతా నికార్సయిన సరుకే వుంటుందని నమ్మకం కలిగింది. లేకపోతే నూటడెబ్బై ఎందుకు తీసుకొంటాడు? నూరు - నూట పాతికో దాని అసలు ధర. రామనాథబాబుకైతే ఇంకా చౌకగానే  దొరుకుతుంది. పోతేపోయింది డబ్బు! మంచిది దొరికింది. తనకైతే ఏం కలిపినా ఫర్వాలేదు. వరూధినికి కదా! మంచిసరకు - సీమసరుకు కావాలి. ఇదయితే మనిషిని తిప్పేయదు. ఆ ఎర్రమందులో కూడా ఏ మాత్రమో నిషా ఉండాలి! లేకపోతే అదిలేనప్పుడు మనిషి ఇట్లా తల్లకిందులైపోదు. నిషా వున్నదేదయినా అలవాటయితే కష్టం.
    వెంకటపతి బాటిల్ తెచ్చి పడకగదిలోవున్న భార్యముందు పెట్టాడు. విస్కీ బాటిల్ చూడగానే వరూధిని ముఖం వెలిగిపోయింది. భర్తకేసి చూసింది. ఆ కళ్ళల్లో భర్తమీద కృతజ్ఞతాభావం, జాలీ, అసహ్యం మూడూ విడివిడిగానే ఒకదానిపక్కన ఒకటి ఒరుసుకొని వున్నాయి.
    "ఎంత?" అని అడుగుతుందేమో చెప్పాలని వెంకటపతి భార్యముందే నిలబడ్డాడు. ఆమె అడగలేదు. అయినా వెంకటపతి చెప్పాడు.
    "సీసా రెండొందలదాకా తీసుకున్నారు. సీమదే, మంచిది."
    "సరే, మీరెళ్ళి పడుకోండి!" భర్తమాటలు వినిపించుకోకుండానే వరూధిని అనేసింది.
    "వట్టిదే తాక్కూడదు. సోడాకాయలు లేవుగా, నీళ్ళు కలుపుకో."
    వరూధిని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ భర్తను చూసింది. వెంకటపతి అమాయకత్వానికి ఆమె నవ్వకుండా ఉండలేకపోయింది!
    వెంకటపతి జేబులో మిగిలివున్న ఇరవై ఐదు రూపాయలూ తడుముకుంటూ వరూధిని వున్న గదిలోనుంచి బయటికొచ్చాడు.
    పాతిక రూపాయలు! తనకు రెండు రోజులకు సరిపోతుంది. ఆలోచిస్తూ పడుకున్నాడు వెంకటపతి.
    కళ్ళుమూసుకోగానే గుర్రుపెట్టే వెంకటపతికి నిద్రపట్టలేదు. ఓ గంటసేపు ఊరంతా తిరిగేసరికి తాగిందాంట్లో సగం దిగిపోయింది. ఎప్పుడనంగా తాగాడు? ఎప్పుడో ఊరుపొద్దుకూక్కముందు. నడిరాత్రి దాటింది. ఇంకా ఏం ఉంటుంది? అన్నట్టు వరూథిన్ని హైదరాబాదు సంగతులు అడగలేదు. అడిగే అవకాశం ఎప్పుడుందీ? బాబు ఎలా వున్నాడో? హాలు సంగతి ఏమయిందో? ఎందుకో కుర్రాణ్ణి వదిలి వుండలేకపోతున్నాడు! వాడ్ని చూసి మూడురోజులే అయింది. అయినా పదేళ్ళయినట్టుంది.
    గోడ గడియారం ఒకటి కొట్టింది. వెంకటపతి మెలకువగానే వున్నాడు. నిద్రపట్టడంలేదు. వళ్ళంతా కుంగతీసుకు పోతున్నట్టుగా వుంది.
    వెంకటపతి లేచి వరూధినిగదిముందుకు వచ్చాడు. గదిలో నిశ్శబ్దంగా వుంది. తొంగి చూశాడు. వరూధిని పందిరి మంచానికి అడ్డంగా పడుకొనివుంది. రవిక తీసేసి బాడీతోనే పడుకొంది. చీర తొలగిపోయివుంది. దీర్ఘంగా బలంగా గాలి పీల్చివదులుతూంది. ఆమె రొమ్ములు లయగా లేచి పడుతున్నాయి. గాఢ నిద్రలోవున్న వరూధిని ముఖం మెరిసిపోతూంది. పెదవులు అందంగా వంపులు తిరిగి వున్నాయి.
    వెంకటపతి భార్య పడక పక్క నిలబడి తదేక ధ్యానంతో చూడసాగాడు. కొద్దినిముషాలు అలాగేచూసి అడుగు ముందుకు వేశాడు.
    టీపాయిమీద వున్న గ్లాసు కిందపడింది. వెంకటపతి ఉలిక్కిపడ్డాడు.
    ఇంకా నయం, విస్కీ బాటిల్ పడలేదు అనుకొన్నాడు.
    బాటిల్ తీసుకొని లైటుకు ఎదురుగా పెట్టి చూశాడు. ఇంకా సగానికి పైగానే వుంది.
    వెంకటపతి మనసు ఆగలేక పోయింది. బాటిల్ తీసుకుని, లైటు తీసేసి, గదిలోంచి బయటికి వచ్చేశాడు. తనగదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. బాటిల్ మూత తీసి, అమాంతం నోటికి అందించాడు. గట గటా నాలుగు గుటకలు వేశాడు. గొంతు మండిపోయింది. తనకే ఇలా అయిందేమిటి? బాటిల్ అటూ ఇటూ తిప్పి చూసుకొన్నాడు.
    మోసం! అది కల్తీది! నూట డెబ్బై పుచ్చుకొన్నాడు. గాడ్దికొడుకు. అందుకే అది వళ్ళు తెలియకుండా పడి నిద్రపోతూంది.
    బాధ పడ్డాడు వెంకటపతి.
    అమ్మినవాడి మీద కసి! వరూధినిమీద కసి! తనమీద తనకే కసి! అందరి మీదా కసి! కసిగా బాటిల్ లోదంతా తాగేశాడు వెంకటపతి.
    
                           30
    
    ఓ నెల రోజులుగా వరూధిని థియేటర్ వైపు ముఖం చూపించలేదు.
    వెంకటపతే వెళ్ళి వస్తున్నాడు. భర్తను రామనాథబాబు గురించి మధ్య మధ్య అడిగింది. ఆ నెలరోజుల్లో రెండుసార్లే వెంకటపతి రామనాథబాబును చూడటం తటస్థించింది. వెంకటపతిని చూసీ చూడనట్టు వెళ్ళిపోతుండేవాడు. ఇదివరలో రామనాథబాబే వచ్చి నెలనెలా డబ్బు ఇచ్చి వెళ్తుండేవాడు. కాని, ఈ నెల రోజులుగా ఒక్కసారికూడా తొంగిచూడలేదు.
    అయినా వరూధిని బెట్టుగా కూర్చుంది. వెంకటపతికి మరీ ఇబ్బంది అయిపోయింది. రామనాథబాబు వుంటే తనకు డబ్బులకు కొరవ వుండేదికాదు. అడిగినంత ఇస్తుండేవాడు. మధ్య మధ్య ఖరీదయిన బాటిల్స్ తెప్పించి ఇస్తుండేవాడు. మేనేజరు శివరాంను అడిగితే రామనాథబాబు చెప్పిందే ఇవ్వటానికి వీల్లేదంటున్నాడు. మరీ వెంటపడితే ఐదో పదో దయతలచి ఇస్తున్నట్లు ఇస్తున్నాడు. ఆ సంగతి వరూథినికి చెప్పాలన్నా భయంగానే వుంది. దొంగకు తేలుకుట్టినట్టు ఊరుకున్నాడు.
    రెండో నెల వచ్చినా రామనాథబాబు రావడంగానీ డబ్బు పంపించడంగానీ జరగలేదు. వరూధిని ఇక ఉండబట్టలేకపోయింది. వెంకటపతితో శివరాంకు కబురు చేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS