దయచేసి బాబాయ్ ని ఒప్పించు పిన్నీ! నీకు దండం పెడతాను , కుటుంబ పరిస్థితి చూస్తే నాకు ఏడుపు వస్తుంది పిన్ని. నేను ఉద్యోగం చేసి, కుటుంబ పోషణ బాధ్యత తీసుకుంటాను...." అంటూ భోరున ఏడ్చింది జయంతి.
దాక్షాయణి కూడా కళ్ళ వెంట నీళ్ళు జలజలా రాలాయి.
"అమ్మా జయంతీ! నువ్వు నా సొంతకూతురువి అయితే ఎంత బావుండేదమ్మా, నా బంగారు తల్లీ.....నీ మనసు అర్ధం చేసుకోగలనురా, మీ బాబాయ్ ని ఒప్పిస్తాను.....బాధపడకు. చిన్నపిల్లవయినా ఎంత చక్కగా కుటుంబ పరిస్థితిని అర్ధం చేసుకున్నావు...." ఆమెను వాటేసుకుని ముద్దు పెట్టుకుంది దాక్షాయణి.
జయంతి అలానే ఆమెను పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. దాక్షాయణి పైటకొంగు ఆమె కన్నీళ్ళతో తడిసి ముద్దయిపోయింది.
దాక్షాయణి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఎప్పటినుంచో మనసులో గూడుకట్టుకున్న దుఃఖం భారంగా ఈవిధంగా బయటకు వస్తుంటే అడ్డు చెప్పకూడదని. ఆ భారం అంతా పోయేవరకు ఆమెను ఒదార్చకూడదని అలానే ఆమెను పొదివి పట్టుకుంది.
"గిరిజక్కను నేను ఎంతగా ప్రేమించాను పిన్ని! ఆమె దూరమైంది. సుందరం బాబాయ్, చిన్నపిన్ని వెళ్ళిపోతారుఅని నేను ఉహించలేదు. ఇప్పుడు నువ్వు నాకు కావాలి పిన్నీ.....నిన్ను నేను వదులుకోను. నేను ఉద్యోగం చేయకపోతే మన మధ్య తప్పక మనస్పర్ధలు వస్తాయి పిన్నీ" అంటూ ఆమె ఏడుస్తూనే మాట్లాడుతోంది.
దాక్షాయణి ఆమె మాటలకు సిగ్గుతో చితికిపోయింది. నేను ఎంత దారుణంగా ఆలోచించాను. సరిగ్గా నా మనసులో మాటలు తెలుసుకున్నట్లు జయంతి ఎంత చక్కగా విశ్లేషించింది అనుకుంటూ.
"ఏయ్ జయంతీ ఊరుకో....నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. ఉరుకోమ్మా, ఏడవకు....." అంటూ ఓదార్చింది దాక్షాయణి.
జయంతి మెల్లగా ఆమె భుజం పై నుంచి పక్కకు జరిగి పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంది.
ఆమె మనసు ఇప్పుడు తేలికపడింది. ఎప్పటినుంచో ఈ విషయాలన్నీ పిన్నితో చెప్పాలనుకుంది, ఇప్పుడు చెప్పేసింది. వాన వేలిసినట్లుంది ఆమె మనసు.
"పిచ్చి పిల్ల! నీ మనసులో ఇన్ని ఆలోచనలు వున్నాయని తెలుసుకోలేకపోయాను. నిన్ను అందరి ఆడపిల్లల్లానే భావించాను. కానీ నువ్వు ఆణిముత్యానివి జయంతి. నీ లాంటి కూతుర్ని కనటం కస్తూరక్క అదృష్టం" అంది దాక్షాయణి.
పైన ఆకాశంలో నిండు చంద్రుడు నిర్మలంగా, ప్రశాంతంగా వున్నాడు. వెన్నెల చల్లగా , తెల్లగా డాబా అంతా పరుచుకుంది. వాళ్ళు డాబా పైకి వచ్చి దాదాపు గంటన్నర అవుతుంది. ఆ నిర్మలమైన వెన్నెల ఆకాశం కింద వాళ్ళు అంతకంటే నిర్మలమైన, స్వచ్చమైన మనస్సులతో కిందకు దిగివెళ్ళారు.
"ఏంటే జయంతి ఇంతసేపు డాబా పైనే వున్నారా? ఏం కబుర్లుంటాయే మీకు?" అడిగింది కస్తూరి నవ్వుతూ.
"ఊరికే ఏవో కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నాంలేవే! ఏంటి ఈ రోజు కూరలు?" అడిగింది జయంతి.
"నీకిష్టమైనవే! ములక్కాయ పులుసు, కాకరకాయ వేపుడు" అంది కస్తూరి.
"అబ్బ నిజంగానా! పిన్నీ రా పిన్ని త్వరగా భోం చేద్దాం" అంది జయంతి.
"అదేంటి మీ బాబాయ్ రాకుండా మీ పిన్ని భోంచేస్తుందా" అంది కస్తూరి.
"ఓహో! ఇదేంటి ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినాలి. మొగుడు వచ్చేవరకు పెళ్ళాం ఆకలితో మాడి చావాల్సిందేనా? పెళ్ళానికి అన్నం తినే స్వేచ్చ లేదా?" అంది జయంతి సీరియస్ గా.
దాక్షాయణి , కస్తూరి ఆమె మాటలకు పగలబడి నవ్వి.
"అది నీకు అర్ధంకాదు లేవే! రేపు నీకు పెళ్ళయితే అప్పుడు తెలుస్తుంది" అంది కస్తూరి.
38
1960, ఆగస్టు.....! !
ఆరోజు జయంతి పుట్టినరోజు.
ఆమెకు, ఆమె కుటుంబానికి పునర్జన్మ నిచ్చిన రోజు కూడా.
ఎందుకంటే జయంతి ఆ రోజు....
ఉ-ద్యో-గం-లో-చే-రిం-ది!
ఆమె చదివిన కళాశాలలోనే అసిస్టెంట్ లైబ్రరియన్ గా మూడు వందల రూపాయల జీతంతో ఆమె ఉద్యోగంలో చేరింది. ఇంట్లో తల్లిని, తండ్రిని, బాబాయ్ ని ఒప్పించటానికి ఆమెకు రెండు నెలలు పట్టింది.
దాక్షాయణి భర్తకు గట్టిగా చెప్పి ఒప్పించింది.
కస్తూరి ముందు ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది.
ఇదేం చోద్యమే తల్లీ.....మన ఇంటావంటాలేదు.....ఫలానా వాళ్ళ అమ్మాయి ఉద్యోగం చేస్తుందట....అని రేపు ఊరంతా చోద్యంగా చెప్పుకుంటుంది. బంధువులు చెవులు కొరుక్కుంటారు....పెళ్ళి చేయలేక ఊరుమీదకు బలాదూర్ వదిలేశారని చెప్పుకుంటారే తల్లీ! అదెంత నామర్ధానే నేను ఒప్పుకోను: అంటూ ఏడుస్తూ నెత్తి కొట్టుకుంది.
అరిచింది....కేకేలేసింది.
కానీ జయంతి చలించలేదు.
స్థిరంగా ఒక్కటే మాట అంది. "నేను ఉద్యోగం చేయటం మీకిష్టం లేదంటున్నారుగాకదా....అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతాను.....పట్నంలోనే ఒక్కదాన్నే ఉంటూ ఉద్యోగం చేస్తాను. అది మీకింకా నామార్ధ అవుతుంది" అంది.
ఆ మాటలు విని కస్తూరి కూతురి రెండు చెంపలు వాయించింది.
"ఎంతగా బరితెగించావే....ఆడపిల్లపుడితే మహాలక్షి పుట్టిందని ఎంతో సంబరపడ్డాం...మాకు శనిలా దాపురించావుకదే" అంటూ నెత్తికొట్టుకుంది.
జయంతి నిశ్శ్సబ్ధంగా నవ్వుకుంది.
దాక్షాయణి మనస్సు చివుక్కుమంది.
