Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 69


    అదుగో ఆ సీసా, అందులో ఏవో ఉండలున్నాయే అన్నాడు ముసిలాయన.
    అవి నా గొట్టికాయలన్నాను నేను.
    ఆ గూట్లో డబ్బీ. అందులో తినబడు సామాగ్రి ఓ పిసరు లేదూ?
    మిడతల్ని దాచుకున్నాను.
    ఆ మూలని జాడీ చూశావ్. దాంట్లోనో?
    కప్పలు.
    ఇకనేం కప్పల్ని ఉడకబెట్టుకుతింటే బాగానే వుంటుంది. నాకలాంటి పట్టింపులు లేవన్నాడు ముసిలాయన.
    కప్పల్ని తింటారా ఎవరైనా అన్నాను.
    ఎందుకు తినరూ? ఎందుకేమిటి తినరు? మహారాజులాగ తింటారు. చీనావాళ్లు కప్పల్నీ, మిడతల్నీ తింటారు. మనం తింటేనేనా తప్పొచ్చింది? రానియ్యి, ఓ అరడజను కప్పల్ని, మిడతలనెన్ని జాగ్రత్త చేశావ్?
    నాలుగో, అయిదో.
    దించవేం. తియ్యి జాడీలు డబ్బాలూ. కడుపునిండా తిన్నతర్వాత పదవే భద్రాద్రికి అనే పాట పాడతాను. కావలిస్తే నువ్వడిగిన రంగమెల్లి పోతానే అనే పాటకూడా పాడతాను. ఇప్పుడు మాత్రం ఇంకా ఆకలి దహించేస్తోంది.
    నాకూ ఆకలిగానే వుంది. అయినా నా కప్పల్ని చంపేస్తే ఒప్పుకోను.
    మా నాన్న చేతులు కడుక్కొని తల రెండు చేతుల్తోను పట్టుకొని పగటికలలు కంటున్నాడు. అవ్వ ఒకచోట నిలవకుండా నడుస్తూ పాడుకుంటోంది. త్యాగరాజు కృతులు ఆవిడకు చాలా ఇష్టంట. తొలినే చేసిన పూజాఫలము అని అరుస్తోంది.
    మీరేదేనా పాడరూ? మా అబ్బాయికి పాటలంటే చెడ్డ సరదా అన్నాడు మానాన్న.
    ఔనండీ నాకు పాటలంటే ఇష్టం. పాడరూ అన్నాను నేను.
    చంద్రకాంతయ్య లేచి చెయ్యి కడుక్కొని తాంబూలం తీసుకొని ఉరుములాంటి గొంతుతో ఊరంతా దద్దరిల్లిపోయేటట్లు పాటకి లంకించుకున్నాడు. ఇరుగు పొరుగు వారందరూ మా యింటిముందు పోగయి పాట వింటూ తన్మయులైపోయారు. మా నాన్న చంద్రకాంతయ్యని లోకి తీసుకొచ్చి వారు ఫలానా అని అందరికీ చెప్పాడు. మైలవరం కంపెనీలో ఆక్టు చేశారనీ విద్యాధీకులనీ పరిచయం చేశాడు.
    జనం ఏమీ అనలేదు. చంద్రకాంతయ్యగారు నాటకాల్లో తమ అనుభవాలను గురించి ఉపన్యసించారు. కలకత్తాలో తనకి సువర్ణపతాకం ఇచ్చారనీ అదంతా నిన్నగాక మొన్న జరిగినట్టు కళ్ళకి కనబడుతోందని అన్నాడు.
    వీరాచారి మరో పాట సెలవియ్యండని అడిగాడు. ఇంట్లో ఏమైనా బియ్యం వుందా అని చంద్రకాంతయ్య అడిగాడు.
    ఓ ఉన్నది. కావలసినంత ఉన్నది అన్నాడు వీరాచారి.
    రావడానికి వీలవుతుందా? తిరిగి రాగానే నీ గుండె కరిగించగల పాట పాడతాను అన్నాడు ముసిలాయన.
    ఇక్కడున్నట్టు వస్తాను అని వెళ్లాడు వీరాచారి.
    అలాగే చంద్రకాంతయ్య రంగశాయిని మీ ఇంట్లో పొట్లపాదు ఉందా అని అడిగి రంగశాయి 'మా ఇంట్లో పాదు ఉండకేం అంటే, ఇబ్బంది అనుకోక ఇంటికి ఒకటి రెండు పొట్లకాయలు తీసుకురావడానికి వీలవుతుందా- రాగానే నీ కళ్లంట నీళ్లు తెప్పించే పాట పాడతానని అనడంతో రంగశాయి అలాగే ఇంటికి బయలుదేరగానే చంద్రకాంతయ్య ఇరుగుపొరుగువాళ్ల నొక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరింట్లోనూ ఏదైనా ఓ పిసరు తినగల, రుచి గల పదార్ధం ఉన్నదేమో అని వాకబు చేసి, వాళ్లంతా ఉన్నట్టు చెప్పగానే వాళ్లందరినీ ఇబ్బంది అనుకోక ఇళ్లకి వెళ్లి ఆ తినగల, రుచిగల పదార్థాలు తీసుకురావడానికి వీలవుతుందా అని అడిగి, వాళ్లంతా వెళ్లి ఎవరింట్లో కలిగినది వాళ్లు తీసుకువచ్చి చంద్రకాంతయ్య పాడే, కాళ్లంట నీళ్లు తెప్పించే, జీవితాన్నే అట్నుంచి ఇటు మార్చివేసే పాట వినడానికి కూర్చుని తంబురానీ, గొంతుకనీ సవరించి ఇది మాయా సంసారం అనే పాటని విజృంభించి పాడగా ఇరుగు పొరుగువాళ్ళు పరవశులై కళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయాక చంద్రకాంతయ్యగారు ఇరుగు పొరుగువాళ్ళు తెచ్చిన మంచి మంచి పదార్ధాలన్నీ వంటింట్లో చేరవేసి ఆ వంకాయలూ, పొట్లకాయలూ, బియ్యం, పంచదార, సెనగపప్పు, అవన్నీ వండుకున్నాక మేమందరమూ హాయిగా భోజనంచేసి ఆకలి తీర్చుకున్న పిమ్మట చంద్రకాంతయ్యగారు మీ అభ్యంతరం లేకపోతే ఇలాగే మరికొన్నాళ్ళు మీ యింట్లోనే వుంటాననేసరికి దీన్ని స్వగృహంగానే భావించుకొండని మానాన్న అనగా అలాగే అని చంద్రకాంతయ్యగారు మా ఇంట్లో పదిహేడు పగళ్లూ పదిహేడు రాత్రులూ గడిపిన మీదట పద్ధెనిమిదో రోజు మధ్యాహ్నం చంద్రకాంతయ్యగారున్నారా అని ఎవరో వచ్చి అడిగితే మానాన్న ఎవరు నువ్వు అని అడిగారు.
    మాది మైలవరం, మళ్ళీ నాటకాలు వేస్తున్నాం. చంద్రకాంతయ్యగారికి తెలుసు. రెండు వారాలలో నాటకం అని ఆ వచ్చిన మనిషి అనగానే పరధ్యానంగా కూర్చున్న చంద్రకాంతయ్యగారు దిగ్గున లేచి అతనితో కలిసి వెళ్ళిపోయాడు.
    ఆ మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ మాకు ఆకలి మండుకొస్తే మానాన్న నన్ను పిలిచి సెట్టిగారి దగ్గరకు వెళ్ళి ఏమిస్తే అది తీసుకురా, ఎలాగైనా తీసుకురావాలన్నాడు.
    ఇరవైరెండు రూపాయలపై చిల్లరబాకీ తీర్చనిదే ఏమీ ఇవ్వడతను అన్నాను నేను.
    వెళ్ళరా మరిన్నీ. నంగిరితనం వాడకు. అతనెంత యోగ్యుడు. నువ్వడిగితే లేదంటాడా?
    చచ్చినట్టు సెట్టి కొట్టుకి వెళ్లి ఇదివరకు చీనా సమస్యను వదలిపెట్టినచోట మళ్ళీ ఎత్తుకొని ఎలాగైతేనేం ఒక సేరు అటుకులు సంపాదించేసరికి నాకు తలప్రాణం తోకకొచ్చింది. అటుకులు తీసుకుని మానాన్న ఇవి తింటే ముసిల్దానికి తంటా వస్తుందని అన్నాడు. అలాగే అవ్వ మర్నాడు పాడుతూ దగ్గుతూ, దగ్గుతూ పాడింది.
    ఇలా అటుకులమీద బతికితే ఎంతకాలానికి నా మహాకావ్యం పూర్తవుతుందన్నాడు మానాన్న.

                                   * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS