జట్కా రోడ్డుమీద పరిగెత్తుతూ వుంది. జట్కావాడు చక్రంలో కమ్చీ కర్ర పెట్టి మోగిస్తూ, బండిమీద నిలబడి, గుర్రం మీదకు వంగి ఈల వేస్తున్నాడు. గుర్రం గేలప్ లో దూకుతోంది. జట్కా కుదుపులకు వరూధిని వూగిపోతోంది.
భర్తతో తను జట్కాలో కూర్చొని మొదటిసారిగా సినిమా కొచ్చిన రోజు గుర్తొచ్చింది వరూథినికి...
ఆనాడు సినిమాహాల్లో కుర్రాడు తెచ్చి డ్రింక్స్ ఇచ్చాడు. భర్తే తెప్పించాడనుకొని తాగింది. కుర్చీలపక్కగా అతను నిలబడ్డాడు. ఎన్నోసార్లు అతన్ని దొంగచూపుల్తో చూసింది. చాలా హుందాగా, పెద్దమనిషిలా నిండుగా నిబ్బరంగా కన్పించాడు. సినిమా అయ్యాక అతనే జట్కా మాట్లాడి ఎక్కించాడు ఇంటిదగ్గర దించిన జట్కావాడు డబ్బులివ్వబోతే "అయ్యగారు కోపం చేస్తారు మీ దగ్గర తీసుకుంటే" అని, తీసుకోకుండా పోయాడు. డ్రింక్స్ తెచ్చిన కుర్రాడూ అదేమాట అన్నాడు. ఆ రోజు అదేమిటని ఆశ్చర్యపడిన భర్తకు తనేం చెప్పింది?
"రామనాథబాబు మాకు దూరపు చుట్టం!" అని చెప్పింది.
అంతా అబద్దం పిచ్చాడు పల్లెటూరి మనిషి నమ్మాడు!
ఆ మాట భర్తకు చెప్పేటప్పుడే అనుకొంది మనసులో ఏమనీ? రామనాథబాబు నాకు కాబోయే చుట్టమనేగా? రెండోసారి పని కట్టుకొని ఆ సినిమా హాలుకే వెళ్ళింది. సినిమా చూట్టానికీ కాదు - హాలు చూట్టానికీ కాదు. రామనాథబాబును చూట్టానికే! తన ఆత్మబంధువును చూట్టానికే గదూ? అతను తన్ను టిక్కెట్లు కొననియ్యలేదు. తన మనస్సునే కొనేశాడు. రెండోసారి తన కార్లో ఇంటికి పంపించాడు మూడోసారి తనే స్వయంగా కార్లోవచ్చి దించి వెళ్ళాడు. ఐదోసారి ఆయనే తనంతట తానే ఇంటికొచ్చాడు.
ఆ తర్వాత ఏం జరిగింది? వరూధిని బుర్ర బద్దలయిపోతూంది. జట్కా వచ్చి ఇంటిముందాగింది.
జట్కావాడికి డబ్బులిచ్చి వరూధిని దిగి లోపలికెళ్ళింది.
వంటమనిషిని పిలిచి "వారింకా రాలేదా?" అని అడిగింది.
"రామనాథబాబుగారు వూరికెళ్ళారన్నారుగా? వచ్చారామ్మా?" బుచ్చమ్మ వరూథిన్ని ఎదురుప్రశ్న వేసింది.
వరూధినికి వళ్ళు మండిపోయింది. దగ్గర్లో ఏమీ లేకపోయింది. ఉంటే బుచ్చమ్మ ముఖం చిట్లేదే!
"ఏమిటి నీ వాగుడు? నేనడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి?" వరూధిని కళ్ళు ఎర్రబడ్డాయి. వంటలక్కా బుచ్చమ్మకు బుర్ర తిరిగిపోయింది.
"వారింకా రాలేదా?" అని అడిగిన ధోరణిలో వున్న గౌరవాన్ని ఆప్యాయతనూ బట్టి అలవాటు ప్రకారం రామనాథబాబును గురించే వరూధిని అడిగిందనుకొన్నది వంటమనిషి మరి ఆమె అనుభవం అదే! భర్తను గురించి అలా అడగటం బుచ్చమ్మ వినలేదు.
వరూధిని కళ్ళూ, ముఖం చూసి కలవరపడిన బుచ్చమ్మ తేరుకొని "మనయ్యగారా? ఇప్పుడే భోంచేసి బయటి కెళ్ళారు" అన్నది.
"హాలు దగ్గిరకేనా?"
"ఆరింకెక్కడి కెళ్తారమ్మా? అక్కడికే పోతారు" అన్నది బుచ్చమ్మ.
ఈ రోజు వరూధినికి వంటమనిషి ప్రతి మాటా ఎత్తి పొడుపుగానూ, ఎద్దేవగానూ వుంది. నాలుగు తన్ని బయటి కీడ్చాలన్నంత కోపంగా ఉంది. కాని, ఆ ముసల్ది రోజూ మాట్లాడే సహజ ధోరణిలోనే మాట్లాడుతూంది. అవేమాటలు ఎన్నోసార్లు వరూధినితో అన్నది. దానిమాటల్లో అర్దాలూ, పెడర్ధాలూ, వ్యంగ్యమూ వరూథినికి ఏనాడూ స్ఫురించలేదు. కాని ఈ రోజు దాని మాటలన్నీ అదోలా అన్పిస్తున్నాయి.
"అన్నం వడ్డించేనా అమ్మాయిగారూ?"
"ఏఁ వొద్దు!"
"అదేంటమ్మా, పెరుగుతోనన్నా ఎంగిలిపడకపోతే ఎట్టా? కొంచమే పెడ్తానమ్మా!" ఆప్యాయంగా అన్నది బుచ్చమ్మ.
"నీగ్గాదు చెప్పింది? నాకు ఆకలిగాలేదని?"
"అయితే ఓవల్టీను కలుపుకొస్తా!"
"ఏం వద్దో మొర్రో అంటుంటే నీ సణుగుడేమిటే?"
"ఏమీ తాక్కుండా ఎట్టానమ్మా మరి?"
వరూధిని విసురుగా పడకగదిలోకి వెళ్ళింది. నిలువుటద్దంలోని ప్రతిబింబం ఆమెను వెక్కిరిస్తున్నట్టుగా చూస్తూంది. మల్లెపూలు లాగేసి, ముడి విప్పేసింది. పిన్నులూ, సవరమూ తీసి టేబులు మీద పారేసింది. బీరువా తెరచి వైన్ బాటిల్ తీసింది. అందులో సగానికి తక్కువగా వున్న వైపంతా గ్లాసులోకి కుమ్మరించింది. మంచంమీద కూర్చొని గటగటా నాలుగు గుక్కలు వేసింది. పొలమారి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. మరో పావుగంటలో మిగతా వైన్ కసిగా తాగేసింది.
మంచంమీద దొర్లింది. పదిన్నర దాటింది. అయినా నిద్రపట్టలేదు. మెదడులో మిడతల దండులా ఎన్నో అనుభూతులూ, అనుభవాలూ, సంఘటనల తాలూకు స్మృతులూ, ఊహలూ దాడి చేయడం మొదలుపెట్టాయి.
హైదరాబాదులో గోపాలరావు చెప్పిందికూడా నిజమేనా?
ఆ ఆలోచన రాగానే వరూధిని గుండె ఆగినంత పనయింది. బయట రిక్షాగంట మోగినా, జట్కా చప్పుడు విన్నా భర్త వచ్చాడేమోననుకొని నాలుగుసార్లు బయటకొచ్చింది. వెంకటపతి రాకకోసం ఆత్రంగా ఎదురుచూసింది. పదకొండు దాటినా వెంకటపతి రాలేదు. ఎంతసేపటికీ రాని భర్తమీద కసీ కోపం పెరగసాగాయి.
అసలు ఆయన సమర్దుడైతే తిప్పలెందుకు?
వెంకటపతి గురించిన పాత జ్ఞాపకాలు వరూధిని మనసులో కదలబారాయి.
పెళ్ళయిన కొత్తరోజుల్లో గండుపులిలా తనకేసి చూసిన వెంకటపతి ఎలుగ్గొడ్డులా చేతుల్లో తన శరీరాన్ని బంధించి వేసిన వెంకటపతి..... తినే తినే పళ్ళెంలో నీళ్ళు పోసినందుకు తనను వంగదీసి బాదిన వెంకటపతి ఏడీ? ఇప్పుడేమయ్యాడూ?
వరూధినికి అసహ్యం, కసీ, పెనవేసుకుపోగా, దుఃఖం పొర్లుకొచ్చింది.
వరూథినికి నిద్రరావటంలేదు. మేలుకుంటే తల పగిలిపోయేట్టుగా వుంది. లేచి బీరువా అంతా వెదికింది. తనక్కావల్సింది దొరకలేదు. మర్చిపోయి వదలడం అంటూ ఎప్పుడూ జరగలేదు. ఒక్కసారన్నా ఆ పని చేసివుంటే ఎంత బాగుండేది? ఇప్పుడది తనకు కావాలి. లేకపోతే బతకలేదు. బుచ్చమ్మను లేపితే? ఇంతరాత్రప్పుడు అదిమాత్రం ఎక్కడినుంచి తెస్తుంది? ఆ రామనాథ బాబు దగ్గిరకే పంపితే? ఛ! ఛ! ఎంతఘోరం? ఆ రామనాథబాబుగడు దాన్ని వళ్ళో కూర్చోబెట్టుకుని దాని పెదవులకు గ్లాసు అందిస్తూ ఉంటాడు.
వరూథినికి తల వెయ్యివక్కలు అయిపోతున్నట్లుగా వుంది. ఇల్లంతా వెదికింది. వెంకటపతి ఆమెకు కనిపించకుండా సీసాలు దాస్తూంటాడు.
ఎక్కడో? తను పాపిష్టిది! తనకు భయపడి సీసాలు ఎక్కడో దాస్తుంటాడు. ఎన్నిసార్లు భర్త తెచ్చుకొన్న సీసాలు తను పగల గొట్టలేదు? ఎన్నిసార్లు రసూల్ కిచ్చి తిప్పి పంపించలేదు? అదంతా ఆయన మంచికే చేసింది. అతిగా తాగి మనిషి పాడయిపోతుంటేనే చేసింది.
వెంకటపతి దాస్తాడనుకొన్నచోటల్లా వెదికింది. ఎక్కడా కన్పించలేదు. దొంగ దాపరికం, ఎక్కడోక్కడ పెట్టేవుంటాడు. అసలు అది లేకుండా ఆ మనిషి బతకలేడు. తనకు మెదడు పెనంమీద పెట్టి కాల్చినట్టుగా అయిపోతుంది. దానికి విశ్రాంతి కావాలి. తను నిద్రపోవాలి. అది తనవల్ల కావడంలేదు. ఆ పని చెయ్యగలిగినది మందు ఒక్కటే, మార్గం ఒక్కటే.
అలజడిగా పక్కమీద దొర్లుతున్న వరూథినికి బయట గేటు తెరచిన చప్పుడు వినబడింది. బయటకు పరుగెత్తుకొచ్చింది. వెంకటపతి గేటుమూసి పిల్లిలా అడుగులు వేసుకొంటూ లోపలకు వచ్చాడు.
వరండాలో లైటు వెలిగింది. వెంకటపతి గాబరాపడిపోయాడు. తలెత్తి చూశాడు. వరూధిని ఎదురుగా నిలబడివుంది. ఆమె కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. చెంపలు నిగనిగలాడుతున్నాయి. ముక్కుపుటాలు ఎగరేస్తూంది. నల్లటి వొత్తుజుట్టు భుజాలమీదగా జారి, రొమ్ములమీద పడివుంది.
గ్రామదేవతలానిలబడివున్న భార్యను చూసి తత్తరపోయాడు. ఆమెలో ఏవో కొత్త అందాలు కొట్టవచ్చినట్టుగా కన్పిస్తోన్నాయి.

