"రీజనింగ్ వుంది పిన్నీ! పిల్లల మీద ప్రేమ వున్న తల్లి భర్తతో పోరాడి వారి ఆశలను నేరవేస్తుంది. వారి మీద వున్న ప్రేమే ఆమె చేత అలా చేయిస్తుంది. అది తల్లికి, బిడ్డకు మధ్య వున్న ప్రేమకు నిదర్శనం" అంది జయంతి నవ్వుతూ.
"చూడమ్మా! నీ రీజనింగ్ లు, అర్గ్యుమెంట్లతో నేను గెలవలేను. నన్ను వదిలేయి....ఈవిషయంలో నేను నిస్సహాయురాలిని" అంది దాక్షాయణి సీరియస్ గా.
"వావ్ నీకు ఇంగ్లీషు బానే వచ్చింది పిన్నీ! పెద్దపెద్ద పదాలు వాడుతున్నావు" అంది జయంతి ఆనందంగా.
"నన్ను నువ్వు మునగచెట్టు ఎక్కిస్తున్నావ్?" అంది నవ్వుతూ.
"మునగచెట్టు అదిగో దూరంగా బావి దగ్గర ఉంది. మనం ఇక్కడ వున్నాం. అదెలా సంభవం?" అంది జయంతి కొంటెగా.
"ఏమో జయంతీ! నీ నిర్ణయం మార్చుకోవటం మంచిదేమో......ఒప్పుకోరమ్మా, అనవసరంగా గొడవలవుతాయి. నా మాటని ఇప్పటి వరకు చదివింది చాలు. పెళ్ళి చేసుకో, ముచ్చటగా వుంటుంది" అంది దాక్షాయణి.
"అంటే నేను ఇంత కష్టపడి చదివింది దేనికి? పెళ్ళి కోసమా" అంది సీరియస్ గా.
"మరి ఉద్యోగం కోసమా?" అంది దాక్షాయణి.
"అవును" అంది జయంతి స్థిరంగా.
"ఏంటి నువ్వు ఉద్యోగం చేయటం కోసమే చదివావా?" అంది దాక్షాయణి.
"అవును మరి....మిరేమనుకున్నారు కాలక్షేపం కోసం, సరదా కోసం చదువుతుందిలే అనుకున్నారా?" అంది జయంతి నవ్వుతూ.
"ఏదో అమ్మాయికి ఇంటరెస్టులే చదవట, అందుకే చదువుకుంటుందని తృప్తిపడ్డాం" అంది దాక్షాయణి.
"మరి ఇప్పుడు కూడా అలానే అనుకోవచ్చుగా?' అంది జయంతి సీరియస్ గా.
"అది వేరు, ఇది వేరు" అంది దాక్షాయణి.
"ఎలా అవుతుంది? చదివేది ఎందుకోసం....ఆ చదువు ప్రయోజనం పోదటం కోసం.....చదువుకు సార్ధకత ఎప్పుడు లభిస్తుంది? సరయిన ఉద్యోగం లభించినప్పుడు" అంది జయంతి.
"అలాగని ఎందుకనుకోవాలి. సరైన మొగుడు లభించినప్పుడు అని కూడా అనుకోవచ్చుగా?" అంది దాక్షాయణి.
"సరైన మొగుడా? అంటే నీ మొగుడు సరైన మొగుడు కాడా?" అంది జయంతి సీరియస్ గా.
"అదేంటి అలా అడుగుతున్నావు?" అంది సీరియస్ గా.
"నీకే చదువులు లేవు కదా! కేవలం అయిదో తరగతి పాసయ్యావు, మరి నీకు అంతటి లక్షణమైన, బుద్దిమంతుడైన మొగుడు దొరికాడు కదా?" అంది జయంతి నవ్వుతూ.
"ఆ రోజులు వేరు.....ఈ రోజులు వేరు...." అంది దాక్షాయణి తన వాదనను బలపర్చుకోవటానికి.
"ఆ.....అది ఇప్పుడు నా దారికొచ్చావు. నేననేది అదే! రోజులు మారాయి. ఈరోజుల్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటంలో తప్పులేదు. మాకాలేజిలో మేడంలు ఉద్యోగాలు చేయటంలేదా? ఆస్పత్రుల్లో డాక్టర్లుగా, నర్సులుగా, గుమ్మస్తాలుగా. ఎంతమంది చేయటం లేదు. వాళ్లందరూ చేసుకోగా లేంది మనం ఎందుకు చేయకూడదు? మనకేమైనా కొమ్ములు ఉన్నాయా?" అంది జయంతి.
దాక్షాయణి ఏం మాట్లాడలేకపోయింది. జయంతి వాగ్ధాటికి ఎదురు చెప్పలేక మౌనంగా వుండిపోయింది.
జయంతే మళ్ళీ తనను తాను కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా అంది.
"ఎంతవరకని బాబాయ్ మాకు సహాయం చేస్తాడు? ఇప్పటికే నా చదువుకోసం పాపం చాలా ఖర్చు చేశాడు. ఇంకా ఆయన్ని పట్టిపిడిస్తే మాకు మీరు కూడా దూరమవుతారు. నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వు బాధపడకు పిన్నీ! ప్రాక్టికల్ గా ఆలోచించి చెపుతున్నాను. ప్రాక్టికల్ గా అంటే అర్ధమయిందిగా నీకు?" అంది జయంతి.
దాక్షాయణినవ్వుతూ తలూపింది.
"గుడ్.....ఎందుకంటే మా కుటుంబం పెద్దది. నేను పెళ్ళిచేసుకోవాలంటే పొలం సగమైనా అమ్మాలి. సగం పొలం నా పెళ్ళికే అమ్మేస్తే మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లెలు పరిస్థితి ఏంటి? నా స్వార్ధం నేను చూసుకుని పొలం అమ్మించి పెళ్ళి చేసుకుని గిరిజక్కలాగా మొగుడ్ని తీసుకుని ఎంచక్కా వేరే కాపురం పెట్టించి వెళ్ళిపోయాననుకో. పిల్లల పరిస్థితి ఏంటి? అందుకే పొలం అమ్మేయటం నా అభిమతం కాదు. పరోక్షంగా ప్రస్తుతానికి నేను పెళ్ళి చేసుకోవటం నాకిష్టం లేదని చెపుతున్నాను. అర్ధమయింది కదా?" అంది నవ్వుతూ.
దాక్షాయణి ఆమె మాటల్ని ఆశ్చర్యంగా వింటుంది.
చిన్నపిల్ల ఎంత చక్కగా పరిస్థితుల్ని విశ్లేషించి చెపుతుంది అనుకుంది.
"నేను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే తమ్ముళ్ళు పరిస్థితి ఏంటి? చెల్లెలు పరిస్థితి ఏంటి? నాన్నగారా అయన పట్టించుకోవటంలేదు. అయన మొదటి నుంచి అదో టైపు మనిషి. కుటుంబ పరువు ప్రతిష్టలకోసం ఏమైనా చేస్తారు కూడా. సున్నితమనస్కులు....అందుకే సుందరం బాబాయ్ చేసినపనికి అయన మనసు తట్టుకోలేకపోయింది. సర్వసంఘపరిత్యాగిలా అయిపోయారు. పచ్చిగా చెపుతున్నాను పిన్నీ! అయన మీద ద్వేషంతో కాదు....మరే ఉద్దేశంతోనూ కాదు....అయన వు...న్నా...లే...న.....ట్లే.....!!" అంది జయంతి స్పష్టంగా.
దాక్షాయణి ఉలిక్కిపడింది.
"ఏంటి పిన్నీ! నామీద కోపం వస్తుందా? ఏంటిది ఇలా బరితెగించి మాట్లాడుతుంది అనుకుంటున్నావా?" అంది.
"లేదు జయంతీ చెప్పు" అంది దాక్షాయణి స్థిరంగా.
"అమ్మ భోళా మనిషి. ఒకపక్క కూతురికి పెళ్ళి చేయాలనే ఆరాటం....మరోపక్క కుటుంబ పరిస్థితి ఏంటని మనసులో పోరాటం. అటు భర్తకు చెప్పుకోలేక, నాకు చెప్పలేక మధ్యలో నలిగిపోయే సగటు గృహిణి. సుందరం బాబాయ్ అతని స్వార్ధం అతను చూసుకుని వెళ్ళిపోయాడు. సురేంద్ర, గిరిజ పరిస్థితి నీకు తెలుసు. పొతే మీరు....అని ఆగింది జయంతి.
మా గూర్చి ఏం చెపుతుందా అని ఆసక్తిగా వింటుంది. అందరి విషయాలు పచ్చి నిజాలు చెప్పింది అనుకుంటుంది దాక్షాయణి.
"మీ గూర్చి ముందే చెప్పాను....ప్రస్తుత పరిస్థితుల్లో నేను మిమ్ములను వదులుకోను. నా మనసులో రగిలే ఏదనను మనసు విప్పి చెప్పికోవటానికి నాకు మంచి స్నేహితురాలు కావాలి....ఆ స్నేహితురాలివి నువ్వే. నువ్వు కూడా లేకపోతే నేను తట్టుకోలేను పిన్నీ, అమ్మను చూస్తే గుండె తరుక్కుపోతుంది. లోగడ కస్తూరమ్మా ఓ సోలడు పాలు పోస్తావా చుట్టాలు వచ్చారు అంటే. ఆప్యాయంగా రెండు సోలలు పోసే అమ్మ నేడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ రెండు సోలలు పాలను అమ్ముతున్న నేపధ్యంలో ఆమె పడే ఆవేదనను అర్ధం చేసుకో.....కుటుంబ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని రోజు రోజుకి ఎంత క్షిణించిపోతుందో చూశావుగా, నాన్నగారు ఇదివరకు ఎలా వుండేవారు....తెల్ల లాల్చీ, తెల్ల పంచె, భుజం పైన పై పంచె వేసుకుని ఠీవిగా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే "దండాలండి ప్రెసిడెంట్ గారూ...." అంటూ ఊరంతా వంగి వంగి నమస్కరిస్తుంటే అయన గర్వంతో పొంగిపోయేవాడు.....ఈ ఊరు నాది, దీని బాగోగులు చూడాల్సిన బాధ్యత నాది అనుకునేవారు, సుందరం బాబాయ్ చేసిన పనితో ఆ కల చెదిరింది. అందుకే అయన అంతగా కృంగిపోయారు.
ఈ పరిస్థితుల్లో నా స్వార్ధం నేను చూసుకుని, పెళ్ళి చేసుకుని వెళ్ళమంటావా పిన్నీ? అమ్మనూ, తమ్ముళ్ళను, చెల్లెని వాళ్ళ మానాన వాళ్ళను వదిలి నేను వెళ్ళలేను పిన్నీ.....అందుకే నా భాదను అర్ధం చేసుకో నేను కూతుర్ని కాదు, కొడుకుని అనుకొండి.
