Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 6

         
    "ఇన్నాళ్ళు పెంచి పెద్దజేసి ఈ అవసానదశలో నన్నువదులుకోలేదనే నా నమ్మకం వదులుకోకూడదంటే నిన్నుస్వీకరించక తప్పదు."

    అలుగుదాటి మోహన్ ఇంటికి వచ్చారు.

    తలుపు తట్టిన శబ్దానికి వెంకట లక్ష్మమ్మ వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో ఒక యువతి చెయ్యి పట్టుకొని నిలబడిన మేనల్లుడినిచూసి ఒక్క క్షణం కొయ్యబారిపోయినట్టుగా అయింది.

    మోహన్ కళ్ళతోనే తన అభ్యర్థనలనీ, ప్రార్థనలనీ తెలియజేశాడు.

    మేనల్లుడి జాలి చూపులకు, రుక్మిణి బెదురుచూపులకు ఆవిడకు వచ్చిన ఆగ్రహం మంచులా కరిగిపోయింది. ముఖ్యంగా రుక్మిణి చక్కదనం ఆవిణ్ణి ఆకట్టుకొంది. ప్రక్కకు తప్పుకొని, "లోపలికి తీసుకురారా, అమ్మాయిని." అంది.

                      *        *        *

    సంవత్సరం గడిచిపోయింది.

    వెంకట లక్ష్మమ్మ ఒకరోజు హఠాత్తుగా కంఠవాయువు వచ్చిపోయింది. ఆవిడ పోవడంతో మాట్లాడే తోడు అనేది లేకుండా పోయింది రుక్మిణికి. ఇరుగు పొరుగు ఎవరూ మాట్లాడరు. రుక్మిణిని చూడగానే ఏ ముష్టిదాన్నో, కుష్ఠుదాన్నో చూసినట్టుగా ముఖాల్లో జుగుప్స నింపుకొని, వీలైతే ఓసారి ఉమ్మికూడా వేస్తారు.

    రుక్మిణి మొహాన్ని పెళ్లి చేసుకొన్నరెండు రోజులకే ఆంజనేయులు గుండెనొప్పితో చనిపోవడంతో ప్రపంచం దృష్టిలో మరీ అపరాధిని అయిపోయింది రుక్మిణి, ప్రపంచం వెలివేసినా మోహన్ తో జీవితం సాఫీగా, ప్రశాంతంగా గడిచిపోతూంది ఆమెకు.

    పలకరించే తోడుకోసం మొహం వాచిపోయినట్టుగా ఉన్న రుక్మిణికి, ఎడారిలో ఒయాసిస్ దొరికినట్టుగా జానకి అనే స్నేహితురాలు దొరికింది.

    జానకి వాళ్ళు ఎదురింట్లోకి అద్దెకు వచ్చారు. ఆమె భర్త ప్రసాద్ ఆ ఊళ్ళో ప్రైమరీ స్కూల్ టీచర్ గా అపాయింట్ అయివచ్చాడు. గుడి దగ్గర ప్రశాంతంగా ఉంటుందని బ్రాహ్మల ఇల్లు ఒకటి ఖాళీగా ఉంటే అది అద్దెకు తీసుకున్నాడు.

    జానకి రుక్మిణిల మధ్య స్నేహం ఏరాకు మారాకు తొడిగాక ఒకరోజు, రుక్మిణి అడిగింది "మీ పక్కింటావిడ ఏదో చెబుతూంది నన్ను చూపెట్టి?"

    "మోహన్ తో నీ పెళ్ళి మొదటిది కాదని, నీ దుర్మార్గపు నడతవల్ల మీ అన్నగారు గుండెపోటువచ్చి చనిపోయారని, నీతో స్నేహం మంచిది కాదని."

    రుక్మిణి ముఖం నల్లబడింది.

    "ఏయ్! ముఖం అలా చిన్నబుచ్చుకొన్నావేం? వాళ్ళమాటలు నేను పట్టించుకొంటాననుకొన్నావా? నేనూ నీలాగే మా ఆయన్ని ప్రేమించి పెళ్ళి చేసుకొన్నదాన్నే! అయితే నాది మొదటి పెళ్ళి! నీకు నాకుతేడా ఇదొక్కటే!" నవ్వుతూ చెప్పింది "అయితే వాళ్ళనాన్న లక్షాధికారి! ఈయన ఒక్కడే కొడుకు. తల్లి చిన్నప్పుడేపోతే తల్లితండ్రి ఆయనే అయ్యిపెంచారట! ప్రసాద్ నన్ను పెళ్ళిచేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టంలేదు! కులాలు కలవవు! అంతస్తులు కలువవు! మా నాన్న కుచేలసంతానం కలిగిన పేద బడిపంతులు! తండ్రిమాట లెఖ్ఖజేయకుండా ఈయన నన్ను పెళ్ళిచేసుకొని ఇంటికి తీసుకువెళ్లారు! అప్పు ఏమైందంటే...."

                       *        *        *

    వరండాలో కూర్చొని పార్టనర్స్ తో మాట్లాడుతున్నారు లక్ష్మీపతిగారు. గేటుకి అభిముఖంగా ఉన్న ఆయనకి పూలమాలలతో అలంకరింపబడిన కారొకటివచ్చి ఆవరణలో ఆగడం కనిపించింది. ఆశ్చర్యంతో ఆయన కళ్ళు పెద్దవి అయ్యాయి.
    కారుతలుపు తెరుచుకొని దిగుతున్న వధూవరులను చూసి ఆయన ముఖం ముందు వివర్ణంగా, తరువాత జేవురించినట్టుగా అయింది. వరండా మెట్లు ఎక్కుతున్న పెళ్ళికొడుకూ, పెళ్ళికూతుర్నీ చూసి ఆయన కళ్ళు నిప్పులు కురుస్తున్నట్టుగా అయ్యాయి.

    దిగ్గునలేచి పిడుగులు రాలుస్తున్నట్టుగా అన్నాడు : "ఆగండి, అక్కడే! లోపలికి అడుగుపెడితే షూట్ చేసి పడేస్తాను!"

    టక్కున ఆగిపోయారు వధూవరులు.

    "ప్రసాద్! మానాభిమానాలు ఉన్న మనిషివైతే ఈ క్షణం వెళ్ళిపో, నా ముందునుండి! ఇంకెప్పుడూ నీ ముఖం నాకు చూపడానికి ప్రయత్నించకు!"

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS