Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 7

    "ఉండవే... వెధవ అపశకునం మాటలూ నువ్వూనూ." దీపని మందలించింది అన్నపూర్ణ." పోనీ ఈరోజు నేను ముగ్గుచిప్ప పట్టుకుని గెంతనా అత్తయ్యా?" సరస్వతిని అడిగింది.

    "ఈరోజేకాదు అక్కా...ఇక రోజూ ఉదయం ఆ ముగ్గుచిప్పని పట్టుకుని వాకిట్లో నువ్వే గెంతాలి!"

    రాధ గొంతు ఖంగున పలికింది.

    అందరూ తలలు తిప్పి చూశారు.

    రాధ, గోపీ మెట్లమీద నిల్చుని వున్నారు.

    రాధ నల్లచీర కట్టుకుని జుట్టు విరబోసుకుని వుంది. గోపి గెడ్డం పెరిగిపోయి భుజాలచుట్టూ శాలువా కప్పుకున్నాడు. గోపి చేతిలో సూట్ కేసు చిన్నది వుంది. రాధ ఓ చిన్న బట్టల మూటలాంటిది తన గుండెలకి అదిమి పట్టుకుని వుంది.

    "బాబూ... ఏంటిబాబూ ఇది?.... ఆ సూట్ కేస్ ఏంటి?.... ఆ మూటేంటి?" సరస్వతి అడిగింది గోపిని.

    "నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అమ్మా..."చెప్పాడు గోపీ.

    "బాబూ." భయంకరంగా అరిచి బాధపడింది సరస్వతి.

    "అట్టా అరవకమ్మా నిన్నుకూడా మా వెంట తీస్కెళ్తాం. నీ మూటకూడా తెచ్చుకో అమ్మా"

    "బాబూ గోపీ!" అన్నపూర్ణకూడా భయంకరంగా అరిచి బాధపడింది.

    "లాభంలేదు వదినా. నువ్వెంత భయంకరంగా అరిచినా నిన్ను నావెంట తీస్కెళ్ళలేను. దేవుడులాంటి అన్నయ్య, దేవుళ్ళకి దేవుడులాంటి నాన్నగారినీ, చిన్నారి పాప దీపనూ కనిపెట్టుకుని నువ్వు ఇక్కడే వుండాలి!" అన్నడుద్ గోపీ కన్నీళ్ళు తుడుచుకుంటూ.

    "కానీ నువ్వు హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీస్కున్నావ్ రా తమ్ముడూ" శంకరం గోపీని ఆశ్చర్యంగా అడిగాడు.

    "ఏ పనీ పాటా లేకుండా తిని కూర్చోవడం నాకు ఇష్టంలేదు అన్నయ్యా. అందుకే ఇంటినుండి బయటకు వెళ్ళిపోయి ప్రయోజకుడినై తిరిగి వస్తా... నా కండలు కరిగించి భార్యనీ, తల్లినీ పోషించుకుంటా"

    అన్నపూర్ణ కిసుక్కున నవ్వింది. రాధ గోపీ డొక్కలో ఓ పోటు పొడిచింది.

    "అంటే  కండలంటే కండలనికాదు.ఏదో ఉన్న నా రక్తమాంసాల్నే కరిగించి పోషిస్తా" తప్పును సరిదిద్దుకున్నాడు గోపీ.

    సరస్వతి లోపలనుండి తన బట్టలమూట తెచ్చుకుంది.
    "పద రాధా పోదాం" అన్నాడు గోపీ.
    ముగ్గురూ అడుగులు ముందుకు వేశారు.
    అన్నపూర్ణా, శంకరం, దీప ఘొల్లుమన్నారు.
    రాధ, గోపీ పరంధామయ్య కాళ్ళు మొక్కారు.
    "వస్తాను నాన్నా! నేను ప్రయోజకుడిని అయ్యాకే నా మొహం నీకు చూపిస్తాను." అన్నాడు గోపీ.
    పరంధామయ్య అటు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు.
    "వస్తానండీ" సరస్వతి ఆయనకు చెప్పింది బాధగా.
    రాధ, గోపీ, సరస్వతులు అడుగులు ముందుకు వేశారు.
    "మావయ్యగారూ! వాళ్ళని ఆగమని చెప్పండి మామయ్యగారూ." అన్నపూర్ణ పరంధామయ్య కాళ్ళమీదపడి ఘొల్లుమంది.
    అయినా పరంధామయ్య కరగలేదు.
    "బాబాయ్! నువ్వు వెళ్ళకు బాబాయ్"
    దీప గోలగోలగా ఏడ్చింది.
    అయినా గోపీ కరగలేదు.
    వాళ్ళు ముగ్గురూ గుమ్మం బయటకు అడుగు పెట్టేశారు.
                                                                       6
    "హక్కా..."
    చంకల క్రింది కర్రలు టకటకలాడిస్తూ కుంటుకుంటూ గెంతుకుంటూ హాలుమధ్య వచ్చి ఆనందంగా అరిచాడు సుబ్రమణ్యం.
    కాని ఆ అబ్బాయి పిలుపువిని ఏ అక్కా పరుగెత్తుకుంటూ అతనికి ఎదురుకాలేదు.
    "అక్కా!" ఈసారి సందేహిస్తూ పిలిచాడు సుబ్రమణ్యం.
    రాధ తప్ప ఆ ఇంట్లోని అందరూ హాల్లోకి వచ్చారు. అందరి మొహాల్లో విచారం కథాకళి చేస్తుంది.
    సుబ్రమణ్యం ఏదో కీడుని శంకించాడు. వాడికి చాలా కంగారుపుట్టింది.
    "మీరందరూ ఎందుకలా వున్నారు? దేవతలాంటి మా అక్కకనబడదేం? ఆమె కేమైంది?" అందోళనగా అడిగాడు సుబ్రమణ్యం.
    "మీ అక్కని ఆ దేవుడెత్తుకెళ్ళిపోయాడు బాబూ" ఘొల్లుమంటూ చెప్పింది అన్నపూర్ణ .
    "హక్కా" గావుకేక పెట్టాడు సుబ్రమణ్యం. అతని చంకల క్రింద కర్రలు పుటుక్కున నేలరాలిపోయాయ్. "హప్పుడే మా అందర్నీ వదిలి ఆ దేవుడు దగ్గరకు వెళ్ళిపోయావా అక్కా" జుట్టుపీక్కుని, ఆ తర్వాత పైకి చూసి, రెండు చేతులూ బార్లాచాపి అన్నాడు.
    "హబ్బెబ్బే....దేవుడెత్తుకెళ్ళాడంటే పైనుండే ఆ దేవుడు కాదు బాబూ .... మీ అక్క దేవత్తెతేమరి మా గోపీ దేవుడే కదా?..." అంది అన్నపూర్ణ కళ్ళు  తుడుచుకుంటూ.
    "హమ్మయ్య! అంటే మా అక్క పోలేదన్నమాట!" సుబ్రమణ్యం క్రిందికి వంగి కర్రలను తీస్కుని చంకల క్రింద పెట్టుకున్నాడు.
    "అయితే మా అక్కవేరు కాపురం పెట్టిందన్నమాట?" ఆనందభాష్పాలు జలజలా రాల్చాడు సుబ్రమణ్యం.
    "మీ అక్క అంత స్వార్థపరురాలు కాదు బాబూ. ఆమె దేవత. ఆమె హృదయం మమతల కోవెల. ఈ దేవాలయం నుండి ఆమె, గోపీ బలవంతంగా తరమబడ్డారు బాబూ బేర్ ర్" అంటూ పరంధామయ్య వంక చూసి మెటికలు విరిచింది అన్నపూర్ణ.
    "ఆ.....తన ఇష్టప్రకారం వెళ్ళలేదా? ఆమె బలవంతంగా తరమబడిందా?....హక్కా!" ఆక్రోశించాడు సుబ్రమణ్యం.
    అతని చంకల క్రింద కర్రలు మళ్ళీ నేలరాలాయ్.
    "అవునబ్బాయ్.... ఆ రాధ బలవంతంగానే ఈ ఇంటినుంచి పంపించి వేయబడింది."
    అన్నాడు శంకరం పరంధామయ్య వంక కొరకొర చూస్తూ.
    "కానీ ఇంత ఘోరకృత్యానికీ, ఇంతటి అమానుషచర్యకీ బాధ్యులు ఎవరు? ఎవరు?? ఎవరు???" బాధగా అరిచాడు సుబ్రమణ్యం.
    "ఇంకెవరు బాబూ!" పరంధామయ్యవంక చూసి మెటికలు విరిచింది అన్నపూర్ణ.
    శంకరం పరంధామయ్యవంక చూస్తూ కాండ్రించి ""యాక్... ధూ"అని ఉమ్మూశాడు.
    దీప ఆయనని చూసి "వ్వెవ్వెవ్వె" అని వెక్కిరించింది.
    "మా అక్కనీ, బావనీ ఎవరు ఇంట్లోంచి తరిమేశారంటే చెప్పరేం" జుట్టు పీకేసుకుంటూ అన్నాడు సుబ్రమణ్యం.
    వెంటనే గట్టిగా "ఢం...ఢం...ఢం..." అని శబ్దం వచ్చింది. సుబ్రమణ్యం ఉలిక్కిపడి ఆ శబ్దం వచ్చిన దిక్కుకు చూసాడు..
    ఆ శబ్దం మరేమిటో కాదు... పరంధామయ్య గుండెలు బాదుకున్నాడు.
    సుబ్రమణ్యం క్రిందికి వంగి కర్రలు అందుకుని చంకల క్రింద పెట్టుకుంటూ అడిగాడు "ఎందుకు మామయ్యా! ఛాతీమీద అలా బాజా వాయించుకుంటున్నావ్?"
    పరంధామయ్య ఘొల్లుమంటూ మరోసారి గుండెలు బాదుకుంటూ చెప్పాడు" ఆ దౌర్చగ్యిడుని నేనే బాబూ...ఢం....ఢం...ఢం "
    ఆ దౌర్చాగ్యుడు?...." అర్థం కానట్టు చూస్తూ అడిగా సుబ్రమణ్యం. "అదే బాబూ మీ అక్కా బావలను ఇంటినుండి వెళ్ళగొట్టిన దౌర్భాగ్యుడిని నేనే బాబూ... నేనే! ఢం...ఢం...ఢం...."
    "ఆ?! దేవుడులాంటి మీరు వాళ్ళని తరిమేశారా?" సుబ్రమణ్యం చంకల క్రింద కర్రలు మళ్ళీ రాలిపోయాయ్. "కానీ ఎందుకిలా చేసారు మామయ్యా! ఎందుకిలా చేసారు? టం...టం...టం...." తన చిన్న ఛాతీమీద మెల్లగా బాజా వాయించాడు.
    "నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు... భగవాన్" పరంధామయ్య సైడు యాంగిల్ లో నిల్చుని మోర పైకెత్తి జుట్టు పీక్కున్నాడు.
    ?"ఎందుకు లేదు మామయ్యా... తిరిగి వాళ్ళిద్దర్నీ డోలూ, సన్నాయ్ వాయిద్యాలతో ఈ దేవాలయంలో పప్రతిష్టించండి... అదే మీ పాపానికి ప్రాయశ్చిత్తం మామయ్యా."
    "కానీ నేనలా చెయ్యలేను బాబూ..." బావురుమన్నారు పరంధామయ్య.
    "ఎందుకు మామయ్యా...ఎందుకు? అసలు నువ్వు వాళ్ళని ఇంట్లోంచి ఎందుకు వెళ్ళగొట్టావ్ మామయ్యా?" చొక్కా కాలర్ ని నలిపేస్కుంటూ అడిగాడు సుబ్రమణ్యం.
    "అది నీకు ఇప్పుడు చెప్పలేను బాబూ... చెప్పలేను" కండువాతో కళ్ళు వత్తుకుంటూ అన్నాడు పరంధామయ్య.
    "ఆయన చెప్పరు... ఈ భాగోతం ఇలా సాగుతూనే ఉంటుంది. నువ్వు టిఫిన్ తిందువుగాని రా బాబూ" అందిద్ అన్నపూర్ణ.
    అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు.
    అందరూ ఒకరికొకరు టిఫిన్ తినిపించుకున్నారు గానీ పరంధామయ్యని ఒక్కరూ పట్టించుకోలేదు.
    ఆయన నోటిలో ఏ ఒక్కరూ, ఓ దోసె ముక్క పెట్టలేదు.
    పరంధామయ్య లోలోపల కుమిలిపోయాడు.
                                                                    ***   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS