అతని మొహం జేవురించింది.
"బాధపడకండీ. మామయ్యగారు ఇప్పుడేమన్నారని? నిజమే కదా. మీ అన్నయ్య ఆఫీసుకు వెళ్ళాలి కదా!?" అంది రాధ అతని తల నిమురుతూ.
"అయితే అలాగేనా చెప్పడం? ఈ వేళనుండీ నేను స్నానం చెయ్యనంతే" అన్నాడు గోపి ఉక్రోషంగా.
"తప్పండీ....స్నానం చెయ్యకపోతే మీ ఒళ్ళు గబ్బెక్కిపోతుంది... తర్వాత మీకు నేను స్నానం చేయిస్తాగా?" అనునయంగా అంది రాధ.
తర్వాత టిఫిన్ చేసే సమయంలో....
"గోపీ....ఈవేళ ఉల్లిపాయముక్కలూ అల్లంముక్కులూ వేసి నీకిష్టమైన పెసరట్టు చేశాను బాబూ... తిను బాబూ..." అంది అన్నపూర్ణ గోపీతో.
"ఆ... పెసరట్లా.... ఏవీ ఏవీ ... నా ప్లేటులో అరడజను పెసరట్లు వడ్డించు వదినా" అన్నాడు గోపి హుషారుగా.
"అరడజనేం ఖర్మ... డజను వడ్డించు... పీకల్దాక తిని ఊరుమీద బలాదూరుగా తిరిగొస్తాడు" అన్నాడు పరంధామయ్య పెసరట్టు మొత్తం వుండచుట్టి నోట్లోతోస్తూ.
గోపి హృదయం దెబ్బతింది. అతని హృదయవీణలోని ఒక తీగె తెగిపోయింది.
అంతే... చటుక్కున లేచి నిలబడ్డాడు.
"ఏంటి మామయ్యగారూ... తింటున్నవాడిని కంచం ముందునుంచి లేపేశారు" బాధపడ్తూ అంది అన్నపూర్ణ.
"నేనేమైనా కానిమాట అన్నానా? నిజమేకదా అన్నాను?" అన్నాడు పరంధామయ్య రెండో పెసరట్టు వుందచుట్టి నోట్లోపలికి తోసేస్తూ.
"వాడు అసలే చాలా అభిమానస్తుడు. వాడినలా అంటారేంటండీ?" అంది సరస్వతి.
"అంత అభిమానం ఉంటే... నేనేమైనా అంటే పడే ఇదే లేకపోతే ఇంట్లోంచి పొమ్మను" అన్నాడు పరంధామయ్య.
ఆ మాటకి అక్కడ వున్న అందరూ ఉలిక్కిపడ్డారు.
తనకి యిష్టమయిన చిన్నకొడుకుపట్ల ఆయనెందుకు అలా ప్రవర్తిస్తున్నారు?
ఎందుకు?
ఎందుకు??
5
ఆ రాత్రి గోపికి నిద్రపట్టలేదు. ఊరికే పక్క మీద పొర్లసాగాడు గోపి.
"ఎందుకండీ ఊర్కే అలా పురుగులా మెదుల్తారు?.... హాయిగా నిద్రపోకుండా."
రాధ ఆ మాట అనంగానే అంతదాకా అతని హృదయంలో పొగలూ సెగలూ కక్కుతున్న అగ్ని పర్వతం ఒక్కసారిగా ఫెటిల్లుమని పగిలి లావా ఉవ్వెత్తున ఎగజిమ్మింది.
గోపీ చటుక్కున మంచంమీద లేచి కూర్చున్నాడు.
"హు!...నిద్ర!! ఎక్కడినుండి వస్తుంది రాధా నిద్ర? దైవంలాంటి తండ్రి నిర్లక్ష్యం చేస్తుంటే, సూటిపోటీ మాటలు అంటుంటే హృదయం గాయపడి రక్తం చిందుతూ వుంటే నిద్రెలా పడ్తుంది రాధా?"
గుండెల దగ్గర చొక్కాని నలిపేస్కుంటూ అన్నాడు గోపి.
"పోనీ నిద్రమాత్రలు వేస్కుని పడుకోండి!... కంటిముందున్న దైవం పతి అని అంటారు. అలాంటి దైవం బాధపడుతుంటే ఏ భారతనారి భరించగలదండీ. ఉండండి నిద్రమాత్రలు తెస్తాను" మంచం మీద నుండి లేవబోయింది రాధ.
" రాథా!" గావుకేక పెట్టాడు గోపి.
గోపి పెట్టిన ఆ కేకకి తుళ్లిపడి మంచంమీద వెల్లకింతలా పడింది రాధ.
"ఎందుకండీ అంతచేటున అరిచారు?"
మళ్ళీ లేచి కూర్చుంటూ అడిగింది రాధ.
"ఏ నిద్రమాత్రలూ నాకు విశ్రాంతి ఇవ్వలేవు రాధా! నాకు విశ్రాంతిని ఇచ్చేది ఒకటే వుంది రాధా"ముక్కు పొంగిస్తూ అన్నాడు గోపి.
"హేంటండీ అదీ? నేను ,మీకు తెచ్చిపెడ్తాను చెప్పండి. భర్త కోరిక తీర్చని పవిత్రమైన భారతనారి ఎక్కడయినా వుంటుందా? చెప్పండి. మీకు విశ్రాంతిని ఇచ్చేది ఏమిటి?" గోపి భుజాలు పట్టి అదే పనిగా ఊపేస్తూ అడిగింది రాధ.
"మరణం రాధా... మరణం!!!" జుట్టు పీక్కుంటూ అన్నాడు గోపి.
"హేవండీ"
రాధ పొలికేక పెట్టింది.
రాధ పెట్టిన ఆ కేకకి ఈసారి గోపి ఉలిక్కిపడి మంచంమీద వెల్లకితలా పడ్డాడు.
తర్వాత సర్దుకుని లేచి కూర్చున్నాడు.
రెండు క్షణాల మౌనం తర్వాత గోపి సీరియస్ గా మొహం పెట్టి అన్నాడు.
"ఈ అర్థరాత్రిపూట గావుకేకలు పెడుతూ మనం ఒకరినొకరు క్రింద వెల్లకితలా పడేస్కోడం ముఖ్యంకాదు రాధా."
"పోనీ బోర్లా పడేస్కుందామా?" అమాయకంగా అడిగింది రాధ.
"అసలు బోర్లానో వెల్లకితలో పడేస్కోడం ఎందుకంట?" పళ్ళు కొరుకుతూ అన్నాడు గోపి.
"మరేం చేద్దామండీ?"
"ఏం చెయ్యొద్దు... నేనొక నిర్ణయం తీస్కున్నా అది శ్రద్దగా విను"
"ఏంటండీ అది?"
"మనం ఈ ఇల్లు విడిచిపెట్టి పోదాం రాధా"
"హేవండీ..." రాధ జడ పీకేస్కుంటూ అంది బాధగా.
"అవును రాధా...మనం ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే" చొక్కొ కాలర్ నలిపేస్కుంటూ అన్నాడు గోపి.
"కానీ దేవాలయంలాంటి ఈ ఇంటిని వదిలిపెట్టి ఎలా వెళతాం అండీ" బోరున ఏడుస్తూ అంది రాధ.
"ఆ దేవుడే కరుణించనప్పుడు దేవాలయంలో వుండి ప్రయోజనం ఏమిటి రాధా.... నేను తిని కూర్చుంటున్నాననేగా నాన్నగారికి నేనంటే చులకన భావం ఏర్పడింది? అందుకనే మనం బయటికి పోదాం రాధా. నేను ప్రయోజకుడినని నిరూపించుకున్నాకే మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కుతాను."
"హేవండి" రాధ వెక్కింది.
"భయపడకు రాధా.... నీకు తిండి పెట్టకుండా మాడ్చనులే. నా కండలు కరిగించి నిన్ను పోషిస్తా రాధా" ఆవేశంగా అన్నాడు గోపి.
"కానీ... మీకు కండలు లేవు కదండీ"
పైటకొంగుతో కళ్ళు తుడుచుకుంటూ బాధగా అంది రాధ.
గోపి చొక్కా విప్పి ఓసారి తన శరీరం వంక చూసుకుని నాలుక కొరుక్కున్నాడు.
"పోనీలే... పెద్దగా కండలు లేకపోయినా ఉన్న రక్తమాంసాలను కరిగించైనా నిన్ను పోషించుకుంటా రాధా... తెల్లారగానే మనం ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం రాధా."అంటూ గబ గబా లేచి చొక్కా వేసేస్కుని బీరువాలోంచి ఓ శాలువా తీసి కప్పుకున్నాడు గోపి.
"అదేంటండీ.... ఇప్పుడు శాలువా ఎందుక్కప్పుకున్నారు? కొంపదీసి మీకు గాని బ్లడ్ కాన్సరా ఏంటి? చెప్పండీ... నా పసుపు కుంకుమలకు నన్ను దూరం చేస్తున్నారా ఏంటి? నా మంగళసూత్రం తాడు హింతవీకని నాకు తెలీదురో భగవంతుడా."
కప్పలా నోరు తెరచి " బేర్ ర్"మంది రాధ.
"ఛా... నోర్ముయ్. ఏంటా అశుభం మాటలు?" ప్రేమగా అన్నాడు గోపి.
"శాలువలు రోగం వచ్చినప్పుడే కాదు. బాధలో ఉన్నప్పుడు కూడా కప్పుకుంటారు"
"అవునుకదూ? ఆ సంగతే మర్చిపోయా" కళ్ళు తుడుచుకుంటూ పక పకా నవ్వింది రాధ. "అయితే నేను కూడా ఈ చీర మార్చేసి నల్లచీర కట్టుకుంటా."
"ఇప్పుడేం చీర మార్చక్కర్లేదు. రేపు ఉదయం మనం ఇల్లు విడిచిపెట్టి పోతామే అప్పుడు నల్లచీర కట్టుకో. జుట్టుకూడా విరబోసుకో" అన్నాడు గోపి.
"అలాగేనండి" తృప్తిగా పలికింది రాధ.
ఇద్దరూ తేలికగా ఊపిరి పీల్చుకొని మంచంమీద వాలారు.
***
ఎప్పట్లా తెల్లారింది.
కాని ఉదయం వేరు. తెల్లారగానే వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గుచిప్ప పట్టుకొని చెంగుచెంగున చిందులేసే రాధ ఈ వేళ వాకిట్లో లేదు.
వాకిలి బోసిగా వుంది.
ఇంట్లోని అందరూ నిద్రలేచి హాల్లోకి వచ్చి ఇంటికప్పువైపు చూస్తూ చెవులూ రిక్కించి దేభ్యం మొహాలు వేశారు.
వాకిట్లో ముగ్గేస్తూ రాధ పాడే పాట ఆరోజు వాళ్ళకి విన్పించలేదు.
అందరూ మొహమొహాలు చూస్కున్నారు. అందరి మొహాలలో ఆశ్చర్యం!
ఒక్క పరంధామయ్య మాత్రం గంభీరంగా ఉన్నాడు.
"ఈ వేళ రాధ ఇంకా లేవలేదేం?" అన్నాడు శంకరం.
"ఒంట్లో బాగోలేదేమో!" అంది సరస్వతి.
"విధి చాలా చిత్రమైనది! ఈవాళ పిడిరాయిలా ఉండేవారు రేపు ఢామ్మని గుండాగి చచ్చిపోవచ్చు.
అందుకేనేమో వానరాకడ ప్రాణంపోకడా తెలీదని అంటారు."
దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది దీప.
