"లేదు. అందుకే నిన్ను అంతసులువుగా చంపను....." అన్నాడు పాండురంగడు.
"సర్పనగర నిధిగురించి తెలుసుకోవడం కోసమే గదా నన్ను చంపనంటున్నావ్...."
"అవును...."
"చచ్చినా బ్రతికినా నావల్ల ప్రయోజనం పొందలేని కొద్ది మనుషుల్లో నువ్వొకడివి...." అన్నాను.
పాండురంగడు నవ్వలేదు. క్రూరంగా నావంక చూసి....."సరిగ్గా మూడంకెలు లెక్క పెడుతున్నాను. మూడు అనే సరికి నాకు సరైన సమాధానం రాకపోయిందా, ప్రయోజన మున్నా లేకపోయినా నిన్ను చంపేస్తాను...." అన్నాడు.
"నాకు తెలియని దాన్ని గురించి నన్నెంత బెదిరిస్తే మాత్రం ఏం చెప్పగలను....." అన్నాను బాధగా. పాండురంగడు నామాట వినకుండా....."ఒకటి...." అన్నాడు. నే నింకేదో చెప్పాను. నేను చెప్పడం పూర్తికాగానే......"రెండు....." అన్నాడు పాండురంగడు.
"పాండురంగా......రక్షించు....." అన్నాను.
"మూడు...." అన్నాడు పాండురంగడు. అతని కుడి చేతివ్రేలు ట్రిగ్గర్ మీద కదిలింది. నాకు స్పృహ తప్పింది.
2
కళ్ళు తెరిచేసరికి నా గదిలోలేను. వాతావరణం కొత్తగా వుంది. ఇప్పుడున్న గది మరీ విశాలంగా లేదు. ఇరుగ్గా వుంది. నేను వెంటనే గమనించలేదు కానీ నాకు ఎదురుగా ఒక మనిషి వు
న్నాడు. బుర్ర మీసాలతో కాస్త భయంకరంగా వున్నాడు.
"ఎవర్నువ్వు?" అన్నాను.
"నాపేరు యమధర్మరాజు....." అన్నాడతను.
ఉలిక్కిపడి..... "నేనిప్పు డెక్కడున్నాను? ....." అన్నాను.
"నరక లోకంలో....."
నేను కళ్ళు నులుముకున్నాను. చెవుల్లోకి వేళ్ళుపోనిచ్చి కెలికాను. వళ్ళు గిల్లుకున్నాను......నేను కల కనడం లేదు. చూస్తున్నదంతా నిజమేనని గ్రహించాను.
"ఎందు కొచ్చాను?"
"ఎందుకా?" యమధర్మరాజు నవ్వాడు..... "చేసిన తప్పులకు శిక్ష అనుభవించడానికి....."
నేను మాట్లాడకుండా యమధర్మరాజు వంకే చూస్తూన్నాను. అతను రెండు నిముషాల్లో నా మంచానికి దగ్గర్లో ఒక బల్ల వేసి దానిమీద కొన్నివస్తువులు పేర్చాడు. వాటిలో కత్తి, చాకు, నిమ్మకాయ, గుండుసూదులు, సిగర్ లైటర్ వున్నాయి. అవన్నీ చూస్తూంటే నా కేదో అనుమానం కలిగింది....."ఇవన్నీ ఎందుకు?" అన్నాను.
"నిన్ను శిక్షించడానికి....." అన్నాడు యమధర్మరాజు.
మంచంనుంచి కదలబోయాను. అప్పుడే తెలిసిందినాకు. నా చేతులైతే ఫ్రీగా కదుల్తున్నాయి కానీ నేను మంచానికి బందీని. లేచి కూర్చునే వీలులేదు.
"అన్నట్లు కారంపొట్లం మరిచిపోయాను....." అంటూ యమధర్మరాజు ఆ గదిలోంచి బయటకు వెళ్ళి అయిదు నిముషాల్లో ఓ పొట్లంతో తిరిగివచ్చి అది కూడా టేబుల్ మీద పెట్టాడు....."నీ వంటిమీద గాట్లు పెట్టి, నిమ్మకాయ పిండి ఆనందించడం నావంతు, అనుభవించడం నీవంతు."
"ఎందుకీ శిక్ష....?"
"చేసిన తప్పుకీ.....!
"ఏమిటి నేను చేసిన తప్పు.....?"
"సర్పనగర నిధికి సంబంధించిన ప్లానుకాగితం ఇవ్వక పోవడం...."
హఠాత్తుగా నాకు అన్నీ గుర్తు కొచ్చాయి. ఈ సర్ప నగర నిధి ఏమిటో నాకు ప్రాణాంతకంగా తయారయింది. "నాకు తెలియని కాగితం యెలా ఇచ్చేది?" అని మనసులో అనుకుని పైకిమాత్రం...."ఒక షరతుమీద ఆ కాగితం నీ కిస్తాను...." అన్నాడు.
యమధర్మరాజుకళ్ళు ఆనందంగా వెలిగాయి...."ఏమిటా షరతు?" అన్నాడు.
"మకరలోయకు దారి చెప్పాలి నువ్వు నాకు...."
"మకరలోయ ఏమిటి?"
"బుకాయించకు. నువ్వు మకరలోయకు దారి చెప్పిన వెంటనే నీకు నేను సర్పనగర నిధిగురించి చెబుతాను...." అన్నాను.
"మకరలోయ ఏమిటి?"
"బుకాయించకు. నువ్వు మకరలోయకు దారి చెప్పిన వెంటనే నీకు నేను సర్పనగర నిధిగురించి చెబుతాను....." అన్నాను.
"మకరలోయ గురించి నిజంగా నాకు తెలియదు....."
"నేను నీ మాటలు నమ్ముతాను. మరి నా మాటలుకూడా నువ్వు నమ్మాలి!"
"ఏమిటి నీ మాట?"
"సర్పనగర నిధి గురించి నిజంగా నాకుతెలియదు...."
యమధర్మరాజు రెండు నిముషాలసేపు ఆగకుండా నవ్వి...." నన్ను నవ్వించగల వాళ్ళు అరుదు. నువ్వు తమాషా మనిషివి...." అన్నాడు.
"నువ్వు మెచ్చుకుంటే నాకు సంతోషం కలగడం లేదు. బల్ల మీద వస్తువులు చూస్తే ఏడుపొస్తోంది కూడా...." అన్నాను.
"అయితే సర్పనగర నిధి గురించి చెప్పాలి...." అన్నాడు.
"నాకు తెలియదన్నానుగా..."
"ఈ రోజున నిన్ను వదిలి పెడుతున్నాను. కాసేపట్లో నీకు ఆహారం వస్తుంది. తిను. బల్లమీద ఈ వస్తువులనే చూస్తూ నిద్రపడితే నిద్రపో. బాగా ఆలోచించుకో. రేపు నేను వచ్చేసరికి సర్పనగర నిధి గురించి చెప్పకపోయావంటే-కత్తిగాటు, కారం, నిమ్మకాయ.....గుర్తుంచుకో.....వస్తాను...." అని వెళ్ళిపోయాడు యమధర్మరాజు.
నేను భయంగా గదిలో చుట్టూ పరీక్షించాడు. వద్దను కున్నా నాకళ్ళు గదిలోంచి బల్లనీ, దానీమీది వస్తువులనూ చూస్తున్నాయి. అవిచూడగానే యమధర్మరాజు మాటలు గుర్తుకు వచ్చి నామనసు పాడైపోతోంది. ఊహించుకునేందుకే భయంకరంగా వున్నాయా బాధలు?
అసలీ సర్పనగర నిధి ఏమిటి? దానికి సంబంధించిన ప్లాను కాగితాలేమిటి? అవి నాదగ్గరుంటాయన్న అనుమానం యెవరికొచ్చింది? పాండురంగడెవరు? యమధర్మరాజెవరు
