Previous Page Next Page 
శంఖారావం పేజి 6

 

    ఉదయ తండ్రి వచ్చి అన్నింటికీ సీతమ్మనే తప్పు పట్టి వైద్యం బాధ్యత సీతమ్మదే అని వెళ్ళిపోయాడు ఆయనకు కూతురిపై ప్రేమ వుంది. కానీ క్యాన్సర్ వైద్యం చేయించే శక్తి లేదు. ఆయనకింకా ఇద్దరు కూతుళ్ళు కొడుకులు వున్నారు.
    ఉదయకు వైద్యం ప్రారంభమయింది.
    "నేను నష్టజాతకురాలిని కాదని ఋజువు చేస్తాను" అని పట్టుబట్టింది సీతమ్మ. కాని ఆమె మనసులో ఆ ధైర్యం నశించడమే కాక తను నిజంగానే నష్ట జాతకురాలన్న అనుమానం ప్రవేశించింది.
    ఇరవై వెళ్ళ వయసు తనకు భర్త తోడు లేకుండా  పోయింది. రెండేళ్ళ వయస్సుకే తండ్రి తోడు లేదు తన కొడుక్కి. ఆరేడేళ్ళ వయసుకే తల్లిని పోగొట్టుకుని తనచెంత చేరారు వేదాంతం, కులభూషణ్.
    ఇప్పుడు ఉదయను విశ్వనాద్ కు తోడు చేయాలనుకుంది. అది జరక్కుండా పోదు కదా?
    డాక్టర్లు చెప్పారు. ఉదయ పరిస్థితి క్రమంగా క్షీనిస్తుందని!
    ఆమె జీవిత కాలాన్ని నాలుగైదేళ్ళు పొడిగించడం తప్ప ఆమెకు ప్రాణం పోయలేమని డాక్టర్లు చెప్పేసారు.
    ఉదయ చేరింది గులాబీ నర్సింగ్ హోమ్ లో.
    విశ్వనాద్,వేదాంతం అమెరికా వెళ్ళారు.
    కులభూషణ్ తనూ గులాబీ నర్సింగ్ హొంలో చేరాడు.
    ఉదయ మీద పరిశోధనలు జరుగుతున్నాయక్కడ. ప్రతిరోజూ ఆమె లక్షణాలను పరిశీలించడం జరుగుతోంది.
    కులభూషణ్ ఆ పరిశోధనల్లో పాల్గొంటున్నాడు.
    సీతమ్మ తరచుగా అతడిని అడుగుతున్తుంది ఆశగా.
    'ఉదయ మనకు దక్కే అవకాశం లేదు. కానీ ఆమె కారణంగా మరెందరో రక్షించబడవచ్చు " అన్నాడు కులభూషణ్.
    "నాకు ఉదయ కావాలి. ఇతరుల గురించి చెప్పకు" అంది సీతమ్మ.
    అప్పుడు కులభూషణ్ ఉదయ గురించి గ్యారెంటీ ఇవ్వలేదు కాని ఇతరుల గురించి సీతమ్మకు చెప్పడం మానేశాడు.
    అమెరికా నుంచి విశ్వనాద్ ఉదయకుత్తరాలు రాసేవాడు.
    "నువ్వు నా దానివి. నిన్ను నేను దక్కించుకోలేక పొతే విజ్ఞానశాస్త్ర ప్రగతి వ్యర్ధం. అర్ధరహితం. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను. నాదాన్ని చేసుకుంటాను. జీవితంలో నీతో తప్ప మరో వివాహం లేదు నాకు" అన్నదా ఉత్తరంలో సారాంశం.
    ఆ ఉత్తరాలు చూసుకుని ఉదయ ఏడ్చేది.
    కులభూషణ్ ఆమెను ఓదార్చేవాడు.
    ఉదయ పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది.
    కొడిగట్టిన దీపానికి రవ్వంత గాలి చాలు. లేదా తనకు తానె ఆరిపోతుంది.
    ఉదయ ఇంకా జీవించి వుండడం కులభూషణ్ కి ఆశ్చర్యంగా ఉంది.
    "అమ్మా నీ అలౌకిక స్వామినడిగి ఉదయ ప్రాణాలు నిలబెత్తలేవా" అని అతడోసారి సీతమ్మని అడిగాడు.
    "భగవంతుడు కష్టాలనుంచి గట్టేక్కిస్తాడు. ప్రాణాల్ని నిలబెట్టడు. ప్రాణాల కోసం దేవుణ్ణి వేడుకొను" అంది సీతమ్మ.
    కాని అసలు కారణం అది కాదు.
    అలౌకికనందస్వామిని అడిగితే అయన కూడా లేదంటే ఆఖరి ఆశ కూడా లేకుండా పోతుందని సీతమ్మకు.
    ఏదో శక్తి తనంతట తానె వచ్చి ఉదయను రక్షించగలదని ఆమె నమ్మకం.
    ఆ నమ్మకం పోగొట్టుకోకూడదని సీతమ్మ ఆశ.
    అందుకే ఆమె ప్రత్యక్ష దైవాన్ని వదిలి శ్రీనివాసుడిని వేడుకుంది.
    అప్పటికీ ఆ శ్రీనివసుడిని నమ్ముకుంది.
    ఉదయ ప్రాణాలు రక్షించబడితే తను నష్టజాతకురాలు కాదని రుజువౌతుంది కొడుక్కు తోడు దొరుకుతుంది.
    ఉదయ గురించి ఏటా, వేలకు వేలు ఖర్చవుతున్నాయి.
    కులభూషణ్ డాక్టర్, వేదాంతం, విశ్వనాద్ అమెరికాలో ఉన్నారు.
    డబ్బు సీతమ్మకు సమస్య కాదు.
    డబ్బు ప్రాణాలను నిలబెడుతుందా?
    ఈ ప్రశ్న ఆమె కళ్ళల్లో కనబడుతుంది కులభూషణ్ కి.
    ఈ ప్రశ్న వెనక ఉదయ కధ కూడా కనబడుతుందతనికి.
    అతడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉదయ దగ్గరకు బయల్దేరాడు.

                                       ***

    గులాబీ నర్సింగ్ హోంలో
    రూమ్ నెంబర్ పదమూడు.
    చిన్నసైజు డ్రాయింగ్ రూంలా వున్న గదిలో గది మధ్య మంచం మీద చిగురుటాకు లాంటి యువతి.
    అవును.....ఆమె చిగురుటాకులాగే వుంది.
    అయినా ఆమె ఉదయ.
    ఆమె ముఖంలో జీవకళ తో కూడిన అందముంది.
    క్షీణించిన ఆమె శరీరం ఆమె అందాన్ని తగ్గించలేక పోయింది.
    ఏదో అఘాతానికి గురై చెట్టు నుంచి వేరుపడుతున్న చిగురుటాకులా ఉన్న ఉదయ మంచం మీద పడుకుని ఉత్తరం చదువుకుంటోంది.
    అది విశ్వనాద్ రాసిన ఉత్తరం.
    "ఉదయా డియర్!
    దేవుడిలా ఎందుకు చేశాడు? నీ ప్రాణాలపై ఆయనకంత మనకారం దేనికీ? నీ విషయంలో నేను దేవుడ్నీ కూడా ప్రతిఘటిస్తాను. అవసరమైతే నన్ను నేను బలి చేసుకుని నీ ప్రాణాలు నిలబెడతాను. అతి త్వరలో ఇండియా వచ్చేస్తున్నాను. వచ్చీ రాగానే ముందు నిన్ను పెళ్ళి చేసుకుంటాను. ఆ తర్వాత మన జంట దేశ సేవకు అంకితమై పోతుంది...."
    ఉదయ ఇంక చదవలేక పోయింది. ఆమె కన్నుల్లో నీరు నిండి అక్షరాలూ కనబడకుండా పోయాయి.
    ఉత్తరం ఆమె చేతుల్లోనే వుంది.
    విశ్వనాదే తన చేతుల్లో ఉన్నట్లామె ఆ ఉత్తరాన్ని బలంగా పట్టుకుంది.
    ఆమె కనుకొలకుల్లోంచి కన్నీటి బిందువులు చెంపల మీదుగా జారిపడుతున్నాయి. అప్పుడామె వానకు తడిసి వేలాడుతున్న చిగురుటాకులా వుంది.
    ఉత్తరంలో ఆమెకు  విశ్వనాద్ కనబడుతున్నాడు.
    తన పద్నాలుగో ఏట విశ్వనాద్ తో పరిచయం అయింది.
    తను టెన్త్ క్లాసు ఫెయిలయితే తండ్రిక్కడ ట్యూటోరియల్ కాలేజీలో చేర్పించాడు హాస్టల్లో ఉంచాడు.
    కారణం ----తనకు పెళ్ళి కుదిరింది.
    తను బియ్యే పాసు కావాలని మగపెళ్ళి వారు షరతు. వారికి కట్నం అవసరం లేదు. చదువు కావాలి.
    వరుడికి బొంబాయిలో ఉద్యోగం. తనకంటే పదేళ్ళు పెద్ద.
    అతణ్ణి చూసిందామె. నచ్చలేదు.
    బొంబాయిలో అతడింకా స్థిరపడలేదు. అందుకని పెళ్ళికి అయిదారేళ్ళ గుతారు.
    తను హాస్టల్లో ఉండగా ఎవరి ద్వారానో విని చూడ్డానికి వచ్చింది సీతమ్మత్త.  
    అత్త పక్కనే విస్సీ బావ.
    "వీడు విస్సీబావే....." అని సీతమ్మే ఉదయకు పరిచయం చేసింది.
    విస్సీబావంటే తనకు నవ్వొచ్చింది. నవ్వితే బావ చిన్నబుచ్చు'కుంటాడని నవ్వలేదు. ఎందుకో మొదటిసారి అతడి మొఖం చూసినప్పుడే అతడంటే అభిమానం పుట్టుకొచ్చింది. బావ కోసమే తను సీతమ్మత్తింటికీ వెళ్ళడం మొదలెట్టింది.
    ఇద్దరూ ఒకరంటే ఒకరిష్ట పడ్డారు. క్రమంగా ఆ యిష్టం ప్రేమగా మారింది.
    తమ ప్రేమ కధల్లో చెప్పుకునే లాంటిది కాదు. సినిమాల్లో చూపించేది కాదు. ఒకరినొకరు చూడకుండా ఒకరోజు కూడా ఉండలేకపోయేవారు.
    కలుసుకున్నప్పుడల్లా ఒకరినొకరు సంతోషపెట్టుకునే మాటలు చెప్పుకునే వారు. సరదాకు కూడా ఒకరినొకరు చిన్నబుచ్చుకునే వారు కాదు.
    విశ్వనాద్ నిదానస్తుడు. వయసుకు మించిన తెలివి అతడిది. ప్రతి విషయం గురించి ఎంతో లోతుగా ఆలోచించే అతడి నుంచి ఎన్నో తెలుసుకునేది ఉదయ.
    ఆ విషయం ఆమె అతడికి చెప్పి మెచ్చుకుంటే -- 'అందరి ముందూ నా ఆలోచన లింత గొప్పగా పని చేయవు. నిన్ను చూడగానే నా మెదడు పదునేక్కుటుంది . నీలో ఏదో విశేషముంది !" అని అతడామేను మెచ్చుకునేవాడు.
    ఇద్దరూ ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేందుకు చూసేవారు. ఇద్దరూ కలిసి ఇతరుల నుంచి తామేదైనా నేర్చుకోవాలని చూసేవారు.
    విశ్వనాద్ ఆమెను తాకిన సందర్భాలున్నాయి. ఒకోసారి అతడామె చేతిని తన చేతిలోనికి తీసుకుని అభిమానంగా ముద్దు పెట్టుకునేవాడు. ఆమె అతడినీ అతడామేనూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్న సందర్భాలు కూడా కొన్ని వున్నాయి.
    కానీ అంతకు మించి వారెన్నడూ మూడడుగు వేయలేదు. వేయాలని వారనుకోలేదు. వయసు వారిలో కామాన్ని కాక స్నేహాన్ని ప్రోత్సహించింది. పరిచయం వారిలో కాంక్షను కాక ప్రేమను పెంపొందించింది.
    పవిత్ర ప్రేమకు వారి స్నేహం ఉదాహరణ.
    వారి ప్రేమకు పవిత్రతను మాత్రం మిగిల్చి --- విధి ఇప్పుడా ప్రేమికులను విడదీయాలను కుంటోంది.
    తను చిగురాటాకునే కావచ్చు. ఏ క్షణంలో నైనా రాలిపోయే చిగురాటాకని. ఆ చిగురుటాకుపై ఆశలు పెట్టుకోకూడదు విశ్వనాద్.
    బావ తనను పెళ్ళి చేసుకుంటా నంటున్నాడు. అందువల్ల తనకేం లాభం? అతడి జీవితం అడవికాచిన వెన్నెలవుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS