Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 6

                                     

    మొదటిరోజు క్లాసుకు వెళ్ళిన రోజునుంచే పాఠాలు మొదలు పెట్టారు. మధ్యలో ప్రాక్టికల్స్ ఉంటాయి. రూమ్ కి రాగానే రికార్డు వర్కు ఉంటుంది.
    ఎంత చదువు ఉన్నా పాటలు, నవ్వులు, హస్కు మాత్రం మానరు అమ్మాయిలు. కొంతమంది చదువు ఒక మూలకు నెట్టేసి, సినిమాలతో, అబ్బాయిల కబుర్లతో కాలక్షేపం చేస్తారు.
    ఎప్పుడూ చదువుతున్న అమ్మాయి దగ్గరకు వచ్చి ఏవో మాటలు విసురుతుంటారు. మరి పుస్తకం ముట్టుకోను భయపడుతుంది ఆ అమ్మాయి, ఎవరేమి కామెంట్స్ చేస్తారోనని! వీణ రికార్డ్సు ముందేసుకుని బొమ్మలు గీస్తున్నది. జుబేదాకు బొమ్మలు గీయటం సరిగా రావని జుబేదా రికార్డులో వీణ వేస్తూ, "నీ వ్రేళ్ళు పొడుగ్గా ఉండి ఆర్టిస్ట్ ఫింగర్స్ అంటారే మరి నీకు డ్రాయింగు ఎందుకు రాదు?" అంది.
    "నీ పట్ల నిజమైందిగా! అంతేకాదు, నీవి చిన్న చేతులు. మంచి సర్జన్ వి అవుతావు" అంది జుబేదా, రిపీట్ అన్న ఎక్స్ పెరిమెంటు గ్రాఫ్ గీస్తూ.
    ప్రక్కరూము విక్టోరియా వచ్చింది. "దేవానంద్ పిక్చర్ వచ్చిందోయ్! మీరూ వస్తారా మాటినీకి!" అంది.
    "దేవానంద్!" ఆశగా చూసింది జుబేదా.
    "మధ్యాహ్నం జువాలజీ ప్రాక్టికల్స్! 'లీచ్' చెప్పుతారు! డుమ్మా కొట్టేస్తే మనం రేపు డుమ్మా" అంది వీణ.
    "అందమైన అమ్మాయిలు చదవకపోయినా పాసై పోతూనే ఉంటారు. లేవండి" అంది విక్టోరియా.
    వీణ జుబేదా వైపు చూసింది.
    "ఆన్సర్ పేపర్స్ లో మా బొమ్మలు డాన్స్ చేస్తూ కనిపిస్తాయా? ఆన్సర్ పేపర్ లో సత్తువ లేకుండా ఎవ్వరూ పాస్ కారు!" అంది జుబేదా.
    వాళ్ళు చూడకుండా మూతి తిప్పుకుంటూ వెళ్ళింది విక్టోరియా.
    "కూసే గాడిద మేసే గాడిద..." అంది జుబేదా. మాటల్లో సరోజ- సోఫియా క్లాసుమేటు- వచ్చింది.
    ఏవో కబుర్లు చెప్పి వెళ్ళింది. అంతలో సోఫీ వచ్చింది విసుక్కుంటూ, బాత్ రూమ్సు ఖాళీ లేవని.        వీణ జుబేదా వైపు కొంటెగా చూసింది. సోఫీ స్నానం చేసి మూడు రోజులైంది.
    స్నానం చేయాలనుకొనేవాళ్ళు ఆరు గంటలకి వెళ్ళితే ఇష్టం వచ్చినంతసేపు చేయవచ్చు. లేట్ గా లేచే సోఫియాలు చాలామంది ఉన్నారు హాస్టల్లో మరి!
    సీనియర్ అయినా, సోఫియాని-'అండీ!' 'అక్క!' నుంచి 'సోఫీ' అని పిలిచే చనువు, స్నేహం ఏర్పడింది వారి మధ్య. సోఫియా బాయ్ ఫ్రెండ్స్ తో ఫ్రీగా తిరుగుతుంది. సినిమాలకి వెళ్ళుతుంది. హాపీ బర్త్ లా ఉంటుంది. ఇన్ని చేసినా చదువు మాత్రం వెనకవేయదు. కష్టపడి చదువుతుంది. ప్రతి సంవత్సరం పాస్ అవుతుంది.
    వ్యక్తిగతంగా ఎలా ఉన్నా స్నేహపాత్రురాలు. అందుకే వీణ, జుబేదాలకు ఇష్టం. సోఫీ క్లాసుమేటు ఇంకా పి. పి. సి. లోనే ఉంది.
    వీణ వెతుకుతున్నది! కిందా పైనా పుస్తకాలలో.
    "ఏమిటి వెతుకుతున్నావ్?" అంది 'సోఫీ' కంటికి అంతా పౌడరు అద్దుతూ.
    "నా పెన్!"
    "మీ నాన్నమ్మ ఇచ్చిందేనా?" జుబేదా కామెంటు.
    "అది నా లక్కీ పెన్. పరీక్షలు దగ్గరి కొస్తున్నాయి."
    ముఖానికి అక్కడక్కడ పఫ్ తో అద్దుతూ, "ఎవరు వచ్చారు రూముకి?" అంది సోఫీ.
    "విక్టోరియా! సరోజ!" అంది వీణ.
    "సరోజ వచ్చిందా? హాయ్!" అంటూ పరుగెత్తింది సోఫియా.
    అయిదు నిమిషాల్లో పెన్ తో తిరిగి వచ్చింది.    
    వీణకు ఇస్తూ, "నీ పెన్ తెచ్చాను. మరి సినిమాకి తీసుకొని పో!" అంది.
    "ఎక్కడ దొరికింది?"
    "మన దొంగపిల్ల సరోజ బాగ్ లో ఉంది."     
    కళ్ళు విప్పి చూస్తున్న వీరివైపు చూసి నవ్వుతూ, "సరోజ! దానికి ఒక జబ్బు! ఇట్టే కాజేస్తుంది ఏ వస్తువైనా! మరల మనం తెచ్చుకోవచ్చు! పాపం! ఆ జబ్బును ఏదో అంటారు... దానికి పెళ్ళికూడా అయింది. దాన్ని వదిలేశాడు దాని దొంగబుద్ధికి భయపడి! ఆఁ! ఆఁ! పిక్చర్ ప్రోగ్రామ్!"
    "మధ్యాహ్నం క్లాసుంది!..."
    "ఫస్ట్ షో కి పోదాము. వార్డెన్ నడిగి పెర్మిషన్ తెస్తాను."
    "ఇస్తుందా?" అంది జుబేదా.
    "దోసకాయ పచ్చడి ఇష్టం అంటే సరి!"
    "ఆమెకు ఇష్టమా!?" అంది వీణ.
    "ఊఁ! మరే!" పుస్తకాలు తీసుకుని క్లాసుకు బయలుదేరింది సోఫియా.
    ఆ సాయంకాలం ముస్తాబు చేసుకొని సినిమాకి బయలుదేరారు ముగ్గురూ. ఒక రిక్షాలో ముగ్గురు పట్టరు కనక నటరాజ్ సర్వీస్ అంటూ నడుస్తున్నారు.
    రాకరాక వచ్చిన హిందీ పిక్చర్. హౌస్ ఫుల్ అయింది. పిల్లల నిరాశ చూసి సోఫియా నవ్వుకొంది.
    మానేజరు వచ్చి వారిని ఫామిలీ రూములో కూర్చోపెట్టాడు.
    "సోఫీ! నీకు అందరూ తెలుసా?" అంది వీణ.
    "ఇది మన హాలే!"
    "మనదా!?" అంది ఆశ్చర్యంగా.
    "అదే! రాజీవ్ ది!"
    "ఆ రౌడీదా!"
    "హల్లో!" మగగొంతు.
    ఉలిక్కిపడి వెనక్కి చూసింది వీణ. వెనక సీట్లో నవ్వుతూ ఉన్నాడు రాజీవ్!
    భయంగా అంది వీణ- "సో....ఫీ....!" అని.
    "హల్లో, రాజ్! ఎప్పుడొచ్చావు?" అంది  సోఫియా.
    "మిస్ వీణ అంటున్న రౌడీ ఎవరు? ఎముకలు విరగ్గొడతా!"
    గబుక్కున సోఫియా చెయ్యి పట్టుకొంది వీణ, జరిగిపోయిన సంఘటన గుర్తుకు వచ్చి.
    వీణ, జుబేదాలు ఒక సాయంత్రం కాలేజీకి వెళ్ళి నోటీస్ బోర్డు చూసి వస్తున్నారు. ఇద్దరూ ఓణీ, పావడా కట్టుకొన్నారు. మంచి లంగాలు, వోణీలు ఉన్నా కాలేజీకి చీరలే కట్టాలి. హాస్టల్లో ఓణీలు వేసుకునేవారు. అలాగే కాలేజీకి వెళ్ళారు.
    వస్తూండగా థర్డ్ ఇయర్ స్టూడెంటు ఎదురై, "ఏమమ్మా! పాపలు! పైట వేసి తిరుగుతున్నారు!" అంటూ ఎగతాళి చేసి వీణ భుజం పై చెయ్యి వేశాడు.
    ఒకటే పరుగు పెట్టారు భయపడిన వీణ, జుబేదాలు, హాస్టల్ దగ్గర సోఫియాతో మాట్లాడుతున్న రాజీవ్ ఈ విషయాన్ని విన్నాడు.
    మరో రోజు ఆ స్టూడెంటు చెయ్యికి కట్టు కట్టుకొని ఉన్నాడు.
    అప్పట్నుంచీ వీణకు మరీ భయం. అబ్బాయిలు కూడా వీణ వైపు చూడటానికి సంకోచించేవారు.
    ఒకందుకు సంతోషించినా, మరొకందుకు భయంగా ఉండేది. సినిమా చూస్తున్న సోఫియా, "జుబేదాకు దేవానంద్ ఇష్టం! మరి నీ ఫేవరిట్ ఎవరు?" అన్నది వీణతో.
    "నాకు ప్రత్యేకంగా ఒకరు ఇష్టమని లేదు. ఒక సినిమా చూస్తాను. బాగుంటే బాగుంది అనుకొంటాను. సినిమావాళ్ళ అందచందాలు చూసి పూజించే పిచ్చి లేదు!"
    జుబేదా అంది నవ్వుతూ, "షి ఈజ్ ఎ పతివ్రత" అని.
    "యూ సిల్లీ గర్ల్! నాకేం పతి లేడు, వ్రతను గావటానికి."
    "మీ తగాదాలు మాచి పిక్చర్ చూడండి" అంది సోఫీ.
    ఇంటర్వెల్ లో రాజీవ్ డ్రింక్స్ పంపాడు. వీణ తీసుకోలేదు.
    "పరాయి మగవాళ్ళ దగ్గర తీసుకోకూడదా! త్రాగమ్మా, డబ్బు ఇచ్చేద్దాము" అంది జుబేదా.
    సోఫీయా మెరుస్తున్న కళ్ళతో వీణను చూపింది.
    ఇంత మంచిగా ఉన్న వీణ జీవితం ఎలా ఉంటుందో? 'భగవాన్! బాగుండాలి' అని కోరుకుంది.
    హాస్టల్ వరకు తన కారులో లిఫ్ట్ ఇస్తానన్నాడు రాజీవ్, పిక్చర్ అయిపోయాక.
    "కారుల్లో తిరిగితే కొత్త పిల్లలకి పాపం, చెడ్డ పేరు వస్తుంది. మేము రిక్షాలో పోతాము" అంది సోఫీ.
    "థాంక్స్, సోఫీ!" అన్నారు వీణ, జుబేదాలు.
    ఒక రిక్షాలో ముగ్గురు కూర్చున్నారు.
    రాజీవ్ కారులో రిక్షా వెనకనే వచ్చి వాళ్ళు హాస్టల్ కి వెళ్ళాక తిరిగి ఇంటికి వెళ్ళాడు.
    రాజీవ్ గాఢంగా వీణను ప్రేమిస్తున్నాడని సోఫియాకి తెలుసు.
    వీణ ధ్యాసంతా చదువుమీద. కప్పలను ఉడెన్ బోర్డు మీద వెల్లకిలా పెట్టి నెయిల్స్ కొట్టి వెయిన్స్ కట్ కాకుండా వీనస్ సిస్టమ్ ఎలా నేర్పుగా చేయాలో, డిజిట్స్ నంబరు చూసి ఏ రకం కప్పో కనుక్కోవాలని; చేతికి అంటుకొనిపోవాలని చూసే బీచ్ ని రుద్ది బ్లడ్ వచ్చేదాకా బాగా చేత్తో రుద్ది మందంగా ఉన్న స్కిన్ ని పిన్ చేసి డైజెస్టివ్ సిస్టమ్, జెవిటల్ సిస్టమ్ అయిదు నిమిషాల్లో చేసెయ్యాలని, కాక్ రోచ్ ని తీసుకొని దాని రెక్కలు కట్ చేసి వెల్లకిలాపెట్టి లెగ్స్ ని పిన్ చేసి, పక్కల ఉండే స్కిన్ ని కట్ చేసి తరవాత డిపెక్ట్ చేసి, నెర్వస్ సిస్టమ్, పంయినరీ ఆపరేటస్ బయటికి తీయడంలో మెలకువలు నేర్చుకోవాలనే తాపత్రయం, బాటిల్స్ లో ఉండే పాముల రకాల్ని కనిపెట్టటంతోనే సంవత్సరం గడిపివేసింది.    
    కాని, హృదయాన్ని కళ్ళలో పెట్టుకొని చూసే రాజీవ్ కాని, అతని అందం, గొప్పదనంకాని వీణ కంటికి కనపడనట్లే ఉంది!
    సోఫియా పడకలో పడుకొని, గాఢంగా నిద్రపోతున్న వీణవైపే చూస్తూ, 'షి ఈజ్ టూ యంగ్!' అని తలచింది.
    పరీక్షలు వచ్చాయి. సరిగ్గా భోజనం చేయకుండా, ఏమి తిన్నారో తెలియకుండా వ్రాసి వస్తున్నారు. ఫిజిక్స్ రెండో పేపరు సరిగ్గా వ్రాయని వీణ దిగులుగా క్రింది పెదవి పంటితో నొక్కుకుంటూ ఒక్కతే హాస్టల్ వైపు పోతూ ఉంది.    
    రాజీవ్ వీణను కలుసుకొని, "హల్లో, వీణా! పరీక్ష ఎలా వ్రాశావు?" అన్నాడు.
    పక్కగా రాజీవ్ ని చూసింది. ఆమె కన్నుల్లో నీరు!
    "వీణా! పేపరు కష్టంగా ఉందా?" అన్నాడు.
    అతని గొంతులో ఆప్యాయత, అతను చలించిన విధము వీణకు కొత్తగా ఉన్నాయి. తల ఊపింది.
    "నీవు వ్రాయని క్వెశ్చన్స్ బాగా చదువు. ఓరల్స్ లో అనే అడుగుతారు. దిగులు పడకు. నీవు పాస్ అవుతావు. నేను చెప్పుతున్నానుగా?" అన్నాడు.
    పొడుగ్గా ఉన్న అతన్ని ఒక్కసారి చూడాలనుకొంది. కాని, చూడకనే చకచక నడిచి వెళ్ళిపోయింది.
    పోతూ ఉన్న వీణవైపే చూస్తూ ఉండిపోయాడు రాజీవ్.
    వీణకు ఎలా దగ్గర కావాలో రాజీవ్ కి అంతు పట్టలేదు. మాటలాడదు. చూడదు. బొమ్మలా ఉన్న వీణతో ఎలా స్నేహం చేయాలి? భుజాలెగురవేసి తిరిగి చూచుకొంటూ వెళ్ళాడు-    
    రూముకి వెళ్ళిన వీణ, "సోఫీ! మీ రౌడీ కనిపించాడు" అని జరిగిన సంగతి చెప్పింది.    
    "వీణా! రాజీవ్ తో స్నేహం చెయ్యి!"
    "ఛీ! మగవారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది." మంచంమీద వాలుతూ అంది.
    పరీక్షలు అయ్యాయి. సోఫీ నాల్గవ సంవత్సరం పాస్ అయింది.
    ఐస్ క్రీం పార్టీ ఇస్తానని హోటల్ కు తీసుకుని పోయింది సోఫియా.
    హోటల్ సర్వర్ జగ్గు ఏ మూల ఉన్నా, వీరు ఎప్పుడు వచ్చినా పరుగెత్తుకొని వస్తాడు.
    వస్తూనే, "చాలా కాలమైంది అమ్మా వాళ్ళూ వచ్చి" అంటూ నవ్వుతూ పలకరించాడు.
    జుబేదాపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాడు. నీట్ గా గొప్పింటి బిడ్డలా ఉంటాడు.
    "ఆ మేకగడ్డం లేకుంటే బాగుంటాడు" అంది వీణ చిన్నగా.
    "ష్! పరాయి మగవాడి అందం మన కెందుకు?" అంది జుబేదా నవ్వుతూ.
    జగ్గు ఐస్ క్రీము తెచ్చాడు. జుబేదా బేగం ముందు ఉంచిన కప్పు అందుకుంది కొంటెగా నవ్వుతూ వీణ. జగ్గు నవ్వుకొంటూ వెళ్ళాడు.
    "జుబేదా! నీ భక్తుడు!"
    "ఛీ! అలాంటి మాట లనకు. ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరికి లైకింగ్ ఉంటుంది. ఆ మాత్రాన- అదో నీ రౌడీ పూజారి మాటల్లోనే ప్రత్యక్షం!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS