Previous Page Next Page 
పగటికలలు పేజి 7


    నవరుచులూ సమపాళ్ళలో వుంది. మనకు అన్ని విధాలా సరిపోయే బేలెన్స్ డ్ డైట్ మన తెలుగువాళ్ళ భోజనం-అన్నం, పప్పు కూర, పచ్చడి, పులుసు, పాయసం, మజ్జిగ, మొదలయిన వాటిల్లో అన్ని రుచులూ, విటమిన్లూ సమపాళ్ళలో వుంటాయి. దుంప, పప్పు, రొట్టి, తప్పితే- షడ్రసోపేతంగా భోజనం చెయ్యడం- ఉత్తరాదివారికి తెలుసా?
    పోనీ మనం వాళ్ళని అనుకరించినట్టు, వాళ్ళు మనని అనుకరిస్తారా? .... చచ్చినా అనుకరించరు. వాళ్ళుగా సహనం. సమానత్వం ఏ కోశానా లేదు! మనభాష వాళ్ళు నేర్చుకోరు. మన అలవాట్లు వాళ్ళకి నచ్చవు. మన భోజనం వాళ్ళ కిష్టముండదు. అసలు మనం అంటేనే వాళ్ళకు లోకువ. ఈర్ష్య, అటువంటిది మనంమాత్రం వాళ్ళను నెత్తికెక్కించుకుంటాం- వాళ్ళభాష మనం మాట్లాడుతాం. వాళ్ళలాగ అలంకరించుకుంటాం. వాళ్ళ సినిమాలను కాపీకొడతాం వాళ్ళ పాటలను కాపీకొడతాం. వాళ్ళ కుప్పిగెంతుల్ని మనం డాన్సుచేస్తాం! వాళ్ళ తిండి తింటాం - ఇంతెందుకు? మనని వాళ్ళు పురుగుల్లా చూస్తున్నా-వాళ్ళంటే మనం పడి ఛస్తాం!
    ఇలా గయితే, మనభాష మనదేశ గౌరవం, వ్యక్తిత్వం ఏంకావాలో అర్ధం కాలేదు!"
    అనిపెద్ధ ఉపన్యాసం దంచి- వూరుకున్నాడు దాసు.
    ఆ ప్రశ్న నన్నొకడినే కాదు! ప్రతి తెలుగు వాడినీ, అడిగినట్లు అనిపించింది. అతని ఆవేశానికి, ఉద్రేకానికీ, ఆశ్చర్యచకితుడనయి పోయాను.

                                    5

    ఆరోజున తల్లిపంపిన మనియార్డరు అందింది. రోజులు అలా గడిచిపోతున్నాయిగాని వచ్చిన పని మాత్రం కాలేదు. గిరి మాత్రం ఏంజేస్తాడు? అవతల తల్లిమాత్రం రోజుకో ఉత్తరం వ్రాస్తుంది. ఉద్యోగం దొరికిందా? లేదా అని - కాకపోతే వచ్చేమనీ - అక్కడే తనతోపాటు ఉండి పొలంపుట్రా చూసుకొని వుండవచ్చు-అలా గయితే రైతులకుకూడా భయం భక్తి వుంటాయని. కాని. గిరికి ఆ పల్లెటూర్లో పడి వుండడం ఎంతమాత్రం యిష్టంలేదు. అందుకే ఏదో సాకు చెప్పి పట్నంలోనే గడిపేద్దామని ఊహ? అంత చదువు చదువుకుని - ఆ పల్లెటూర్లో ఎందుకూ పనికిరాకుండా పొలాల గట్లమీద తిరగడానికా? అని అమ్మతో చెప్పేసరికి ఆమె అవునుకామోను కొడుకేదో పెద్ద వుద్యోగం చేసి ఉద్దరిస్తాడు అని అనుకుంటుంది అమాయకురాలు.
    అదృష్టవంతుడయిన గిరి, తండ్రి ఆస్థి కొంత వుంది కాబట్టి ఉద్యోగం చేస్తేనేగాని గడపదన్న కర్మలేదు- తనూ తన తల్లి అంతే! మరెవ్వరూ లేకపోవడం. హాత్ హూత్ అనడానికూడా తండ్రి ఏనాడో కళ్ళుమూయడం, వీటన్నిటీచేత, గిరి పేచీపూచీలేనీ పూలరంగడులా వున్నాడు!
    అయితే అలా ఉత్తినే తిరిగడం గిరికియిష్టం లేదు! చదువుకొని పెద్దవాడయినా యింకా ప్రతిదానికీ అమ్మని అడగవలసి రావడం! అమ్మ ఏదో ఒకటి అంటూ యివ్వడం యిదంతా గిరికి నామోషికం అనిపించింది కూడా! అయితే ఉద్యోగం పురుషలక్షణం అన్నారు. సంఘంలో అలా అలకాగా తిరిగేకన్నా- ఒక వుద్యోగం అంటూ ఉంటే గౌరవం, మర్యాదా కూడాను. అదీకాక యింక యివాళో రెండ్రోజులు పోయేకో పెళ్ళికూడా చేసుకుంటాడు. యింకా ఆ పెళ్ళాం వచ్చాక ఏది కావలసి వచ్చినా పెళ్ళాంముందు అమ్మాయి అడగాలి. ఎంత చిన్నతనం? అంచేత నయినా ఒక ఉద్యోగం సంపాదించక తీరదు-అయినా కూర్చుని తింటే కొండలయినా తరిగి పోతాయి? తనేం లక్షాధికారా?....కాని....అనగానే దొరికి పోతుందా?
    చదువు పూర్తి అయిన అబ్బాయికి ఉద్యోగం దొరకడం- ఈడురాగానే ఆడపిల్లకి పెళ్ళి కావడం ఎంత కష్టం ఈ రోజుల్లో?
    అయినా ఉద్యోగాన్వేషణ మానలేదు గిరి ఒక రోజున ఒకాఫీసులో ఖాళీవుందని పేపర్లో చదివి- ఆ ఆఫీసరు దగ్గరికి పోయి సవినయంగా నమస్కరించి నిలబడ్డాడు!
    "ఏం బాధ్జీ!" అని అడిగాడు!
    "ఏం లేదండీ నేను చాలా బీదవాన్ని! చదువు కున్నాను టైపు చెయగలను అకౌంటింగ్ బుక్కీ సింగు ప్యాసయ్యేను. షార్టు హేండు కూడా వచ్చును....మీ ఆఫీసులో ఏదయినా ఉద్యోగ మిప్పిస్తే మీపేరు చెప్పుకు బ్రతుకుతాను!" అంటూ దీనాతి దీనంగా చెప్పవలసిన విధంగానే చెప్పేడు! అది విని-
    "ఇంతేనా! యింకా ఏమయినా క్వాలిఫికేషన్లు మిగిలిపోయాయో బాగానే వుందిగాని- ఆఫీసు ముందు నో వేకన్సీ బోర్డు చూడలేదా? అన్ని వున్నాయిగాని- నీలో అసలయిన డిసిప్లిన్ వున్నట్టు కనబడలేదు. కనీసం ఆఫీసు మర్యాద లయినా పాటించాలని తెలీదా? అని అడిగేడు అతను- గిరికి కొంతవరకూ అలాంటి అనుభవాలు అలవాటుకాబట్టి- అంతగా పట్టించుకో లేదు! అంత వేగిరం వదలనూలేదు- చీవాట్లు దులుపుకోవడం అవమానాలు భరించడం- నిరుద్యోగులకి నిత్యకృత్యాలు.
    "కోప్పడకండి! నిన్ననే మీ ఆఫీసు ఎడ్వర్ టయిజుమెంటు పేపర్లో చూశాను! ఇవాళ వచ్చాను అప్పుడే లేవంటే ఏం చెప్పను."
    "అది- నిన్నటి సంగతి- ఇంతవరకూ వుంటుందా? ఈ రోజుల్లో ఎవర్టయిజ్ చెయ్యనిదే కాండిడేట్లు వస్తున్నారు. ఖాళీలు లేకుండానే అప్లికేషన్లు వస్తున్నాయి అలాంటిది నీకోసం అట్టి బెటుకు కూచున్నాం అనుకున్నావా? ఆ ఖాళీ భర్తీ అయి పదహారు గంటలయింది తెలుసా?
    "పోనీలెండి అదికాకపోతే మరేదయినా యిప్పించి పుణ్యం కట్టుకోండి!"
    "అబ్బబ్బ! వదలరుకదా ఎన్నిసార్లు చెప్పడం. నీలాంటి వాళ్ళ బాధ పడలేక మేము ఎంప్లాయ్ మెంటు ఎక్సేంజ్ నుంచి వచ్చినవాళ్ళనే తిను కుంటున్నాము. అంచేత అక్కడికివెళ్ళి అడుగు నన్ను చంపకు! అని విసుక్కున్నాడు! అయినా ఓ పట్టాన వదల్లేదు గిరి-
    "అలాగంటే ఎలాగండి! ఖాళీలున్నాయంటున్నారు! దయయుంచి నాకో ఛాన్సు యిప్పించండి!"    
    "సరి! ఇంతసేపూ చెప్పింది నీక్కాదటోయ్. మిఠాయి వుండలు బజార్లో వుంటాయి! అయితే ఉత్తినే దొరుకుతాయా! కొనుక్కోవడం అంటూ ఒక పద్ధతి వుందంటావా! అలాగే మా ఆఫీసుకి కొన్ని పద్ధతులున్నాయి వెళ్ళి ఆ ప్రకారం రా! వెళ్ళింక విసిగించకు!" అని అన్నాడు!
    ఇంక లాభం లేదని గిరి తిరిగి వెళ్ళిపో తుంటే ఆ గుమ్మం దగ్గరే ఆ ఆఫీసులో గుమాస్తానే ఒకడు ఎదురయి-
    "ఏం బాబూ తిరిగి వెళ్ళిపోతున్నావు?" అని ప్రశ్నించాడు.
    "మరేం చేయమంటారు? ఖాళీలు లేవంటగా?-
    అది విని - ఆయన "హి...హి....హి" అని ఒక సినిమా నవ్వునవ్వి - "వెర్రివాడా? చదువు కున్నావు? ఆపాటి గ్రహించలేవా? ఆపాటి ప్రపంచజ్ఞానం లేదా? అతని మాటల్లో అర్ధం గ్రహిస్తాననుకున్నాను!" అన్నాడు.
    అది వినగానే అందరిచేతా చీవాట్లు తినడమేనా తన బ్రతుకు అనుకున్నాడు. తనొక శుద్ధ మొద్దవతారంలా కనబడతాడా ఏమిటి? లేక పోతే అందరూ తెలుసున్నట్టు తనకు చెప్పేవాళ్ళే కాదా?
    "ఏమిటి అలాఅంటున్నారు?" అని ఎంతగా అడిగేడు!
    "నేనిక్కడ గుమస్తానే! నాకిక్కడ సంగతులు బాగా తెలుసును! నీకు నిజంగా ఉద్యోగం కావాలా?" అని అడిగేడు ఆ గుమస్తా!
    "అదేవిటండీ అలాగంటారు! నౌఖరీ ఏదయినా చేయడానికే కదా ఇలా ప్రతి ఆఫీసుకీ తిరగడం!' అని అన్నాడు గిరి-
    "నీ కెవరయినా తెలిసిన పెద్ధవాళ్ళున్నారా?- అంటే - పెద్దపదవుల్లో వుండి. మంచి పలుకు బడిగల - మినిష్టర్లు, చైర్మన్లూ, యిలాటి వాళ్ళు!"
    "లేరండీ ఎందుకూ?"
    "ఎందుకా? రికమెండేషన్ చేయడానికి! ఉద్యోగం ఇవ్వండీ అని - చెప్పడానికి?"
    "లేరు?"
    "పోనీ, పెద్ద ఉద్యోగస్తులున్నారా? వాళ్ళ ఆఫీసుల్లోనే వేసుగొంది....  "
    "లేరు!"
    "పెళ్ళి అయిందా లేదా!"
    "ఎందుకండీ?"
    "అవకపోతే - ఉద్యోగం కూడా మామగారే వేయించుకోవాలి? అని కండిషను పెట్టు గుందికీ .... కట్నం లాంఛనాలు నీటితో కూడా...."
    "బలే బావుంది .... పెళ్ళి యింకా కాలేదు లెండి - కాని పెళ్ళి అయేవరకూ ఉద్యోగం లేకుండా వుండటం మెలాగండి?"
    "ఛా అదేమిటోయ్! అలాగంటావు? ఉద్యోగం అయేవరకూ పెళ్ళిలేకుండా వుండలేవనాలీగాని!"
    "మీకేమండి ఎలాగయినా హాస్యమాడతారు!"
    "అయితే పోనీ - పుష్కలంగా డబ్బురాదా? .... ఈ వుద్యోగం కోపం - తిరగడం మాని ఏదయినా వ్యాపారం పెట్టు గుందికి!"
    "లేదు!"
    "అయితే చూడు! నే చెప్పినట్టు చెయ్యి! కొండ మీద కోతికూడా దొరుకుతుంది! ఒక్క రెండు వందలు .... ఏది .... ఒక్క రెండూ వందలూ .... తెచ్చి ఈ ఆఫీసరుగారికి సమర్పించుకో! రేపే నీకు నౌఖరి లభిస్తుంది! పూర్వం .... రాజుల దగ్గిరికి గర్భిణీ స్త్రీల దగ్గరకి దేముడి దగ్గరికి - బ్రాహ్మణుల దగ్గరకి, ఉత్త చేతులతో పోరాదనే వారు! .... యిప్పుడు ఏ పని జరగాలన్నా .... ఆ పని ఎవరివల్ల జరుగుతుందో వారి దగ్గరికి కూడా ఉత్త చేతుల్తో పోకూడదు! ఉత్తికాగితం మీద అప్లికేషను పెడితే అది గాలికి ఎగిరిపోతుంది ఆఫీసరు టేబిలు మీద కంటతడి నిలవాలంటే ... ఆ కాగితం మీద వెయిట్ ఉండాలోయ్! ఆ బదువు పేరే "లంచం!" తెలుసా! .... అదీ అసలు సంగతి నీ యిష్టం" అని అన్నాడు!
    అది వినగానే కళ్ళు పచ్చగా అయి రెండు కళ్ళకీ రెండు పచ్చనోట్లు అవుపించాయి.
    "ఏమిటి రెండు వందలు లంచమా?" అన్నాడు వింతగా-
    "మరేమిటనుకున్నావు? అవ్వాకావాలి బువ్వా కావాలి అంటే ఎలా! రెండు వంద లిస్తావేమో? వందరూపాయలు నెలకి సంపాదిస్తావేమో రెండు నెలలు పనిచెయ్యలేదనుకో! ఇలాఎన్నెల్లు తిరిగినా సంపాదించగలవా? ఉద్యోగం..... ప్రపంచం- నాయనా ప్రపంచం? పనులు లేవు-లేవు-పొమ్మనేవాళ్ళకన్నా యిది నయమేకదా? ఇటు నీకు ఉద్యోగం అయినట్టూ వుంటుంది. అటు అతనికీ కొంత లాభిస్తుంది!..." అయినా నాకెందుకులే- పోనీ...ఏదో బాధపడుతున్నావు! ....ఎన్ని యిబ్బందు'ల్లో వున్నావో, అని నాకు తోచిన నిజం చెప్పేను.....ఆపైన నీయిష్టం!" అని వూరుకున్నాడు.
    అది విని-గిరికి చాలా అసహ్యం వేసింది!
    అయితే మీరు మధ్యవర్తులా?.... మీ కెంత కమీషను వుంటుంది?" "తృణమో పణమో వుండదనుకోకు...ఏదీ లేకపోయినా ఆఫీసరు గారి అభిమానం వుంటుందిగా!....ఏ పనికైనా దారి అంటూవుంటుందిగా ఆ దారి చూపే వాన్నేనేను! యిందులో నాదేముంది!" అని అన్నాడు!
    "మార్గదర్శిగారూ ఒక్క నమస్కారం! రెండు వందలే ఉంటే ఇకనేం? ఆసొమ్ము కోసం ముందు దొంగతనము నేర్చుకొని, సంపాదించితప్పకుండా మీ ప్రభువు దర్శనం చేసుగుంటాను! సెలవు!" అని ఒళ్ళుమండి అన్నాడు గిరి-
    "అయితే నీ కర్మపో! పైన చెప్పినవాటిల్లో ఏది లేకపోయినా ఈ లోకంలో నీకెక్కడా ఉద్యోగం పుట్టదు- అర్జీలకీ- ఉద్యోగాలూ, ఆశీర్వచనాలకి బిడ్డలూ పుట్టరు నాయనా యిది జ్ఞాపకం ఉంచుకో!" అని అతడన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS