Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 6


    'తప్పక ఒప్పుకో అన్నయ్యా! ఆ పిల్లకి విచిత్రవేషధారణకి ఒక ప్రయిజ్ ఇవ్వొచ్చును!'
    'పాపం! అమాయకులు!' అంది దేవమ్మ.
    ఇంకో సంబంధానికి వెళ్ళారు. ఈసారి తాతయ్యగారుకూడా వచ్చాడు. ఇల్లంతా మాడరన్ స్టయిల్ లో సర్ది వుంది. ఆ పిల్ల తల్లికి, తండ్రికి ఒక్కర్తే కూతురట! వెనకాసరాలేని కుర్రవాడి కిచ్చి పెళ్ళిచేసి ఆ పిల్లాడ్ని ఇల్లరికం తెచ్చుకోవాలని కోరికట! ఆడపెళ్ళివారు, నిమ్మనీరూ, రెండేసి బిస్కత్తులూ ఇచ్చి మగపెళ్ళివారిని సత్కరించారు. మాధవ తన కిచ్చిన ప్లేటులోని రెండు బిస్కత్తుల్లో ఒకటి, తెల్లని బొచ్చుకుక్క పిల్ల అతని మోకాళ్ళమీదకు ఎగబ్రాకుతోంటే. దానికి ప్రజంట్ చేశాడు. పెళ్ళి కూతురు కాన్వెంట్ లో ఎయిత్ స్టాండర్ద్ చదివిందట! పిల్లని తీసుకవచ్చి ఎదురుగా వున్న సోఫాలో కూర్చుండబెట్టారు. ఆ అమ్మాయి నల్లగా, పొడుగ్గా వుంది. కొంచెం ముందున్న రెండు పళ్ళూ ఎత్తుగా వున్నాయి. చెవులకి పెద్ద పెద్ద బంగారపు రింగులు పెట్టుకుంది. తెల్లని స్లీవ్ లెస్ బ్లవుజ్, తెల్లటి టెరిలిన్ చీరా ధరించింది. లేత గులాబీరంగు లిప్ స్టిక్ పేదలకు వేసింది. మెడలో బొడ్డుదాకా వుండే పొడుగాటి ముత్యాల హారం ధరించింది. ఆ హారం మధ్యన అరచేయియంత రాళ్ళు పొదగబడిన లాకెటు వుంది. వకచేతికి పది పన్నెండు రాళ్లగాజులు, ఇంకొకచేతికి రెండువేళ్ళ వెడల్పున్న నల్లటి స్ట్రాపుతోటి స్క్వేర్ వాచీ పెట్టుకుంది. ఆ అమ్మాయి కుర్చీలో కూర్చోబోతూ రామనాధాన్ని విష్ చేసి మరీ కూర్చుంది. రామనాధం ఇబ్బందిగా ఫీలయ్యాడు.
    'మీకు బి. ఎ. లో క్లాసు వచ్చి నట్లుంది! యం. ఎ. చదవకుండా, ఈ టీచర్ ట్రయినింగ్ ఎందుకయ్యారూ?' అని సూటిగా రామనాధం ని అడిగింది.
    రామనాధం తెల్లబోయి చూసాడు ఆమెవైపు! మాధవ ఆమె చొరవకి ఆనందించాడు.
    'వాడికి చదవాలనే వుంది. కొన్నాళ్ళు జాలిగా ఉద్యోగం చేసేక చదువుతాడు!' అని అన్నతరఫున చెప్పాడు.
    'ఆర్దికంగా కూడా కలిసివస్తుంది లెండి! మీరేం చేస్తున్నారు?' అని మాధవ వివరాలు అడిగింది. ఒక అర్ధగంట సేపు కాలేజీలూ, అమ్మాయిలూ, అబ్బాయిల చుట్టూ వాళ్ళ సంభాషణ భ్రమణం చేసింది! తాతయ్యా, దేవమ్మకీ ఆ పిల్ల అల్లా నదురూ, బెదురూ లేకుండా మాట్లాడెయ్యటం చోద్యం అనిపించింది.
    తాతయ్య, దేవమ్మ అల్లా వింతగా చూస్తున్నా ఆ అమ్మాయి లక్ష్య పెట్టలేదు. ప్రేమలూ, కధలూ, సినిమాలూ, నూతన సాహిత్య రీతులూ, ఫేషన్లూ, ఖండకావ్యాలూ అన్నీ కలబోసి, గలగల్లాడుతూ మాట్లాడేసింది. అప్పు డప్పుడు పత్రికల్లో పడుతూ వున్న జోక్స్ కూడా చెప
్పి, భళ్ళు భళ్ళు మని నవ్వింది.
    రామనాధానికి, ఆ అల్ట్రా మాడర్నిటీ గొంతుపట్టినట్లు అన్పించింది.
    'హైలీ కల్చర్డ్ ఫామిలీ!' అన్నాడు మాధవ.
    'ఏమిటో ! ఆ పిల్ల అల్లా మగాళ్ళ మీదకు ఎగబడి మాట్లాడుతోంటే, ఆ తల్లీ తండ్రీ ముసిరిపోతారు తప్ప కాస్త హెచ్చరించనన్నాహెచ్చరించరు! ప్రక్కన చెట్టంత ఆడది వున్నదన్న జ్ఞానమన్నా లేదు వాళ్ళకి!' అంది దేవమ్మ.
    'వీళ్ళ బ్రతుకులు బండలవ్వా! ఇంటికి 'నా' అన్న పెద్ద మనుషులు వస్తే ఇన్ని పంచదార నీళ్ళూనూ, కుర్రాళ్ళ కిచ్చినట్లు రెండు బిస్కట్లు ముక్కలూనా ఇచ్చేది? అందుకే లక్షలకి లక్షల రూపాయిలు కూడబెట్టుకుంటున్నారు మరి!' అన్నాడు తాతయ్య.
    'అవును మరి! వచ్చిన వాళ్ళందరికీ తేరమేపుతా రనుకున్నారా లేకపోతే!' అంది దేవమ్మ.
    'అమ్మా! అది అలాంటి మేడలున్న వాళ్ళు చేసారు కనుక మాడరన్ స్టయిల్ క్రింద వస్తుంది. అదే మనలాంటివాళ్ళం చేస్తే.'
    'ఛ! వాళ్ళింట్లో ఫలహారాలకే గతి లేదు!' అని చీదరిస్తారు. అన్నాడు రామనాధం.
    ఏమయితేనేం! ఏ సంబంధానికైనా ఏవో వంకలు వచ్చి పురిట్లోనే సంధి కొట్టుతూ  వచ్చాయి. నచ్చటం దాకా ఏ సంబంధమూ రానే లేదు! కామేశ్వరి ఛాయ తక్కువగా వున్నా. ఏదో సంసారపు రీతిలో వుండి, చక్కని సౌజన్యంతో కన్పించింది రామనాధానికి. ఆదివారం వచ్చి వెళ్ళిపోతూన్న రామనాధాన్ని తాతయ్య ఆపేడు.
    'ఈ సంగతి విన్నావా?' అన్నాడు.
    'ఏమిటన్నట్లు చూశాడు రామనాధం. మాధవ తండ్రి ధోరణికి వింతబడ్డాడు.
    'ఈ నరసయ్యకి బాగా గర్వం బలిసింది! పోనీ, చిన్ననాటి స్నేహితుడు పిలచి పిల్లనిస్తానన్నాడు కదా అని చూసి రమ్మన్నాను. సరే చూసి వచ్చారు. ఏరా! రామా! ఎవర్ని చూసానన్నావ్! ఎవర్ని వచ్చానని చెప్పావ్!' అన్నాడు.
    దేవమ్మ భర్త గట్టిగా మాట్లాడటం విని, వంటింట్లోంచి అంగట్లోకి వచ్చి నిలబడింది.
    "పెద్ధమ్మాయ్ ని చూసాను నాన్న గారూ! ఆ అమ్మాయే నచ్చింది కూడా!' అన్నాడు రామనాధం.
    'ఏం! అల్లా అన్నావా! మన మధ్య వర్తి నారాయడు వ్రాసేడు చూడు! పెద్ధమ్మాయ్ కి వేరే సంబంధం కుదిరిందట! అవతలవాళ్ళు కట్నం లేకుండానే చేసుకుందుకు, వొప్పుకున్నారట! కాని మనం చిన్నప్పటినించీ తెలిసిన వాళ్ళు అవటం నించీ, మనకే ఫాస్ట్ ఫ్రెఫరెన్స్ యిస్తారట! అంచేత తాను మొదట ఇచ్చే కట్నంతో రెండో అమ్మాయి నిస్తాడట! నచ్చేమాటయితే వచ్చి చూడాల్సిందని, రెండు పెళ్ళిళ్ళూ వకసారే జరిపిస్తే తనకి ఖర్చులు కలిసివస్తాయనీ వ్రాసేడు. పాపం! ఈనగారు దయతలిచి, మనకు పిల్లనియ్యకపోతే, మనకు పెళ్ళిళ్ళు కావుకాబోలు! మనల్ని ఉద్ధరించటానికే కన్నాడా తను ఆడపిల్లల్ని!' అంటూ కోపంగా కేకలేసాడు.
    'ఇంతోటి అప్సరసనీ, కట్నం లేకుండా ఎవరెత్తుకు పోతున్నారు బాబూ!' అన్నాడు మాధవ! రామనాధం మనసు చివుక్కు మంది.
    'నేనూ కట్నం లేకుండా చేసుకుంటాను; పెద్ధమ్మాయే నాకూ నచ్చింది అని చెప్దామనుకున్నాడు రామనాధం. కాని ఏదో తెలియని అస్వతంత్రత అతని గొంతును నొక్కి పెట్టింది.
    'అసలు అన్నాయ్ కి పెద్ద పిల్లే నచ్చింది! ఆ ఇచ్చే ప్రెఫరెన్స్ ఏదో పెద్దమ్మాయ్ ని ఇచ్చి చేయటంలో చూపితేనే బాగుండేది!' అన్నాడు. మాధవ వెంపు మెచ్చికోలుగా చూసాడు రామనాధం.
    'బాగుందిరా వొరస! అసలు పెద్ద పిల్ల కాటిక్కాయలా వుంటుందిట! నారాయడు చెప్పేడు. దానినే, కట్నం లేకుండా ఎగరెత్తుకు పోయి పెళ్ళాడే వాడుంటే, ఇంక రెండో పిల్లది భూలోక రంభట! దాన్ని పెళ్ళాడటం కోసం ఉభయ ఖర్చులూ భరించి పెళ్ళాడుతామంటూ క్యూలో నిలబడి వుంటారీ పాటికి పెళ్ళికొడుకులు! అన్నమాట. తిరగ వేసిన వాళ్ళతో మనకేమిటి! ఇంక వాడికీ మనకి సంబంధ స్నేహాలు ఈనాటితో సరి! ఇంక వాడికేం జాబు వ్రాయను!' కోపంతో అన్నాడు తాతయ్య.
    'నాన్నతో వాదించి లాభంలేదు. నువ్వు స్వతంతృడివి! నువ్వు ఏమీ అనకుండా వుంటే ఎల్లా!' అన్నాడు రామనాధంతో మాధవ.
    'దేని గురించి!' విస్మయంగా అడిగాడు రామనాధం.
    ''అదేం టన్నాయ్! నీకు పెళ్ళికూతురు నచ్చలేదూ!' ఆశ్చర్యంగా అన్నాడు మాధవ.
    'నచ్చలేదన్నానా! నేను మటుకు!' అన్నాడు.
    'అయితే నాన్నతో చెప్పు! ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని' అన్నాడు.
    'అదెలా! ఆమెకేదో సంబంధం కుదిరిందన్నారుటగా!' అన్నాడు నీరసంగా రామనాధం.
    'కుదిరితే మటుకు! నీకు నచ్చింది! నాన్నగారు కట్నంతో మడత పేచీ పెట్టారు! దానితో వాళ్ళు ఇంకేదో సంబంధం చూసుకున్నారు! ఆ కట్నం అక్కర్లేదని నీవే చేసుకుంటానంటే నీకెందుకు ఇయ్యరు? నాన్నదంతా అతిశయం! పెద్ద వాళ్ళ అతిశయానికి చిన్న వాళ్ళ కోర్కెలు బలయిపోవాలా! కేవలం పెంచి పెద్ద చేసిన వారి మాట మన్నన కోసరం, నీ మనసుకి నచ్చిన జీవన సహచరిని వదులుకుంటావా! నీవు స్వతంత్రుడివి! ఆర్జన పరుడివి అయి కూడా నీ మనసుని మసి చేసుకుందుకే తల వొంచావా!' తీవ్రంగా ఆవేశంగా అన్నాడు.
    రామనాధం తేలిగ్గా నవ్వాడు.
    'నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకె వడ్నీ పెళ్ళి చేసుకోనని ప్రతిన పట్టావా! యిప్పటివరకు చూచిన వాళ్ళల్లో ఆపిల్ల నచ్చిందన్నాను. వాళ్ళు ఇవ్వదలిచి పిలిచారు. మనం చేసుకోదలిచి వెళ్ళాము. చూసి వచ్చిందన్నాము. ఈ లోగా వాళ్ళకి ఇంకో మంచి సంబంధం లాయకీగా దొరికింది చేసుకుంటున్నారు. మనం వెళ్ళి అడ్డు పడడం ఎందుకు? మనకి అంతకన్నా మంచి సంబంధం దొరికే యోగం వుందేమో!' నిర్లిప్తతగా అన్నాడు.
    'ఏం మెట్టమెదాంతము చెబుతా వన్నయ్యా! చూసీ చూడగానే, ఆమె నీకు ఎంతగానో నచ్చింది. కాని నాన్న మాట గౌరవం కోసరం ఇల్లా అంటున్నావు' ఆవేదనగా అన్నాడు మాధవ.
    'మొత్తానికి భావుకున్ననిపించుకు న్నావు!' నవ్వాడు రామనాధం.

                                                         *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS