Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 6


    'అమ్మ చనిపోయింతర్వాత యిక నాకు అక్కడ ఉండ బుద్ధి పుట్టలేదు. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుపు వస్తూ ఉండేది. ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నాను. క్షుద్బాధ నన్ను నిలువునా దహించివేయసాగింది అడుగులు పడలేదు. మూడురోజుల క్రితం ఒక్కపూట చేసిన భోజనం.....అర్ధాకలితో...! ప్రక్కింటి ఆమె మా యింట్లోకి రావడం కనుపించింది. చేతిలో సంచీ తీసుకొని రెండడుగులు వేసి క్రిందపడి పోయాను. ఆమె నా దగ్గరకు వచ్చి నన్ను లేవదీసి తమ యింటికి తీసుకువెళ్ళింది. అన్నం పెట్టింది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత వేరేవాళ్ళ యింట్లో ఆరోజే అన్నం తిన్నాను. అమ్మ ఎన్ని కష్టాలైన భరించింది గాని చేయెత్తి ఎవరినీ యాచించలేదు.
    'అన్నంపెట్టి ఆదరించిన ఆమెవద్ధ శలవుతీసుకొని బయలుదేరాను, అంతలో పోలీసులు నన్ను వెదుకుతూ వచ్చారు. నన్ను ఏవేవో ప్రశ్నలు అడిగి, వివరాలు వ్రాసుకొని వెళ్ళిపోయారు.
    'నేను వీధిన పడ్డాను. ఏమిచేయాలో? ఎటు వెళ్ళాలో తోచలేదు. ఆ ఊళ్ళో మాత్రం ఉండ బుద్ధి పుట్టలేదు. నేరుగా స్టేషనుకు వెళ్ళాను. ఏదో ఒక రైలు ఫ్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఎక్కి కూర్చున్నాను. అది ఎక్కడికి వెడుతుందో తెలియదు. అలసటగా ఉండడంవల్ల ఆవులిస్తూ నిద్రపోయాను.
    'ఎవరో తట్టి లేపుతూ ఉండడంవల్ల లేచాను. ఎదురుగా తెల్లని దుస్తుల్లో టికెట్టు కలెక్టరు కనుపించాడు. 'టిక్క ట్టేదీ...?' అడిగాడు. 'లేదు' అని తల అడ్డంగా త్రిప్పాను. అప్పుడే రైలు ఏదో స్టేషనులో ఆగింది. అతను దిగిపొమ్మని బెదిరించాడు. నాకు భయంవేసి ఏడుపు సాగించాను. అతనికి జాలి కలుగలేదు. పైగా అది ఫస్టుక్లాసు కంపార్టుమెంటు. చేయిపట్టుకొని బలవంతంగా దింపబోతుంటే నేను పెద్దగా ఏడవసాగాను. ఆ కంపార్టు మెంటులో వేరే ఒక సంపన్న కుటుంబం ప్రయాణం చేస్తూ ఉంది. ఖరీదైన దుస్తుల్లో ఉన్న ఆయన జోక్యం కలిగించుకొని నావైపు తిరిగి 'ఎవరమ్మా నీవు...? టిక్కెట్టు లేకుండా, అందులో ఫస్టు క్లాసు కంపార్టు మెంటులో ఎక్కావు!' అని ప్రశ్నించాడు.
    'నేను దిక్కులేని దానినండీ! మూడు రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది. నా కిక ఆ ఊరిలో ఉండ బుద్ధివేయలేదు.'
    'అంతా అబద్దంసార్! ఇటువంటి వాళ్ళను రోజుకు వంతమందిని చూస్తూ ఉంటాం....!' కళ్ళెర్రజేస్తూ అన్నాడు టిక్కెట్టు కలెక్టరు.
    'లేదండీ....! నేనబద్ధం చెప్పడంలేదు' అని దీనంగా ఆ పెద్దమనిషి కళ్ళల్లోకి చూశాను. ఆ పెద్ధమనిషి సహృదయు డిలా  ఉన్నాడు. టి. టి. కి హైద్రాబాదు వరకు అయే చార్జి చెల్లించి రశీదు తీసుకున్నాడు. నా తలమీద నుంచి ఎంతో బరువు దించివేసినట్లైంది, అమాయకంగా వారివైపు చూశాను. వారితో నన్ను నేను పోల్చుకొని ఎంతో సిగ్గుపడ్డాను. వారి దుస్తులు, వేషభాషలు నాగరికంగా ఉన్నాయి. మళ్ళీ తలఎత్తి వాళ్ళను చూడలేక పోయాను. నా పరిస్థితి నాకే అసహ్యంగా తోచింది. చినిగిపోయి మురికితో కనిపిస్తున్న గుడ్డలతోనూ, ఒళ్లంతా పేరుకుపోయిన మకిలితోనూ చూసేవారికి నాపై ఏహ్యభావం కలిగిస్తూ ఉంది.
    'చూడమ్మా..... ఒంటరిగా ఎక్కడికి వెళ్ళ తలచుకున్నావ్?'
    నేను మాట్లాడలేదు. మళ్ళీ అడిగారు. మాట్లాడకుండా ఉండడం బాగుండదని భావించి 'ఎటు వెళ్ళారో తోచడం లేదండీ! అంతా అయోమయంగా ఉంది. తినడానికి తిండి లేకున్నా అమ్మ నన్ను చదివించింది. ఎనిమిదవక్లాసు చదువుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక దుర్మార్గుడి ఘాతు చర్యకు గురైంది.' అని జరిగిన దంతా చెప్పి ఏడవసాగాను. నా మాటలు నమ్మారు ఆ భార్యాభర్తలు. వారబ్బాయి కావచ్చు పదహారు సంవత్సరాల వయసుంటుంది. అతను మాత్రం మొదటి నుండీ నన్ను చిన్న చూపు చూడడం గుర్తించాను. వారితో చెప్పి అలసటగా ఉండడం వల్ల పడుకున్నాను. మళ్ళీ మెలుకువ వచ్చి చూసే సరికి రైలు సికింద్రాబాద్ స్టేషనులో ఆగింది. తెల్లవారింది. వారంతా ముఖాలు కడుక్కుంటున్నారు. నన్నూ కడుక్కో మన్నారు. కడుక్కున్నాను. ఆ తర్వాత వారితోపాటు నాకు కూడా టిఫిను యిప్పించారు. మొహమాట పడుతూనే టిఫిను పూర్తి చేశాను.
    'అమ్మాయీ! నీ కభ్యంతరం లేక పోతే మా యింట్లో ఉండు. నా భార్యకు సాయంగా కూడా ఉంటుంది.'
    ఆప్యాయతతో నిండిన వారి మాటలు నాకు ధైర్యాన్ని కలిగించాయి నా మనసులో భగవంతుడే ఈ విధంగా దారి చూపించాడని ఊహించాను.
    'ఏమ్మా మాట్లాడవు? నీ కిష్టం లేకపోతే చెప్పు.'    
    'అబ్బే....! అదేం లేదండి, ఈ పరిస్థితిలో మీరు నన్ను భగవంతునిలా ఆదుకుంటున్నారు. సంతోషంగా వస్తాను.'
    'నాన్నగారూ! అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారా...? ముక్కు ముఖం తెలియని వాళ్ళను అంత త్వరగా నమ్మకూడదు.'
    'వారబ్బాయి మాటలు నాకు కొంత నిస్ప్రుహను కలిగించాయి. అతని మాట లను పట్టించుకొని నన్ను వద్దంటూరేమోనని భయపడ్డాను. కాని అలా జరగ లేదు. వారితోపాటు నన్ను వారు యింటికి తీసుకు వెళ్ళారు.

                             *    *    *

                                   3

    'నిత్యం తెల్ల వారు జామునే లేచి ఇంటి పనులన్నీ చేస్తూ గడిపేదాన్ని. రాత్రి అందరూ పడుకున్న తర్వాతే పడుకునే దాన్ని. ఈ విధంగా పది పదిహేను రోజులు గడిచిపోయాయి. నా చదువుల మీద ఆశ ఒదులుకున్నాను. ఈ కొద్ది కాలంలోనే అటు అన్నపూర్ణమ్మగారి. యిటు శ్రీపతిగారి ఆదరాభిమానాలను చూరగొన గలిగాను. ఒకరోజు శ్రీపతిగారు నన్ను పిలిచారు.
    'అమ్మాయీ! నీవు ఎనిమిదవ తరగతి చదువుతూన్నట్లు చెప్పిన విషయం ఈ రోజే గుర్తుకు వచ్చింది. ఒకవేళ నీవు చదువుకోవాలను కుంటే చదివిస్తాను.'
    'నాకు అంత అదృష్టమూ బాబు గారూ....! అయినా నాకు చదువెందుకు? అమ్మగారికి, మీకు సేవచేస్తూ గడుపుతాను.'
    'లేదమ్మా .... నీవు చదువుకోవాలని ఉత్సాహంగా ఉంటే మొహమాటం లేకుండా చెప్పు. తప్పకుండా చదివిస్తాను.'
    'నా కయితే చదువుకోవాలని ఉత్సాహంగానే ఉంది.'    
    'అలాగయితే నిన్ను తప్పకుండా చదివిస్తాను. రేపే మనయింటికి దగ్గరలో ఉన్న గర్ల్స్ హైస్కూలు హెడ్మిస్ట్రస్ తో మాట్లాడి అన్ని ఏర్పాట్లూ చేస్తాను.'
    'మీ ఈ ఋణం ఈ జన్మలో మరిచి పోలేనండీ...!'
    'అంత మాటెందుకమ్మా? ఎవరికి ఎవరు ఋణపడతారో నిర్ణయించే శక్తి మనకెక్కడిది? అంతా ఆదైవనిర్ణయం!'
    'శ్రీపతిగారితో ఆ సంభాషణ జరిగిన తర్వాత నాకు వేయి యేసుగుల బలం వచ్చింది. నేనుకూడా చదువుకొని మర్యాదగా జీవించగలననే ఆశ మళ్ళీ కలిగింది నాలో....! వారు అన్నమాట ప్రకారం నన్ను హైస్కూలు లో చేర్పించారు. ఇంట్లో అన్నపూర్ణమ్మగారికి అన్నివిధాల తోడ్పడుతూనే నా చదువు సాగిస్తూ ప్రశాంతంగా రోజులు గడపసాగాను.మూడుమాసాలు గడిచాయి. అంత ఉదార హృదయంగల ఈ దంపతులకు ప్రభాకరం లాంటి కుమారుడెలా కలిగారో నా కర్ధం కాలేదు. శ్రీపతిగారు సెప్పిన 'దైవనిర్ణయం' అనే పదం నాకు పదే పదే గుర్తుకు వస్తూండేది.
    'శ్రీపతిగారిది లక్షల ఆస్తి ఒక్కడే కుమారుడు కావడంవల్ల గారాబంగా పెంచుకున్నారు. అందువల్ల ప్రభాకరం ఎవరిమాటా వినకుండా పెడసరంగా తయారయ్యాడు. వారికి ప్రభాకరం గురించిన చింతతప్ప వేరే ఏ చింతా లేదు. అతి గారాబంవల్ల పూర్తిగా చెడిపోయాడు. అతనికి డబ్బు విలువ తెలియదు. విచ్చల విడిగా ఖర్చు చేసేవాడు. ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాదు. ప్రతివారితోనూ దురుసుగా ప్రవర్తిస్తూండే వాడు. అతని ఈ ప్రవర్తన అతని తల్లిదండ్రులను మానసికంగా ఎంతో కృంగదీసేది. నాతో కూడా చాలాసార్లు అలాగే ప్రవర్తించాడు. అతని ప్రవర్తన తెలిసిన నేను మెదలకుండా ఊరుకొనేదాన్ని. ఒకటి రెండుసార్లు నాపట్ల దురుసుగా ప్రవర్తించడం చూసిన శ్రీపతిగారు అతనిని గట్టిగా మందలించారు. ఆ కారణంగా నాపై కోపం ఏర్పడింది ప్రభాకరానికి. అతని వల్ల నాకు ప్రమాదమేమీ కలగకుండా చేయమని ఆ దైవాన్ని ప్రతిరోజూ ప్రార్దిస్తూ ఉండేదాన్ని.' అని నిద్ర మత్తుతో ఆవలించింది శారద.
    'ఆపేశావేం...? కధ యిప్పుడిప్పుడే రక్తి కడుతూంది. త్వరగా చెప్పు!' అంది శాంత.
    'అబ్బ...! ఇక ఈరోజు వోపిక లేదే!మరెప్పుడైనా చెబుతాను.'
    'ఉహు .... లాభంలేదు. ఇప్పుడు చెప్పాల్సిందే! నిద్ర తేలిపోయింది. ఎలాగూ మళ్ళీ యిక నిద్ర పట్టదు.' పట్టు బట్టింది శాంత.
    'సరే...! అలాగే చెబుతాను.' అని ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి మళ్ళీ ప్రారంభించింది. 'మూడు సంవత్సరాలు ప్రశాంతంగా ఆ యింట్లోనే గడిచి పోయాయి. నేను హెచ్. ఎస్. సి. ఫస్టు క్లాసులో ప్యాసయ్యాను. అదే సంవత్సరం ప్రభాకరం కూడా క్లాసునే ఎంతో కష్టం మీద పూర్తి చేయడానికి చేసిన ప్రయత్నంలో అది మూడవది. ప్రభాకరాన్ని నేను అర్ధం చేసుకున్నాను. అతను అలా చెడుగా ప్రవర్తించడానికి అతని చుట్టూ స్నేహితులే కారకులని ఊహించాను. చాలా తెలివైనవాడు. శ్రద్ధగా చదువుతే ఫస్టుక్లాసులో ప్యాసుకాగల తెలివితేటలున్నాయి. కాని దుస్సాంగత్యంవల్ల చదువంటే పూర్తిగా నిర్లక్ష్యం ఏర్పడింది. తల్లిదండ్రులు గట్టిగా మందలించలేకపోయేవారు. వారి బాధ చూడలేక ఒకసారి ప్రభాకరంతో మాట్లాడుదామని అతను ఒంటరిగా ఉన్న సమయంలో అతని గదికి వెళ్లాను. నేను వెళ్ళేసరికి ఏదో చవకబారు సెక్సు నవల చదువుతూ ఉన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS