6
"అన్నలారా వినండి! వినండి! ఇదిగో ఈ రత్నం లాంటి బానిస పిల్లని చూడండి! చాలా మంచి బేరం! ఈ అమ్మాయిని కొనుక్కున్న వారికి నిధి దొరికినట్లే -- జీవితాంతం అదృష్టం అనుభవిస్తారు."
సోమవారం పూనా బజారు లో జరిగే సంతలో మోర్ భట్ శ్యామాని అమ్మకానికి పెట్టాడు. ఒక మామిడి తోపు మధ్య జరిగే ఈ సంతలో ఒక చెట్టు నీడ కింద చాప వేసుకుని కూర్చుని పక్కనే నుంచుని ఉన్న శ్యామాని చూడమని, కొనమని అరుస్తున్నాడు. ఆమె దిగాలు పడిపోయి దించిన తల ఎత్తలేక పోయి ఉంది. మామిడి తోపు నీడ కోసం వచ్చే సోమరులు చాలామంది ఈ వినోదాన్ని చూస్తున్నారు. క్రమంగా అక్కడి గుంపు పెద్దది అవుతూ వచ్చింది. ఇది గమనించిన మోర్ భట్ ఉత్సాహంగా తాంబూలం నములుతూ, 'అన్నలారా, చూశారా ఈ అమ్మాయి అందం! రత్నం లాంటి బానిస పిల్ల--" అని రెట్టించి అరవటం ప్రారంభించాడు. "ఈ బానిస పిల్ల మొహమే కాదు, బుద్ది కూడా అందమయినదే! ఎంతో మంచి స్వభావం -- ఎంతో అణకువ, వినయం! ఇంటి పనులన్నీ బాగా తెలిసిన అమ్మాయి --"
"అయితే మీరెందుకీ నిధిని అమ్మేస్తున్నారండీ!" అని అక్కడే నుంచుని ఉన్న ఒక అమాయకుడు అడిగాడు.
"ఏం చెప్పమంటావు బాబూ. అంతా నా ఖర్మ! నా కసలు బుద్ది లేదు. కాని నాలాంటి పేద బ్రాహ్మడు బానిసల్ని పోషించగలడా అంట? నాలుగేళ్ల క్రితం నా పాండిత్యాన్ని మెచ్చి మన పీష్వా సాహెబ్ వారె ఈ పిల్లని యజ్ఞం లో దాసీ దానంగా ఇప్పించారు! అప్పటి నుంచీ ఈ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పోషించామనుకొండి......" అని సమాధానం ఇచ్చాడు మోర్ భట్. ఈ రకం ప్రశ్నని ఎదురు చూసినవాడే కాబట్టి. "కాని, రోజులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు కదా! నేనొక అప్పుల వాడి చేత బడ్డాను. రుణం తీర్చుకోవటానికి ఈ రత్నాన్ని అమ్మేస్తున్నాను ...ఈ సంగతి విన్న నా భార్య మూర్చపోయి నంత పని చేసిందంటే నమ్మండి! పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉంది పాపం...."
మోర్ భట్ వర్ణించిన ఈ జాలి గాధ, శ్యామా అందం అక్కడ గుంపు ని మరింత పెద్దది చేశాయి. శ్యామా కి మాత్రం ఇదంతా దుర్బరం అనిపించింది. చంఫాజీ ని తలుచుకోగానే నక్షత్రాల వంటి ఆమె కళ్ళు చమర్చాయి.
"భగవంతుడా! నా ప్రార్ధనలు నీకు వినిపించి ఉండవు. నేను పంపిన పావురం సురక్షితంగా చంఫాజీ ని చేర్చమని వేడుకున్నాను. నా సందేశం అతనికి కనుక అందే వుంటే ఈపాటికి గుర్రా మెక్కి ఇక్కడికి వచ్చేసి ఉండడూ? ఇంకా ఎందుకు రాలేదో! నా నుదుటి రాత ఎలా వుందో కదా..... " అని లోలోపలే కుమిలిపోయింది. ఈ బాధకి తోడు కొందరు ఆమెని కొనటానికి ఉద్యుక్తులవటం మొదలు పెట్టారు.
"అయితే ధర ఏమాత్రం?" అని అడిగాడు ఒక రయితు.
"బాబూ నేనేం పెద్ద షావుకారినా వ్యాపారం చెయ్యటానికీ , బేరం చెయ్యటానికీ? మోసం అనేది నాకు చాలా దూరం -- పది మొహర్లు ఇప్పించండి చాలు--" అన్నాడు మోర్ భట్ కొంచెం నిర్లక్ష్యంగానే.
ఈ వెలని విన్న మోతుబరి రయితు అడిరిపోయాడు. "ఇదేమి టీ వింత! ఆడపిల్లకి పది మొహర్లా/ పానిఫట్ ముందు రోజుల్లో కూడా ఇంత లేదే! మూడిస్తాను ఇచ్చేసేయ్!" అన్నాడు.
ఇంతలో ఒక కువిందుడు ముందుకు వచ్చి, నాలుగు మొహర్లు పాడాడు. మోర్ భట్ ఇద్దరికీ తల అడ్డంగా ఆడించాడు.
"బాపనయ్యా, ఈ మోతుబరి చెప్పిందీ నిజమే . రోజులు బాగా లేవు. మూడు మొహర్లు మంచి వేల! కాని, నాకు ఈ పిల్లని చూస్తె సద్భావం కలుగుతుంది. అయిదు మొహర్లిస్తాను, తీసుకో!" అని ముందుకి వచ్చాడు ఒక అంగడి పెట్టుకున్న వ్యక్తీ.
మోర్ భట్ విరగబడి నవ్వాడు. తర్వాత సావధానంగా తమలపాకు చిలక చుట్టుకుని, వక్క పొడితో నములుతూ , "బాబూ చెప్తున్నా విను! ఈ పిల్లని, పొలం చేసుకునే వారూ, బట్టలు నేసె వారూ, అంగడి పెట్టుకునే వారూ కొనుక్కోగలరా ఏమిటి? ఎవరో మహారాజు ఇంట్లోనో, అంతః పురం లోనో వెలిగి పోవలసిన కన్యా రత్నం!" అన్నాడు.
"ఈ బ్రాహ్మడు చాలా గడసరి!' "ముసలి నక్కే ననుకో!" "ఎంత దురాశ!" అనే మాటలు వినిపించాయి అక్కడి వారు మోర్ భట్ జవాబు విన్న తర్వాత. అదే సమయంలో ఇద్దరు ఆశ్వికులు అటు రావటంతో ఈ హడావుడి కొంత తగ్గింది.
"టోపీ వాలే సాహెబ్ లకి వందనాలు!"
"బొంబాయి కర్ సాహెబ్ లకీ జయ్!"
"కంపెనీ వాలే సాహెబ్ లకి స్వాగతం!" అని కొందరు వారిని ఆహ్వానించారు. ఇలా ఆహ్వానించిన వారంతా 'తెల్లదొర' లతో మంచి బేరం కుదుర్చు కొనవచ్చు నని ఆశించే వ్యాపారులే.
గుర్రాల మీద సపరి వారంతో వచ్చిన ఆ ఇద్దరి పేర్లూ, 'మిస్టర్ మోస్టిన్, మిస్టర్ ప్రయిస్." ప్రయిస్ ఏదీ కొనాలని లేకపోయినా మోస్టిన్ చెప్పటం వల్ల కొన్ని తివాసీలూ, ఒక హుక్కూ , పన్నీరు బుడ్డి , ఇంకా ఇతర చిల్లర వస్తువులూ కొన్నాడు. 'ఇవి చాలు' నని వెళ్ళిపోబోతున్న అతనితో మోస్టిన్, సర్! మీరు దేశం వస్తువులని ఎన్నో కొన్నారు. మీరేమీ అనుకోకుండా వుంటే మరో అందమయిన వస్తువునీ చూపిస్తాను. మన బొంబాయి ఆస్థానానికి బాగా ఉంటుంది...." అన్నాడు కొంచెం బెరుకుగా . ప్రయిస్ మోస్టిన్ కన్నా "సీనియర్" అధికారి.
"ఏమిటది?' అని అడిగాడు.
'ఒక బానిస పిల్ల సర్! అదుగో ఆ చెట్టు కింద ఉన్నమ్మాయి! అంత ఖరీదు కూడా చెయ్యదు. పానిఫట్ యుద్ధం తర్వాత మరాఠా దేశంలో బానిసల వెలలు బాగా పడిపోయాయిట. ఇండియాలో ఇంకెక్కడా ఇంత చవకగా దొరకడుట-- " అన్నాడు మోస్టిన్.
"బానిసపిల్లని మనమేమీ చేసుకుంటాము మోస్టిన్? మనదేమన్నా దేశీయ ప్రభుత్వమా, బానిసలని కొనుక్కోనటానికి? మనదొక కంపెనీ తెలుసా?"
మోస్టిన్ కి ప్రయిస్ అంటే భయం లేకపోలేదు. కాని ఎందుకో శ్యామా మీద బాగా మోజు పడటంతో అంతటితో వదలలేదు.
"క్షమించండి ,సర్!........ఇంతకీ నేను చెప్ప వచ్చేది .....ఈ దేశంలో ఉన్నప్పుడు ఇక్కడి పద్దతులు అలవాటు చేసుకోనటం మంచిది కదా........ఇండియన్లు కూడా మనల్ని మరింత ఆదరిస్తారు.......బానిసపిల్ల ఉండటం ఈ దేశంలో గొప్ప....." అని వాదించాడు.
మోస్టిన్ పట్టుదల ప్రయిస్ కి ఆశ్చర్యం కలిగించింది. ఇంతగా అతన్ని ఆకర్షించిన బానిస పిల్ల ఎవరా అని శ్యామా ఉన్న వైపు పరిశీలనగా చూశాడు.
"మోస్టిన్ నీకు మతి పోతోంది! కాని నీ సరదా తీర్చుకో....అమ్మాయి నిజంగా అందంగా ఉంది ......మన కార్యాలయం లో ఉంచినా కంటికి నదురుగా కనిపిస్తుంది ---సరే, బేరం కుదుర్చు !' అన్నాడు చిరునవ్వుతో.
అతని మాటల్లోని వేళాకోళానికి మోస్టిన్ కొంచెం సిగ్గు పడినా, గుర్రాన్ని మోర్ భట్ కూర్చుని ఉన్న చెట్టు వైపుకి తీసుకు వెళ్లి, మరాఠీ ;లో . "ఈ అమ్మాయి వెల ఎంత?" అని అడిగాడు.
అతని ప్రశ్న వినగానే శ్యామా ఒక అరుపు అరిచి, కుప్పగా కూలిపోయింది.
"అయ్యో భగవంతుడా! నన్నొక 'యవను' డికా అమ్మేస్తున్నారు! నా మతమే మార్చేస్తారే! అమ్మా, అమ్మా! నన్ను కన్నప్పుడే నా మెడలో నీ గోళ్ళు గుచ్చి చంపెయ్యక ' పోయావా?"
మోర్ భట్ మాత్రం మంచి బేరం దొరికిందని సంతోషించాడు. "సాహెబ్ ! తెల్లదొరాలకి బేరం అంటే ఇష్టం లేదని నాకు తెలుసు! అందుకనే ఒకే ధర చెప్పేస్తున్నాను. 15 మోహర్లిఇచ్చి ఈ పిల్లని తీసుకు వెళ్లి పొండి!" అన్నాడు.
మోస్టిన్ కి ఈ ధర సరసంగా నే తోచింది కాని ఎందుకయినా మంచిదని బేరం ప్రారంభించాడు. ఇంతలో అక్కడ ఒక చిన్నఅలజడి బయలుదేరింది. ఒక బ్రాహ్మణుడు హైందవ బాలికను మ్లేచ్చుడికి అమ్మటం చాలా దోషం అన్నారు కొందరు. కాని మోర్ భట్ వారిని లెక్క చెయ్యలేదు.
"చదువుకున్న బ్రహ్మడివి, శాస్త్రాలని గురించీ, తప్పొప్పులని గురించీ నా కెక్కువ తెలుసా , మీకా? సముద్రం లాంటి మన మతానికి ఒక చుక్క పొతే పెద్ద నష్టం కలిగించదు లెండి!" అని బిరుసుగా సమాధానం ఇచ్చాడు.
వీరి కలహం ముదరవచ్చునని మోస్టిన్ అవసరవసరంగా 15 మోహర్లు తీసి మోర్ భట్ కి ఇచ్చాడు. శ్యామా పూర్తిగా కుంగిపోయింది. ఆమె కన్నీరు ధారలుగా ప్రవాహించసాగింది. చుట్టూ పక్కల వారు ఆమెని వోదార్చ పోయారు. ఆ సమయంలో ఒక చిన్న తెల్లటి పావురం ఎగిరి వచ్చి రెక్కలు రెపరెప లాడిస్తూ శ్యామా భుజం మీద వాలింది. వాలినదే తడవుగా ముక్కుతో సున్నితంగా ఆమె బుగ్గ మీద పిదవటం మొదలు పెట్టింది. శ్యామాకి కొత్త ప్రాణం పోసినట్లయింది! అమాంతంగా లేచి నుంచుని పావురాన్ని గుండెలకి పోడువుకుంది. ఎవరిదీ పావురం , అని ఆశ్చర్యపోతున్న అక్కడి వారు మరొక వింత దృశ్యాన్ని చూశాడు. ఆశ్వారూడుడయిన ఒక యువకుడు అతివేగంగా అక్కడికి వచ్చాడు.
"శ్యామా!' అనే అరుపుతో గుర్రం మీద నుంచి నేల మీదకి దూకాడు.
శ్యామా చిన్న కేకవేసి అతని చేతుల్లో వాలింది. "చంఫాజీ -- నన్నీ దారుణ ప్రమాదం నుంచి కాపాడు! మతాన్ని వదులుకుని భ్రష్టు రాలనయి పోకుండా రక్షించు!" అన్నది చెక్కిళ్ళ మధ్య ." నన్నీ టోపీ వాలా సర్దార్ కి అమ్మేస్తారుట!"
చంఫాజీ మొహం కోపంతో ఎర్రబడింది. మోర్ భట్ వంకా, మోస్టిన్ వంకా ఉరిమి చూశాడు. ఇక పట్టలేక ఒరలోని కత్తిని కొంచెం బయటికి లాగాడు.
మోర్ భట్ హడలి పోయాడు. వెనక్కి తగ్గి పోయి -- "అయ్యయ్యో , వీడు గజదొంగ! శీలే దార్ అని పేరే గాని పిల్లల్నేత్తుకు పోయే రకం! బాబూ, ఈ పిల్లని వెనక్కి లాక్కపోయారా మన కింక దక్కదు. చూడండి సిగ్గు లేకుండా ఇందరి మధ్య వాడి నెలా వాతెసుకుందో!" అని అరవటం ప్రారంభించాడు. "ఈ టోపీ వాలా సాహెబ్ వారి సొత్తుని దోచేందుకు వీడి కెన్ని గుండెలు?'
మోస్టిన్ కి కూడా కోపం వచ్చేసింది. శ్యామాని విడిపించమని తన పరివారానికి అజ్ఞ ఇచ్చాడు.
చంఫాజీ వారిని చూసి బెదరలేదు. ఒరలోని కత్తిని పూర్తిగా బయటికి లాగి , "జాగ్రత్త! ముందుకి వచ్చిన వాడి తల నరికి పారేస్తాను!' అని గర్జించాడు.
మోస్టిన్ పరివారం కచేరి జనం. వారికి యుద్ధం అలవాటు లేదు. చంఫాజీ మాటలకి జడిసి ఇక ముందడుగు వెయ్యలేక ఆగిపోయారు. కాని మోస్టిన్ కి రోషం వచ్చింది. గుర్రాన్ని ముందుకి నెట్టాడు.
"ఇదుగో శీలేదార్! అమ్మాయిని వదిలారా సరి. లేకపోతె నీ తల తీసేస్తా!" అని బెదిరించాడు.

