Previous Page Next Page 
లోకం పోకడ పేజి 6


    ఆ రాత్రి తెల్లవార్లూ కామాక్షి నిద్రపోలేదు. ఒకటే ఆలోచన. రాఘవరావు తండ్రి ఆ ఊరి మునసబు. పంటకాలవ ఒడ్డున ఇదివరలో రాఘవరావు ఒకసారి పలకరించాడు. అప్పుడే అతని భావం అర్ధమయింది. ఆరునెల్ల తరువాత యిప్పటికి , తను ఒంటరిగా ఉండటం తటస్థించింది. పగబట్టి పసిగట్టాడు. కోరిక తీర్చుకుందామని వచ్చాడు. కోరిక తీరలేదు. బుస కొడుతూ వెళ్ళిపోయాడు. ఈ కోడె త్రాచు ఎప్పుడు ఏ సమయంలో కాటు వేస్తుందో?
    కామాక్షి కి యిదే ఆలోచన. కామాక్షి చక్కని చుక్క కాకపోయినా చక్కని ఆకారమూ, కను ముక్కు తీరూ, అవయవ సౌష్టవం గల పడుచు. వివాహమయి కాపురానికి వెళ్ళిన తరవాత రెండు సంవత్సరాల యినా కాకముందే నాలుగు రోజులు జ్వరం కాసి భర్త రమణయ్య పోయాడు. రమణయ్య హైస్కూలు ఫైనల్ వరకూ చదివి ఉన్న పాతిక ఎకరాలూ స్వంత వ్యవసాయం పెట్టి తండ్రికి అండదండలు గా ఉండేవాడు. భార్య కామాక్షి అంటే ఎంతో  అపేక్ష గా, ప్రేమగా ఉండేవాడు. వారిద్దరి దాంపత్యం ఎంతో చూడముచ్చట గా ఉంటుందని అంతా అనేవాళ్ళు. అంతర్యాలు కలిసినా, అనుభవాలు తీరక పోయినా ఆపేక్షలు, పెనవేసుకున్నా, ఆయుర్దాయం ఎవరూ పెంచలేరు. కామాక్షి ని కారు చీకట్లో వదిలి పరలోక గతుడయినాడు రమణయ్య. ఆఖరి గడియల్లో కామాక్షి కి రెండు ముక్కలు చెప్పాడు: 'బ్రతికి నన్నాళ్ళూ ఏ చెడ్డ పేరూ తెచ్చుకోవద్దు. ఆత్మవిశ్వాసం ఉంటె ఎన్ని అవరోధాలు కలిగినా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు '-- అని. కామాక్షి కి ఈ రెండు మాటలూ మనస్సులో , హృదయం లో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. క్షణిక సుఖాలూ, యౌవనోద్రేకాలూ అనాటితోనే హరింప చేసుకున్నది. శారీరక వాంఛలూ , ఆ రకమైన అన్ని ఆలోచనలు ఆమెలో నుంచి ఆరోజునే తుడిచి పెట్టుకు పోయాయి.
    ఎవ్వరి జోలికి పోకుండా, ఎవ్వరి ప్రమేయమూ లేకుండా ఎవరి మానాన వాళ్ళు బ్రతుకుతున్నా, సంఘం లో ఉండే దుష్ట శక్తులు బ్రతక నివ్వవు. కామాక్షి నిప్పు లాంటి మనిషనీ, ఆమెను అన్నవారు పాపాత్ములనీ, అందరికీ తెలుసు. కాని రాఘవరావు మాత్రం పట్టుదల ఎక్కువయింది. కామాక్షి పొందు తను పొంద గలిగితే తనకా ఊళ్ళో యింకా పేరు ప్రతిష్టలు పెంపొందుతాయని అతని పిచ్చి భ్రమ. ఈ వూరు మిడిల్ స్కూల్లోనే కామాక్షి పెళ్లి కాకముందు మూడవ ఫారం వరకూ చదివింది. భర్త పోయిన తరవాత మనోవర్తి కి గాను అత్తగారు రెండెకరాల మాగాణీ పొలం యిచ్చారు. అందులో సంవత్సరానికి ఖర్చులు పోను ఆరు వందలు వస్తాయి. తండ్రికి వండి పెడుతూ , భారత భాగవతాలూ , పురాణ గ్రంధాలూ చదివి తండ్రికి వినిపిస్తూ విశ్రాంతి గా జీవిస్తున్నది. ఒక్క అయిదవ తనం లోనే భగవంతుడు చిన్న చూపు చూశాడు గాని, ఆమె గుణ గుణాలకు వ్యక్తిత్వానికి తెలివి తేటలకూ ఏమీ లోటు లేదు. కామాక్షి అంటే తండ్రి నాగభూషణం తో బాటు అందరికీ గౌరవమే.
    భళ్ళున తెల్లవారింది. రాత్రి తెల్లవార్లూ నిద్రలేక పోవటం చేత ఎడతెగని ఆలోచనలతో సతమతమై పోయింది కామాక్షి.
    గొడ్ల కాటి వాడు తెల్లగా తెల్లవారిన తరువాత లేచి "అమ్మగారూ, ఎల్లోత్తా" అని వెళ్ళిపోయాడు. వాడి ప్రాణానికి ఆ రాత్రి తెల్లవార్లూ నిద్ర మేలుకుని కాపలా కాసినట్టే ఉంది.
    మర్నాడు రాత్రికి కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపింది. ఆ రాత్రి కూడా నిద్ర పోలేదు. గొడ్ల కాటి వాడు చక్కగా నిద్ర పోయాడు.
    మానవ మనస్తత్వాలు పలు తీరులుగా ఉంటాయి. తమ తమ యిళ్ళల్లో పక్క వేసుకునెందుకు బట్ట లేకపోయినా, ఏ కటిక నేల మీద పడుకున్నా వారికి హాయిగా నే ఉంటుంది. ఎవరింటి వద్దయినా సాయం పడుకోమని , వాళ్ళకు చాప యిచ్చి చక్కని వరండా చూపించినా , ఎదుటి వారింట్లో కావలి పడుకోమంటే వాళ్ళ కేదో పెద్ద ఘనకార్యం చేసినట్లే ఉంటుంది.
    ఆ రెండు రాత్రిళ్ళు మానసిక ఆవేదనతో నిద్ర పట్టలేదు కామాక్షి కి. గొడ్ల కాటి వాడు హాయిగా చాప మీద దుప్పటి ముసుకు పెట్టుకుని నిద్ర పోయి తెల్లవారి పుగాక్కాడకు కామాక్షి నడిగి డబ్బులు తీసుకు పోయాడు.
    మూడో రోజు సాయంత్రానికి నాగాభూషణం వచ్చాడు. తండ్రి వచ్చిన తరువాత ప్రాణం కుదుట బడ్డది కామాక్షి కి. ఎంతో ఆత్రంగా అడిగింది : "రమేష్ కులాసాగా ఉన్నాడా నాన్నా?" అని.
    నాగభూషణం "ఇస్సో" మని నిట్టూర్చి నడి మంచం మీద కూలబాడ్డాడు. పొగాకు కాడ పాయ తీసి చుట్ట చుట్టుకున్నాడు. తండ్రి ముఖంలో కోపంతో కూడిన ఆవేదన బాగా కనపడ్డది కామాక్షి కి. ఆ కోపానికి కారణ మేమిటో ఆమెకు అర్ధం కాలేదు.
    "ఏం నాన్నా! మాట్లాడ వేం? తమ్ముడు కులాసాగా ఉన్నాడా?" అన్నది మళ్ళీ.
    "కులాసానే. వాడికేం? మూడు పూలూ, ఆరు కాయలుగా ఉన్నది వాడి చదువు . వాడసలు చదువు కన్నా ప్రేమ పాఠాలు వల్లే వేస్తున్నాడు. వ్యవహారం ముదురు పాకం లోనే పడ్డది" అన్నాడు నిట్టుర్చుతూ.
    నిర్ఘాంత పోయింది కామాక్షి. తండ్రి అనే ఈ మాటలు ఆమెకు శూలాల్లా గుచ్చుకున్నాయి. తన తమ్ముడు ఇలాంటి వ్యవహారాలు మొదలు పెట్టాడా! కాలేజీ అమ్మాయిల్నీ ప్రేమిస్తున్నాడా! అసలీ మగవాళ్ళు యింతగా పెట్రేగి పోతున్నారేం? కాస్త వయస్సులో ఉన్న ఏ అడది కనుపించినా గంగవేర్రు లెత్తి పోతారు. ఎంతో బుద్ది మంతుడనుకున్న తమ్ముడు రమేష్ ఇంతటి వాడయినాడా? వీడికీ రాఘవరావు మాదిరే పరస్త్రీ వ్యామోహం కలిగిందా? ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా వండి పెట్టి, తన ఆశలన్నీ వాడి మీదనే పెట్టుకుని, పెళ్ళీ పేరంటం చేసి, తండ్రి తదనంతరం తమ్ముడి నీడనే తల దాచుకోవాలను కున్న కామాక్షి ఈ విషయం వినగానే నిర్జీవయిపోయింది. మనస్సు లో చెలరేగే ఆవేదన మనస్సులోనే అణుచుకుని ఇంక ఏం మాట్లాడలేక అవతలకు వెళ్ళిపోయింది కామాక్షి.
    కూతురు మారు మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయిందో నాగభూషణనికి అర్ధం కాలేదు. కాసేపు ఆయనా ఆ మంచం మీదనే పడుకుని విశ్రాంతి తీసుకుని, కొంతసేపటి కి లేచి పెరట్లో కి వెళ్ళాడు. చోపాలో గుంజ నానుకుని కూర్చుని కన్నీరు పెట్టుకుంది కామాక్షి. ఎందుకు ఏడుస్తున్నదో అర్ధం కాక అక్కడే నిలబడి పోయాడు నాగభూషణం.
    "ఎందుకమ్మా , కామాక్షీ కంట తడి పెట్టావ్? తమ్ముడు ప్రేమ వ్యవహారాలూ మొదలు పెట్టాడనా!" అన్నాడు ఒక్క నిమిషం ఆగి.
    కళ్ళు తుడుచుకుంటూ చోపా లో నుంచి యివతలికి వచ్చింది కామాక్షి.
    "తమ్ముడు ప్రేమ వ్యవహారం లో పడ్డాడని ఎట్లా తెలిసింది నాన్నా? చెప్పుడు మాటల్ని మనం లక్ష్య పెట్టకూడదు" అన్నది.
    "వాడి గదిలోనే సురేంద్ర అని వాడి స్నేహితుడున్నాడు. మనవాడు లేని సమయంలో అతనే అన్ని విషయాలూ నాకు చెప్పాడు."
    "ఎవరా అమ్మాయి? కాలేజీ లో చదివే పిల్లేనా?"
    "హైస్కూల్లో చదువుతున్నదిట. ఏమయినా వయస్సు అటువంటిది తల్లీ" అంటూ కూతురు జీవితం తలుచుకుని ఆయనా మనస్సులో బాధ పడుతూ వీధి వాకిట్లో కి వెళ్ళాడు. ఎంతసేపయిందో వచ్చి అరుగు మీద రాఘవరావు కూర్చున్నాడు చుట్ట పొగ దర్జాగా వదులుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS